దేవుళ్ళూ - భక్తీ !
'""'''""""""""""""""""""""""""""""
బిడ్డ పుట్టినప్పుడు ఆ మెదడులో ఏ ఆలోచనా వుండదు. ఆ మనసు మీద ఏ ప్రభావమూ వుండదు, ఏ విశ్వాసాలూ వుండవు. కానీ, అప్పటికే బిడ్డ చుట్టూ ఒక సమాజం వుంటుంది. దానికి కొన్ని నీతులూ, కొన్ని ధర్మాలూ, కొన్ని అలవాట్లూ, కొన్ని విశ్వాసాలూ, అన్నీ సిద్ధంగా వుంటాయి. ఈ బిడ్డ కూడా రోజు రోజుకీ తన చుట్టూ వున్న జీవిత విధానం ప్రకారం, సాంప్రదాయాల ప్రకారం, పెరుగుతూ వుంటాడు. తన చుట్టూ వున్న మనుషులు చేసిందాన్నే తనూ చేస్తాడు. చుట్టూ వున్న వాళ్ళు నమ్మిన దాన్నే తనూ నమ్ముతాడు. సమాజ ప్రభావానికి అతీతంగా ఏ బిడ్డా పెరగదు.
“దేవుడికి దణ్ణం పెట్టు!" తో ప్రారంభమౌతుంది బిడ్డని పెంచే వ్యవహారం. బిడ్డకి నెమ్మదిగా కాస్త విషయాలు పరిశీలించే జ్ఞానం వొచ్చేటప్పటికి - ఇంట్లో దేవుడు! పక్కింట్లో దేవుడు! ఎదరింట్లో దేవుడు! ఎదరింటి వాళ్ళ పక్కింట్లో దేవుడు! పక్కింటి వాళ్ళ ఎదరింట్లో దేవుడు! అంతే కాదు. బళ్ళో దేవుడు! పుస్తకాల్లో దేవుడు! కొండెక్కితే దేవుడు! ఆకాశంలో దేవుడు! ఈ దిగ్బంధంలో ఒక మనిషికి, వెన్నెముక నిలబడి తర్క జ్ఞానం తెలిసే టప్పటికే 'దేవుడి జబ్బు' ముదిరిపోతుంది. ఎన్నెన్నో ఆలోచనలూ, తర్క వితర్కాలూ, ఊగిసలాటలూ, సంఘర్ష ణలూ, చివరికి శరణాగతీ!
పూర్వం భక్తి - స్వర్గం కోసమో, పుణ్యం కోసమో అని చాలా కధల్లో చదువుతాం. కానీ ఇప్పుడు, స్వర్గం కావాలని ఎవ్వరూ అనరు. లోపల అనుకోరు కూడా. స్వర్గ నరకాల మీద విశ్వాసాలు లేక కాదు. వాటి మీద ఎంత నమ్మకం వున్నా, ఈ నాడు దేవుళ్ళని పూజించేది వాటి కోసం కాదు. జీవితాల్లో కావలసినవాటి కోసమే దేవుళ్ళని ప్రార్ధిస్తారు.
ఒక రాజు, దేవుళ్ళని ప్రార్ధిస్తే, తన రాజ్యం విస్తరిం చాలనీ, శతృవుల్ని జయించాలనీ, కోరుకుంటాడు. ఒక వర్తకుడు, తన వర్తకం పెరగాలనీ, లాభాలు పెరగాలనీ, కోరుకుంటాడు. ఈ రోజుల్లో ఒక నిరుద్యోగి, ఉద్యోగం కావాలని కోరతాడు. రాతి ముందో, రప్ప ముందో నిల బడి ఒక ఆడపిల్ల తల్లి, కూతురికి పెళ్ళి సంబంధం కావాలని కోరుతుంది. మగ పిల్లాడి తల్లి, కొడుక్కి ఎక్కు వెక్కువ కట్నం, లాంఛనాలూ రావాలని కోరుతుంది. అద్దె ఇళ్ళల్లో పాట్లు పడేవాళ్ళు, ఎప్పటికయినా ఒక స్వంత ఇల్లు కట్టుకోవాలని కోరుకుంటారు. ఒక దీర్ఘ రోగి, రోగం కుదిరితే మొక్కుబళ్ళు చెల్లిస్తానని మొక్కుకుంటాడు. ఒక ఉద్యోగి, ప్రమోషన్ రావాలని కోరు కుంటాడు. ఈ రకంగా, ధనిక వర్గంలోనూ, పేద వర్గం లోనూ కూడా ఎవరి అవసరాల కోసం వాళ్ళు కోరు కుంటారు. ఈ కోరికలన్నీ సమాజ పరిస్తితులకు సంబం ధించినవే.
