Vedantha panchadasi:
తస్మాదాభాసపురుషః స కూటస్థో వివిచ్య తమ్ ౹
కూటస్థోఽ స్మీతి విజ్ఞాతు మర్హతీత్యభ్యధాచ్ర్యుతిః ౹౹18౹౹
18. కూటస్థమును ఆధారముగ గలిగి పురుషుడనబడుచున్న చిదాభాసుడు మిథ్య నుండి కూటస్థమును వివేచింపవలెను.
అసందిగ్ధా విపర్య స్తబోధో దేహాత్మ నీక్షతే ౹
తద్వదత్రేతి నిర్ణేతి మయమిత్యభిధీయతే ౹౹19౹౹
19.సామాన్యమానవుడు దేహమే తాను అనే బోధను ఎంతమాత్రముగాని సంశయము విభ్రమము లేక కలిగియుండును.అట్టి నిస్సంశయము భ్రమ రహితము అగు బోధయే జ్ఞానికి తాను బ్రహ్మమే అని కలుగునని సూచించుటకు "ఇది" అని ప్రయోగింపబడినది.
దేహత్మజ్ఞానవత్ జ్ఞానం దేహాత్మజ్ఞానబాధకమ్ ౹
ఆత్మన్యేవ భవేద్యస్య స నేచ్ఛన్నపి ముచ్యతే ౹౹20౹౹
20. దేహమే ఆత్మ అనే జ్ఞానము వలె దృఢమగు జ్ఞానము బ్రహ్మమునందు కలిగినచో అది దేహాత్మ జ్ఞానము నశింపజేయును.
అట్టి పురుషుడు తనకు ఇష్టము లేకున్నను ముక్తుడగును.
ఉపదేశసాహస్రి 4.5
వ్యాఖ్య:- పురుష శబ్దానికి ఉపసంహారంగా "ఆస్మి" అనే శబ్దంయొక్క వివరణ -
కూటస్థుడే చిదాభాస (జీవ)స్వరూపుడు.
ఎందుచేతనంటే,పురుష శబ్దానికి కూటస్థ సహితుడైన చిదాభాసమని అర్థం.
ఆ చిదాభాసమే , కూటస్థుని తనకంటే భిన్నంగా ఉన్నట్లు భావిస్తూ లక్షణావృత్తిద్వారా
"నేను కూటస్థుడిని" , "బ్రహ్మమును" అనే జ్ఞానాన్ని పొందుతొంది.
అందుచేతనే శ్రుతివాక్యంలో "ఆస్మి" అనే పదాన్ని వాడారు.
సామాన్య మానవుల్లో దేహమే ఆత్మ అనే విషయంలో సంశయంగాని,విపర్యంగాని లేనట్టి నిశ్చితమైన జ్ఞానం కనిపిస్తొంది.
సరిగ్గా , అలాగే మోక్షాన్ని పొందాలంటే ప్రత్యగభిన్నమైన ఆత్మయందు కూడ సంశయముగానీ,
విపర్యముగానీ లేనట్టి దృఢమైన జ్ఞానాన్ని పొందాలి.
కర్తృత్వ భోక్తృత్వాదులు స్వభావ సిద్ధంగా జీవులలో ఉన్నా శక్తిరూపంలో అవి అనర్థాలు కావు.వాటి వలన కలిగే ఫలమే (కార్యమే) అనర్థకం.అందువల్ల,
శక్తి వలన కలిగే కార్యాన్ని జ్ఞానోపార్జనతో నివారించవచ్చు.
విద్యాప్రాప్తి వల్ల లభించే బ్రహ్మత్మత్వం,
అత్మ - పరమాత్మ ఏకత్వభావన లేనప్పుడు మోక్షకాంక్షే ఉండదు.
"నాన్యః పంథా విద్యతేఽ యనాయ" అనే శ్రుతి కూడా
"జ్ఞానాదేవ తు కైవల్యం" అని నిర్ధారిస్తున్నది.
నిర్గుణ,నిష్ర్కియాది పరబ్రహ్మ
అత్మాన్వేషణ,ఆత్మజ్ఞానముతోనే సాక్షాత్కారమవుతుంది.
ఈ విషయాన్ని నిర్ణయించటం కోసమే "ఆయం"('ఇది')అనే శబ్దాన్ని వాడారు.
శ్రీ శంకరుల అభిప్రాయానుసారం "దృఢమైన జ్ఞానమే మోక్ష సాధనం" .
"ఈ దేహాన్నే నేను " అనే దృఢ జ్ఞానం అజ్ఞానులైన వారికి కలిగినట్లే ,
"ఈ ప్రత్యగాత్మనైన (జీవాత్మనైన) నేనే బ్రహ్మను" అనే దృఢజ్ఞానం ఎవరికైనా కలిగితే అటువంటివాడు తాను కోరకపోయినా మోక్షాన్ని పొందుతాడు.
