Vedantha panchadasi:
స్వప్నేన్ధ్రజాల సదృశ మచిన్త్య రచనాత్మకమ్ ౹
దృష్టనష్టం జగత్పశ్యన్కథం తత్రానురజ్యతి
౹౹171౹౹
స్వప్నం లా నశించు జగత్తునందు కోరిక ఎట్లు జనించును.
స్వ స్వప్న మాపరోక్ష్యేణ దృష్ట్యా
పశ్యన్స్వజాగరమ్ ౹
చిన్తయేదప్రమత్తః నన్నుభావనుదినం ముహుః
౹౹172౹౹
చిరం తయోః సర్వసామ్యమనుసన్థాయ జాగరే ౹
సత్యత్వ బుద్ధిం సంత్యజ్ర నానురజ్యతి పూర్వవత్
౹౹173౹౹
తన కలను తాను నేరుగా చూచి,జాగ్రదవస్థను చూచుచు అనుదినము చింతించి బ్రాంతిని వదలును.
ఇంద్రజాలమిదం ద్వైత మచింత్యరచనాత్వతః ౹
ఇత్యవిస్మరతో హానిః కా వా ప్రారబ్థ భోగతః
౹౹174౹౹
నిర్బన్థస్తత్త్వ విద్యాయా ఇద్థ్రజాలత్వ సంస్మకతౌ ౹
ప్రారబ్ధస్యాగ్రహో భోగే జీవస్య సుఖదుఃఖయోః
౹౹175౹౹
ఈ ద్వైతజాతము ఇంద్రజాలము.
జ్ఞానము తెలుపును. ప్రారబ్దానుభవము వలన ఏమి హాని ?ఏమీలేదు.
వ్యాఖ్య:- మాయామయమైనప్పటికీ,
సుఖకారణమైనట్టి భోగాలయెడల ఆసక్తి ఎట్లా పోతుంది ? అంటే -
జగత్తు అనేది స్వప్నం లాంటిదనీ,ఇంద్రజాలము లాంటిదనీ,మిథ్య అనీ,
అంచిత్య రచనాత్మకమైనదనీ, పరివర్తనశీలమైనదని,
క్షణభంగురమనీ - చూస్తూకూడా జ్ఞానియైనవాడు అటువంటి జగత్తుమీద అనురాగాన్ని ఎట్లా పెంచుకుంటాడు ?
ఈ జగత్తు,అందలి భోగములు,
స్వప్నంలా కరిగిపోయేవే,
ఇంద్రజాలములే అవి - ఊహకతీతమైన కల్పనలు, చూచుచుండగనే నశించేవే అని
స్పష్టముగా ఎరిగిన జ్ఞానికి వానియందు ఆస్థ,కోరిక ఎట్లు జనించును ? జనించదు.
అనురాగాన్నీ పొందడు.
స్వప్నాన్ని ప్రత్యక్షంగా చూస్తూవున్నాంకదా !
అలాగే జాగ్రత్తును గురించి కూడా బాగా ఆలోచించి ,
ఈ రెండూ సమమే అనే విషయాన్ని తెలుసుకుని ఈ రెండింటిని గూర్చి అనుదినమూ చింతించవలెను.
జాగ్రదవస్థలో ఉంటూ వస్తున్న సత్యత్వబుద్ధిని(జాగ్రత్తులో కనిపిస్తున్నవన్నీ సత్యమనే బుద్ధిని)చక్కగా వదలిపెట్టి ఈ జాగ్రదవస్థకూడా స్వప్నంలాంటిదే - మిథ్యయే-
అని నిత్యం తలవాలి.
ఈ విధంగా స్వప్నము, జాగరణము ఈ రెండూకూడా తాత్కాలిక భోగాల్ని మాత్రమే యిస్తాయనీ,పరిణామంలో అవి నిస్సారము, వినాశస్వభావము కలవి అని గ్రహించి జాగ్రదవస్థలో ఉండే సత్యత్వబుద్ధిని వదలివేస్తాడు.
అప్పుడిక జాగ్రత్కాలీన పదార్థాలను కూడా లోగడలాగా చూడడు - ఆ పదార్థాల యెడల అనురక్తుడు కాడు.చూ.ఉపదేశసహస్రి .
17-61.
