Saturday, January 4, 2025

 *తోక లేని తిమ్మరాజు* 
🙊🙉🙈🐵

*నవ్వుల కథ*😊

తిమ్మన్న కోతిమూకలకు రాజు. అది ఒక ఊరి దగ్గిర మిట్టమీద వుంటూ వుండేది. అది చేసే దుండగాలు ఇన్నీ అన్నీకావు. పిల్లలేమిటి పెద్దలేమిటి దాని పేరుచెప్పితే భయపడనివాళ్లు లేరు.

తిమ్మన్న తన కోతి సమూహాన్ని వెంటేసుకుని ఆ చుట్టుపక్కల వున్న తోటల్లోపడి అందిన పళ్లూ, కాయలూ, తిన్నన్ని తిని, మిగతావి కొరికి కింద పారేసి చెట్లన్నీ ధ్వసం చేస్తుండేది.

ఒక రోజున తిమ్మన్న తిమ్మపల్లె వచ్చింది. వచ్చి అక్కడ ఒక పాడుబడిన గోడ మీద కూర్చుని, “ఈ వూళ్లో వాళ్లని ఏవిధంగా ఏడిపిద్దామా" అని తీరిగ్గా ఆలోచిస్తూ కూర్చుంది. తిమ్మన్న పొడుగాటి తోక గోడ రెండో వైపున వేళ్లాడుతూ వుంది. అక్కడ నాగజెముడు కంప వున్న సంగతి పాపం తిమ్మన్నకి తెలియదు. ఇంతలో ఒక పిల్లవాడు ఆటుపోతూ చేతిలో వున్న జామకాయ విసిరివేశాడు. జామకాయ తీసుకోటానికి తిమ్మన్న ఎగిరి దూకి జామకాయ తీసుకుని తిందామని కూర్చుంది. ఇంకేం, అక్కడ ఒక రక్కిస ముల్లు ఉండి తోక మొదట్లో గుచ్చుకుంది. తిమ్మన్న కెవ్వున కేక వేసి ఎగిరి అవతలకి దూకింది. ఆ ముల్లు లాగాలని ఎన్నో తిప్పలుపడింది కాని అది రాలేదు.

తిమ్మన్న ఇలా అవస్థపడుతూండగా, ఆ వూరి మంగలి తిమ్మప్ప ఆ దారినే పోతూ తిమ్మన్నను చూచాడు. చూచి “అదేమిటోయ్ తిమ్మన్నా. ఏమిటిలా పీక్కుంటున్నావ్? ఏమిటి సంగతి ?” అని అడిగాడు.

"మంగలి మామా, పాడు ముల్లొకటి నా తోకలో గుచ్చుకుందోయ్,” అన్నది.

"ఓస్, ఇంతేగదా ! నే తీవేస్తారే వుండు" అన్నాడు మంగలి.

"బాబ్బాబు, నీకు పుణ్యం వుంటుంది. తీదూ" అని తొందరచేసింది తిమ్మన్న,

"తీస్తా, తొందరపడమాకు. నువ్వు కదలకుండా, మేదలకుండా కూర్చోవాలి సుమా ఆట్లాగైతేనే తీస్తా, లేకపోతే నా వల్ల కాదు” అన్నాడు మంగలి.

“ఓ ఇంతేకదా భాగ్యం! నువ్వు ఏం చెప్పితే అది చేస్తా. రాతిబండకిమల్లే కూర్చుంటా, సరేనా?” అంది తిమ్మన్న.

మంగలి పొదిలోంచి కత్తి తీసి నెమ్మదిగా ముల్లు గుచ్చుకున్న చోట బొచ్చును గొరగబోయినాడు. కత్తి తోకకి తగలగానే తిమ్మన్న ఒక్కమాటు ఎగిరిపడింది. ఇంకేం, తోక సర్రున తెగిపోయింది. వెంటనే తిమ్మన్న మంగలి చెయ్యి లంకించుకుని “ఓరి నీ చెయ్యి విరగ! తిమ్మన్న రాజు తోక తెగగొయ్యటానికి నీకు చేతులెల్లా వచ్చాయిరా! దుర్మార్గుడా మళ్ళీ నా తోక నాకు పెట్టనన్నా పెట్టు, లేకపోతే ఆ కత్తెనా ఇచ్చిపో" అని నిలవేసింది.

