మైల ఇంట్లో ఏమీ తినకూడదా?
గరుడపురాణం మామూలు సమయాల్లో చదవకూడదా?
అక్కడకు వెళ్ళి వచ్చిన వారు దీపం ఎందుకు చూడాలి?
మృతాశౌచం కలిగినప్పుడు బంధువులు ఏం చేయాలి?
పితృదేవతలు, పితృక్రియలు, పితృ యజ్ఞాలు దాదాపు ఒకే విధంగా ఉంటాయి. ముఖ్యంగా స్వధాదేవి పేరు స్మరించే అంతా పితృదేవతలకు తర్పణాదులు నిర్వహించాలి. ఎందుకంటే స్వధాదేవి పేరు స్మరించి ఇస్తేనే అవి పితృదేవతలకు చెందుతాయి.
గరుడపురాణం మామూలు సమయాల్లో చదవకూడదా?
ఇది చాలా అసంబద్ధమైన నమ్మకం. మహాపురాణాలు 18లో గరుడపురాణం ఒకటి. ఇది సాక్షాత్తూ గరుడునికి విష్ణువు చెప్పిన పురాణం. ఇది సకల పితృకార్యాలకూ ప్రామాణికమైన పురాణం. ఇందులో నిజానికి పితృకార్యాల గురించి చాలా తక్కువే ఉంది. అధికభాగం ఆయుర్వేదం గురించి, వివిధవ్యాథుల గురించి, రత్నశాస్త్రం గురించి ఉంది. అనేక దేవతారాధనల గురించి, వ్రతాల గురించి ఉంది. కేవలం 20 శాతం మాత్రమే పితృకార్యాల గురించి ఉంది. దీన్ని చదవకూడదని పుట్టించిన వారు ఏమైపోయారో కానీ, నేటికీ అనేక మంది దాన్ని నమ్ముతున్నారు. వ్యాసమహర్షి ప్రసాదించిన పురాణం ఇది. కావాలని ఆయన జనులకు అపకారం జరగాలని మహాపురాణం వ్రాశారా? అనే కనీస ఇంగితం కూడా నేడు అనేక మందిలో లోపించింది.
ప్రాణప్రదమైన వారు మరణిస్తే వారిని ఓదార్చడానికి జీవాత్మ పరమాత్మల గురించి స్వర్గనరకాల గురించి ఉన్న దీన్ని చదవడం ప్రారంభించి, ఘంటసాల భగవద్గీతలా ఇక ఆ సమయంలో తప్ప దీన్ని చదవకూడదనే దుర్దశకు చేరుకున్నాము.
ఆధ్యాత్మిక మార్గంలో అభివృద్ధి కలగాలంటే ముఖ్యంగా వైరాగ్యం అవసరం. అదిలేనిదే ఆధ్యాత్మికతే లేదు. ఇటువంటి వైరాగ్యం శ్మశాన సందర్శన జరిగినప్పుడు వస్తుంది. దీన్ని దృఢపరచుకుంటే మనిషి సాత్విక స్వభావుడై ధర్మమార్గానికి వస్తాడు.
విచారం నుంచీ విషాదం వస్తుంది. విషాదం నుంచీ వైరాగ్యం వస్తుంది. వైరాగ్యం నుంచీ విజ్ఞానం వస్తుంది. విజ్ఞానం నుంచీ నిస్సంగత్వం వస్తుంది. నిస్సంగత్వం వల్ల కర్మసిద్ధి కలుగుతుంది. ఫలితంగా కర్మకౌశలం కలుగుతుంది. అదే యోగసిద్ధి.
ఇది కలగాలంటే మనిషి తప్పనిసరిగా చదవాల్సిన పురాణంగా దీన్ని వ్యాసభగవానులు అందించారు. దీన్ని నిత్యం చదువుకోవడం వలన మనిషిలో ధర్మప్రవర్తన పెరుగుతుంది. కనీసం తాను ఏ పాపాలు చేస్తున్నాడో తెలుస్తుంది. కనుక ఇది అర్ధం లేని ప్రశ్న. అసంబద్ధమైన నమ్మకం.
మా అమ్మగారు పరమపదించారు. మేము అశౌచంలో ఉన్నాము. ఈ సందర్భంగా కర్తలు ఏం చేయాలి? బంధువులు ఏం చేయాలి.
