ఈరోజు మనిషికి విలాసాలున్నాయి కానీ నిజమైన సుఖం లేదు. మందులున్నాయి గాని ఆరోగ్యం లేదు. సంపద ఉంది గాని సంస్కారం లేదు. మానవ జీవనరాగం ఎక్కడో శ్రుతి తప్పింది. దాన్ని సరిదిద్దాలంటే ప్రకృతితో కలిసిమెలిసి జీవించాలి. అప్పుడే మనిషి సుఖపడతాడు.
మనసు పెట్టాలేగాని సముద్రపు హోరులో ఒక రుత్వికుడి వేదమంత్ర ఘోష వినబడుతుంది. హిమాలయం అణువణువూ ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా భాసిల్లుతోంది. పిల్లగాలిలో పార్వతీదేవి చిరునవ్వులు, హోరుగాలిలో పరమ శివుడి ఢమరుక ధ్వనులు, చిరుగాలిలో చిన్ని కృష్ణుడి మువ్వల సవ్వడి విన వస్తాయి. వాటిని ఆలకించగలిగితేనే జీవితం ఆహ్లాద భరితమవుతుంది.
జీవితం బాగుండాలంటే మాటతీరు సరిగ్గా ఉండాలి. సౌమ్యంగా పరిమళభరిత పుష్పంలా శరత్కాలపు వెన్నెలలా చల్లగాను, హనుమంతుడి వాక్కులా వినయంగాను, సుగ్రీవాజ్ఞ మాదిరిగాను... సందర్భాన్నిబట్టి మాట్లాడాలి. మాట సరస్వతీ మాత వరం. మన వాక్కులే మనకు స్వర్ణాభరణాలు. మన మాటలు కోయిల గానంలా శ్రోతలను అలరించి, రంజింపజేయాలి. మాటలే మన వ్యక్తిత్వాన్ని నిర్వచిస్తాయి. మాటల్ని ఎంతో అర్ధవంతంగాను గుణాత్మకంగాను ఉపయోగిం చాలి. మాట అనేది మానవ సంబంధాలలో అత్యద్భుతమైన విజయాలను అందిస్తుంది. స్నేహం పెరుగుతుంది. ఎవరితోను వైరం ఉండదు. మన మాట- మన వ్యక్తిత్వం ముందు దేవాలయంలోని ధ్వజస్తంభం మాదిరి సమున్నతంగా నిలబడాలి. మాటలేకాదు- మందహాసం, కరచాలనం, ఆలింగనం, పలకరింపు - ఇవన్నీ కూడా బంధాలను ముడివేస్తాయి.
ఒకసారి మేరు పర్వతం అభివృద్ధిని సహించలేక అసూయ పడుతుంది వింధ్య పర్వతం . ఆ బాధతో ఆకాశానికి నిచ్చెనలు వేసినట్టు పెరిగిపోతూ పోతూ సూర్యచంద్రుల గమనానికే అడ్డం వచ్చింది. లోకాలన్నీ అంధకార మయ్యాయి. దిక్కుతోచని దేవతలు అగస్త్య మహర్షిని ప్రార్థించారు. ఆయన సతీసమేతంగా వింధ్యపర్వతం దగ్గరకెళ్లి తాము తీర్థ యాత్రలకు దక్షిణాపథం వెళ్తున్నట్టు చెప్పాడు. తాము తిరిగి వచ్చేవరకు తన విరాట్ స్వరూపాన్ని తగ్గించుకోమంటాడు. ఆ తరువాత వాళ్లు ఆ దారిన తిరిగి రాకపోవడంతో వింధ్యపర్వతం అలా తగ్గి ఉండిపోవాల్సి వస్తుంది. అసూయ వల్లే దానికి ఆ గతి పట్టింది. అందుకే జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలంటే వ్యక్తిత్వంలోని లోపాలను మనకుమనంగా గుర్తించాలి. వాటిని సరిదిద్దుకునేందుకు మనసావాచా ప్రయత్నించాలి.
అందుకే జీవితమంటే నూరేళ్ల పంట' అంటారు. దాన్ని సద్వినియోగం చేసుకొని జీవన పరీక్షలో వంద మార్కులూ పూర్తిగా తెచ్చుకోగలిగితే మన జన్మ ధన్యమైనట్లే. దీనికి గాను శాస్త్రీయ దృక్పథంతో, ప్రణాళికాబద్ధంగా ఒక ప్రవర్తన నియమావళిని ముందుగా రూపకల్పన చేసుకోవాలి.
సేకరణ మీ రామిరెడ్డి మానస సరోవరం 👏
No comments:
Post a Comment