"తిమ్మన్నా, ఇందులో నా తప్పేముంది చెప్పు. నువ్వు కదిలావు. తోక తెగింది. నేనేం కావాలని తెగ్గోశానా ? నా బ్రతుకు ఈ కత్తితోనే వుందే, అది ఇస్తే నా గతేంకావాలి చెప్పు?” అని అన్నాడు మంగలి విచారంగా.

“నువ్వు బతికితేనాకేం చస్తే నాకేం, నా తోక కోసినందుకు నీ కిది శాస్తి” అంటూ తిమ్మన మంగలి చేతిలోని కత్తి లాక్కుని వుడాయించింది.

"తిమ్మన్న కొంత దూరంవచ్చి, అక్కడొక మర్రిచెట్టు నీడన కూర్చుని తెగిన మొండి తోక చూసుకుందామని ప్రయత్నించింది. కాని కనిపించలేదు.

ఇంతలో అక్కడికొక మామిడి పళ్లమ్మి పళ్ల తట్ట నెత్తిన బెట్టుకుని వచ్చి, చెట్టు నీడన కూర్చుని తట్టలోని పండు ఒకటి తీసుకుని తినటం మొదలెట్టింది. 

తిమ్మన్న ఆ అమ్మితో “అమ్మీ, అమ్మీ, అదేమిటీ ఆట్లా నోటితో కొరుక్కుని తింటావేం? చక్కగా కత్తితో తోలు తీసి, సన్నని ముక్కలు కోసుకుని తినరాదూ" అన్నది.

"తిమ్మన్నా! బీదముఁడని. నాకు చాకులూ కత్తులూ, ఎక్కడ్నుంచొస్తయ్" అన్నది పండ్లమ్మి.

"నాదగ్గిర ఒక మంచి కత్తి వుంది. కావాలంటే కాసిని కాయలు కోసుకుతిను. ఇంతలోకే యేం ఆరిగిపోతుంది గనకనా" అని తిమ్మన్న కత్తి ఇచ్చింది.

పండ్లమ్మి నాలుగైదుపళ్ళు కోసుకు తిన్నది. ఒక్క ముక్క కూడా తనకి పెట్టడంలేదే అని తిమ్మన్న చూస్తూంది. పండ్లమ్మి తిరిగి కత్తి తిమ్మన్నకిచ్చింది.

తిమ్మన్న కత్తివంక చూచి, "ఎంత నంగనాచివమ్మా, కత్తి అంతా మొండి
చేసి ఇస్తున్నావే నేనిచ్చినప్పుడు తళతళ మెరుస్తున్నదే, ఇప్పుడెట్లా వుందో చూడు. పదునంతా పోయింది. నా కక్కర్లేదు, పాడుకత్తి. నువ్వే వుంచుకో. కత్తికి బదులు ఆ పళ్ల తట్ట ఇచ్చివెళ్ళు” అన్నది తిమ్మన్న దర్జాగా. పాపం, పళ్లమ్మి తెల్ల బోయింది. 

"తిమ్మన్నా, నేనేం గొంతులో కొట్టుకోనా ఈ కత్తి తీసుకుని. ఏదో, ఈ పళ్లమ్ముకుని నాలుగు డబ్బులు సంపాయించుకుని పొట్టపోసుకోవాల్సినదాన్ని నేను. నా నోట్లో మట్టికొట్టకు” అన్నది పండ్లమ్మి.

"నువ్వు నీనోట్లో మట్టే కొట్టుకుంటావో, బంగారమే కొట్టుకుంటావో నాకెందుకూ? నా మామూలు కత్తి నా కిచ్చినా సరే లేకపోతే పండ్లతట్ట ఇచ్చి వెళ్లినా సరే” అన్నది తిమ్మన్న.