భగవంతుడు లేడు కాబట్టి, ఈ ప్రార్ధనల్ని వినే వాళ్ళూ, తీర్చేవాళ్ళూ ఎవరూ వుండరు. కానీ, ధనిక వర్గం, దాని కోరికల్ని అదే తీర్చుకోగలదు. ప్రజలు, లేని భగవంతుళ్ళ వేపు మొహాలు తిప్పి ఉన్నంత కాలమూ ధనిక వర్గం కోరికలు నెరవేరుతూనే ఉంటాయి.సమస్య అంతా పేద వర్గానిదే.
సమాజం, 'నిరుద్యోగం' అనే సమస్యే లేకుండా యువతీ యువకులందరికీ పనులు చేసే అవకాశం కల్పిస్తే, ఉద్యోగాల కోసం దేవుళ్ళకు మొక్కు కోవలసిన పరిస్థితి వుంటుందా? జబ్బులకు తగిన వైద్య సౌకర్యాల్నీ, శ్రద్ధగా బాధ్యతగా వైద్యం చేసే ఆస్పత్రుల్నీ సమాజం ఏర్పాటు చేసుకుంటే, రోగులు, దేవుళ్ళని ప్రార్దించుకోవలసిన అవసరం వుంటుందా? సైన్సు పరి జ్ఞానమే వుంటే, ఇంకా వైద్యం కనిపెట్టని జబ్బుల్ని కూడా మనుషులు సహనంతో భరించుకోగలుగుతారు. అలాగే, ఏ సమస్య అయినా. పేద ప్రజలు, ఏ అవసరాల కోస మైతే దేవుళ్ళని ప్రార్దిస్తారో, ఆ అవసరాలన్నీ వాళ్ళే ఎంతో సునాయాసంగా తీర్చుకోగలరు. కానీ, ఆ 'జ్ఞానం' ప్రజలకు ఏర్పడాలి. అది జరగకుండా వుండడానికే, దోపిడీ ప్రభుత్వం, ప్రజలు తమ అవసరాల కోసం దేవుళ్ళనే ప్రార్ధించుకునే లాగ ప్రోత్సహిస్తుంది, తిరపతికి బస్సు సౌకర్యాలు పెంచీ, భద్రాచలం గుడికి వెండి రేకులు తాపించీ, అన్నవరంలో ... సింహాచలంలో ఏదేదో చేసీ, ప్రజలకు దేవుడి గుళ్ళ మీద ఆకర్షణలు పెంచుతుంది. దోపిడీ ప్రభుత్వం చేసే పరిపాలనలో, ప్రజల మూఢ నమ్మకాల్ని చెక్కు చెదరనివ్వకుండా వుంచడం ఒక ముఖ్య భాగం.
ప్రజల్ని మూఢత్వంలో వుంచే మతం, దోపిడీ వర్గానికి పెద్ద రక్షణ కవచం.