ఇటువంటి స్థితిని పొందిన జ్ఞానికి ప్రారబ్ధకర్మ భోగంవల్ల కలిగే హాని ఏముంటుంది ?
ఈ ద్వైతజాతము ఇంద్రజాలము వంటిది.దీనికి కారణము ఊహాతీతమని విస్మరింపడు జ్ఞానియైనవాడు.
మిథ్యా,భ్రాంతి అనే విషయాలను మర్చిపోకుండా యుక్తిపూర్వకంగా అనుసంధానం చేస్తూ ఉండే జ్ఞాని ప్రారబ్ధకర్మఫలమైన సుఖాన్నిగాని,దుఃఖాన్నిగాని అనుభవించటంవల్ల అతని మిథ్యత్వ భావానుసంధానికి కలిగే హాని ఏమీ ఉండదు.
ఎందుచేతనంటే - భోగం,మిథ్యత్వ అనుసంధానం ఈ రెండూ భిన్నవిషయాలు కాబట్టి !
ఈ రెంటికి ఉన్న తేడా ఏమిటంటే -
"జ్ఞానము" - దృశ్యమాన జగత్తంతా ఇంద్రజాలము వలె మిథ్యయని తెలుపును.(అందరి అనుభవములను అది తొలగింపదు).
జగత్తు ఇంద్రజాలములాగా మిథ్యయనే స్మృతిని కలిగించటంలోనే తత్త్వజ్ఞాన నిర్భంధం (నియమం) ఉంటుంది. అంతే తప్ప భోగాలను నాశనం చేయాలనే నియమం దానికి ఉండదు.
ఇక"ప్రారబ్ధకర్మ"యొక్క లక్ష్యం -
జీవునికి సుఖదుఃఖరూపమైన భోగాన్ని కలిగించి అనుభవింపజేయును అంతే తప్ప వాటి సత్యత్వాన్ని తెలియజేయటం కాదు -
ఆ అనుభవములను సత్యములుగ జేయజాలదు.
ఈ రెంటికి ఉన్న భిన్న విషయత్వం ఇదే.
విద్యారబ్ధే విరుధ్యేతే న భిన్నవిషయత్వతః ౹
జానద్భిరప్యచన్ద్రజాల వినోదో దృశ్యతే ఖలు
౹౹176౹౹
జగత్సత్యత్వమాపాద్య ప్రారబ్ధం భోజయేద్యది ౹
తదా విరోధి విద్యాయా భోగమాత్రాన్న సత్యతా
౹౹177౹౹
జ్ఞాన,ప్రారబ్ధము భిన్నములు. ప్రారబ్ధము జ్ఞానము ఏకకాలమున ఉండజాలదు.
కేవలము అనుభవించుటచే సత్యత్వము సిద్ధింపదు.
అనూనో జాయతేభోగః కల్పితైః
స్వప్నవస్తుభిః ౹
జాగ్రద్వస్తుభిరప్యేవ మసత్యైర్భోగ ఇష్యతామ్
౹౹178౹౹
యది విద్యాపహ్నువీత జగ్రత్ర్పారబ్ధ ఘాతినీ ౹
తదా స్యాన్న తు మాయాత్వబోధేన తదపహ్నావః
౹౹179౹౹
అనపహ్నుత్య లోకా స్తదిన్థ్రజాలమిదం త్వితి ౹
జానన్త్యేవానపహ్నుత్య భోగం మాయాత్వధీస్తథా
౹౹180౹౹
స్వప్నం వలన అనల్పానందం ఎలా కలుగుతుందో అలాంటిదే జాగ్రత్.మాయ తెలిసినంతనే తొలగదు.జ్ఞానము మిథ్యావిషయానుభవము తొలగింపదు.
వ్యాఖ్య:-విద్య , ప్రారబ్ధకర్మ ఈ రెంటికీ విరోధం వున్నదా ?
"జ్ఞాన" విషయములు, "ప్రారబ్ధమునకు" విషయములు భిన్నములు.
"తత్త్వజ్ఞానమనే" విద్యకు, ప్రారబ్ధకర్మకు పరస్పర విరోధం ఏమీలేదు.ఎందుచేతనంటే వాటి విషయాలు వేరువేరు కాబట్టి !
మనం అనుభవించే రూపజ్ఞానం,రసజ్ఞానం లాగా !
