Sunday, February 9, 2025

 *ప్రేరణ ✌️మార్గ* 🌿 *చింతన*

మీ కల... ఈ ప్రపంచం దృష్టితో కనే కల కాకుండా... మీ సొంత కల అంటూ ఏదో ఒకటి ఉండాలి కదా! అంటే ఆ కల నెరవేరితే మీ జీవితమంతా ఆనందంగా గడిచిపోగలగాలి. స్వర్గం గురించి గానీ, నరకం గురించి గానీ కలలు కనడం కాదు. వ్యాపారానికి సంబంధించిన కల కాదు...

👉ఏ కల సాకారమైతే మీ యావత్‌ జీవితం ఆనందమయం కాగలదో, అలాంటి కల ఏమిటి?

మనిషి కలలుకంటాడు. నిద్రపోకుండా, మెలకువగా ఉంటూ కూడా ఎన్నెన్నో కలలు కంటూ ఉంటాడు. భోజనం చేస్తూ కలలు కంటాడు, గుర్రంపై స్వారీ చేస్తూ కలలు కంటాడు, ఇంట్లో ఉన్నప్పుడు కలలు కంటాడు, బయట ఎక్కడో తిరుగుతున్నా కలలు కంటాడు. 

కలల ప్రపంచంలో విహరించని వారెవరైనా ఉన్నారా! 

జీవితంలో ఇలా జరుగుతుందని, అలా జరుగుతుందని, బాగా డబ్బు సంపాదించినట్లు, ప్రమోషన్‌ వచ్చినట్లు, పరీక్షల్లో పాసయినట్లు... ఇలా రకరకాలైన కలల్లో ప్రతి ఒక్కరూ విహరిస్తూ ఉంటారు. 

మీరు జన్మించినప్పుడు మీతో ఎవ్వరూ ఏవిధమైన ప్రమాణాలూ చేయలేదు, తర్వాత మీకు మీరే ఎన్నో ప్రమాణాలు చేసుకొని, వాటి గురించి కలలుకంటూ ఉంటారు. కలలు కనడమనేది మానవ నైజం.

🌿అయితే ముఖ్యంగా మీ కల...

ఈ ప్రపంచం దృష్టితో కనే కల కాకుండా... మీ సొంత కల అంటూ ఏదో ఒకటి ఉండాలి కదా! అంటే ఆ కల నెరవేరితే మీ జీవితమంతా ఆనందంగా గడిచిపోగలగాలి. స్వర్గం గురించి గానీ, నరకం గురించి గానీ కలలు కనడం కాదు. వ్యాపారానికి సంబంధించిన కల కాదు... ఏ కల సాకారమైతే మీ యావత్‌ జీవితం ఆనందమయం కాగలదో, అలాంటి కల ఏమిటి?

👉అది తెలుసుకోవాలంటే... ముఖ్యంగా మీరు మీలోనికి ప్రవేశించాలి. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో అర్థం చేసుకోవాలి..

మేధావులు, సాధువులు, అధికారులు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, రైతులు.. ఎవరైనా సరే ఈ ప్రపంచంలో ఎవరెలాంటి కలలు కన్నా.. సరే... ఏదో ఒక రోజు ఈ భూమండలమే పూర్తిగా అంతరించిపోయినప్పుడు, మీరు కనే ఆ కలలు కూడా అంతమైపోతాయి కదా! మిగిలేదేమిటి? 

ఏనాడైతే మనిషి అంతమైపోతాడో అతని కలలు కూడా అతనితో పాటు అంతమైపోతాయి.

ఈనాటి వరకు మీరు ఈ ప్రపంచం చూపించిన వాటి ఆధారంగా కలలు కన్నారు. 

👉మిమ్మల్ని నేను అడిగే ప్రశ్న ఏమిటంటే... మీ సొంత కల ఏమిటి? అది ధనం కోసమో, పేరు కోసమో, వస్తువుల కోసమో కాదు... మీ జీవితానికి సంబంధించిన కల ఏమిటో మీరు తెలుసుకోవాలి. ఆ కల నెరవేరకపోతే మీ జీవితం అసంపూర్తిగా మిగిలిపోతుంది.
మీరు మీ జీవితంలో ఆ పరమానందానుభూతిని పొందాలి.. దాని కోసమే మీరు ఇక్కడికి వచ్చారు. అది చేయకుండా మీరు మిగతావి ఎన్ని చేసినా ఏం లాభం? 

🌿ఈనాటి ప్రపంచాన్ని గమనిస్తే... ఇంట్లో ఉన్న తిరగలితో దుస్తులు ఉతుకుతున్నట్లుగా విచిత్రంగా ఉంది. 

👉మనిషి పరిస్థితి ఎలా ఉందంటే, కాలమనే తిరగలిలో పడి నలిగి పోతూ హాహాకారాలు చేస్తూ ఉన్నాడు. దుఃఖంలో, బాధల్లో సతమతమవుతున్నాడు. అందరినీ దూషించడం మొదలుపెడుతున్నాడు. తనకే ఎందుకిలా జరుగుతోందని వాపోతున్నాడు. ఎందుకంటే ఏ స్విచ్‌ నొక్కితే వెలుతురు వస్తుందో దాన్ని ఆర్పేసి, చీకటిలో కొట్టుమిట్టాడు తున్నాడు.

దేని కోసం మీరు ఈ ప్రపంచమంతటా అన్వేషిస్తున్నారో, అది మీలోనే ఉంది.

🌿మరి మీరు దేనిని అన్వేషిస్తున్నారు?
దేనికోసం మీ అన్వేషణ? 

👉ఈ విషయం ఆలోచించండి, మీ జీవితంలో మీలో ఉన్న ఆ అసలైన ఆనందాన్ని స్వయంగా అనుభూతి పొందండి. మీ జీవితాలను సఫలం చేసుకోండి.🍁

No comments:

Post a Comment