“ఇదేం తంటారా భగవంతుడా" అని పండ్లమ్మి విచారిస్తూండగా, తిమ్మన్న తట్ట లంకించుకుని అక్కణ్ణించి ఉడాయించింది.

పళ్ల తట్టతో తిమ్మన్న ఒక బీడు దగ్గిరికొచ్చింది. అక్కడొక 10 యేళ్ల పిల్ల ఒక ఎద్దుని మేపుతోంది. ఆ  పిల్ల చాలా నీరసంగా వుండటం చూచి "ఏం పిల్లా. అలా నీరసంగా వున్నా వేం? ఆకలవుతోందా?" అని అడిగింది.

"ఆవును తిమ్మన్నా. ప్రొద్దుట చద్ది బువ్వ కూడా తినకుండా వచ్చానివ్వాళ.. మాచెడ్డ ఆకలేస్తోంది" అన్నది పిల్ల.

"అలాగనా, పాపం. ఇవిగో నా దగ్గిర మంచి మామిడిపళ్లు తట్టెడున్నయ్యి. నీకు కావల్సినన్ని తీను,” అని పళ్లతట్ట పిల్లకిచ్చింది తిమ్మన్న.

పిల్ల ఆత్రంకొద్దీ, పళ్ళువరసబెట్టి తినటం మొదలెట్టింది. ఇంకా తట్టలో నాలుగైదు పళ్ళు వున్నయ్యనంగా, తిమ్మన్న గయ్, గయ్మంటూ లేచింది. "ఏంపిల్లా, పిట్ట కొంచెం, కూతఘనం అన్నట్లు, లొడితెడు లేవు బుట్టెడు పల్లెల్లా తిన్నావ్ ? ఏదో దయతలచి తినమన్నానుగ అని అన్నీ తిని కూచున్నావ్, భలేదానివిలే. నా పళ్ళు నాకు కక్కు. లేకపోతే ఆ ఎద్దును ఇచ్చెయ్యి” అన్నది తిమ్మన్న. 

పాపం పిల్ల బిక్కమొగం వేసింది. - "తమ్మన్నా. ఎందుకలా కోప్పడతావు. నువ్వు తినమంటేనేగా తిన్నాను. ఎద్దుని
తిరిగి ఇంటికి తీసుకెళ్లకపోతే మా అమ్మా నాన్నా నన్ను చితకదొడుస్తారు తిమ్మన్నా. నన్ను వొదిలిపెట్టు" అన్నది పాపము పిల్ల కన్నీళ్ళుకారుస్తూ.

కాని తిమ్మన్నకు జాలికలగలేదు, పిల్ల చేతులో వున్న తాడు లంకించుకుని ఎద్దుని లాక్కుపోయింది. పాపం పిల్ల, బోర్లపడి ఏడుస్తూ ఉండిపోయింది.

ఎద్దుని తీసుకుని వస్తుండగా తిమ్మన్నకు ఒక నూనెగానుగ కన్పించింది. గానుగకి ఒకటే ఎద్దుకట్టి వుంది. రెండో ఎద్దుకు బదులు తెలకవాడే గానుగ లాగుతున్నా డు. "ఏమండోయ్ తెలకల బావగారూ. ఈ ఉద్యోగం ఎప్పట్నించీ" అని అడిగింది తిమ్మన్న.

"ఏంచేసేది తిమ్మన్నా, రెండో ఎద్దు నిన్ననే చచ్చింది. గానుగ ఆడితేనేగా డొక్కాడేది. అందుకని నాకీ ఖర్మ" అన్నాడు తెలకవాడు.

"అలాగటోయ్! నా దగ్గిర ఇదుగో ఈ ఎద్దు వున్నది. కావలిస్తే ఇవ్వాల్టికి నీ గానుగ ఆడించుకో" అంది తిమ్మన్న.

"చాలా మంచివాడివి తిమ్మన్నా!  సాయంత్రం లోపల నీ ఎద్దుని నీకిస్తాలే” అన్నాడు తెలకవాడు.

