Saturday, January 25, 2025

 ☘️🍁  ఆప్తవాక్యాలు  🍁☘️


86. విశ్వతశ్చక్షురుత విశ్వతోముఖః

అన్నివైపుల కన్నులు, అన్నివైపుల ముఖములు కలవాడు(ఋగ్వేదం)

ఈశ్వర తత్త్వానికి భారతీయులు ఇచ్చిన ఆవిష్కరణ. మన ఈశ్వరుడు ఎక్కడో లేడు. అంతటా, అన్నిటా అతడే. సర్వనేత్రములు ఆయనే, సర్వముఖములు ఆయనే.
పలుకునవి, ఆరగించునవి..... ముఖములు. అంటే - వాక్శక్తి, స్వీకార శక్తీ ఈశ్వరచైతన్యములే. నేత్రాల దర్శన శక్తి, వదనాన వాక్శక్తీ, ఆహార స్వీకరణశక్తి, శ్రవణశక్తీ, ఆఘ్రాణశక్తీ... అన్నీ ఒకే ఆత్మ యొక్క అనంత చైతన్యాలు.

'సహస్రకరః'... 'సహస్రపాత్' మొదలైన మరికొన్ని వేదవాక్యాలు పరమాత్ముని అనంత‘ఆదానప్రదాన’ (ఇచ్చిపుచ్చుకొనే) శక్తులను విశ్వమంతా దర్శించాయి. అన్నిటా వ్యాపించే
చైతన్యాన్ని 'సహస్రపదుని'గా భావించాయి. విశ్వమంతా విరాడ్రూపుని దేహంగా
దర్శించిన ఆధ్యాత్మికత మనది.
 ఒకొక్క ఉపాధిలో నేత్రాది ఇంద్రియాలలో దర్శనాది
శక్తులు పరిమితంగా గోచరిస్తాయి. కానీ ఆ పరమేశ్వరుని దర్శనశక్తి అనంతం.శ్రవణాది శక్తులు అపరిమితం. ఇంద్రియాలకు పరిమితం కాదది. కనుకనే అపారం.
కెరటాలలోని పరిమిత శక్తి సముద్రానిదే. కానీ సముద్రం అపరిమితం. అలాగే ప్రత్యేక ఉపాధిలో దర్శనమిచ్చే చైతన్యాలు పరిమితంగా గోచరించినా, వాటికి
మూలమైన ఈశ్వర చైతన్యం అపరిమితం.

ఈ విధమైన అవగాహన మనకి కలిగితే మన నుండి వ్యక్తమయ్యే శక్తులు “మనవి”అనే అహంకారం తొలగుతుంది. పరిమితం అపరిమితం లోనిదేనని గ్రహింపు వస్తుంది. అప్పుడు మనలోని అహం... అనంతమైన ఈశ్వరచైతన్యంతో తాదాత్మ్యం చెందుతుంది.

అప్పుడింక ఈ విశ్వంలో సూర్యచంద్రాదులకీ, పంచభూతాలకీ, సర్వజీవులకీ ఒకే ఆత్మ గోచరిస్తుంది. ఈ ఏకాత్మ దర్శనాన్ని పొందినవాడు దేనినీ మోహించడు; దేనినీ
ద్వేషించడు.

'ఈశావాస్యమిదం సర్వం' అని ఉపనిషత్తు నిర్దేశించిన పరమార్థాన్ని సాక్షాత్కరింపజేసుకుంటాడు.

ఎన్నో కట్టెలు తలోరకంగా జ్వలిస్తున్నా అన్నిటా అగ్ని ఏకమేనని, భిన్నత్వం కట్టెల వలన ఏర్పడినదే కానీ, కట్టెల వికృతులు అగ్నికి లేవని అవగతం చేసుకోవాలి.విభిన్న దృష్టి జగదృష్టి, అక్కడ చైతన్యపు భిన్నత్వం లేదు. ఉపాధుల భిన్నత్వమే.ఉపాధి దృష్టి అగ్నికి కల్పితమే. సత్యమైన వహ్ని ఏకమే. ఇదే బ్రహ్మ సత్యం - 'ఏకం
అద్వితీయం బ్రహ్మా'.

ఈ బ్రహ్మముతో తాదాత్మ్యం చెందిన వానికి విశ్వంలోని ప్రత్యణువూ
ఈశ్వరమయమే. దానిని సాధించినవానికి భిన్నత ఉండదు. ఈ లక్ష్యాన్ని సిద్ధింపజేసుకునేందుకే భారతీయ వేదవిద్య పలురకాల ప్రబోధాలనందించింది.

'ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః' అన్నట్లుగా సమదర్శి అవుతాడు.

ఈ సామ్యదృష్టియే సామరస్య హేతువు. ఈ భారతీయ వేదాంతమతమే ప్రపంచంలోని స్వార్థపూరిత విభేదాలకు ఏకైక ఔషధం.             

No comments:

Post a Comment