Thursday, January 30, 2025

 ఒక తులసిపత్రం సమర్పించిన మాత్రంచే విష్ణుభగవానుడు ఎంతగానో ప్రసన్నం అవుతాడు. జలం నిండిన వేలకొలది పాత్రలు సమర్పించినా అంత ప్రసన్నం కాడు. ఒకతులసీపత్రం సమర్పించుట వల్ల కలిగే ఫలితం వేలకొలది గోవులను అర్చిస్తే లభించే పుణ్యంతో సమానం. 

కార్తికమాసంలో తులసీదళం సమర్పించిన ఇంకను విశేషమైన ఫలితాలు సిద్ధిస్తాయి. ఉపయోగించిన పూలు, నీరు పూజ కనర్హం. కాని తులసీదళం మరియు గంగాజలం ఉపయోగించినవే అయినప్పటికీ తిరిగి ఉపయోగించవచ్చు. 
 
“దర్శనం నర్మదాయా స్తు గంగాస్నానం విశాంవర | 
తులసీదళసంస్పర్శః, సమ మేతత్ర్తయం స్మృతమ్‌ ॥ 
(పద్మపురాణం ) 
 
నర్మదానది దర్శనం, గంగానదిలో స్నానం, తులసీదళం స్పర్శనం- వీటి మహిమ సమానం. 
 
గవా మయుతదానేన, యత్ఫలం లభతే నరః । 
తులసీపత్రదానేన, తత్ఫలం కార్తికే సతి ॥ 
(బ్రహ్మవైవర్తం ) 
 
సతీ! లక్ష గోవులను దానం చేస్తే కలిగే ఫలితం, కార్తికమాసంలో ఒక 
తులసీదళం దానం చేయడంవల్ల లభిస్తుంది. 
 
“మణికాంచనపుష్పాణి, తథా ముక్తాఫలాని తు | 
తులసీపత్రదానస్య, కలాం నార్హంతి షోడశీమ్‌ ॥ 
(పద్మపురాణం ) 
 
మణులు, స్వర్ణము, పుష్పములు, ముత్యములు మొదలగువానిని దానం చేయడంవల్ల కలిగేపుణ్యం తులసీదళదాన ఫలంలో 16వ భాగాని కూడా సమానం కాదు.

No comments:

Post a Comment