Tuesday, February 4, 2025

 Vedantha panchadasi:
స్థితోఽ ప్యసౌ చిదాభాసో బ్రహ్మణ్యేకీభవేత్పరమ్ ౹
నతు బ్రహ్మణ్యతిశయం ఫలం కుర్యాద్ఘటాదివత్ ౹౹94౹౹

94. చిదాభాస ఘటాదుల విషయములో వలె విశేష ఫలమును ఈయజాలదు. బ్రహ్మముకంటే భిన్నముగ భాసింపజాలదని భావము.

అప్రమేయ మనాదించేత్యత్ర శ్రుత్యేదమీరితమ్ ౹
మనసై వేదమాప్తవ్యమితి ధీవ్యాప్తతా శ్రుతా ౹౹95౹౹

95.  బ్రహ్మము చిదాభాసచే తెలియబడదనుట
'అప్రమేయమనాదించ' అనే శ్రుతివాక్యము ప్రమాణీకరించుచున్నది.
'మనసై వేదమాప్తవ్యం' అనే శ్రుతి బుద్ధిచే తెలియబడుటను ప్రమాణీకరించుచున్నది.



95.

వ్యాఖ్య:- బుద్ధి,బుద్ధివృత్తులు చిదాభాసకంటె 
విశిష్ట స్వభావంకలవి. అందుచేత ఘటాదుల్లాగానే బ్రహ్మమందుకూడా బలవంతంగా ఫలవ్యాప్తి జరగాలికదా ! అనే ఆ శంకకు సమాధానం -

ఘటాకారవృత్తిలాగానే బ్రహ్మను ప్రత్యక్షం కావించుకొనే వృత్తుల్లో కూడా,అంతఃకరణ పరిణామాల్లో కూడా చిదాభాస స్థిరంగా ఉంటుంది.కాని బ్రహ్మము కంటె వేరుగా దాని (చిదాభాస యొక్క) ప్రతీతి ఉండదు.బ్రహ్మమునందే లీనమగును.అది బ్రహ్మము యొక్క ఛాయయే గనుక.
ప్రచండమైనట్టి ఎండలో ఉన్న దీపకాంతిలాగా దానిలో కలిసిపోయి ఉంటుంది.
స్ఫురణరూపమైన లక్షణం కలిగినట్టి ప్రత్యేకమైన అతిశయఫలాన్ని కలిగించలేదు.
ఘటాదులకంటే భిన్నముగ భాసించినట్లు బ్రహ్మముకంటే భిన్నముగ భాసింపజాలదని భావము.

'నిర్వికల్ప మనన్తం చ హేతుదృష్టాంత వర్జితమ్.
అప్రమేయ మనాదించ మజ్ఞాత్వా ముచ్యతే బుధః' 
అమృతబిందు.9. 

 - బ్రహ్మము ప్రమాణానికి విషయం కానిది - ఫలవ్యాప్తిరహితమైన దన్నమాట !
అనంతము,అనాది అయినది.
అంటూ శ్రుతి, బ్రహ్మకు ఫలవ్యాప్తి రాహిత్యాన్ని చెప్పింది.

ఈ బ్రహ్మతత్త్వము అనేది 'మనసైవేద మాప్తవ్యం నేహనానాస్తి కించన'  
బృ.4-4-19,
మనస్సు,బుద్ధితో తెలియబడుటను 
(అజ్ఞాన నివృత్తి వరకు) బ్రహ్మయొక్క వృత్తి విషయత్వాన్ని గురించి ప్రమాణీకరించుచున్నది.

ఆత్మానం చేద్విజానీయాదయమస్మీతి వాక్యతః ౹
బ్రహ్మాత్మ వ్యక్తి ముల్లిఖ్య యోబోధః సోఽ భిధీయతే ౹౹96౹౹

96. బ్రహ్మము ఆత్మల ఐక్యతను గూర్చి కలుగు బోధనే అపరోక్షజ్ఞానము.

అస్తు బోధోఽ పరోక్షఽ త్ర మహావాక్యాత్తథాప్యసౌ ౹
న దృఢః శ్రవణాదీనామాచార్యైః పునరీరణాత్ ౹౹97౹౹

97. మహావాక్యములచే కలిగిన బ్రహ్మబోధ దృఢపడుటకు శ్రవణాదులు విధించిరి.

అహం బ్రహ్మేతి వాక్యార్థబోధో యావద్థృఢీభవేత్ ౹
శమాది సహితస్తావదభ్యసే చ్ఛ్రవణాదికమ్ ౹౹98౹౹

98. 'అహం బ్రహ్మాస్మి' బోధ దృఢపడు వరకు శమాది గుణములతో కూడా శ్రవణాదులను అభ్యసింపవలెను.

