☘️🍁 ఆప్తవాక్యాలు 🍁☘️
96. త్వం త్రాతా తరణో చేత్యో భూః పితా మాతా సదమిన్మానుషాణామ్
ఓ పరమేశ్వరా! నీవు రక్షకుడవు, దాటించువాడవు, జ్ఞేయమవు, ఉనికివి,ఎల్లవేళలా ఈ మనుష్యులకు తండ్రివి, తల్లివి (ఋగ్వేదం)
పరమేశ్వరునకు, మనకీ ఉన్న బంధాన్ని ఈ మంత్రం ద్వారా వేదమాత తెలియజేస్తోంది. ఈ పరమేశ్వరతత్త్వాన్ని ఎవరు ఏ సంప్రదాయంలో కొలిచినా ఈ
భావనను మనసులో ప్రతిష్ఠితం చేసుకుంటే చాలు.
1. త్రాతా:
రక్షకుడు. 'ఆర్తత్రాణ పరాయణుడు' వంటి భక్తి భావనలకు ఆధారమైన వైదిక మంత్ర ప్రతిపాదనలలో ఇది ఒకటి. జీవులకు ఆర్తిలో స్ఫురించవలసిన మహిమాన్విత
తత్త్వం భగవానుడే.
2. రణ
దాటించువాడు. దీనికి భౌతికస్థాయిలో 'కష్టాల నుండి గట్టెక్కించుట' అని
చెప్పుకోవచ్చు. కానీ అసలైన పారమార్థిక ప్రయోజనం 'అవిద్యారూప సంసారసముద్రము నుండి దాటించువాడు' అనే అర్థాన్ని స్వీకరించాలి.మోక్షయిష్యామి
మాశుచః' వంటి గీతావాక్యాలు ఇక్కడ స్ఫురణకు వస్తాయి.
3. చేత్య :
తెలుసుకోవలసినవాడు. విచారణ ద్వారా, ఉపాసన ద్వారా తెలియబడేవాడు.
ఈయనను తెలుసుకొనుటే జీవితానికి పరమార్థం. భగవదనుభవమే 'తెలుసుకొనుట'.భక్తి దృష్టితో 'ఈశ్వర సాక్షాత్కారం', వేదాంత పరిభాషలో 'బ్రహ్మజ్ఞానం'. ఈశ్వర స్పృహ, అనుభవం ప్రధానమని తాత్పర్యం. 'మధువైరి దవిలిన మనము
మనము-పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి' అనే భాగవత ధర్మం ఇందులో ధ్వనిస్తోంది.
4. భూః
సదా ఉండువాడు. అందరికీ ఆధారమై, అన్నిటినీ కలిగించు అధిష్ఠాన రూప పరమాత్ముడితడు. 'సత్' అనే మాటకి ఇదే అర్థం.
5. పితా, 6. మాతా
తల్లి, తండ్రి. ఈ శబ్దాలు కారణత్వాన్ని సూచిస్తున్నాయి. సర్వకారణుడైన సర్వేశ్వరుడు తలిదండ్రుల వలె కారణమై, పోషకమై, రక్షకమై ఉన్నవాడు.
ఈ రెండు మాటలతో పరమాత్మకు మనమెంతటి దగ్గరివారమో, ఆయనతో మనకుండవలసిన చనువు ఎంతటిదో అర్థమౌతుంది.
'మానుషాణామ్' అనే మాటకి 'ఆలోచన (జ్ఞానం) కలిగిన వారికి' అనే అర్థాన్ని స్వీకరించవచ్చు(మన అవబోధనే... అనే ధాతు అర్థాన్ని అనుసరించి). భారతీయ
సంస్కృతిలోని భక్తి భావనకు వైదికమైన ఇటువంటి మంత్రాలే ఆలంబన. 'నీవే తల్లివి తండ్రివి', 'త్వమేవ మాతా చ - పితా త్వమేవ' - వంటి భాగవతుల వచనాలకు
ఆలంబనమైన వైదిక సంప్రదాయమిది.
ఈ ఆరు బంధాలను భావన చేస్తుంటే క్రమంగా 'ఆ పరమాత్మయే సమస్తము'
అనే సిద్ధి లభిస్తుంది.
మనకు శాశ్వతబంధం భగవంతునితోనే ఉంది. మిగిలినవన్నీ కర్మబంధాలు, పరిమితాలు. ఈ నిత్యబంధువుని విస్మరించనివాడే ధన్యుడు.
No comments:
Post a Comment