సాధారణంగా మనం వినే దేవుళ్ళ కధలన్నీ ఎంతో శ్రావ్యమైన సంగీతం ద్వారా, చక్కని పాటల ద్వారా వింటూ వుంటాం. దేవుళ్ళ గురించి పాడే సినిమా పాటల్లో కూడా చక్క చక్కని వరసలూ, రాగాలూ, కంఠాలూ, కవిత్వాలూ, రక రకాల సమ్మేళనాలతో వుంటాయి. ఆ పాటలు మరీ మరీ వినబుద్ధి వేస్తాయి.ఆ పాటలు వినాలని మనకు కలిగే కోరికా, పాటలు వింటోంటే కలిగే ఆనందం, 'అదంతా భక్తే' అనుకుంటాం. కానీ, పాటలు వింటూ తన్మయత్వం చెందేది భక్తికి కాదు, సంగీత సుఖానికే. ఎంత నాస్తికుడైనా, త్యాగరాజు కీర్తనలూ, కూచిపూడి గానాలూ, ఆనందంగా వింటాడు. భక్తులంతా గుంపుగా కూడి, ఆర్మణీలతో, మద్దెళ్ళతో, తాళాలతో భజనలు చేస్తున్నప్పుడు, వారికి కలిగే ఆనందం 'ఆ పాటల వల్లనే' అని అర్ధం చేసుకోరు. ఎవరు ఉత్సాహంగా పాడితే వారు చాలా గొప్ప భక్తులుగా చెలామణీ అవుతారు. ఒక్క పాటన్నా పాడ కుండానూ, వీణలు గానీ మద్దెళ్ళు గానీ తాళాలు గానీ ఒక్క వాయిద్యం అయినా లేకుండానూ, వాటి శబ్దాల వల్ల ఉత్తేజం తెచ్చుకోకుండానూ, ఊరికే కూచుని, భక్తి లోంచి అంత ఉత్సాహం, అంత సుఖం, అంత ఆనందం, పొందమనండి, ఎవరినైనా!
దీన్ని బట్టి, దేవుళ్ళపై భక్తి కలగడానికి 3 కారణాలు కనబడుతున్నాయి. (1) పసితనం నించీ చుట్టూ సమాజ ప్రభావం వల్ల వచ్చే అలవాటు. (2) తమ సమస్యల్నీ, కష్టాల్నీ భగవంతుడే తీరుస్తాడు - అనుకోవడం. (3) గానంలో, సంగీతంలో ఆనందం.
సాధారణంగా 'భక్తి' గురించి తర్క వితర్కాలు జరిగే టప్పుడు అనేకమంది ఒకే సందేహం వెలిబుచ్చుతారు. "ఎందరో గొప్ప గొప్ప మేధావులు, పండితులు, కవులు, ఎంతో చదివిన వారు కూడా దేవుణ్ణి నమ్ముతారే! గాంధీ గారు కూడా... " ఇదీ ఆ సందేహం! ఇది చాలా సహజమైన సందేహమే. ఇంతకు ముందే చెప్పుకున్నాం, భక్తి కలగడానికి కారణాలు. ప్రతీ వొక్కరి మీదా ఆ పరి స్ధితులే పనిచేస్తాయి. గాంధీగారు అయినా, ఇంకో గారు అయినా, ఈ సమాజంలో పుట్టి పెరిగిన మనుషులే.
అయితే, కొంత మంది మనుషులు పెద్దయిన తర్వాత, కొంచెం ఆలోచించడం తెలిసిన తర్వాత, 'హేతు వాదం' వంటి సిద్ధాంతాలతో పరిచయం కలిగి, భక్తిని వదిలేస్తారు. కానీ ఇలాంటి వాళ్ళు చాలా తక్కువ. ఇలా మారని వాళ్ళే చాలా ఎక్కువ.
పేద ప్రజల్లో హేతువాదులు మచ్చుకి కూడా వుండరు. ఎందుకంటే, వారికి ఆ జ్ఞానం అందదు. వారికి, ప్రకృతి గురించి తెలుసుకునే చదువులే వుండవు.
చదువులు వున్నా, ఆ చదువులు బూర్జువా చదు వులే. అవి, 'దోపిడీ శ్రమ సంబంధాల' గురించి చెప్పవు. పైగా, ఆ నిజాన్ని మరుగుపరుస్తూ అన్నీ అబద్ధాలే చెపుతాయి. కాబట్టి చదువుకున్న వాళ్ళకి కూడా అసలు నిజం అందదు.