బాఢం సంతి హ్యదార్ధ్యస్య హేతవః శ్రుత్యనేకతా ౹
అసంభావ్యత్వ మర్థస్య విపరీతా చభావనా ౹౹99౹౹

99. విరుద్ధములగు వాక్యములు సంశయములు వలన బోధ అదృఢమగును.

వ్యాఖ్య:-ప్రత్యగాత్మ స్వరూపాన్ని, సత్యత్వాది లక్షణాలుగల బ్రహ్మానికి అభిన్నమైనదానినిగా 
"నేను బ్రహ్మను" అనే స్వస్వరూప సాక్షాత్కారజ్ఞానం కలగటాన్నే అపరోక్షజ్ఞానం అంటారు.

 'పురుషుడు తన ఆత్మను పరమాత్మయే గదా అని తెలిసికొనినచో '- అనే శ్రుతి వాక్యము బ్రహ్మము ఆత్మల ఐక్యతను గూర్చి కలుగు బోధనే 
తెలుపుచున్నది.అదే 
'అపరోక్షజ్ఞానము'.ఇదే 'ఆత్మానం చే ద్వజానీయాత్' బృ.4-4-12 అనే శ్రుతిలో వర్ణింపబడ్డది.

ఇక జ్ఞానందృఢమవడానికి శ్రవణ మననాదుల అభ్యాసం అవసరం ఎంతైనావుంది.
మహావాక్యములచే బ్రహ్మబోధ కలిగినా అది దృఢముగ ఏర్పడదు.కనుకనే 
శ్రీ శంకరభగవత్పాదులు శ్రవణాదులను విధించిరి.

మహావాక్యాలవల్ల 
'జీవాత్మ అనేది బ్రహ్మకంటే భిన్నమైనదికాదు' -  అనే బ్రహ్మాత్మైక్యజ్ఞానం కలుగుతుంది.  నిజమే !
కానీ , జ్ఞానం దృఢంగా స్థిరంగా ఉండదు.
ఆ జ్ఞానం స్థిరపడటానికై వాక్యార్థ జ్ఞానం తరువాత మాటిమాటికి శ్రవణ , మననాదులను అభ్యాసం చేయాలి అని 
"ఆవృత్తి రసకృదుపదేశాత్" -బ్ర.సూ. 4-1-1 లో చెప్పబడ్డది.

"అహం బ్రహ్మాస్మీ" - 
"నేను బ్రహ్మను" అనే జ్ఞానం బాగా దృఢపడేంతవరకు శమము,దమము,తితిక్ష మొదలైనవాటితోబాటు 
శ్రవణ,మనన,నిది,ధ్యాసనాది సాధనాల ఆవృత్తి - అభ్యాసం 
జరుగుతూనే ఉండాలి అని 
శ్రీ శంకరులు చెప్పారు.

ఉపనిషద్వాక్య ప్రమాణాలతో కలిగిన జ్ఞానం దృఢంకాకుండా ఎందుకుంటుంది ? 
అనే ఆక్షేపానికి సమాధానం -

బోధ అదృఢమగుటకు కారణములు గలవు. విరుద్ధములుగ కన్పించు శృతి వాక్యములు,బ్రహ్మాత్మైక్యము అసంభవమను సంశయము విపరీతమగు ఆలోచనలు (కర్తృత్వబోధను కల్పించునవి)

శ్రుతిగత వైవిధ్యం - 
శ్రుతులు అనేక విధాలుగ ఉండటం - అనేది సంశయం కలగటానికి మొదటి కారణం.

అఖండము ఏకరసము అద్వితీయము అయిన బ్రహ్మము అలౌకికమైనందున ప్రమేయగతమైన సంశయానికి సంబంధించిన వైషమ్యం (అర్థానికి సంబంధించిన ప్రతీతి అసంభవమవటం) అనేది రెండవ కారణం.

కర్తృత్వాది అభిమానంవల్ల కలిగే విపరీత భావన మూడవ హేతువు.

ఇలా సంశయము కలగటానికి జ్ఞానం దృఢం కాకపోవటానికి కారణాలు కనిపిస్తున్నాయి. కాబట్టి అపరోక్షజ్ఞానం దృఢపడటానికి శ్రవణాది సాధనాల ఆవృత్తి అవసరమౌతోంది. 

No comments:

Post a Comment