*🌹🌹🌹 ఆచార ప్రభవో ధర్మః 🌹🌹🌹*
*ఆచారం వలన ధర్మం కలుగుతుంది (మహాభారతం)*
*ధర్మ విషయాలు చెప్పేవాళ్లకు ఎన్నడూ కొదవ ఉండదు. చేసేవాళ్లే అరుదవుతారు.గత కాలంలోకన్నా ఇప్పుడే అత్యధికంగా ధార్మిక గ్రంథాలు, ఊరూరా ధర్మవేదికలు ఎక్కువయ్యాయి. ఒకే భగవద్గీతపై వేలాది పుస్తకాలు వచ్చాయి. రామాయణాదుల గురించి కూడా చెప్పనలవి కానన్ని గ్రంథాలు, ప్రసంగాలు వెలువడుతున్నాయి. ఇన్ని ధర్మపన్నాలు నలుచెరగులా వినిపిస్తున్నాం. ధర్మం మాత్రం అరుదవుతోంది!ఎక్కడ వస్తోంది తేడా!*
*శిష్యుడు ఎంత విధేయతతో, వినయంతో తనపట్ల మెలగాలో, గురుదక్షిణ ఎంత చెల్లించాలో ముందే ఆలోచిస్తూ, శిష్యుడెలా ఉండాలో ఆశిస్తూ గురువు ఉంటాడు. కానీ గురువుగా తాను చేయవలసినదానిని చేయడు. అలాగే గురువు ఎలా ఉండాలో శిష్యుడు ఆశిస్తుంటాడు. తన శిష్యధర్మాన్ని నిర్వర్తించడు.*
*(''పరులు చెప్పిననైన, నిజేచ్ఛనైన..."తనలో లోపాన్ని తాను తెలుసుకొని సవరించుకోలేనివాడు ఇంకొకరి నుంచి ఆశించే అర్హతను కోల్పోతాడు.తన ధర్మాన్ని తాను సక్రమంగా ఆచరించినప్పుడు తప్పకుండా ఆశించినదానికంటే ఎక్కువ ఫలమే ప్రకృతి నుంచి లభిస్తుంది.)*
*కోడలు ఎలా ఉండాలో ప్రవర్తన నియమావళిని అత్త బోధిస్తుంది. కోడలి నుంచి చాలా ధర్మాలను ఆశిస్తుంది. అలాగే కోడలు కూడా ''అత్తగారు ఇలా ఉండాలి'' అనే ఆదర్శాన్ని ఆశిస్తుంది! ఇలా ప్రతి ధర్మమూ అవతలివారినుంచి ఆశించడమే తప్ప, తమవైపు నుంచి ఆచరించడం తగ్గుతోంది.*
*ఇద్దరు మనుషులు సమావేశమైతే, ''ప్రపంచం చెడిపోతోంది. అంతా అవినీతిమయం" అని ప్రపంచ వార్తలన్నీ విశ్లేషించి, వేడి నిట్టూర్పులు విడిచి కాసేపు కాలక్షేపం చేసి,ఎవరికివారు నిష్క్రమిస్తారు. ఇలా ప్రతి ఇద్దరూ అనుకుంటూ ఉంటే, మరి చెడిపోతున్న ప్రపంచమేదో అర్థం కాదు.*
*అవతలివారు సరిగ్గా లేరని నిరూపించడానికి సాక్ష్యాలు సేకరించడం, తర్కాలు సాగించడం, తర్జనభర్జనలు పడడం - వాటితోనే ఎంతోమంది అమూల్య సమయాన్ని ఖర్చుచేస్తుంటారు. అందరినీ పరిశీలించి, వారి ధర్మాధర్మాలు నిగ్గుతేల్చే బదులు - తన అంతరంగాన్ని తాను మథనం చేసుకొనే ప్రయత్నం ఏమాత్రం సాగదు.*
*''కైకేయి తల్లిగానో, భార్యగానో సరిగ్గా ప్రవర్తించిందా? దశరథుడు ఉత్తమ తండ్రిగా ఉన్నాడా?'' - అనే ప్రశ్న రాముడు వేయలేదు. తాను ఉత్తమపుత్రునిగా ప్రవర్తించడానికే అంకితమయ్యాడు. తన ధర్మనిష్ఠను తాను బలపరచుకొనేందుకు ధార్మికాంశాలను గ్రహిస్తూ ఆత్మ పరిశీలన చేసుకొనేవాడు మాత్రమే ధర్మానికి తార్కాణంగా నిలబడతాడు.*
