*విధి.....*
మానవునికి విధి స్వరూపం అంటే ఏమిటి, విధిని తెలుసు కోవటం సాధ్యమవుతుందా.. ఇటువంటి ప్రశ్నలు చాల వస్తుంటాయి...
విధిని నడిపించే మహా చైతన్యం ఆ పరమేశ్వరుడె అని అర్థమైతే అప్పుడు ఈ ప్రశ్న ఉదయించదు.
సహజంగా మొలిచే గుణం విత్తనంలో, మొలిపించే గుణం భూమిలో ఉందని మరిచిపోయి మొక్కలని మనమే పెంచుతున్నామని అనుకుంటాం. అప్పుడు ఎవరి ప్రమేయం లేకుండా పెరిగే కీకారణ్యం మాటేమిటి అనే ప్రశ్న ఎదురౌతుంది.. దీని భావం మన ప్రయత్నం అక్కర్లేదని కాదు, అహంకారం విడనాడమని.
అలాగే 'విధిని తప్పించలేము' అంటే అది మన చేతిలో లేదని స్పష్టం చేయడమే. అసలు విధి స్వరూపం ఒక్క క్షణం ముందైనా తెలుసుకోగలమా.. లేనప్పుడు దానిలో మన ప్రమేయం ఎలా ఉంటుంది.. విధిని నడిపించే 'మహా చైతన్యం' మాత్రమే దాన్ని ఎలాగైనా మార్చగలదు.
ఒకే సూర్యుడు 100 నీటి కుండల్లో ప్రతిబింబించి నట్లు విశ్వమంతా నిండి ఉన్న ఆ మహా చైతన్యం ఉనికి మన హృదయం లోనూ వెలుగుతోంది. దేహమే నేనుగా భావిస్తున్నాం కనుక మహాచైతన్యాన్ని (దైవాన్ని) ఈ దేహంతో హృదయంలో వెదకటం ప్రారంభించాలి. తద్వారా బాహ్యదృష్టి తగ్గి "సత్యశోధన" అలవడుతుంది...
No comments:
Post a Comment