Vedantha panchadasi:
అస్తి కూటస్థ ఇత్యాదౌ పరోక్షం వేత్తి వార్తయా ౹
పశ్చాత్కూటస్థ ఏవాస్మీత్యేవం వేత్తి విచారతః ౹౹31౹౹
31. గురూపదేశాదుల వలన పరోక్షముగ కూటస్థము కలదు అని తెలిసికొనును.పిదప విచారణ పూర్వకముగ స్వానభవముననే
"నేను కూటస్థమును" అని తెలియును.
(ఇది అపరోక్షజ్ఞానము).
వ్యాఖ్య:- శబ్దం వల్ల వచ్చే జ్ఞానము సాధారణంగా పరోక్షజ్ఞానము.అది దూరవస్తువయితే ఎప్పటికీ పరోక్షజ్ఞానమే.
"కాశీ"కి వెళ్ళని వానికి ఆశబ్దం వలన వచ్చిన జ్ఞానము సర్వదా పరోక్షమే.అనుభవంలోకి రాదుగదా !
ఇంద్రాది దేవతలు,స్వర్గం మొదలగునవన్నీ అంతే గదా !
దగ్గరలోనే ఉన్న ఘటమును
'ఘటమున్నది అని బోధిస్తే అదీ పరోక్షమే',
అలాగక ఎదురుగా చూపించి బోధిస్తే అది అపరోక్షజ్ఞానమగును.
ఇది ఘటము,
నేను బ్రహ్మమును,
నీవు దశముడవు మొదలగునవి ఉదాహరణలు.
ఇందులో పదిమంది పరమానందయ్య శిష్యులు నదిలో స్నానము చేసి బయటకు వచ్చి లెక్క చూస్తే లెక్కచూచిన వానికి తాను తప్ప తొమ్మిది మంది లెక్కకు వస్తున్నారు.
అందువలన దశముడు అనగా పదవ వాడు నదిలో కొట్టుకొని పోయాడని ఏడుస్తున్నాడు.
ఒక బాటసారి వీరిని చూచి మీరు పది మంది ఉన్నారయ్యా
(దశమః అస్తి) అన్నాడు.ఇది పరోక్షజ్ఞానము.
అపుడు వారు పదవవాడు(దశముడు)ఏడి అని అడిగితే,
ఆ లెక్కించినవాడే దశముడని(దశమః త్వమసి) చెప్పాడు.అప్పుడు కలిగినది అపరోక్షజ్ఞానము.
అలాగే బ్రహ్మమున్నదని చెప్పినది,
జీవుడు - ఆత్మ అన్నది పరోక్షజ్ఞానము.
"ఆ ఆత్మ నీవే",
"ఆ బ్రహ్మము నీవే"
అని చెప్పిన వాక్యము
అపరోక్ష జ్ఞానము. కనుక
మహావాక్యం చెప్పేది అపరోక్షజ్ఞానమే.
చర్చలద్వారా,విచారణద్వారా,సద్గురువుచేత బోధింపబడినవాడై "కూటస్థుడున్నాడు కూటస్థోఽస్తి" అని తెలుసుకుంటాడు ఈ విధంగా తెలుసుకోవటం పరోక్షజ్ఞానం.
పిమ్మట శ్రవణాదులు పరిపక్వమైన పిమ్మట -
"నేనే బ్రహ్మము కంటే భిన్నం కానట్టి కూటస్థుడను!కూటస్థోఽహమేవాస్మి" అని స్వానుభవమున తెలుసు కుంటున్నాడు.ఇది అపరోక్షజ్ఞానం.
కర్తా భోక్తేత్యేవమాది శోకజాతం ప్రముఞ్చతి ౹
కృతం కృత్యం ప్రాపణీయం ప్రాప్తమిత్యేవ తుష్యతి ౹౹32౹౹
32.ఆపై 'పుణ్యాపుణ్య కర్మలకు నేను కర్తను,సుఖదుఃఖములను అనుభవించు భోక్తను నేనే ' మొదలగు దుఃఖసమూహమును వదలివేయును.
వ్యాఖ్య:- శ్రవణమననాదుల ద్వారా "నేను బ్రహ్మం కంటే భిన్నం కానట్టి కూటస్థుడను" అని తెలుసుకుని స్థితుడైన వానికి ప్రపంచము నందలి వస్తుసముదాయమంతయు కేవలం వస్తువులు మాత్రమే కాక బ్రహ్మం నందు కదలాడు అలలులాగా కనబడుతుంటాయి.
వస్తువులతో గల తాదాత్మ్యాన్ని విడనాడి సత్యవస్తువులకు అధిష్ఠానమయిన బ్రహ్మానుసంధానముతో వుండువానికి
"నేను కర్తను,నేను భోక్తను" అనే వాటివల్ల కలిగే శోకాన్ని దుఃఖాన్ని వదిలివేస్తాడు.
"నేను చేయవలసినదంతా చేసాను", "పొందవలసినదంతా పొందాను" అనే సంతోషాత్మకమైన జ్ఞానాన్ని పొందుతాడు.
దీనినే తృప్తీ అంటారు.
క్రమం తప్పని నిరంతరాభ్యాసం వలన సాధకుడు ముందుగా అనంత చైతన్యాన్ని అప్పుడప్పుడు స్వానుభవంతో గ్రహిస్తాడు.
దీక్షతో సాధనను కొనసాగించగా చివరగా ఆనందనందమయమయిన స్వరూప స్థితిలో వ్యష్ఠి భావననేది లేకుండా లీనమయిపోతాడు.
తానూ బ్రహ్మంకంటే వేరుకాదనీ,తానే బ్రహ్మమనీ గ్రహించాలి.
"అహం బ్రహ్మస్మి" అని తెలుసుకుంటూ ప్రజ్ఞాన ఘనమయి నిలుస్తాడు.
No comments:
Post a Comment