ఇది అతి ముఖ్యమైన అంశం. అనేక కారణాల వలన మృతాశౌచాన్ని ఎవరికి వారు సొంత భాష్యాలతో పవిత్రమైన దివ్య కార్యక్రమాలను భగ్నం చేసుకుంటున్నారు. ముఖ్యంగా మేనత్తలు, ఆడపడుచులు, అత్తగార్లు, కోడళ్ళు ఎవరికి తోచిన ఆచారాలు వారు చొప్పించి అనవసరంగా ప్రాయాస పడుతున్నారు. శాస్త్రాలలో ఉన్నది ఒకటి, నేడు ఆచరణలో ఉన్నది వేరు. ముఖ్యంగా మృతా శౌచాలు బాహాబాహీలకు గోదాలుగా మారడం అత్యంత దురదృష్టం.
గరుడపురాణం స్పష్టంగా కృత త్రేతా యుగాల్లో అసలు ప్రేతలుగా ఎవరూ మారలేదని చెబుతుండగా, నేడు ప్రేత విముక్తి కలిగి పితృదేవతలుగా మారే వారు అతి స్వల్పంగా ఉంటున్నారు. ‘‘విధిహీనమసృష్టాన్నం మంత్రహీనమదక్షిణమ్, శ్రద్ధా విరహితం యజ్ఞం తామసం పరిచక్షతే‘‘ అని గీతాకారుడు అన్నది మొదటి పదిరోజులతో మొదలు అవుతోంది. శ్రద్ధ లేకుండా, శాస్త్రవిరుద్ధంగా, అన్నదానాది తృప్తులు లేకుండా, మంత్రశుద్ధి లేకుండా, సరైన దక్షిణలు ఇవ్వకుండా అక్షరాలా తామస యజ్ఞాలుగా నేటి పితృక్రియలు మారుతున్నాయి. కనుక నేడు ఏంచేయాలో ఏంచేయకూడదో తెలుసుకోవడం అతిముఖ్యం.
అక్కడకు వెళ్ళి వచ్చిన వారు దీపం ఎందుకు చూడాలి?
మారుతున్న ఆచారాల్లో ఇది ఒకటి. మృతుని ఊరి చివరకు తీసుకువెళ్ళినవారు అక్కడి పనులు అయిపోయాక, నక్షత్రదర్శనం చేసి స్నానాలు చేయాలి. దాన్ని సచేల స్నానం అంటారు. దీని అనంతరం వారు అగ్నిని స్పృశించాలి. అయితే నేడు అగ్నికార్యాలు చేసేవారు లేరు కనుక దీపం వెలిగించి దాన్ని చూడమని చెబుతూ వచ్చారు. కనుక దీపం చూడమనడం వెనుక అగ్నిస్పర్శ ఆచారం దాగి ఉంది.
మైల ఇంట్లో ఏమీ తిన కూడదా? త్రాగకూడదా?
శాస్త్రాలలో ఉన్నది అర్ధం చేసుకొని ఆచరించాలి. ముక్కస్య ముక్కా ఆచరించకూడదు. దీన్నే త్యాగయ్యగారు భాగవత రామాయణ భాగవత శ్రుతి శాస్త్రపురాణ మర్మములు తెలిసి అన్నారు. శాస్త్రం ఎందుకు అలా చెప్పిందో గ్రహించి ప్రవర్తించాలి. దీన్నే ఆధునిక న్యాయపరిభాషలో స్పిరిట్ ఆఫ్ లా అంటారు.
గరుడపురాణంలో, విష్ణుపురాణాల్లో మృతుని ఇంటి నుంచీ మైల పోయేవరకూ ఏమీ తిన కూడదు, త్రాగకూడదు, కుటుంబీకులు దానాలు ఇవ్వకూడదూ తీసుకోకూడదు. వేదాధ్యయనాలు చేయకూడదు అని చెప్పింది. అదే సందర్భంలో బంధువులు మిత్రులు, తెలిసిన వారు, ఆయన డబ్బుతిన్నవారు, ఆయన నుంచీ లబ్ధిపొందిన వారు, రక్త సంబంధీకులు, గోత్రీకులు మొదలైన వారు వచ్చి ధర్మ ఉదకాలు ఇవ్వాలని వారు వదిలే నీరే ప్రేతకు దాహం తీరుస్తుందని, వారు తినే ఆహారమే ప్రేత ఆకలి తీరుస్తుందని కూడా మరొక చోట ఉన్నది. ఈ రెండూ సమన్వయం చేసుకోవాలి. అంతేకాక, మృతా శౌచం పది రోజులు ఉంటుంది. ఈ సందర్భలో ప్రేత తన ఇంటిలోనే ఉంటుంది. తన వారి చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. దీనికి అనేక కారణాలు ఉంటాయి. ముఖ్యంగా మమకారం. నాది నావాళ్ళు అనే మమకారం వారిని వదిలిపోనివ్వదు.
