Friday, January 10, 2025

 *నేడు ముక్కోటి ఏకాదశి* 
---------------------------------------
*ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తరద్వార దర్శనం చేస్తే కలిగే పుణ్య ఫలం ఏమిటి?*
----------------------------------------
అనంతమైన పుణ్యఫలం అని చెప్పుకోవాలి. భారతీయులు కాంతిని ఆరాధించేటటువంటి వారు. ప్రాజ్ఞ్ముఖంగా ప్రయాణించేటటువంటి వారు. దేహంలో ఎప్పుడూ కూడా ఎడమ భాగాన్ని కుడి భాగం నియంత్రిస్తూ ఉంటుంది. వామ భాగం స్త్రీ సంబంధితమైనటువంటి భాగం. ప్రేమ, పారమార్థిక దృష్టి, లౌకిక సుఖములు, ఆనందములు ఇవన్నీ కూడా ఉత్తర దిక్భాగంలో ఉంటాయి. వీటన్నింటినీ నియంత్రించేది ఎడమ భాగం. అలాగే మన దృష్టి కూడా నిరంతరం ఎడమ వైపుకే ప్రసరిస్తూ ఉంటుంది. ఉత్తరం దిక్కుకు ధనము, సంపద వంటి వాటికి ప్రాముఖ్యత ఉంది. అన్నింటికంటే మించి ఈ విశాల విశ్వమంతా కూడా తన చుట్టూ తానూ తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుంది అనుకుంటే ఈ విశ్వంలో ఉండే అంతర్భాగము axil అంటారు దానిని అది దీనికి వ్యతిరేకంగా తిరుగుతూ ఉంటుంది. ఈ విశ్వము దక్షిణం వైపునుంచి ఉత్తరం వైపుకు anti clockwise తిరుగుతూండగా అందులోని అంతర్భాగం ఉత్తరం వైపునుంచి దక్షిణానికి clockwise తిరుగుతుంది. "ప్రాగ్ ఆరభ్య దక్షిణేణ వర్తనం" మన హిందూ ధర్మంలో అందుకోసమే ఆలయానికి వెళ్తే ప్రదక్షిణ చేయాలి - ప్రాగ్ ఆరభ్య దక్షిణేన వర్తనం. ఉత్తరంగా, ఈశాన్యంగా, తూర్పుగా, ఆగ్నేయం, దక్షిణం ఇలా ప్రదక్షిణ చేస్తూ ఉంటాం. కనుక ఈ రెండింటి మధ్య ఉండే వైరుధ్యం వల్ల కలిగిన ఆకర్షణ శక్తి చేత మనం ఈ భూమిమీద అంటిపెట్టుకొని ఉన్నాం దానికే భూమ్యాకర్షణ శక్తి అని పేరు.
----------------------------------------
ఈరోజున ఉత్తర దిగ్భాగ మార్గాన్ని అనుసరించి ఇంక రెండు మూడు రోజులలో సూర్యనారాయణ మూర్తి ఉత్తర దిగ్భాగంలో ప్రయాణం చేస్తూంటాడు. ఈరోజున మనం ఉత్తర దిగ్భాగంతో ప్రయాణం ప్రారంభం చేసినట్లయితే తప్పకుండా కైవల్యం లభిస్తుంది. ఈ భూమితో ఉండే ఆకర్షణ సంబంధిత సంబంధాలన్నీ కూడా తొలగిపోయి ఆ శ్రీమన్నారాయణ మూర్తిని చేరుకుంటాము. భవ బంధనాలన్నీ కూడా తొలగిపోతాయి. అనేటటువంటి రహస్యాన్ని కనుగొన్న ప్రాచీనులు ఈ అంశాలన్నీ కూడా శాస్త్రోక్తంగా చెప్తే అందరికీ అర్థం అవుతాయో లేదో అనే ఉద్దేశ్యంతో కథలను జోడించి విభీషణ శరణాగతి కథ, వైకుంఠ ఏకాదశి కథ, ముప్పది మూడు కోట్ల దేవతలతో ఆ స్వామి ఈనాడు మనకు దర్శనమిస్తాడు. మూడు కోట్లతో రంగధాముని దర్శనమిస్తాడు. ఇలా చెప్పి ఆలయాలవైపు మనల్ని మరల్చారు. స్వామి దర్శనం చేసుకోండి అంటూ అనుజ్ఞనిచ్చారు. మన ప్రయత్నం కాకుండా గురువుతో ప్రయత్నం కావాలి. స్వప్రయత్నం కూడదు అంటుంది ధర్మము. కాబట్టి నారాయణుడే అటువంటి మనలో