Tuesday, January 21, 2025

 ☘️🍁  ఆప్తవాక్యాలు  🍁☘️


82. ఉపసర్పమాతరం భూమిమ్

మాతృభూమిని సేవించు(ఋగ్వేదం)

'భూమి'ని 'మాతృమూర్తి'గా భావించి ఆరాధించడం మన సంప్రదాయం. అమ్మలో ఉన్న లక్షణాలన్నీ భూమిలో కనిపిస్తాయి. ఉనికినీ, పోషణనీ, రక్షణనీ, భద్రతనీ ప్రసాదించి, చివరకు లయమైతే తనలో పొదువుకొని కడుపులో కలుపుకొనే భూదేవిని
అమ్మగా కాక ఇంకెలా భావించుతాం.

వేదంలో ఈ భావన పల్లవించింది. మాతృభూమిని సేవించమని ఋగ్వేదం ప్రవచించింది.

( ప్రాచీన భారత చక్రవర్తి పృథువు తన విజ్ఞాన సంపదతో, పాలనా
దక్షతతో నేల తల్లి విలువను తెలియజెప్పిన కారణంగా ఈ తల్లికి 'పృథ్వి' అని పేరు వచ్చింది. భూమి గోరూపంలో రాగా, ఆమె పొదుగు నుంచి బహుసంపదలు గ్రహించినట్లుగా పురాణాలు సంకేతించడంలో ఎంతో అద్భుత భావన ఉంది. ఇది ప్రపంచదేశాలు గ్రహించవలసిన ప్రకృతి
పరిరక్షణ రీతి.)

వసుధనంతటినీ ఒక కుటుంబంగా భావించాలి అనే చింతనను కూడా
ఋషిసంస్కృతి ప్రసరించింది. భూఖండమంతా మన తల్లే. సందేహం లేదు. కానీ 'మనదైన భూభాగం మన దేశం' అని ఏ భూమిని భావిస్తున్నామో దానిని మన
'మాతృభూమి'గా సేవించడం ప్రధానం. ఎవరి ఇల్లు వారు చక్కబెట్టుకుంటే సమాజమంతా క్షేమమే. అదేవిధంగా ఎవరి దేశాన్ని వారు మాతృభూమిగా సమర్చించి,
దాని సర్వతోముఖాభివృద్ధికి తన వంతు కృషిని సమర్పించి తీరాలి.

"మాతా భూమిః పుత్రో అహం పృథివ్యాః" అని అథర్వణవేద మంత్రం. “అమ్మ భూమి! నేను ఈ భూమికి పుత్రుడను" అని దీని అర్థం.

“వయం రాష్ట్ర జాగృయామ” అని యజుర్వేద మంత్రం(మనమంతా దేశాభివృద్ధికై జాగరూకులమై ఉండాలి). దేశభక్తి సనాతనవైదిక భావనగా ఈ మంత్రాల వల్ల
స్పష్టమౌతోంది.

ఇతరుల్ని హింసించి మన దేశాన్ని బాగుచేసుకోవడమనేది నీచమైన విషయంగా మన ప్రాచీన గ్రంథాలు చాటిచెప్పాయి. ఒకరి ఇంటిని కొల్లగొట్టి మన ఇంటిని సుసంపన్నం చేసుకోవడం తగదని దీని భావం. పృథివి మొత్తాన్ని గౌరవిస్తూనే
స్వదేశాన్ని రక్షించుకోవడం ఈ దేశం చెప్పిన నీతి. అందుకే భారతచరిత్రలో ఈ దేశం దేనిపైనా తనంత తాను దాడి చేయలేదు. ఇతరుల ఆక్రమణను భరించింది,ఎదిరించింది.

( మన కొద్దిపాటి నిర్లక్ష్యం, స్వార్థం దేశానికి పెద్దనష్టాన్నే కలిగించవచ్చు. దేశభక్తి నిత్యహృదయస్పందనగా లేని కారణంచేతనే ఇన్నిన్ని అవినీతి కూపాలు,పాలకుల కుంభకోణాలు.! మాతృభూమిపై భక్తి అనే భావన నుంచి“వందేమాతరమ్" అనే జాతీయ స్వరగీతిక ఈ జన జిహ్వలపై నర్తించింది.స్వాతంత్ర్యం సిద్ధి ఉపాసనలో పరమమంత్రమయ్యింది.)