అంతేగాక, వర్తకాల్లోనూ దోపిడీ రాజకీయాల్లోనూ వుండే వాళ్ళు, తర్కాన్ని బొత్తిగా చేరనివ్వరు. వాళ్ళని వాళ్ళు మభ్యపెట్టుకుంటూ, ప్రజల్ని మభ్యపెడుతూ, 'భక్తి'ని నిలబెట్టి వుంచడానికే ప్రయత్నిస్తారు.
గాంధీగారు కూడా అంతే. ఆయన, చిన్న కులస్తు లందరికీ 'రామ నామ జపాన్ని' పరిష్కార మార్గంగా చెప్పాడంటే, అదంతా కేవలం అమాయకత్వం వల్ల జరిగిందనీ, ఏ స్వప్రయోజనాన్నీ ఆశించకుండా జరిగిందనీ, నమ్మనక్కర లేదు. ప్రజల్ని అజ్ఞానంలో వుంచడానికి, పాత పండితులందరూ చెప్పిన దంపుళ్ళ నీతులే ఆయనా - చెప్పాడు. కాకపోతే, 'అహింస, హరిజనులు, సత్యా గ్రహం' లాంటి జరీ మెరుపుల్తో!
ఈ ప్రకృతి ఏమిటి? దీని సూత్రాలు ఏమిటి? దేవుడు వున్నాడా? ఉంటే ఎక్కడ?- ఇలాంటి విష యాలు తెలుసుకోవాలంటే, ప్రకృతి శాస్త్రాల మీద ఆధారపడి తెలుసుకోవలిసిందే గానీ, తల కిందకీ కాళ్ళు పైకీ పెట్టి పిల్లి మొగ్గలు వెయ్యడం వల్ల తెలుసుకో గలిగేదేమీ వుండదు.
ప్రపంచంలో, పెట్టుబడిదారీ విధానం కన్నా అభి వృద్ధి చెందిన ఆలోచనా విధానమూ, శ్రమ దోపిడీని గ్రహించిన శాస్త్రీయ సిద్ధాంతమూ, వచ్చేశాయి. మనం ఇంకా ఏ మూల గుళ్ళోనో, బాబాల పాదాల అడుగునో చేరి “మా పిల్లాడికి ఉద్యోగం దొరుకుతుందా? మా పొలంలో మంచి పంట పండుతుందా? మా పిల్లని ఈ నెలన్నా అత్తారు తీసికెళ్తారా?" అని దేవిరించే స్తితిలో వున్నామంటే, అటు ప్రకృతి శాస్త్రాలు గానీ, ఇటు సామాజిక శాస్త్రాలు గానీ, ఏవీ మన వరకూ రాలేదన్న మాట!
శ్రీరాముడు సాక్షాత్తూ మహా విష్ణువేనని, కవులు బాకా లూదితే అదంతా నమ్ముతూ, ఈ నాటికీ 'రామ రాజ్యం' కోసం అర్రులు చాచే స్తితిలో వున్నామంటే అది మన అజ్ఞానమే.
ఈ భక్తి ఎందుకో, ఇది జీవితాలకేం పనికి వస్తుందో, భక్తులకు కూడా తెలీదు.
రామాయణంలో రాముడే అన్నాడు. దేవుడు ఎప్పుడూ కనపడడని! భరతుడు కూడా "తపస్సు వల్ల ఫలితం వుందో లేదో తెలీనప్పుడు తపస్సు చేస్తూ జీవితం వృధా చేసుకోవడం ఎందుకు?" అన్నాడు. - ఈ రకంగా, రామాయణంలోనే అనేక పాత్రలు అనేక సందర్భాల్లో 'దైవం' గురించి ఎన్నో సందేహాలు వ్యక్తపరిచాయి. వాటికి జవాబులు దొరకలేదు.
సీతా, రాముడూ చెట్లనీ, పుట్లనీ పూజిస్తూ వుంటారు - తమ కోరికలు తీర్చమని! అలాంటి వాళ్ళు మన దేవుళ్ళు! వారినీ మనం పూజించటం, మన కోరికలు తీర్చమని!!
-- రంగనాయకమ్మ
(రామాయణ విషవృక్షం నుంచి)
No comments:
Post a Comment