జగన్నాటకం!
************
'నిజం' గుమ్మం దాటేలోగా
'అబద్ధం' ఆరు ఆమడలు
ప్రయాణం చేస్తుంది!
అబద్ధానికి జోరెక్కువ!
ఆకర్షణ ఎక్కువ!
దేవుడు, భక్తి, పరలోకం
స్వర్గనరకాలు,జన్మజన్మలు
ఇవి వట్టి నమ్మకాలు!
ఎట్టి ఋజువులు లేవు!
వీటిని బాగా నమ్ముతారు!
సర్వ మత బోధకులు
భక్తులందరిని
పరలోకం పంపేవారే!
నిజం రవ్వంత లేదు!
ఐనా నమ్ముతున్నారు!
హిందూ పూజారులు
ముస్లిం ముల్లాలు
క్రిస్టియన్ ఫాదర్లు
బాధలు తీర్చమని వస్తే
'కడుపులు' చేస్తారు!
ఐనా నమ్ముతారు!
అబద్ధాల ఆకర్షణ!
వాట్సాప్ లో ఫెక్ లు
ప్రచారమైనంతగా
నిజం ముందుకెళ్ళదు!
కొందరు పెద్దలు
దైవస్తోత్రాల,పెళ్లిమంత్రాల
అసలురంగును
బైటపెడుతూనే ఉంటారు
నమ్మేవాళ్లెవరు?
కులాలు మతాలు
కొందరి బ్రతుకు తెరువు!
వాటిమీద కట్టిన మేడలు
ఇప్పుడిప్పుడే
కూలుతున్నాయి!
విన్నా వినకపోయినా
ఏకైక సత్యం ఒకటి!
అందరం అబద్ధాల్లో
బ్రతుకుతున్నాం!
ఒకరిమీద ఒకరు
ఆధారపడ్డాం!
శ్రమజీవుల
అజ్ఞానాన్ని
వాడుకుంటూ
వాళ్ళ శ్రమ శక్తిని
దోచుకుంటూ!
అతనికంటె ఘనుడు
ఆచంట మల్లన్న!
ఒకరినిమించి ఒకరు
అబద్ధాల రాయుళ్ళు!
నిచ్చెనమెట్ల వ్యవస్థ!
నిజాలు చెపితే
మోసం చెయ్యటం ఎలా?
మోసం లేకుండా
బ్రతకటమెలా?
ఇదీ మన వ్య(అ)వస్థ!
ఈ వ్యవస్థను
మార్చుకోకుండా
నీతులు చెప్పినా
ప్రవచనాలిచ్చినా
ఎవ్వరూ మారరు!
అవకాశం వచ్చేవరకు
అందరూ శ్రీవైష్ణవులే!
అవకాశం చిక్కితే
కంకణం చేతపట్టిన
ముసలి పులులే!
ఈ నిజాలన్నీ
నమ్మేవాళ్లెవరు?
మీకు తెలియకా కాదు!
నాకు తెలిసీ కాదు!
అంతా జగన్నాటకం!
**********
-తమ్మినేని అక్కిరాజు
8-2-2025
No comments:
Post a Comment