☘️🍁 ఆప్తవాక్యాలు 🍁☘️
122. వినాశే బహవో దోషాః జీవన్ భద్రాణి పశ్యతు
చనిపోవడంలో చాలా దోషాలున్నాయి . జీవించి ఉంటే చాలు శుభాలను చూడవచ్చు (వాల్మీకీరామాయణం)
దేనిమీదైనా విరక్తి పుట్టవచ్చేమోగానీ, జీవితం మీద విరక్తి కలగకూడదు. బ్రతుకు తీపి అనేదే ఒక అద్భుతం! మనం 'అల్పం' అనుకున్న క్షుద్రజీవిలో సైతం ఈ 'తీపి' ఉంటుంది. చీమ మొదలు సార్వభౌముని వరకు సమానంగా విస్తరించినది ఈ
బ్రతుకు తీపి.
జీవితానికి ఉన్న విలువ అపారం - లౌకికమైన ప్రయోజనాలతోపాటు, అలౌకికమైన పరమార్థాన్ని సాధించే గొప్పతనం 'జీవితం' అనే అంశంలో ఇమిడి ఉంది.
జీవితాన్ని అందంగా, ఆనందంగా, సమృద్ధిగా అనుభవించడానికి కావలసిన నైతిక సూత్రాలు, నియమాలు, అభ్యాసాలు ఏర్పరచారు మన మహర్షులు.
“ఆరోగ్యవంతమైన శరీరంలో మంచి మనస్సు ఉండాలి. ఈ రెండిటినీ సాధించడమే అసలైన ప్రయోజనం" అన్నది స్పష్టమైన నిర్వచనం. అందుకే ఎప్పుడూ జీవితంపై రోత కలగకూడదు. ఈ అవగాహన లేక క్షణికోద్రేకాలకు లోనైనవాడు బ్రతుకునే
పూర్తిచేసుకోవాలనుకుంటాడు. జీవితంలో అర్థంలేని పరుగులు పెడుతూ, 'ప్రశాంతత' అనే స్వాభావిక స్థితిని కోల్పోవడం చేత అవగాహన అనేది లేకుండా బతుకు సంపదని
పోగొట్టుకుంటున్నాం.
హనుమంతుడు ఎంతో ఆత్మవిశ్వాసంతో, ఆశతో సీత జాడ గ్రహించేందుకు లంకలో ప్రవేశించాడు. అంతా వెతికాడు. ఇంక వెతకవలసినదేది లేదనేంతగా సర్వమూ గాలించాడు. కానీ సీతమ్మ జాడ కానరాలేదు. అప్పుడు అతనిలో ప్రవేశించింది నిరాశ. దానితో నిస్పృహ! క్రమంగా పరిణామాలను ఊహించాడు. ఏ సమాచారమూ
లేకుండా వట్టి చేతులతో తిరిగివేళితే రాముడు, సుగ్రీవుడు అందరూ హతాశులౌతారు.అందుకే తిరిగి వెళ్ళడం కన్నా, ఇక్కడే ఆత్మహత్య చేసుకుంటే మేలు అనిపించింది.
కానీ బుద్ధిమంతుడు కనుక తక్షణం ఆ బలహీనత నుంచి బయటపడ్డాడు. సక్రమంగా ఆలోచించాడు. “చనిపోవడంలో చాలా దోషాలున్నాయి. జీవించి ఉన్నవాడు శుభాలను చూడగలడు" అనుకున్నాడు.
ఒకొక్కసారి అంతా శూన్యమే అనిపిస్తుంది. కానీ ఆ క్షణం దాటితే అంతా మేలే కలగవచ్చు. ఈ లోపల తొందర పడి మృత్యువుని స్వాగతిస్తే, ఆ శుభాలన్నీ అందుకొనే అవకాశమే మిగలదు. ఈ వాక్యంలో ఆత్మబలాన్ని పుంజుకున్న హనుమ ఆశావాదం
ఫలించింది. అశోకవనం కనిపించింది. సీత జాడ దొరికింది. ఆశావాదానికున్న
సత్ఫలం అది. అలలా వచ్చిన దిగులే అంతా కాదు.
మరణిస్తే దేహాన్ని కోల్పోతాం కానీ మరో ఉపాధితో జీవించిక తప్పదు. అప్పుడు ఇప్పటి ఆత్మహత్యా పాపఫలాన్ని సైతం అనుభవించవలసిందే.
'శాశ్వత శాంతి' అనే సముద్రాన్ని చేరుకునేందుకు ఈ జీవితాన్ని
వినియోగించుకోవాలి. జ్ఞానాన్ని సంపాదించాలి. తన కుమారులందరూ విశ్వామిత్రుని
కారణంగా మరణించినప్పుడు, భూదేవి బోధతో క్షణికోద్రేకం నుంచి బయటపడ్డ వసిష్ఠుడు తపస్సు చేసి శివసాక్షాతారం పొంది, ఆ విశ్వగురువు ప్రసాదించిన
బ్రహ్మజ్ఞానంతో సుస్థిర శాంతిని పొందుతాడు. ఇలా ధార్మికంగా, లౌకికంగా,తాత్వికంగా ఆలోచించినా జీవితానికన్నా విలువైనది లేదు.
ముందు మనం - అటు తరువాతే లోకం. బయట వస్తువులపై, వ్యక్తులపై
మమకారం, ఆశ పెంచుకొని అవి కోల్పోతే బతుకునే బలి చేసుకొనడం మూర్ఖత్వం.బయట వస్తువు లభించక ముందూ మనం ఉన్నాం. అది పోయినా ఉంటాం.మనల్ని నాశనం చేసుకొనే హక్కు మనకే లేదు. 'ఓర్చినమ్మకి తేటనీరు' అన్నట్లు
సహనానికి ఫలం సౌభాగ్యమే!
No comments:
Post a Comment