తిమ్మన్న సాయంత్రం తెలకవాడి దగ్గిరికి వచ్చింది. తెలకవాడు ఎద్దును తిరిగి ఇచ్చేశాడు. తిమ్మన్న ఎద్దువంక ఎగాదిగా చూసి, “ఏమోయ్ తెలకలబావా ! డొక్కలు పీక్కుపోయేదాకా బాగా పని చేయించుకుని ఇస్తున్నావా నా ఎద్దును నాకు. చూడు, ఇప్పుడో ఇక కాసేపటికో చచ్చేటట్లుంది. నువ్వే వుంచుకో, నాకక్కర్లేదు. నా ఎద్దుకు బదులు నీవు ఆడించిన నువ్వుల నూనంతా నాకిచ్చెయ్యి" అన్నది.

తెలకలవాడు తెల్లబోయి "తిమ్మన్నా.
ఇలాగనటం నీకు న్యాయమేనా? నూనె ఇస్తానని నేను చాలామంది దగ్గిర డబ్బులు కూడా ముందుగా తీసుకున్నా నే. నూనె ఇవ్వకపోతే నన్ను వాళ్ళు బతకనిస్తారా. క్షమించు, నూనె ఇవ్వలేను” అన్నాడు.

“ఏమిటీ, ఇవ్వలేవూ? ఎలా ఇవ్వవో చూస్తా” ఆంటూ తిమ్మన్న నూనెచట్టి నెత్తిన బెట్టుకుని దౌడు తీసింది.

తిమ్మన్న నూనెచట్టి నెత్తిన బెట్టుకుని వస్తుండగా, దోవలో ఓ ముసలి అవ్వ అట్లు పోస్తున్నది. తిమ్మన్న అవ్వ పక్కకి పోయి కూర్చుని “అవ్వా, అవ్వా, నువ్వు దోసెలు కుప్పలు కుప్పలుగా పోస్తున్నా వేగాని, కమ్మని వాసనరాదేం. ఇలాంటివి ఎవరు కొంటారు నీ దగ్గిర మంచి పప్పు నూనెతో దోసెలు తయారు చేస్తే ఎంతో మంది వస్తారు కొనటానికి” అన్నది.

"తీమ్మన్నా, నువ్వు చెప్పేది నిజమే. కాని బీదముండని, మంచి పప్పు నూనె ఎక్కణ్ణుంచి తేను?" అన్నది అవ్వ.

"అవ్వా, నీకు నిజంగా కావల్సివుంటే ఇదుగో నా దగ్గర చట్టెడు మంచి నూనె వున్నది. నీకు కావాల్సినంత వాడుకో. నాకు మాత్రం ఒక్కటంటె ఒక్క దోసె పెట్టు, చాలు” అన్నది తిమ్మన్న.

ఆవ్వ సరేనని, నూనె తీసుకుని దోసెలు పొయ్యటం మొదలుపెట్టింది.

అవ్వ దగ్గిర వున్న పిండి అంతా ఆయి పోయింది. చట్టిలో నూనె కూడా సగానికి పైగా అయిపోయింది. అవ్వ చట్టి తిరిగి తిమ్మన్న కిచ్చేసింది. తిమ్మన్న చట్టి లోకి తొంగిచూసి "అవ్వా, ఏమో ననుకున్నా, భలేదానివే. ఈ కాస్త నూనెను నేనేం చేసుకోను నువ్వే వుంచుకో. నువ్వు  పోసిన ప్రతి దోసెలోనూ నా నూనే వున్నది. అందుకని దోసెలు నావీ, మిగిలిన నూనె నీది” అన్నది.

అవ్వకు ఏమీ తోచలా. పొయ్యి వూదే గొట్టంతో దేహశుద్ధి అయితేగాని తిమ్మన్న వదలడనుకొని, గొట్టం కోసం పొయ్యి వైపు తిరిగింది. ఇదే సందు గదా అని తిమ్మన్న, దోసెల దొంతర నెత్తిన బెట్టుకుని ఒక్క పరుగుతీసింది.

దోవలో తిమ్మన్నకి ఒక మనిషి రండోలు మోసుకొస్తూ కనిపించాడు. తిమ్మన్న “ఏం,రండో బావా! ఎక్కడికి ప్రయాణం ?” అని అడిగింది.

