*🌺🕉️ జై శ్రీమన్నారాయణ 🕉️🌺*
*ఓం నమో భగవతే వాసుదేవాయ*
🍁🍁🍁 🍁🍁🍁 🍁🍁🍁
*మానవ బలహీనతలు*
*ఆత్మస్తుతి పరనింద మనసును ఉల్లాసపరుస్తాయి. ఉత్తేజాన్ని కలిగిస్తాయి. అయినా ఆ సంతోషం చిరకాలం నిలవదు. స్వల్ప విజయాలను ఘనవిజయాలుగా ప్రచారం చేసుకుంటూ తమ సుగుణాలను తామే పొగుడుకునేవారు జీవితంలో రాణించలేరు. తనంతటివాడు లేడని మిడిసిపడుతూ తనకు తానే సాటి అని భావించేవాడు అజ్ఞాని. భూమిపై నివసించే లక్షల జీవరాసుల్లో తన పాత్ర అణువంత అని గ్రహించినవాడే ఉత్తముడు. ఆత్మస్తుతి ఆత్మహత్యతో సమానమని ఒకానొక సందర్భంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పాడు.*
*'పేరు ప్రఖ్యాతుల కోసం పాకులాడేవారు భ్రాంతిలో పడి కొట్టుకుంటున్నారు. సర్వేశ్వరుడే సమస్తాన్ని నియమిస్తున్నాడని, అన్నింటికీ పరమేశ్వరుడే కర్త అని భావించేవారు బుద్ధిమంతులు. సమస్తం ఈశ్వరేచ్ఛతోనే జరుగుతుందనే దృఢ విశ్వాసం గల వ్యక్తి తాను ఈశ్వరుడి చేతిలో పరికరమని భావిస్తాడు’ అని రామకృష్ణ పరమహంస బోధించారు. ఆత్మస్తుతి చేసుకునేవారు ఇతరుల దోషాలు ఎంచడంలో ప్రవీణులవుతారు. పరనింద మనసును ఉద్వేగపరుస్తుంది. కానీ, వారికి తమ దోషాల గురించి తెలియదు. తెలిసినా తెలియనట్లు నటిస్తారని భారతం చెబుతుంది.*
*ధర్మరాజు రాజసూయ యాగం చేశాడు. యజ్ఞం పూర్తయ్యాక చివరి రోజున భీష్ముడి సలహాపై శ్రీకృష్ణుణ్ని పూజించాలని అనుకున్నప్పుడు శిశు పాలుడు మండిపడ్డాడు. శ్రీకృష్ణుణ్ని నిందించసాగాడు. శిశుపాలుడి తల్లి కిచ్చిన మాట ప్రకారం నూరు తప్పులవరకు సహించిన శ్రీకృష్ణుడు హద్దుదాటిన వదరుబోతు తల ఖండిస్తాడు. అకారణ ద్వేషం అనర్థ హేతువు. ఇతరుల దోషాలు ఎంచుతూ సమయం వృథా చేసు కునేవారు తమ జీవితంలో ఏమీ సాధించలేరు.*
*అసూయా ద్వేషాలు మనిషి తోబుట్టువులు. అవి మనసును కలుషితం చేసే ఉపద్రవాలు. ఎదుటివారి ఉన్నతిని చూసి ఓర్వలేకపోవడం సంకుచిత మనస్తత్వం. అసూయ ద్వేషాన్ని రగిలిస్తుంది. పగను పెంచుతుంది. అసూయాపరుడు మానసిక వేదనకు గురవుతాడు. లోకంలో ఎవరికీ ద్వేషం కలిగించనివాడు, ఎవరివల్లా ఉద్వేగానికి గురికానివాడు, ఈర్ష్య, భయం, మనోవికారం లేనివాడు అయిన భక్తుడు తనకు ఇష్టుడని భగవంతుడి గీతోపదేశం. అసూయాపరుడు, ఇతరులను అసహ్యించుకునేవాడు, అసంతుష్టుడు, కోపి, నిత్య శంకితుడు, పరధనోపజీవి అనే ఆరుగురూ దుఃఖభాజనులని విదుర నీతి చెబుతోంది.*
*జీవితం సుఖసంతోషాలతో సాగిపోవడానికి చదువు, జ్ఞానంతోపాటు మనసులో మానవత్వపు పరిమళాలు వీచాలి. తోటివారికి సహాయం చేయగల సహృదయులు ఇతరుల దోషాలు లెక్కించరు. సజ్జన సాంగత్యం దుష్ట ఆలోచనలను దూరం చేస్తుంది. అసూయాద్వేషాలను మనసుకు చేరనీయదు. నిత్యం భగవన్నామ స్మరణలో పునీతులైనవారు నిర్మల మనస్కులై తమ శక్తికి లోబడి కార్యాచరణకు పూనుకొని విజయం సాధిస్తారు. తమతోపాటు ఇతరుల అభ్యున్నతినీ కోరుకుంటారు. సమాజ శ్రేయస్సును కాంక్షిస్తారు.*
🍁🍁🍁 🍁🍁🍁 🍁🍁🍁
*🙏సర్వేజనాః సుఖినో భవంతు🙏*
🌴🦚🌴 🦚🌴🦚 🌴🦚🌴
No comments:
Post a Comment