*🌺🕉️ జై శ్రీమన్నారాయణ 🕉️🌺*
*ఓం నమో భగవతే వాసుదేవాయ*
🍁🍁🍁 🍁🍁🍁 🍁🍁🍁
*జీవుడు వేరు, దేవుడు వేరన్నది ద్వైతం. జీవుడే దేవుడన్నది అద్వైతం. జీవాత్మ, పరమాత్మలు రెండూ వేర్వేరు... సృష్టిలో కంటికి కనిపించే ప్రతిదీ, కనిపించని పరమాత్మ మీద ఆధారపడి ఉంది... ఆయనే ఈ సృష్టికి మూలకారకుడని, ఆయనని శరణు వేడి తరించాలని ద్వైతం చెబుతోంది. ఇక, సాక్షాత్తూ భగవానుడి ప్రవచనమే అద్వైతమని మూలభారతంలోని గీత ప్రబోధిస్తోంది. కిరీటికి కర్తవ్యబోధ చేసి, స్వధర్మాచరణ శ్రేష్ట మని, కర్మయోగ విశిష్టతతో భగవంతుణ్ని చేరే ఉపాయం సాక్షాత్తూ శౌరి చెప్పడం- భారత యుద్ధకాలంనాటి మాట. అయితే బాధ్యతలు తీరి, సేదదీరిన నాలుగు దశాబ్దాల తరవాత, సవ్యసాచికి మళ్లీ భగవద్గీత మదిలో మెదిలింది. గుర్తులేదు మళ్లీ చెప్పమన్నాడు.*
*'బ్రహ్మజ్ఞానం అనంతమైంది. కనుక ముఖ్యమైన దాన్ని తెలుసుకొని ఆచరించు' అంటూ కాలం ప్రాముఖ్యతను చెప్పకనే చెప్పాడు గీతాచార్యుడు. లోకం తీరు లోకేశుడికి తెలుసు. బంధాలు వదిలించుకోలేక సత్వ రజస్తమో గుణాల బారినపడ్డ జీవుల వ్యధా ఆయనకి తెలుసు. అందుకే వారిని ఉద్దరించడానికి, విజయుడి వంకతో సమాధి యోగం గురించి చెబుతూ, ఆత్మో పదేశం చేశాడంటారు పెద్దలు. ఇది భగవద్గీతకు తదనంతరం చెప్పింది కనుకనే, ఉత్తర గీత అయ్యింది.*
*నిజానికి సాధకులకు ఉత్తర గీత అద్భుతమైన మార్గదర్శి అంటారు పెద్దలు. ఇక్కడ ఆత్మజ్ఞానం గురించి అభ్యర్థిస్తాడు అర్జునుడు 'దేహమే దేవాలయం' అంటాడు దేవకీ నందనుడు. సర్వాంతర్యామిని చూడటానికి అంతకు మించిన దేవాలయం ఎక్కడ ఉంది? ఆ సంగతిని మర్చిపోయి దేవుడి కోసం ఎక్కడెక్కడో వెతకడం అంటే- ఇంట్లో ఉన్న పాయసాన్ని వదిలి, ఆకలితో భిక్షాటనకు బయలుదేరడం లాంటిది. మనలో ఆత్మరూపంలో ఉన్న పరమాత్మే అంతర్యామి. సాధన ద్వారా మన 'లోనికి' ప్రవేశించి, ఆ అంతర్యామిని దర్శించాలి. మునులు ఆత్మను దైవంగా భావించి, దాని మీద ధ్యాస పెడతారు. కనబడే ప్రతి వస్తువులోనూ, ప్రతి ప్రాణిలోనూ పరమాత్మను చూడగలిగిన యోగి వీళ్లందరికన్నా ఉత్తముడు.*
*పరమాత్మను తెలుసుకోవడానికి ధ్యానసాధనే శరణ్యం. కోటి పూజలు ఒక స్తోత్రంతో, కోటి స్తోత్రాలు ఒక ధ్యానంతో, కోటి ధ్యానాలు ఒక లయంతో సమానం. మనసును శూన్యం చేసి ధ్యానించే ధ్యానం జపం కన్నా గొప్పది. మనసునీ, బుద్ధినీ నిలుపుదల చేసి, అహంకారాన్ని విడిచి పెట్టినపుడే ఆత్మమీద దృష్టి పెట్టడానికి వీలవుతుంది. మనసు చలిస్తున్నంత సేపూ ఆత్మజ్ఞానం కలగదు. నువ్వుల్లో నూనె ఉన్నా, గానుగ ఆడిస్తేనే బయటపడుతుంది. అలాగే మనలోని భగవంతుడు సాధన చేసి ధ్యానం చేస్తేనే కనబడతాడు. నిరంతర సాధన చేసి, ధ్యానిస్తేనే ఆత్మ అవగతం అవుతుంది. అదే పరమాత్మ అని అర్థమవుతుంది. మనం బయటికే గానీ, లోనికి ప్రయాణం చేయడం నేర్చుకోం. పాలల్లో వెన్న ఎక్కడుందీ అంటే అంతటా ఉందంటాం. అలాగే అంతటా ఉన్న పరమాత్మను చేరుకోవడానికి ధ్యానసాధనే శరణ్యం.*
🍁🍁🍁 🍁🍁🍁 🍁🍁🍁
*🙏సర్వేజనాః సుఖినో భవంతు🙏*
🌴🦚🌴 🦚🌴🦚 🌴🦚🌴
No comments:
Post a Comment