భూమిని మాతృమూర్తి వలె, గోమాత వలె దర్శించిన పృథుచక్రవర్తి ఈ ధరణిని హింసించకుండా, మేధాశక్తితో ఇందులోని సంపదను ఎలా వెలికిదీయాలో గ్రహించాడు.
ఎలా వినియోగించాలో ఆకళింపు చేసుకున్నాడు. ఆ ప్రయత్నంలో ప్రకృతికీ,పర్యావరణకీ ప్రమాదం రాని విధంగా ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలో అవలంబించాడు.అలా ధాత్రిని ఒక తల్లి వలె గౌరవించి, మాతృమూర్తి నుంచి శిశువు స్తన్యాన్ని గ్రహించినట్లుగా సంపదను గ్రహించాలని, గోవుపాలను పొందుతూ ఆ గోమాతను పెంచి పోషించినట్లుగా పుడమిని పరిరక్షించుకోవాలని ఆచరించి చూపించారు.

ప్రాచీన భారత చక్రవర్తి పృథువు తన విజ్ఞాన సంపదతో, పాలనా దక్షతతో నేల తల్లి విలువను తెలియజెప్పిన కారణంగా ఈ తల్లికి 'పృథ్వి' అని పేరు వచ్చింది.భూమి గోరూపంలో రాగా, ఆమె పొదుగు నుంచి బహుసంపదలు గ్రహించినట్లుగా పురాణాలు సంకేతించడంలో ఎంతో అద్భుత భావన ఉంది. ఇది ప్రపంచదేశాలు
గ్రహించవలసిన ప్రకృతి పరిరక్షణ రీతి.

ఈ నేలపై ఊపిరి తీసుకొని, ఈ తల్లి ఇచ్చే ఆహారాన్ని తినే అందరికీ తమవంతు బాధ్యత ఉంది. అలసత్వాన్ని విడిచి, అక్రమాన్ని వదలి, కాలుష్యాలను ఈ
దేశపరిసరాల్లో లేకుండా జాగ్రత్తపడాలి. "నేనొక్కణ్ణి చేస్తే సరిపోతుందా!” అని నిర్లక్ష్యపడడం తప్పు. ఇలా అందరూ నిర్లక్ష్యాన్ని కనబరిస్తే ఇక అంతా అభద్రతే!

'దేశభక్తి' అనేది ఏ యుద్ధాల సమయంలోనో, ఏపరాయిపాలనలోనో
పుట్టుకురావాల్సిన అవసరం కాదు. అది నిత్యం మనలో రగుల్కొనవలసిన చైతన్యం.

మన కొద్దిపాటి నిర్లక్ష్యం, స్వార్థం దేశానికి పెద్దనష్టాన్నే కలిగించవచ్చు. దేశభక్తి నిత్యహృదయస్పందనగా లేని కారణంచేతనే ఇన్నిన్ని అవినీతి కూపాలు, పాలకుల కుంభకోణాలు.!

మాతృభూమిపై భక్తి అనే భావన నుంచి “వందేమాతరమ్" అనే జాతీయ స్వరగీతిక ఈ జన జిహ్వలపై నర్తించింది. స్వాతంత్య్రం సిద్ధి ఉపాసనలో పరమమంత్రమయ్యింది.

దేశం అనగానే కేవలం మట్టి మాత్రమే కాదు. ఆ మట్టిలో పరిమళించే తరతరాల సంస్కృతి, దాని ఔన్నత్యం, అమ్మతోపాటు అమ్మ చరిత్రను గౌరవించే శిశువులా
ఉండాలి. అదృష్టవశాత్తు మన దేశధారుణి సార్వకాలిక విలువల్ని, సార్వజనీన సత్యాలనీ
యుగాలనాడే ఆవిష్కరించిన పవిత్ర ఘనచరిత్ర కలిగిన జనని.

ఆ పరంపరనీ, నేటి ప్రగతినీ. విస్తృతపరచి రక్షించుకొనే బాధ్యతనే దేశభక్తి అంటారు.“తల్లికీ, దేశానికీ తేడా లేదు. స్వర్గం కన్నా మిన్న నా దేశం" అని శ్రీరామచంద్రుడే
అన్నాడు. ఈ దేశభక్తిని పసితనం నుంచే పిల్లలలో పెంచిపోషించకపోతే, ఈ తల్లి నేలపై మమత పెరగదు. అది పెరగనినాడు దేశం పట్ల తన బాధ్యతను విస్మరించే ప్రమాదం ఉంది!  

No comments:

Post a Comment