అది ఇతర కారణాల వల్ల కూడా బయటికి పోలేదు. ఎందుకంటే ఆత్మహత్యలు చేసుకొన్నవారు, హత్యలకు గురైనవారు, బలవన్మరణాలు పొందిన వారు, శవాలు దొరకకుండా చనిపోయినవారు, హంతకులు, మహాపాపులు ప్రేతాలుగా మారి శ్మశానాది ప్రాంతాల్లో, దారుల్లో కాపుకాసి ఉంటారు. వీరు క్రొత్తగా చనిపోయిన వారిని పీడించి వారికి వచ్చే ఆహార, పానీయాలు దోచుకుంటారు. కనుక, వారి నుంచీ రక్షణ కోసం కూడా ప్రేత తన ఇంటినే ఆశ్రయించి ఉంటుంది. కుమారుడు తన వారికి పదిరోజులపాటు ఇచ్చే దానాలు, ఉదకాదులు వల్ల ప్రేతకు బలం చేకూరుతుంది. పిశాచాలకు కూడా పిల్లికి బిచ్చం వేసి నట్టు వేసే వాటివల్ల వారు కూడా శాంతించి కొత్తప్రేతకు చోటు ఇస్తారు. ఈ కారణాలన్నింటి వల్లా ప్రేత పదిరోజుల పాటు తన ఇంటిలోనే ఉంటుంది. అనుకూలమైన పరిస్థితి వచ్చినప్పుడు అది పదిరోజుల తరువాత స్వేచ్ఛగా వెళిపోతుంది.
అయితే ప్రేతకు భయం కలిగించే పనులు ఇంటిలో వారు ఆ సమయంలో చేయకూడదు. దైవ పూజలు చేయడం, వేదమంత్రాలు చదవడం, ఇళ్ళు కడిగి ముగ్గులు పెట్టడం, ఆడవారు జుట్టు శృంగారించుకోవడం, బొట్లు పెట్టుకోవడం, అలంకరించుకోవడం వంటివి చేయడం వలన ప్రేత నిరాశకు గురౌతుంది. బయటకు వెళ్ళ లేదు, ఇంటిలో ఉండలేదు, ఈ పరిస్థితి దానికి రానివ్వ కూడదు. కనుకనే ఆ పది రోజులూ అశౌచం పనులు ప్రేతకు భయం కలుగకుండా చేస్తారు.
ఆ సమయంలో బిగ్గరగా మాట్లాడడం కూడా చేయకూడదు. ప్రేత విపరీతమైన భయంతో ఉంటుంది. యమభటులను చూసి వారి పెట్టే హింసలకు మహాభయం ఆవరించి ఉంటుంది. కనుక అంతా మౌనంగా ఉండాలి. అంతేకాక కర్త ఆ సమయంలో రెండు చేతులతో తలదువ్వుకోవడం చేస్తాడు. అది దరిద్రలక్షణం మాత్రమే కాదు ప్రేతలకు ఆహ్వానం వంటిది. అలాగే తొడలు కొట్టుకుంటూ ప్రదక్షిణలు చేస్తాడు. కనుకనే తొడలు కొట్టుకోకూడదు అంటారు. ఆ సమయంలో చేసే పనులు కేవలం ప్రేతకు తృప్తికలిగించేవి. అవి మామూలు సమయాల్లో చేయరాదని పూర్వం పెద్దలు నిందించేవారు.
ఆ పదిరోజులకు ఆ ఇల్లు దానికి ఆవాసంగా ఉంటుంది కనుక అక్కడ ఏమీ తినరాదని అన్నారు. అయితే బంధువులు, స్నేహితులూ ఇతరులకు తప్పులేదు. వారు తినాలి కూడా. వారు తినడం ప్రేతకు సంతోషం కలిగిస్తుంది. అంతేకాక వారికి మృతుల పై ఉన్న ప్రేమను వ్యక్తం చేయడంగా భావించవచ్చు.