భోగ్యపదార్థాలయొక్క మిథ్యత్వ జ్ఞానం భోగ్యపదార్థాలు మిథ్యయని తెలియటం భోగానికి బాధకంకాదు.ఎట్లా తెలుసు ?అంటే -
ఇంద్రజాలము అనేది
"మాయ"అనీ,"మిథ్య"అనీ తెలుసు.
అయినప్పటికి అందరూ ఆ చమత్కారాన్ని చూస్తున్నారు - విషయాన్ని అనుభవిస్తున్నారు,
ఇంద్రజాలము"కనికట్టే" అని తెలిసికూడా.
అలానే ప్రారబ్ధము,
జగత్తునకు సత్యత్వము ఆపాదించి అనుభవింప జేసినచో అపుడు జ్ఞానమునకు విరోధియగును. జగత్తు ఎప్పుడైతే సత్యంగా చూడబడిన ఇక జ్ఞానం ఎక్కడిది ? జ్ఞానముతో ఏకకాలమున ఉండజాలదు.
ప్రారబ్ధకర్మ మనేది , జగత్తునందలి సమస్త భోగపదార్థాల సత్యత్వాన్నీ సంపాదనచేసి - అ భోగాలు సత్యాలని చెప్పి జీవునికి సుఖాన్నో లేేక దుఃఖాన్నో ఇస్తూ ఉంటే అప్పుడు ,
అది - ఆ ప్రారబ్ధకర్మము విద్యాజ్ఞానానికి విరోధి అయితే కావచ్చునేమో !
కాని ,అట్లాజరగటం లేదు.అది కేవలం భోగాన్ని మాత్రమే ఇస్తోంది.
భోగాన్ని యిచ్చినంత మాత్రం చేతనే ఏదీ సత్యంకాదు. అట్లాఅయితే భోగ్యమైన జగత్తు సత్యం కావాలి.
సత్యం నిలకడకలది.మరి -
నిత్యం మారే జగత్తునకు సత్యత్వం ఎలా ఆపాదిస్తాము.
జగత్తు సత్యం అని - రుజువు చేసేందుకు దృష్టాంతము ఏదీలేదు.కేవలము ప్రారబ్ధమును అనుభవించుటచే సత్యత్వము సిద్ధింపదు.
అయితే మిథ్యా పదార్థాలవల్ల భోగం లభిస్తుంది అని అనటానికి కూడా దృష్టాంతం ఏమీలేదు ! అంటే -
స్వప్నంలో కల్పిత పదార్థాలవల్ల భోగం లభిస్తోంది. అట్లాగే జాగ్రత్తులో
అసత్యపదార్థాలవల్ల కూడా భోగాన్ని అంగీకరించాలి.ఈ విధంగా మిథ్యాపదార్థాలవల్ల కూడా భోగం లభిస్తోంది కదా!
అసత్యములైన స్వప్నవిషయములచే అనల్పమైన ఆనందానుభవము కలుగుచున్నది.
జాగ్రద్విషయములు కూడా అట్లే అసత్యములైన
భోగమును ,
సుఖదుఃఖానుభవమును కల్పించునని భావము.
విద్య అనేది భోగ్యపదార్థాలను కప్పివేస్తే - ఇది రజితంకాదు అనే ఈ విధమైన నిషేదించే జ్ఞానంలాగా కనిపించే భోగ్యపదార్థాల స్వరూపాన్ని కప్పివేసినప్పుడే దానిని(విద్యను) ప్రారబ్ధాన్ని నశింపజేసేది అని అనగలుగుతాం.
ఎందుచేతనంటే అది - విద్య, ప్రారబ్ధకర్మఫలమైనట్టి
సుఖదుఃఖాలతో కూడిన జగత్తుకు విరోధికాదు.
జ్ఞానము జాగ్రవస్థనే తొలగింపగలిగినచో అపుడు ప్రారబ్ధమును నశింపజేయగలుగును.
అయితే "జగత్తుమాయ"అని తెలుసుకొన్నంత మాత్రంచేతనే జగత్తు యొక్క స్వరూపం నశించదు - నష్టంకాదు.
పాఠశాలలో పాఠం
విని - చదివినంతనే ఇంకొక తరగతికి వెళ్ళడానికి అది సరిపోతుందా ? కాదుకదా !