జ్ఞానమును ప్రేరేపించు వాడు. ఆయన ప్రపన్నుడు. అడిగిన వాళ్ళందరికీ కూడా ఆశ్రయం ఇచ్చే ప్రపన్నుడు. ఎవరిని రక్షించాలా? అని సంసిద్దుడై ఉంటాడుట. కాబట్టి ఉత్తర ద్వార దిశగా మనం ప్రయాణం చేస్తే తప్పకుండా కోరిన కోరికలు నేరవేరుతాయి. అన్నింటికంటే కోరవలసినది ఏమున్నది? - ఈ లోకంతో భవ బంధనాలనుంచి విముక్తి. మోక్షము అంటే "ముచిల్ మోక్షణే" అని అర్థం. బంధనాలనుంచి ముక్తిని పొందడము, విముక్తిని కలిగించుకోవడము అని అర్థం. అందుకే ఉత్తర దిశ ఇంత ప్రాముఖ్యం కలది, ఇంతగా విశేషత ఈ పండుగకు ఉన్నది.                                       **************************---------------------------------------    మన సంప్రదాయంలో వైకుంఠ ఏకాదశికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. దీనినే ముక్కోటి ఏకాదశి అని అంటారు. మూడు + కోటి = ముక్కోటి
ఈ రోజున వైష్ణవ ఆలయాలలో ఎదురుగా ఉన్న ద్వారాన్ని మూసేసి, ఉత్తర ద్వారాన్ని తెరిచి , ఆ ద్వారం నుండి స్వామి దర్శనాన్ని చేయిస్తారు. ఈ ఉత్తర ద్వారాన్నే వైకుంఠ ద్వారమని అంటారు.
----------------------------------------
ఇలా ఉత్తర ద్వార దర్శనం చేయడం వెనుక స్వామివారి లీలావిశేషాలు ఉన్నాయి.
----------------------------------------
శ్రీ మహావిష్ణువు కృతయుగంలో మత్స్య,కూర్మ,వరాహ, నారసింహావతారాలను, త్రేతాయుగంలో రామచంద్ర అవతారాన్ని ధరించి ,ద్వాపరయుగంలో కృష్ణ అవతారంలో దర్శనమిచ్చిన స్వామి, కలియుగంలో విరజానదీ మధ్యభాగంలో, సప్తప్రాకార సంశోభితమైన పరమపదంతో సహా శ్రీ దేవి భూ దేవిల సమేతుడై, విష్వక్సేనాదులు తనను కొలుస్తూ ఉండగా, శేషపాన్పుపై అర్చావతారుడై వెలసిన దివ్యగాధను, ముక్కోటి విశదపరుస్తూ ఉంటుంది. ఇందు వెనుక ఆసక్తికరమైన కధ ఉంది.
----------------------------------------
పూర్వం ఒకానొక సమయంలో ఇంద్రుడు, తన గొప్పదనాన్ని అందరితోపాటు త్రిమూర్తులకు, అష్టదిక్పాల్కులకు తెలియచేయాలన్న ఉద్దేశ్యంతో ఒక గొప్ప విందును ఏర్పాటు చేశాడు. ఆ విందుకు శ్రీ మహా విష్ణువు శ్రీ భూనీలా సమేతముగా, పరమశివుడు పార్వతీగంగా సమేతముగా, బ్రహ్మదేవుడు శ్రీ వాణీ సమేతముగా విచ్చేశారు. ఇక దిక్పాలకులు ,ముక్కోటి దేవతలు, సకలలోక వాసులు సకుటుంబ సపరివార సమేతముగా విచ్చేసారు. వారి ఆగమనముతో స్వర్గలోకమంతా కోలాహలంగా ఉంది. అప్పుడు పార్వతిదేవి ఇంద్రునితో ," నీ సభలో అత్యంత ప్రతిభాశాలురైన నాట

్యమణులున్నారని ఏర్పాటు చేస్తే, అది చూసి మేమంతా ఆనందిస్తాము కదా" అని అడుగగా ఇంద్రుడు తక్షణమే ఊర్వశి,మేనక,తిలోత్తమలను పిలిపించి నాట్య ప్రదర్శనలను ఇప్పించాడు. వారి నృత్యంతో అంతగా సంతృప్తి చెందని పార్వతీదేవిని చూసి ఇంద్రుడు వినయంతో ఒక్కసారి రంభ నృత్యం చూసి వారి అభిప్రాయాన్ని తెలియచేయమని కోరాడు.
