`అబ్బా ఏమి చలిరా... చలి చంపేస్తూంది..!!`
నేలంతా మంచుదుప్పటి కప్పుకుని,
తెల్లవారినా ఇంకా చల్లదనాన్నే వార్చుతూ,
సూరీడి లేత కిరణాల్నీ చల్లబరుస్తూంది..
ఇందులో అంతగా చెప్పుకునేదేముందీ..!!
అది ప్రకృతి ధర్మం..
ఎండాకాలం, వానాకాలం,చలికాలం ..
కాదన్నా,వద్దన్నా ఈ మూడూ వచ్చే తీరతాయ్..
కాని మనకి మాత్రం..!!
అన్నికాలాలూ సౌకర్యంగానే ఉండాలనుకుంటాం..!!
"అబ్బ ఏం చలిరా బాబూ!! ఎముకలు కొరికేస్తోంది"!
"పొద్దున్నే లేవాలంటే ప్రాణంమీదికొస్తోంది"
"ఇంతెక్కువ చలి ఎన్నడూ చూడలేదమ్మోయ్"
"పాడు చలి పాడు చలి పళ్ళు బిగబడ్తున్నాయ్"
"రెండు రెండు దుప్పట్లు కప్పుకున్నా
సరిపోవడం లేదు చలి పోవడం లేదు."
"ఛఛ..ఆ ఎండాకాలమే బాగుండేది.
"ఎంచక్కా ఏ.సి.ఏస్కుని హాయిగా ఉండేవాళ్లం"
హహహహహ.
ప్రతీ చలికాలం ప్రతొక్కరూ అనే మాటలే ఇవి.
ఐనా ఇవేం పట్టించుకోకుండా
చలికాలం రానూ వస్తుంది.
పోతూపోతూ ఎండాకాలాన్ని
మనకంటగట్టి మరీ పోతుంది.
అందాకా ఆకాశానికెత్తిన ఎండాకాలాన్ని,
అదేం చిత్రమో!!
"వామ్మోవ్! ఎండలు మండిపోతోన్నాయ్!
బండలు పగిలిపోతోన్నాయ్!ఒహటే ఉక్కపోత!
ఆపైన అయ్యబాబోయ్ కరెంటు కోత!
ఏ.సి.ఏసినా ఏమూలకి సరిపోవడం లేదు..
దరిద్రపు ఎండలు!
ఎన్నడూ చూడలేదమ్మా ఇట్టాంటి ఎండల్ని!
ఇది విన్నారా !?
భూమి పుట్టిందగ్గర్నుంచీ
అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది ఈ యేడాదేనట!
భోరున పదిరోజులు ఏకబిగిన వర్షమొస్తే బాగుండు.
పీడా విరగడయ్యేది!!
హుష్!హుష్ ష్!!
ఆ చలికాలమెంత హాయిగా ఉండేదీ!!
సుబ్బరంగా సాయంత్రమే ఇంత తినేసి
నిండా దుప్పటి కప్పుకుని తొంగుంటే
వెచ్చగా కమ్మగా కంటినిండా నిద్రొచ్చేది.
ముదనష్టపు ఎండలు! ఇంకెన్నాళ్ళో!?"
ఇలా ఉంటాయ్ శాపనార్థాలు!!!
ఇహ వర్షాకాలమైతే.....
ఈమధ్య అంతంతమాత్రమే ఉన్నా,
ఆ పడిన రెండు మూడు రోజుల వర్షానికే
జనాలకి మాత్రం,
ఎక్కడా లేని చీకాకులూ,ఛీత్కారాలూనూ!
" ఏం వర్షాలో ఏం పాడో!?
పొద్దున్నుంచీ ఒహటే ముసురు తగుల్కుంది"
"ఒక్కసారిగ ఓ గంట పడి వదిల్తే పోద్ది కదా"
"ఏపనీ చేయలేం! పట్టుమని కనీసం బైటికెళ్ళలేం"
"ఈపాడు కరెంటొకటి పోయిందా! ఇక రాదు!"
మొన్ననగా ఉతికిన బట్టలు ఆరకుండా ముక్కవాసనొస్తున్నాయ్!
ఒకటే జలుబూ,రొంపా,కొంపంతా బురద బురద!"
అంటూ ముక్కు చీదుతూ ముక్కచీవాట్లు పెడతారు.
నిజానికి అన్నికాలాలూ వాటి నిడివీ,
వాటి పనులనీ,సకాలంలో చేస్తేనే కదా,
ప్రకృతి సమతుల్యతా,భూమి సమశీతోష్ణతా వర్థిల్లేదీ!?
దాదాపు మూడు దశాబ్దాలుగా పరిశీలిస్తే,
ఈ సమతుల్యత రానురానూ
లోపించిందనే చెప్పొచ్చు.
అందుక్కారణం!!
ప్రగతీ పురోగతీ పేరుతో పెరుగుతోన్న శాస్త్రవిజ్ఞానం,
ప్రయోగాల పేరుతో ప్రకృతిని
పలురకాలుగా హింసించడం,
తద్వారా సహజవనరులూ
తగ్గి పచ్చదనమూ పోయి,
పచ్చిదనమే లేక,నేల అట్టడుగు సైతం అట్టుడుకుతోంది.
ఇహ అలాంటప్పుడు మేఘాలెలా ఏర్పడతాయ్!?
ఉడికిన నేల ఉబికినప్పుడు సముద్రాల్లో ఏర్పడే
అల్ప పీడనాల వల్ల పడే వర్షాలే ఇకదిక్కు...
అంతే కాదు తుఫాన్ల భయంకర నష్టాల్నీ
చవి చూడాల్సొస్తుంది.
అందుకే ఎండాకాలం నానాటికీ తీవ్రమవుతోంది.
ఈ చలికాలమూ ముందు ముందు వేడెక్కినా ఆశ్చర్యం లేదు.
తిట్టుకున్న వర్షాన్ని వరుణయాగం చేసి వేడుకున్నా!
కరుణింపబడే యోగమూ లేదు.!
అంతా చేజేతులా చేస్కుని,,
చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు,,
అవే చేతుల్ని చాచి ఆకసం వంక చూస్తే ఏముందీ!!?
భగభగమండే సూర్యుడి మంటకు
కళ్ళు బైర్లు కమ్మడం తప్ప!
ఇకనైనా,,,,
ఉన్న అరకొరా ప్రకృతిని కాపాడుకునే
ప్రయత్నం చేద్దాం.
అన్ని కాలాల్నీ ప్రేమిద్దాం...
No comments:
Post a Comment