*తండ్రి ప్రేమ (బాలల నీతి యుక్తి కథ)*
డా.ఎం.హరికిషన్- కర్నూలు-9441032212
**************************
కందనవోలులో ఒక ధనవంతుడు వుండేవాడు. చిన్నప్పుడు వాళ్ళు చాలా పేదవాళ్ళు. అతను చేయని పని లేదు. ఒకొక్క రూపాయే కూడబెట్టుకుంటూ పైకి ఎదిగాడు. బండిమీద సరుకులు పెట్టుకొని వీధుల్లో తిరుగుతూ అమ్మేవాడు. అతిగా ఆశ పడకుండా నిజాయితీగా తక్కువ లాభానికి మంచి సరుకు ఇచ్చేవాడు. దాంతో నెమ్మదిగా అతని పేరు ఊరంతా పాకిపోయింది. అతను వీధుల్లోకి రాకుండా అందరూ అతన్నే వెదుక్కుంటూ అతని వీధిలోకే సరుకుల కోసం పోవడం మొదలైంది. గుండుసూది నుంచి బంగారు నగల దాకా అన్నీ అతని వద్ద దొరికేవి. నెమ్మదిగా అతను ఆ ఊరిలో పెద్ద ధనవంతునిలా మారిపోయాడు.
అతనికి నలుగురు కొడుకులు. వాళ్ళు బాగా చదువుకొని పనులన్నీ చూసుకోవడం మొదలుపెట్టారు. నెమ్మదిగా ఆ ధనవంతునికి వయసు పైబడింది. చివరి రోజులు సమీపించాయి. ఒకరోజు నలుగురు కొడుకులను పిలిచి వాల్ల చేతిలో ఒక పెట్టె పెట్టి "ఆశ చెడ్డది. దాని వెంట పరుగెత్తకండి. ఒకరిని ముంచకుండా, మనం మునిగిపోకుండా బతకాల. కాలం ఎప్పుడూ ఒకేలా వుండదు. మీరు నలుగురూ ఎప్పటికీ విడిపోకండి. ఏదయినా ఊహించనిది జరిగి మీ ధనమంతా పోయి ఆపదల్లో పడితే అప్పుడు దీనిని తెరవండి. అలా ఏమీ జరగకపోతే మీ పిల్లలకు దీనిని అప్పగించండి" అని చెప్పాడు. ఆ తరువాత అతను కొద్ది రోజుల్లోనే మరణించాడు.
నలుగురు కొడుకులూ మంచివాళ్ళే కానీ ఉన్నదాంతో సంతోషపడే రకం కాదు. మా నాన్న సంపాదించిన దానికి పదింతలు మనం సంపాదించాలి. మన పేరు దేశదేశాలలో వెలిగి పోవాలి అనుకున్నారు. దాంతో వాళ్ళు చుట్టుపక్కల వున్న దేశాలతో ఒప్పందాలు చేసుకోవడం మొదలుపెట్టారు. భారతదేశంలో దొరికే విలువైన సరుకులు ఓడల్లో నింపి అక్కడ అధిక ధరకు అమ్మేవాళ్ళు. అక్కడ చౌకగా లభించే సరుకులు తెచ్చి ఇక్కడ అమ్మేవాళ్ళు. కొద్దిరోజుల్లోనే వాళ్ళ సంపద అనుకున్నట్టుగానే మరింతగా పెరగడం మొదలుపెట్టింది.
ఒకసారి విదేశాలకు పెద్ద ఎత్తున సరుకులు పంపించవలసి వచ్చింది. దాంతో సంబరంగా వున్న సొమ్మంతా పెట్టి ఓడల్లో సరుకులు నింపారు. ఒకేసారి వరుసగా ఇరవై ఓడలు బైలు దేరాయి. అమ్మితే పదింతలు లాభం. వాళ్ళ కల తీరే రోజు. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా వుండదు గదా. భయంకరమైన తుఫాను విరుచుకుపడింది. ఓడలు తట్టుకోలేక పోయాయి. నీటితో నిండి ఒకొక్కటే మునిగిపోయాయి. దెబ్బకు అంతవరకు తాను సంపాదించినదంతా తుడిచిపెట్టుకు పోయింది. సరుకులు అప్పుగా ఇచ్చిన వాళ్ళకు తిరిగి చెల్లించడానికి విలువైనవన్నీ అమ్ముకోవలసి వచ్చింది.
ఇక ఆ ఊరిలో బతకలేక ఎక్కడికైనా వెళ్ళిపోదాం అనుకున్నారు. అంతలో వాళ్ళకు వాళ్ళ నాన్న ఇచ్చిన చిన్న చెక్కపెట్టె మతికి వచ్చింది. దేవుని గదిలోంచి తీసుకువచ్చి దాని మూత తెరిచారు. అందులో ఒక వెండి రేకు కనబడింది.