----------------------------------------
అనంతరం సభావేదిక చేరుకున్న రంభ ముందుగా పార్వతీ పరమేశ్వరులకు నమస్కరించి, అనంతరం లక్ష్మీ నారాయణుల పాద పద్మములకు, వాణిపద్మజులను సేవించి, సభికులకు అభివందనం చేసి, సరస్వతీ భరతభూషణులను స్తుతించి నాట్యం మొదలు పెట్టింది. ఆమె నాట్యానికి సభికులంతా ముగ్ధులు అయ్యారు. రంభ నాట్యకౌసల్యాన్ని చూసి మెచ్చిన పార్వతీ దేవి నవరత్నఖచిత బంగారు గండపెండేరాన్ని,లక్ష్మీ దేవి బంగారు కడియాన్ని,సరస్వతి దేవి రత్న ఖచిత దండ కడియాన్ని, రంభకు బహూకరించారు. ఇంకా చాలా మంది దేవతలు రంభకు బహుమతులు ఇచ్చారు.
రంభ తన గౌరవాన్ని నిలబెట్టిందని తలచిన ఇంద్రుడు, ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. అందుకు రంభ ఇంద్రుని వలన తనకు పుత్రుడు కలిగేటట్లు అనుగ్రహించమని కోరింది. అది విన్న సభాసదులందరూ కరతాళధ్వనులతో తమ ఆమోదాన్ని తెలిపారు. ఆమె కోరిక తీరేందుకు ఇంద్రుడు సకల దేవతల సాక్షిగా రంభ సహితంగా నందన వనానికి వెళ్ళాడు.
----------------------------------------
ఈ వ్యవహారమంతా దేవగురు బృహస్పతికి నచ్చలేదు. ఆవేశాన్ని అణుచుకోలేకపోయిన దేవగురువు ,నేరుగా నందన వనానికి వెళ్ళి,సరస సల్లాపాలలో మునిగి ఉన్న ఇంద్రుని పైకి తన కమండలాన్ని విసిరిగొట్టాడు. అప్పటికీ అతని ఆవేశం చల్లారకపోవడంతో దేవేంద్రుని రత్నకిరీటం కిందకు పడేంతగా కొట్టాడు. ఇంద్రుడిని భూలోకంలో ఆటవిక బందిపోటుగా జన్మించమని శపించాడు. తన వలన ఇంద్రుని శపించవలదని రంభ కోరినప్పటికి బృహస్పతి వినకపోవడంతో, రోషావేశపూరితమైన రంభ దేవ గురువుని నీచ జన్మ ఎత్తమని శపిస్తుంది.
----------------------------------------
ఈ లోపు అటుగా వచ్చిన నారదుడు విషయాన్ని గ్రహించి, ముగ్గురుని త్రిమూర్తుల వద్దకు తీసుకొని వెళ్ళాడు. ఈ శాపాలు అందరు అనుభవించవలసిందే అని తెలిశాక, ఇంద్రుడు భోరున విలపించసాగాడు. దీనముగా వేడుకున్నాడు.
----------------------------------------
ఇంద్రుని దుఃఖాన్ని చుసిన కరుణాపూరితుడైన విష్ణుభగవానుడు అతనిని ఓదార్చి, తను భూలోకంలో అవతరించి శాపవిమోచనాన్ని ప్రసాదించగలనని చెప్పాడు. విష్ణువు మాటలు విన్న లక్ష్మీ దేవి " స్వామి గురువుశిష్యులు ఇద్దరు పరస్పర వివేకశూన్యులై శపించుకుంటే ,                                  ఆ శాపవిమోచనానికి మీరు భూలోకంలో అవతరించడం దేనికి...రామ అవతారంలో పడిన కష్టాలు చాలవా?                 " అని అడిగింది."
---------------------------------------
తాను ద్వాపరయుగాంతంలో దుర్వాసుని శాపంవల్ల బాధితురాలైన ఓ గొల్ల భామకు వరం ఇవ్వడమే కారణమని పేర్కొన్నాడు.