పరీక్షలుకూడా రాసి ఉత్తీర్ణుడవ్వాలిగా !
ఇంద్రజాలంలో కూడా స్వరూపం నష్టమయ్యేదాకా మిధ్యత్వ జ్ఞానం ఉంటోంది -ఇది మాయ,కనికట్టు అని మనకు తెలిసినంతనే ఇంద్రజాలంలోని వస్తువు మరుగున పడటం లేదు.
దీనినే విపులీకరించిన -
ప్రేక్షకులు,
ఇంద్రజాల స్వరూపం - ఇంద్రజాలికుడు సృష్టించిన వస్తువులు మరుగున పడకపోయినా -
కళ్ళకు ఆ వస్తువులు కనిపిస్తూనే ఉన్నా -
ఇది మాయ(ఇంద్రజాలం) అని
తెలుసుకుంటూనే ఉన్నారు.
అట్లాగే,భోగ్యపదార్థం నష్టం కాకపోయినా ఈ సంసారం మిథ్య అనే జ్ఞానం కలగటం సంభవమే.
ఇంద్రజాలము కల్పితమను జ్ఞానము జనులకున్నను ఆ జ్ఞానము ఇంద్రజాల ప్రదర్శనమును తొలగింపదు. అట్లే జగన్మిథ్యత్వజ్ఞానము ఉన్నను అది - ఆ మిథ్యావిషయముల అనుభవమును తొలగింపదు అని భావము.
యత్ర త్వస్య జగత్ స్వాత్మా పశ్యేత్కస్తత్ర కేన కమ్ ౹
కిం జిఘ్రేత్కిం వదేద్వేతి శ్రుతౌతు బహు ఘోషితమ్
౹౹181౹౹
తేన ద్వైత మపహ్నుత్య విద్యోదేతి న చాన్యథా ౹
తథా చ విదుషో భోగః కథం స్యాదితి చేచ్ఛృణు
౹౹182౹౹
ద్వైతమే లేక ఈ జగత్తంతా ఆత్మగా దర్శించిన జ్ఞాని దేనినిదేనిచో చూడగలడు, ఘ్రాణింపగలడు అని శ్రుతి బహుధాహోషించినది.
సుషుప్తి విషయా ముక్తివిషయా వా శ్రుతిస్త్వితి ౹
ఉక్తం స్వాప్యయ సంపత్తోర్యితి సూత్రే హ్యతిస్ఫుటమ్
౹౹183౹౹
శ్రుతి సుషుప్తి,ముక్తి స్థితులను మాత్రమే చెప్పి,జీవన్ముక్తి దశను చెప్పుటలేదు.
వ్యాఖ్య:-"జ్ఞాని" యైనవానికి ఈ సమస్తము ఆత్మస్వరూపమైపోయి నప్పుడు చూచే వాడెవడు ?
ఏ నేత్రాలతో చూస్తాడు ? లేదా ,
అతడు చూడటం, వినటం,వాసన చూడటం,
మాట్లాడటం,స్పృశించటం మొదలైన భోగ్యవిషయాలు మాత్రం ఏమి మిగిలి ఉంటాయి"? అని శంకించవచ్చు !
శ్రుతుల్లో కూడా అనేక చోట్ల ఈ తథ్యాన్ని చెప్పారు.
కనుక ద్వైతము తొలగించే జ్ఞానము కలుగును.
మరొక విధమున కాదు.
ఇందువల్ల ద్వైతం మరుగున పడటంతోనే విద్యోత్పత్తి జరుగుతుందనీ, ఇటువంటి స్థితి లభించినప్పుడు జ్ఞానియైనవానికి భోగమనేది -విషయానుభవము ఎట్లా ఉండగలుగుతుంది?
"ఇదం సర్వం..."అనే శ్రుతి, "సుషుప్తి"విషయమై చెప్పినదా ?
"ముక్తి"విషయమై చెప్పినదా ? అనే శంకకు సమాధానంగా బ్రహ్మసూత్రాల్లో "స్వాప్యయ సంపత్త్యోరన్యతరాపేక్షమావిష్కృతం హి"-బ్ర.సూ.4-4-16
లో స్పష్టం చేేయబడ్డది.
