☘️🍁 ఆప్తవాక్యాలు 🍁☘️
90. నమో వృక్షేభ్యో హరికేశేభ్యః
ఆకుపచ్చని కేశములుగల వృక్షములకు నమస్కారము(యజుర్వేదం)
ఇది యజుర్వేదంలో రుద్రనమక మంత్రాలలోనిది. వృక్షముల రూపంలో నున్న పరమేశ్వరునికి నమస్సులు.
పచ్చని ఆకులతోనున్న కొమ్మలన్నింటినీ జటాజూటమువలె, వృక్షమును శివునివలె దర్శించిన భక్తిభావన దీనిలో గ్రహించవచ్చు. అయితే - వేద విజ్ఞానం ఆధారంగానే
- 'కేశములు' అంటే 'కిరణము'లని అర్థం తీసుకుని దిక్కులలో వ్యాపించిన కిరణాలతో
ఒక కాంతివృక్షంగా విస్తరించిన సూర్యమూర్తిని ఈ మంత్రంలో దర్శించవచ్చు.సూర్యనే శివునిగా, శివునే సూర్యునిగా ఉపాసించడం మన సంప్రదాయం.కొందరు-ఇంద్రియ చైతన్యములే హరికేశములుగా విస్తరించిన ఆత్మస్వరూపాన్ని
వృక్షంగా వర్ణించవచ్చు. ఈ విభిన్నార్థములన్నిటికీ నమస్కరించి-వృక్షాలనే దైవంగా
భావించే గొప్పతనాన్ని మాత్రమే స్వీకరించి ఈ మంత్రాన్ని పరిశీలించుదాం.
పచ్చని చెట్లు భగవంతుని రూపాలని భావించడం మన అనాది సంప్రదాయం.వృధాగా చెట్లను నరకడం మహాపాపం. తప్పనిసరై ఒకటి నరికితే దానికి బదులుగా
మరొక సముచిత స్థలంలో మరికొన్ని చెట్లు నాటాలనీ, నరికిన పాపం పోవడానికి ప్రత్యేక యజ్ఞం చేయాలనీ మన ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. మేడి (ఔదుంబరం),బిల్వం, తులసి, ఉసిరి, కదంబం... దేవతా వృక్షాలు అని శాస్త్రవచనం. వీటి పరిసరాల్లో
మసలినా దైవశక్తి, ప్రాణశక్తి మనకు లభించి-భౌతిక ఆధ్యాత్మిక సాధనలను ఫలవంతం
చేసుకోగలమని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. మహర్షులు వృక్షాల నీడల్లోనే జపతపాలు, అధ్యయనాలు చేసేవారు. ప్రకృతి సహజమైన పచ్చదనాన్ని చూస్తే మెదడుకి చురుకుదనం, జ్ఞాపకశక్తి, సృజనాత్మకత పెరుగుతాయని ఆధునిక విజ్ఞానం.
ప్రకృతిలోని వృక్ష సంపదను దైవంగా ఆరాధించే విధానంలోని భాగంగానే,
తులసిని మొదలుకొని వేప, వటవృక్షం, అశ్వత్థవృక్షం మొదలైన వాటి వరకు అనేక చెట్లను దేవతలుగా పూజించడం కనిపిస్తోంది. కొన్ని చెట్లు కొన్నిదేవతలకు ప్రత్యేక నివాసాలుగా శాస్త్రాలు వక్కాణించాయి. బిల్వం శివునకు, మేడి దత్తాత్రేయునకు,
కదంబం జగదంబకు, తులసి నారాయణునకు, గరికలు గణపతికి...ప్రత్యేక ప్రీతి.
ఈ చెట్ల ఔషధీయ విలువలను ఆయుర్వేదాది గ్రంథాలు ఏనాడో చెప్పాయి. ఆ ఓషధీ విలువలతోపాటు దైవీయ సత్యం కూడా ఉన్నదని ఋషుల దర్శనం.
మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణురూపిణే |
అగ్రతః శివరూపాయ వృక్షరాజాయ తే నమః ॥
- అని నమస్కరించడం మన సంప్రదాయం. పచ్చదనం, పూలపళ్ళ చెట్లు ఇంటి పరిసరాల్లో ఉంటే లక్ష్మీనివాసమవుతుందని మహాభారత వచనం. అయితే వసతి
సౌకర్యాలు ఇరుకౌతున్న రోజులివి. కానీ వీలైనంత, కుండీలలోనైనా చిన్న చిన్న పూలమొక్కలను, తులసి మొక్కలను పెంచి, వాటికి రోజూ భక్తిపూర్వకంగా, స్నేహాభావంతో నీళ్ళుపోస్తున్నా... మనలో క్రమంగా సాత్విక భావనలు అభివృద్ధి
పొందే అవకాశముంది.
“న్యగ్రోధోదుంబరోశ్వత్థాః" - అని విష్ణు సహస్రం, మట్టి, మేడి, తావిచెట్లను
విష్ణురూపాలుగా దర్శించింది.
“రామ వృక్షం”.. అంటూ రామశక్తిని వృక్షస్వరూపంగా వాల్మీకి అభివర్ణించారు.“ధర్మమయ మహాతరువు”గా ధర్మరాజును, “రోషమయ విషవృక్షం"గా దుర్యోధనుని దర్శింపచేశారు వ్యాసదేవులు.
“వృక్ష ఇవ స్తభో దివితిష్ఠత్యేకః" .... అని భగవానుని వృక్షంగా వర్ణించింది వేదం.జీవులకు సాఫల్యాలను ప్రసాదించే మంత్రవృక్షంగా వేదాన్ని దర్శించారు మహర్షులు.
రామాయణాన్నీ, భారత, భాగవతాలను కూడా నారాయణ మూలమైన కల్పవృక్షాలుగా
వ్యాఖ్యానించారు.
ఇలా చెట్టుతో అనుబంధ లతను అల్లుకున్న ఇంత గొప్ప సంస్కృతిని మనం విస్మరిస్తున్నాం. పల్లెల్లో రాజకీయ నీచత్వం వల్ల కరువవుతున్న అభివృద్ధి, పట్టణ
నగరాలలో అభివృద్ధి పేరిట జరుగుతున్న ప్రకృతి విధ్వంసం మనకి పచ్చదనపు సిరిని దూరం చేస్తున్నాయి. పాశ్చాత్య దేశాలలో వృక్షసంపదని, జలసంపదని అత్యంత
శ్రద్ధతో రక్షించుకుంటున్నారు. వారినుండైనా స్ఫూర్తి పొంది, మన ప్రాచీనులు జీవనవిధానాన్ని అలవరచుకునే ప్రయత్నం చేద్దాం.
No comments:
Post a Comment