----------------------------------------
అలా శ్రీ మహవిష్ణువు భూలోక అవతార వెనుక చాల కథలు ఉన్నాయి...అందులో ఇది ఒకటి!
**************************----------------------------------------      *వైకుంఠ ఏకాదశి.......,.!!*
శ్రీరంగనాథునిగా అవతరించిన శ్రీహరిని గోదాదేవి ధనుర్మాసంలో భక్తితో పూజించి తన భర్తగా పొందింది. రోజుకో పాసురంతో శ్రీమన్నారాయణుని స్తుతించిన గోదాదేవి ఆయనను ప్రసన్నంగా చేసుకుంది. ఇక, పుష్యమాసంలో వచ్చే శుక్షపక్ష ఏకాదశిని వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, పుత్రదా ఏకాదశి అని పిలుస్తారు. ఈ రోజున ఉత్తర ద్వారంలో శ్రీమన్నారాయణుని దర్శించుకోవాలని భక్తులు ఎంతో ఆరాటపడతారు. ఏడాదికి వచ్చే ఇరవైనాలుగు ఏకాదశుల్లో ప్రతిదీ పవిత్రమైందే. కానీ, వీటిలో వైకుంఠ ఏకాదశి మాత్రం లేదు. ఎందుకంటే మిగతా ఏకాదశులు చంద్రమానం ప్రకారం గణిస్తే వాటికి భిన్నంగా సౌరమానం ప్రకారం దీన్ని గణిస్తారు. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే ముక్కోటి ఏకాదశి అంటారు.
ముక్కోటి ఏకాదశి పేరు వెనుక పురాణ కథనాలు
----------------------------------------
వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశని, స్వర్గద్వార ఏకాదశి అని పిలుస్తారు. ఈ పేర్లు వెనుక వేర్వేరు కథలు పురాణాల్లో కనిపిస్తాయి. శ్రీమహావిష్ణువునకు నెలవైన వైకుంఠంలోని వాకిళ్లు ఈరోజునే తెరుచుకుంటాయి కాబట్టి దీన్ని వైకుంఠ ఏకాదశి అంటారు. దక్షిణాయనం ప్రారంభం ఆషాడ శుద్ధ ఏకాదశి నాడు పాల కడలిలో యోగనిద్రకు ఉపక్రమించిన నారాయణుడు కార్తీక శుద్ధ ఏకాదశి రోజు మేల్కొంటారు. ఇలా మేల్కొన్న స్వామిని దర్శించుకోవడానికి పుష్యమాస శుక్లపక్ష ఏకాదశి నాడు ముక్కోటి దేవతలూ వైకుంఠానికి చేరుకుంటారు. అందుకే దీనిని ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు. దక్షిణాయణంలో చనిపోయిన పుణ్యాత్ములకు ఈ రోజునే స్వర్గంలోకి ప్రవేశించే అవకాశం కల్పిస్తారు కాబట్టి స్వర్గద్వార ఏకాదశి అని అంటారు.
----------------------------------------
కృతయుగంలో ముర అనే రాక్షసుడు దేవతలను, రుషులను, ప్రజానీకాన్ని పట్టిపీడిస్తూ క్రూరంగా హింసించేవాడు.

ముర అకృత్యాలను భరించలేని దేవతలు శ్రీహరికి తమ గోడు చెప్పుకున్నారు. దీంతో, మురాసురుని సంహరించడానికి శ్రీమహావిష్ణువు బయల్దేరతాడు. తనను సంహరించడానికి శ్రీహరి వస్తున్న విషయం తెలిసిన మురాసురుడు సాగర గర్భంలోకి వెళ్లి దాక్కుంటాడు. అతడిని బయటికి రప్పించేందుకు ఉపాయం పన్నిన నారాయణుడు ఓ గుహలోకి వెళ్లి నిద్రపోతున్నట్లు నటిస్తాడు. శ్రీహరిపై దాడికి ఇదే అదనుగా భావించిన మురాసురుడు గుహలోకి ప్రవేశించి స్వామిని వధించేందుకు కత్తి దూయగానే ఒక శక్తి ఉద్భవించి మురను సంహరిస్తుంది. ఈ విధంగా దేవతలను సంరక్షించిన ఆ శక్తికే ఏకాదశి అని నామకరణం చేశారు.            

No comments:

Post a Comment