*''ధర్మో రక్షతి రక్షితః'' అంటే లోకంలో ధర్మాన్ని ఉద్ధరించడానికి కంకణం కట్టుకోవడం కాదు తన ధర్మాన్ని తాను కాపాడుకొనడం. అటువంటి వారికి ఎప్పుడూ రక్షణ లభిస్తుంది.*
*శ్రీకృష్ణుడూ అటువంటి ఆచార ధర్మ స్వరూపుడే. ప్రతి అణువునా పరమేశ్వరుని చూపు పరచుకున్నదని తెలిసినప్పుడు నైతికతనీ, ధార్మికతనీ విడిచే పనిలేదు. ఆచరణలో నిష్ఠితుడైనవాడు, ఆశించడమనే పనిలో పడి కాలాన్ని వృథా చేసుకోడు. ప్రతిక్షణం కాలం విలువని గ్రహించి అప్రమత్తంగా ధర్మాచరణలో నిమగ్నమై ఉంటాడు.*
*ప్రపంచంలో అందరి ముఖాలను మనం చూస్తాం. విమర్శిస్తాం. కానీ మన ముఖమే మనకు కనిపించదు. ప్రపంచాన్నంతటినీ విశ్లేషిస్తాం. సూక్ష్మక్రిముల్ని కూడా గమనించే యంత్రాలను సైతం ఆవిష్కరిస్తాం. కానీ మనల్ని మనం పరిశీలించుకోం.*
*ముఖాన్ని బాగుచేసుకోవడానికి అద్దం ఎలా అవసరమో, మనస్సును సవరించుకోవడానికి ఆత్మపరిశీలన అంత అవసరం. ప్రపంచమంతా ఎంత తిరిగినా ఎవరి జీవితం వారిదే. ఎవరి పాపపుణ్యఫలాలు వారే అనుభవిస్తారు. పరనింద, పరద్రవ్య వ్యామోహం కూడదనీ, తన ఆత్మయే తనకు ప్రమాణమనీ శాస్త్రాల-ఉద్భోధ.*
*''నేనెందుకిలా ఆలోచిస్తున్నాను. నా ప్రవర్తనలో పొరపాటు ఉందా?'' అని ఎప్పటికప్పుడు అంతరంగ మథనం చేసుకొనడం ఉత్తముల లక్షణం. దుష్యంతుడు, హనుమంతుడు వివిధ సందర్భాలలో తమ మనస్సును తామే ప్రశ్నించుకుని సమాధానాలను గ్రహించారు.*
*''సతాం హి సందేహ పదేషు వృత్తిషు*
*ప్రమాణమంతఃకరణ ప్రవృత్తయః"*
*(అభిజ్ఞాన శాకుంతలమ్)*
*''సత్పురుషులకు సందేహం కలిగే సందర్భంలో వారి అంతఃకరణమే వారికి ప్రమాణం'' అని కాళిదాసవచనం. "నేనెప్పుడూ సరిగ్గా ఉంటాను" అనే సమర్థింపు ఆత్మను బుకాయించడమే.*
*''పరులు చెప్పిననైన, నిజేచ్ఛనైన''...తనలో లోపాన్ని తాను తెలుసుకొని సవరించుకోలేనివాడు ఇంకొకరి నుంచి ఆశించే అర్హతను కోల్పోతాడు. తన ధర్మాన్ని తాను సక్రమంగా ఆచరించినప్పుడు తప్పకుండా ఆశించినదానికంటే ఎక్కువ ఫలమే ప్రకృతి నుంచి లభిస్తుంది.*
*''ధర్మో రక్షతి రక్షితః'' అంటే లోకంలో ధర్మాన్ని ఉద్దరించడానికి కంకణం కట్టుకోవడం కాదు- తన ధర్మాన్ని తాను కాపాడుకొనడం. అటువంటి వారికి ఎప్పుడూ రక్షణ లభిస్తుంది.*
*🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹*
No comments:
Post a Comment