“ఇక్కడికేనోయ్ తిమ్మన్నా. పక్క వూరిలో పెళ్ళికి పిలిచారు" అన్నాడు రండోలు వాడు. సరేనని ఇద్దరూ కలిసి నడుస్తున్నారు.

ఇంతలోకే ఒక ఏరు దగ్గిరికి వచ్చారు. తిమ్మన్న రండోలువాడితో, "రండోలుబావా, చాలా దూరం వచ్చాం. కాళ్ళు లాగుతున్నయ్యి కదూ? కమ్మని దోసెలు కాసిని తిని, ఆ ఏట్లో నీళ్ళు కడుపునిండా తాగితే ఎంతో హాయిగా
ఉంటుందికదూ?" అన్నది.

"నిజమే, కాని ఈ నట్టడవిలో మనకి దోసెలేం ఆకాశాన్నించి రాల్తాయా?" అన్నాడు రండోలువాడు.

"ఆకాశాన్నించి రాలటమెందుకోయ్. మనదగ్గిర లేకపోతేగా ! ఇవిగో నాదగ్గిర బోలెడు కమ్మటి దోసెలున్నై. కాళ్లూ, చేతులూ కడుక్కురా, తిందాం” అన్నది తిమ్మన్న.

సరేనని రండోలువాడు కాళ్ళు చేతులు కడుక్కొనివచ్చి, దోసెలు తీసుకుని తినటం మొదలుపెట్టాడు. తిమ్మన్న మాత్రం పక్కన చూస్తూ కూర్చున్నది.

రండోలువాడు వంచిన తల యెత్తకుండా దోసె మీద దోసె గొంతు దాకా మెక్కాడు. తిమ్మన్న అది చూసి మండిపడుతూ - "చాల్లేవయ్యా భలే పెద్ద మనిషివి. ఏదో పుణ్యానికి కాసిని తినమంటే అన్నీ తింటావా? నా దోసెలన్నా నాకుతే. లేదా నీ డోలన్నా నాకివ్వు" అన్నది.

డోలువాడు గుడ్లు వప్పజెప్పి చూస్తూ కూచున్నాడు. గొంతువరకూ మెక్కటం చేత అతనికి నోటంట మాట కూడా రాలేదు. ఏంచెయ్యటఁరా భగవతుడా అని ఆలోచిస్తూండగా, తిమ్మన్న డోలు లంకించుకుని ఒక్క పరుగున తన కోతి సమూహు దగ్గరికొచ్చి చేరుకుంది.

కోతులన్నీ తిమ్మన్నరాజును చూడగానే లేచి నిల్చుని సలాంచేసినై. కోతుల  మంత్రి, "రాజా, ఈవేళ తమరు చేసిన ఘనకార్యాలు సెలవిస్తే చెవులారా విని ఆనందిస్తాం” అన్నాడు.

“సరే, అంతా కూర్చోండి" అని తిమ్మన్న రాజు బావి మీదకి ఎక్కి డోలు మీద దరువేస్తూ ఇలా పాట పాడాడు :—

"తోకపోయి కత్తి వచ్చె ఢం, ఢం, ఢం కత్తిపోయి పళ్లు వచ్చె ఢం, ఢం, ఢం పళ్లుపోయి ఎద్దు వచ్చె ఢం, ఢం, ఢం ఎద్దుపోయి నూనె వచ్చె ఢం, ఢం, ఢం నూనెపోయి దోసెలొచ్చె ఢం, ఢం, ఢం దోసెలుపోయి డోలు వచ్చె ఢం, ఢం, ఢం ఢం, ఢం ఢం, ఢం, ఢం, ఢం. ఢం, ఢం, ఢం"

ఇది వినంగానే కోతులన్నీ సంతోషంతో ఎగిరిగంతులెయ్యటం మొదలుపెట్టినై. అడవి అంతా కోతులగోలతో మారుమోగి పోయింది.
🐒
*కధ కంచికి మనం ఇంటికి*

No comments:

Post a Comment