అయమిత్యపరోక్షత్వముచ్యతే చేత్తదుచ్యతామ్ ౹
స్వయం ప్రకాశచైతన్యమపరోక్షం సదా యతః ౹౹ 21 ౹౹
21. 'ఇదియే నేను' అనే వాక్యములో 'ఇది' జ్ఞేయమగు విషయమును సూచించును.
బ్రహ్మము జ్ఞేయవిషయము కాదు గనుక ఆ పదము బ్రహ్మమును సూచింపజాలదు.
అనినచో నిజమే కాని ఆ బ్రహ్మము ప్రత్యగాత్మగా స్వయంప్రకాశమే కనుక సర్వదా అపరోక్షముగనే తెలియ బడుచున్నది.
వ్యాఖ్య:-"ఇది నాది" మొదలయిన పదప్రయోగాల వలన,
"దేహం" నేను చూసే వస్తువనీ,
"నేను" చూసే "సాక్షిననీ బుజువవుతొంది.
పురుషుడు స్వయంజ్యోతి అని ఉపనిషత్తులలో వర్ణించబడినది.
ప్రకాశమంతటికీ ఇదే ఆధారం.దీనిని ప్రకాశింపజెయ్యవలసిన దేదియులేదు.
"జ్యోతిషాం అపి తత్ జ్యోతిః"
ఈ ప్రకాశం వల్లనే మనలోని ఆంతరంగిక ప్రపంచాన్ని,బాహ్య ప్రపంచాన్నీ కూడా గుర్తించగలుగుతున్నాము.
బాహ్యాభ్యంతర అనుభవాలేవీ ఇది లేనిదే గుర్తింపబడవు
శరీరానికి వస్తుతః కదిలే శక్తి కానీ జ్ఞానం కానీ లేవు.కేవలం జడం మాత్రమే.
"అసంగో హి అయం పురుషః"--
పురుషుడయిన నేను అసంగుడను,దేనితోనూ సంబంధంలేదని బృహదారణ్యకోపనిషత్తులో యజ్ఞావల్క్యమహాముని తన భార్యకు బోధిస్తాడు.
చైతన్యం స్థూలశరీరంతోను,అదిచేసే పనులతోనూ తాదాత్మ్యం చెంది ఉన్నప్పుడు జాగ్రత్ పురుషునిగా ప్రాపంచిక అనుభవాలు పొందుతొంది.
ఇదే పురుషుడు సూక్ష్మశరీరంతో తాదాత్మ్యం చెంది స్వప్నాన్నీ,
స్వప్న ప్రపంచాన్ని చూస్తున్నాడు.
స్వప్నం తరువాత అదే పురుషుడు సుషుప్తి అవస్థలో ఏమీ లేకపోవడాన్ని గుర్తిస్తున్నాడు.
ఈ అవస్థలలో మార్పులను చెందుతూ అదే పురుషుడు జాగ్రత్ పురుషునిగా,స్వప్నాన్ని చూసే తైజసునిగా, సుషుప్తిననుభవించే ప్రాజ్ఞునిగా మార్పు చెందినట్లుగా కనిపిస్తున్నాడు.కానీ,
ఈ విధంగా ప్రత్యేకంగా ఉన్న విభిన్నమయిన మూడవస్థలనూ ప్రకాశింపజేసే చైతన్యం మాత్రం ఏ అవస్థచేతనూ, వస్తువుల వలననూ,కాలంవలననూ పరిమితం కావడం లేదు.
చైతన్యరూపమైన ఈ పురుషుడు అసంగంగా దేనితోనూ సంబంధం లేకుండా నిత్యమూ కేవలంగా వుంటూ,
అన్ని కాలాలను,వస్తువులను,
అవస్థలను ప్రకాశింపజేస్తున్నాడు.
"అయంఘటః" "ఇది ఘటం" అన్నప్పుడు, "అయం" అనే శబ్దం అపరోక్షత్వాన్నీ నిర్దేశిస్తుంది.అట్లాగే,
శ్రుతియందలి "అయం"అనే పదం కూడా
ఆపరోక్షత్వాన్ని-ప్రత్యక్షాన్ని
నిర్దేశించాలి.ఎందుచేతనంటే,
స్వయంప్రకాశమైన చైతన్యం ఎల్లప్పుడూ అపరోక్షమే !
స్వయంప్రకాశంతో ప్రకాశితమయ్యే వాని యందు అన్యప్రకాశం అవసరముండదు.
'ఆవరణకర్త' లేనందువల్ల చైతన్యం ఎల్లప్పుడూ అపరోక్షరూపంలోనే తెలియబడుచున్నది.
No comments:
Post a Comment