*తగిన శాస్తి (సరదా నీతి కథ)* - డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212
**************************
ఒక ఊరిలో ఒక పేద రైతు వుండేవాడు. అతను చానా మంచివాడు. బాగా కష్టపడేవాడు. అతనికి ఇంటిముందు కొంచం ఖాళీ స్థలం వుంది. అక్కడ చిన్న తోట వేసి ఆకుకూరలు కూరగాయలు పండించేవాడు. ఒకసారి అందులో ఒక గుమ్మడి తీగను నాటాడు.
కొన్ని రోజులకు ఆ గుమ్మడి తీగ పెరిగి పెద్దగయి నిండుగా పూలు పూసింది. దాంతో రైతు ఆ గుమ్మడి తీగకు ఎటువంటి పురుగులు పట్టకుండా జాగ్రత్తగా చూసుకుంటూ బాగా ఎరువులు వేయసాగాడు. కొద్ది రోజులకు అది మంచి లావు లావు కాయలు కాయసాగింది. వాటిలో ఒక కాయేమో ఎవరూ ఊహించనట్లు రోజురోజుకూ పెరిగి పెద్దగవుతూ పదిమంది మోసేంత లావయింది. అది చూసి అందరూ
మా జన్మలో ఇంత లావు కాయను మేమెప్పుడూ చూడలేదు అంటూవుంటే... చుట్టుపక్కల వూళ్ళవాళ్ళు బండ్లు కట్టుకోని వచ్చి మరీ చూసిపోసాగారు.
వానికి అంత లావు కాయను చూసి సంబరమైతే అయితావుంది కానీ దాన్ని యేమి చేయాలో తోచలేదు. అప్పుడు ఒక ముసలాయన రేయ్... ఈ లోకంలో ఇలాంటి వింతలు నూటికో కోటికో ఎప్పుడో ఒకసారి జరుగుతా ఉంటాయి. దీన్ని అలాంటిలాంటి అల్లాటప్పగాళ్ళ చేతిలో పెట్టొద్దు. సక్కగా తీసుకోనిపోయి మనూరిని పాలించే మహారాజుకు బహుమానంగా ఇయ్యి. ఆయనకు నచ్చిందంటే నీ తలరాతే మారిపోతాది. నచ్చలేదంటే నీ పని నీకు ఎలాగూ వుంది గదా. పో పోయి కొండకు తాడుగట్టి లాగుపో అన్నాడు.
ఆ రైతు సరేనని ఆ గుమ్మడికాయను ఒక బండిమీద వేసుకొని రాజు దగ్గరికి పోయాడు. రాజు ఆ గుమ్మడికాయను చూసి చానా సంబరపడ్డాడు. ఆ రోజు ఆయన పెళ్ళాం పుట్టినరోజు. ఆమెకు గుమ్మడికాయ కూరంటే చానా ఇష్టం. దాంతో రాజు సరిగ్గా సమయానికి తెచ్చావు అంటూ ఆ రైతును మెచ్చుకొని ఆ గుమ్మడికాయ ఎంత బరువుందో అంత బరువు బంగారం కానుకగా ఇచ్చి పంపిచ్చాడు. ఆ రైతు ఆ బంగారమంతా అమ్మి చెరువు కింద పదెకరాల పొలం కొనుక్కోని హాయిగా కాలుమీద కాలేసుకోని బదకసాగాడు.
అది చూసి వాని పక్కింటిలో వున్న ఒక ధనవంతునికి కన్ను కుట్టింది. ఎలాగైనా సరే ఆ పేద రైతుకన్నా పదింతల బంగారం బహుమానంగా సంపాదించాలి అనుకున్నాడు. వాని దగ్గర ఒక మంచి పొలం పని చేసే ఎద్దు వుంది. దానికి మూడుపూటలా తిండి పెడతా, చిన్న పనిగూడా చెప్పకుండా పందిని మేపినట్టు మేపసాగాడు. అది పనీపాటా లేక తినీ తినీ ఆరు నెలలు తిరిగేసరికి ఒక చిన్న ఏనుగు పిల్ల లెక్క బలిసింది. అంతలావు ఎద్దు చుట్టుపక్కల యెక్కడా లేదని జనాలంతా యెగబడి చూడసాగారు. దాంతో వాడు సంబరంగా ఆ ఎద్దును తీసుకొని రాజు దగ్గరకు పోయాడు.
రాజా... ఈ భూమ్మీద ఇంత లావు ఎద్దు ఎక్కడా లేదు. కాబట్టి దీనిని తీసుకొని దీని బరువు ఎంతుందో అంత బంగారం నాకు బహుమానంగా ఇవ్వండి అన్నాడు.
రాజుకి వాని చెడు ఆలోచన అర్థం అయ్యింది. దాంతో కోపంగా వాన్ని చూస్తూ ... రేయ్... రైతు పని పంట పండించడం. ఎవరికీ రానంత దిగుబడి యెవడు సాధిస్తాడో వాడు గొప్పోడు అవుతాడు. అలాగే ఎద్దుపని దున్నడం. ఏదీ దున్ననంత వేగంగా, ఏది ఎక్కువ ఎకరాలు దున్నితే అది గొప్పదవుతుందిగానీ... ఇలా పోరంబోకు మాదిరి పనీపాటా లేకుండా తిని లావయితే ఎలా గొప్పదవుతుంది. ఈ మాత్రం పని నువ్వేకాదు డబ్బులున్న ఏ గొట్టంగాడయినా చేస్తాడు. అనవసరంగా ఒక మంచి ఎద్దును ఎందుకూ పనికి రాకుండా చేసినందుకు వీన్ని తీసుకుపోయి పది కొరడా దెబ్బలు కొట్టండి అని భటులను ఆదేశించాడు. అదిచూసి అందరూ వానికి తగిన శాస్తి జరిగిందని నవ్వుకున్నారు.
**************************
డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212
*************************
కథ నచ్చితే *SHARE* చేయండి. రచయిత పేరు మార్చకండి. తీసేయకండి.
No comments:
Post a Comment