అంటే - "సుషుప్తి అవస్థ , సంపత్తి(మోక్షం)" ఈ రెంటిలో ఏదో ఒకదానితోనే పురుషునికి విశేష విజ్ఞానం కలుగదు అని శ్రుతులు చెపుతున్నాయి.
ఈ విధంగా ఈ సూత్రం సుషుప్తిని వర్ణిస్తోందా ?
లేక మోక్షాన్నా ?
దీనిలో ఎక్కడా "విద్య" ద్వారా జగత్తు మరుగునపడటం అనేది వ్యక్తం కావటం లేదు.
శ్రుతి సుషుప్తి అవస్థను గూర్చియు ముక్తి స్థితిని గూర్చియు చెప్పుచున్నదని బ్రహ్మసూత్రములలో(4.4.16) స్పష్టముగ వివరించబడినది. జీవన్ముక్తి దశను గూర్చి చెప్పుట లేదని భావము.
బృహదారణ్యక ఉపనిషత్తు - 2.414;
ఈశావాస్యోపనిషత్తు -7 ;
ఛాందోగ్య ఉపనిషత్తు -
7.24.1 -
ఉపనిషత్తులు ఏంచెపుతున్నాయంటే -
ద్రష్ట దృష్టి దృశ్యము ముగ్గురూ ఒకటైనప్పుడు సత్యం కనిపిస్తుంది.అంటే మనం అధ్యయనం చేస్తున్న
అంశతో మమేకం కావడం. అదేమనంగా మారడం.
ద్వైతమును తొలగించడమే
జ్ఞానము - అనగా
ద్రష్ట దృష్టి దృశ్యము ఏవీ మిగులనిదే "ఆత్మసాక్షాత్కారము".
నీవు,నేను,తాను,ఇతరుడు అను వృత్తులు ఎక్కడలేవో, "సంకల్పరూప జ్ఞానము" కొంచెము కూడా ఎక్కడలేదో, సర్వము శాంతించినట్టిది, నిరాలంబమైనది,అనాభాసమైనది,అనామకమైనది,
కారణములేనిది -
అదే"ముక్తి"- అదే"మోక్షము".
సర్వపదార్థములకు "సత్త" అయినది, అదేతప్ప అన్యములేనిది -
ద్రష్ట,దృశ్యము ఆమద్యలో నున్న దృష్టి దేని స్వరూపమో -
అదియే ద్రష్ట,దర్శనము,దృశ్యము ఇత్యాదులు లేని "పరమపదము".
(మనం ఒక దృశ్యాన్నిగాని వస్తువునుగాని చూడటమనే ప్రక్రియ మొదలైనప్పుడు,ఆ దృశ్యము లేదా వస్తువుయొక్క దృశ్యజ్ఞానము మనకు లభించేలోపు,ఆ దృశ్యము లేదా వస్తువుకు - చూచేవారికి ,చూడడమనే
ప్రక్రియకు సంబంధం ఏర్పడుతుంది.ఆ సంబంధం ఏర్పడేలోపు మద్యలో వచ్చే ఎడమ - జాగాలో మనదృష్టి ఎక్కడైతే వుంటుందో అదే త్రిపుటి. అంటే
ద్రష్ట దృశ్యము దర్శనము ఇత్యాదులులేని
"పరమపదము".
చిత్తము ఒకచోటనుండి మరియొక చోటికి పరిగిడుచుండగా ఏతన్మధ్యమున నుండు చిత్తమునకు ఏది స్వరూపమో,
జడముగా ఉండుటగాని, గ్రహించుటగాని,భావించుటగాని లేనిదో అదే"పరమపదము".
నిరంతరము వచ్చే ఆలోచనా ప్రవాహంలో రెండుభావాల మధ్య కాళీనే -
మనస్సు పనిచేయని స్థితి అదే "అమనస్క యోగం".ఇలా నిరంతరంగా సమాధి అవస్థలో ఉండడమే పరమపదం.
జడమగు స్థితినివీడిన శిలాహృదయమే అది - "ఆత్మస్థితి".
"సర్వమూ పరబ్రహ్మమే"!
చైతన్యరూపములో తనదేహమందును,
సర్వ దేహాలు,సకల జీవరాసుల లోనూ ఇతర పదార్థాలను "పరబ్రహ్మగా" చూడడమే
"విశ్వరూప సందర్శనము".
No comments:
Post a Comment