Thursday, January 30, 2025

 *శ్రద్ధలు... వైవిధ్యాలు.....*

శాస్త్రవిధిని మీరినా శ్రద్ధతో పూజించే సాత్వికుల, రాజసుల, తామసుల.. ఆచరణలు... 

పూర్వజన్మల కర్మల వలన జీవులకు సాత్విక, రాజస, తామస శ్రద్ధలు ఏర్పడతాయి. స్వభావంచే శ్రద్ధ పుడుతుంది. శ్రద్ధలేని వాడు అంటూ ఎవరూ ఉండరు. శ్రద్ధ ఎలాంటిదైతే వారు అలాంటి వారే అవుతారు.

1) సాత్వికులు దేవతలనీ,
2) రాజసులు యక్షరాక్షసులనీ,
3) తామసులు భూతప్రేతాలనీ పూజిస్తారు.

ఆహార, యజ్ఞ, తపస్సు, దానాలు కూడా గుణాలను బట్టే ఉంటాయి...

ఆహారములు :

1) ఆయుస్సునూ, ఉత్సాహాన్ని, బలాన్ని, ఆరోగ్యాన్ని, సుఖాన్ని, ప్రీతినీ వృద్ధి చేస్తూ రుచి కల్గి, చమురుతో కూడి, పుష్టిని కల్గించు ఆహారం సాత్వికాహారం.

2) చేదు, పులుపు, ఉప్పు, అతివేడి, కారం, ఎండిపోయినవి, దాహం కల్గించునవి రాజస ఆహారాలు.

3) చద్దిదీ, సారహీనమూ, దుర్వాసన కలదీ, పాచిపోయినదీ, ఎంగిలిదీ, అపవిత్రమైనదీ తామస ఆహారం..

యజ్ఞములు :

1) శాస్త్రబద్దంగా ఫలాపేక్ష లేక చేసేది సాత్విక యజ్ఞం.

2) ఫలాపేక్షతో, పేరు కోసం, గొప్పను చాటు కోవడం కోసం చేసేది రాజస యజ్ఞం.

3) శాస్త్రవిధి, అన్నదానం, మంత్రం, దక్షిణ, శ్రద్ధ లేకుండా చేసేది తామస యజ్ఞం.

తపస్సు :

1) దేవతలను, పెద్దలను, గురువులను, బ్రహ్మవేత్తలను పూజించడం, శుచి, సరళత్వం, బ్రహ్మచర్యం, అహింస శరీరం తో చేయు తపస్సు.
బాధ కల్గించని సత్యమైన ప్రియమైన మాటలు, వేదాభ్యాసం మాటలచే చేయు తపస్సు.
నిశ్చల మనస్సు, మృదుత్వం, మౌనం, మనఃశుద్ధి కల్గి ఉండడం మనసుతో చేయు తపస్సు.
ఫలాపేక్ష రహితం, నిశ్చలమనస్సు, శ్రద్దతో చేయు తపస్సు సాత్వికం.

2) కీర్తి ప్రతిష్ఠల ఆశతో గొప్పను ప్రదర్శిస్తూ చేయు తపస్సు రాజసికం. దీని ఫలితం కూడా అల్పమే.

3) పరులకు హాని కల్గించు ఉద్దేశ్యంతో తనను తాను హింసించు కుంటూ, మూర్ఖఫు పట్టుదలతో చేయు తపస్సు తామసికం.

దానాలు :

1) పుణ్య స్థలాలలో దానం, పాత్రతను బట్టి దానం, తనకు సహాయ పడలేని వారికి దానం చేయడం సాత్వికం.

2) ఉపకారం ఆశించి, ప్రతిఫలం కోరుతూ కష్టపడుతూ ఐనా చేసే దానం రాజస దానం.

3) అపాత్రదానం, అగౌరవం చే చేసే దానం తామస దానం.

'ఓం'' "తత్" 'సత్" అనే మూడు సంకేత పదాలు బ్రహ్మజ్ఞతకు సాధనాలు. వాటి వలనే వేదాలు, యజ్ఞాలు, బ్రాహ్మణులూ పుట్టడము జరిగింది.
అందుచేతనే యజ్ఞ, దాన, తపో కర్మలన్నీ 'ఓం' కారపూర్వకం గానే చేస్తారు.

మోక్షం కోరువారు ప్రయోజనం కోర కుండా చేసే యాగ, దాన, తపోకర్మలన్నీ "తత్" శబ్దం చే చేయబడుతున్నాయి.

"సత్" శబ్దమునకు ఉనికి, శ్రేష్టము అని అర్థం. నిశ్చలనిష్ట, పరమాత్ముని గూర్చి చేసే అన్ని కర్మలు కూడా "సత్" అనే చెప్పబడుతున్నాయి.

శ్రద్దలేకుండా ఏమి చేసినా "అసత్" అనే చెప్పబడతాయి. వాటి వలన ఎలాంటి ప్రయోజనమూ ఉండదు...

No comments:

Post a Comment