దానిమీద “మీరు ఆపదల్లో ఉన్నప్పుడు నలుగురినీ చేయి చాచి అడగకండి. పొట్టచేత బట్టుకొని నాలుగు దిక్కులకు వెళ్ళకండి. ఇంటిదేవుని వద్దకెళ్ళి ఉత్తరం దిక్కు తిరిగి దండం పెట్టండి. శివుని వాహనం మాయమైన చోటే బతుకు తెరువు దొరుకుతుంది. ఎంత సంపాదించినా అంతా చేరవలసింది మట్టిలోకే. మనిషికి కావలసింది ఆరడుగుల లోతు నేలనే. అది తెలుసుకుంటే మీ జీవితం మరలా సుఖవంతమవుతుంది" అని రాసి వుంది.
ఎంత ఆలోచించినా వాళ్ళకు నాన్న చెబుతున్న దేమిటో తెలియలేదు. చూడడానికి ఎవరో వేదాంతులు చెప్పిన మాటల్లాగా వున్నాయిగానీ ఇందులో తమకు తెలియని విషయం ఏదో దాగి వుంది అనిపించింది. ఆ ఊరిపెద్ద టక్కుపల్లి సుబ్బయ్య చాలా తెలివైన వాడు. ఎటువంటి చిక్కుముడినయినా సరే సులభంగా విప్పగలడు. నలుగురూ అయన వద్దకు వెళ్ళి విషయం చెప్పి ఆ వెండిరేకు అందించారు.
అతను దానిని బాగా చదివి "ఒక్కసారి మీ ఇళ్ళు పరిశీలించాలి" అన్నాడు. సరే అని వాళ్ళు తీసుకుపోయారు. ఇళ్ళు అంతా గమనించాడు. తరువాత చిరునవ్వుతో "మీ ఇంటి దేవుడు ఎవరు” అన్నాడు. “శివుడు” అని చెప్పారు. శివుని గది ఎక్కడుందో కనుక్కొని పూజగది దగ్గరికి పోయి ఉత్తరం వైపుకు తిరిగాడు. అక్కడొక గుమ్మం కనబడింది. పోయి ఆ గుమ్మం తెరిచాడు. ఇంటి వెనుక పెరడు కనిపించింది. దానిలోకి వచ్చి చుట్టూ చూశాడు. ఎక్కడా ఏమీ కనబడలేదు. ఇంటి పక్కన ఒక గుడి వుంది. ఆ గుడిని బాగా పరిశీలించి చూడసాగాడు. గోపురంపై నంది వుంది. నంది అంటే శివుని వాహనం. వెంటనే అతను "సమయం ఐదు అవుతూ వుంది. ఆ గోపురం మీది నంది నీడ ఇంటి పెరడులో పడుతూ వుంది. ఇంకో గంటలో చీకటి పడుతుంది. మౌనంగా ఆ నీడనే గమనించండి. శివుని వాహనం మాయమైన చోటే బతుకు తెరువు దొరుకుతుంది అని మీ నాన్న రాశాడు కాబట్టి ఆ నీడ మాయమైన చోటనే ఏదో వుండి వుండాలి" అన్నాడు. అందరూ మౌనంగా ఆ నీడనే గమనించసాగారు. ఆ నీడ కొద్దికొద్దిగా జరుగుతూ పెరటిలో వేపచెట్టు పక్కనున్న చిన్న అరుగుమీద పడి మాయమైంది.
వెంటనే టక్కుపల్లి సుబ్బయ్య ఆ నలుగురినీ అరుగు వద్దకు పిలిచి "మీ నాన్న ఎంత సంపాదించినా అంతా చేరేది మట్టిలోకె అన్నాడు గదా... అంటే ఈ అరుగు కింద మట్టిలోనే ఏదో దాచి పెట్టాడు. తవ్వి చూడండి" అన్నాడు.
వెంటనే వాళ్ళు పలుగూ పారా తెచ్చి అక్కడ తవ్వడం మొదలుపెట్టారు. నడుం లోతు తవ్వినా చెమటలు కారుతున్నాయి కానీ ఏమీ దొరకడం లేదు. నిరాశ పడ్డారు. టక్కుపల్లి సుబ్బయ్య కాసేపు ఆలోచించి "అంత సులభంగా నిధి పైపైన్నే పెడితే... ఎవరైనా ఏదైనా పని బడి తవ్వినప్పుడు సులభంగా దొరికి వాళ్ళ వశం అవుతుంది గదా... అందుకే మీ నాన్న చివరగా ఒక మాట రాశాడు. 'మనిషికి కావలసింది ఆరడుగుల లోతు నేలనే' అని. కాబట్టి ఆరడుగుల వరకు ఆగకుండా తవ్వండి" అన్నాడు. వాళ్ళు అలాగే తవ్వసాగారు. కాసేపటికి గునపానికి ఏదో ఖంగుమని తగిలింది. అందరి మొహాల్లోనూ చిరునవ్వులు వెలిగాయి. నెమ్మదిగా ఒక ఇనుప పెట్టెను తీశారు. దానిలో అనేక బంగారు ఆభరణాలు, విలువైన హారాలు వున్నాయి. వాటిని అమ్మి మరలా వారు జీవితాన్ని మొదలు పెట్టారు.
**************************
డా.ఎం.హరికిషన్- కర్నూలు-9441032212
*************************
కథ నచ్చితే *SHARE* చేయండి. రచయిత పేరు మార్చకండి. తీసేయకండి.
No comments:
Post a Comment