నిజానికి అక్కడ అన్నశాంతి జరగాలి. ఇది మంచి ఉద్దేశంతో ఏర్పరచిన ఆచారం. చనిపోయిన వ్యక్తి మీద ఎంతమందికి అభిమానం ఉందో దీని వలన తెలుస్తుందని పెట్టినట్టు అనిపిస్తుంది. ఎంత మంది తింటే అంతగా ప్రేతకు ఆకలి తీరుతుంది. అయితే నేడు పన్నెండు రోజులు బంధువులను మేపగలిగిన సత్తా ఎవరికీ లేదు. ఉండే అవకాశం కూడా ఎవరికీ ఈ బిజీ జీవితాల్లో లేదు. కనుక అన్నశాంతి జరగడం లేదు.
ఈ మృతా శౌచం కేవలం వ్యక్తి చనిపోతే మాత్రమే కాదు, స్తీకి ప్రతినెలా వస్తుంది. ఆమెలో విడుదలయ్యే ప్రతీ అండం ఒక శిశువే. అది ఫలదీకరణం చెందకుండా ఆమె రజస్వల కావడం అంటే భ్రూణహత్య జరిగినట్టే. కానీ నేడు అధికశాతం ఈ మైలను పాటించడంలేదు.
కర్తకు ఏటి సూతకం ఎందుకు ఉంటుంది? ఇంత కఠినమైన నియమాలు ఎందుకు పెట్టారు? ఇది అర్ధం కావాలంటే అశౌచానికి ఉన్న ప్రాథమిక రహస్యం తెలుసుకోవాలి.
మృతా శౌచం ఎక్కువ కాలం కర్తకు ఉంటుంది. అతని భార్యకు కూడా ఉంటుంది. అతని పిల్లలకు పదోనాడే శుద్ధి ఉంటుంది. సపిండీకరణం అయి, ఆశీర్వచనం అయ్యేవరకూ కర్తకు మాత్రమే మైల ఉంటుంది. ఇంటిపేరు వారికి దాయాదులకు సోదరులకు 10 రోజుల పాటు మైల ఉంటుంది. పెళ్ళి అయిన కూతుళ్ళు పక్షిణీ దారులు అవుతారు. అలాగే పెళ్ళైన మేనత్తలు తదితరులు, భార్య వైపు చుట్టాలు ఇలా ఒక్కొక్కరికీ ఒక్కో సమయంలో మైల పోతుంది. వీరిలో కొంతమందికి వెంటనే స్నానంతో కూడా శుద్ధి అవుతుంది.
ఇవన్నీ పరిశీలిస్తే ఈ మైలా, తంతులూ చనిపోయినవారి కోసం కన్నా జీవించి ఉన్నవారిశ్రేయస్సు కోసం అని అర్ధం చేసుకోవాలి. ముఖ్యంగా కర్తకు జననీ జనకుల పూర్వమధ్యమఉత్తర క్రియలు చేయడం వలన అశ్వమేధాది యజ్ఞఫలితాలు వస్తాయి. ఇది కేవలం సాధనా మార్గంలో ఉన్నవారికే అర్ధం అవుతుంది. దీనికి ఉదాహరణే మైల.
చనిపోయినప్పుడు మన వెంట ఎవరూ రారనే వేదాంతం అందరికీ తెలుసు. అయితే కర్తకు మరింతగా బ్రహ్మజ్ఞానం కలిగించేది మైల. మృతి నాడు అంతా మైలపట్టి ఉన్నా, శవదహనం తరువాత కొందరికి శుద్ధి అయిపోవడంతో మొదలై, పదోరోజున తన కుమారులకు కూడా శుద్ధి అయిపోయి, కేవలం తాను మాత్రమే మైల ఉన్న వ్యక్తిగా నిలిచిన రోజున ఏదో తెలియని ఆధ్యాత్మిక జ్ఞానం కర్తకు కలుగుతుంది. అంతేకాక ఈ పన్నెండు రోజులూ అతడు ఎవరినీ తాక రాదు, బ్రాహ్మణులకు దానాదులు చేసేటప్పుడు కూడా వారిని తాకరాదు. ఈ విధమైన నియమాలతో కర్త ఉన్నప్పుడు కలిగే అనుభవం ఏమిటి అనేది ఎవరికి వారు తెలుసుకోవాల్సిందే.
No comments:
Post a Comment