*మహా శివరాత్రి*
మాఘమాసం అంటే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది మహాశివరాత్రి పర్వదినం.
_శివరాత్రి లింగోద్భవ ఘట్టాల గురించి తెలుసుకుందాము_
ఒకప్పుడు బ్రహ్మ తన సృష్టి ఎలా ఉన్నదో చూద్దామని లోకసంచారానికి బయలుదేరాడు.
ఆయనకు క్షీరసాగరంలో శేషతల్పగతుడై ఉన్న శ్రీ మహావిష్ణువు కనపడ్డాడు,
కాలప్రభావం వలన బ్రహ్మ రజోగుణాన్ని పొంది, శ్రీహరిని లేచి నిలబడి తనకు నమస్కరించమని, హరి తన పుత్రుడని పలికాడు.
నా నాభీపుండరీకం నుంచి పుట్టావు కనుక నీవే నా పుత్రుడవనీ, నీవే నాకు నమస్కరించాలి అని విష్ణువన్నాడు, వాదోపవాదాలు పెరిగాయి.
బ్రహ్మవిష్ణువులు యుద్ధానికి సిద్ధమయ్యారు, హంసవాహనం ఎక్కి బ్రహ్మ హరిపై పాశుపతాస్త్రం వేసాడు.
శ్రీహరి గరుడవాహనం ఎక్కి బ్రహ్మపై మహేశ్వరాస్త్రం వేసాడు.
ఆ రెండు అస్త్రాలు ఘోరంగా ఒకదానినొకటి ఢీకొట్టి, వెనుకకువెళ్ళి, మరలా ముందునకు వచ్చి ఢీ కొడుతుండడంతో పెద్ద పెద్ద శబ్దాలతో, వేడిగాల్పులతో అగ్నిజ్వాలలు పుట్టి లోకాలను దహించడం మెుదలుపెట్టాయి, అకాలప్రళయం ఏర్పడింది.
ఈ ఘటనకు భీతిల్లిన దేవతలు శివునివద్దకు వెళ్ళి రక్షించమని మెురపెట్టారు, అప్పుడు శివుడు దేవతలకు అభయం ఇచ్చి, బ్రహ్మ విష్ణువులు యుద్ధం చేస్తున్న చోటకు వెళ్ళాడు, వారిద్దరి మధ్య నిలబడ్డాడు.
శ్లో || మహానల స్తంభ విభీషణాకృతిః !
బభూవ తన్మధ్యతలే సనిష్కలః !!
బ్రహ్మ విష్ణువుల యుద్ధం ఆపి, వారి అస్త్ర ప్రభావం అణచడానికి, శివుడు వారిద్దరి మధ్య, ఒక మహా భయంకరమైన అగ్నిస్తంభంగా మారి నిలబడ్డాడు.
బ్రహ్మ విష్ణువుల అస్త్రాలు ఆ అగ్నిస్తంభములో లీనమైపోయాయి, యుద్ధం ఆగిపోయింది. ప్రపంచప్రళయం ఆగింది, జగత్తులకు శాంతి చేకూరింది, లోకశ్రేయస్సుకోసం శివుడు ధరించిన అగ్నిస్తంభమే మెుట్టమెుదటి శివలింగం.
అది ఆవిర్భవించిన స్థలం అరుణాచలంగా ప్రసిద్ధిని పొందింది.
శివుడు బ్రహ్మ విష్ణువులకు స్వస్వరూపంతో అగ్నిస్తంభము నుండి దర్శనం ఇచ్చి వారితో ఇలా అన్నాడు.
శ్లో || దినమేతత్ తతః పుణ్యం భవిష్యతి మహత్తరమ్ !
శివరాత్రిరితి ఖ్యాతా తిథిరేషా మమప్రియా !!
"ఈ దినము మహత్తరమైనది, పుణ్యదినం, శివరాత్రిగా పిలవబడుతుంది."
"ఈ తిథి నాకు చాలా ఇష్టం, నేను శివలింగాకృతి ధరించిన ఈ మాసం అత్యంత పవిత్ర మాసమౌతుంది".
ఇంకా "శివలింగం లోకానికందించబడిన మాఘం - పుణ్యామోఘం " అని నారదుడు లింగరూపాన్ని ప్రశంసిస్తాడు.
లింగం సగుణము మరియు నిర్గుణము కూడా.
శివరాత్రి నాడు రాత్రి 12 గంటలకు మీ యుద్ధం ఆపడానికి లింగం రూపం ధరించాను, కనుక
ఈ కాలమును లింగోద్భవ కాలము అని అంటారు.
ఈ లింగోద్భవ కాలములో తనను అర్చించిన వాళ్ళు శాశ్వతంగా కైలాసములో నివసిస్తారు.
వారికున్న ఈతి బాధలు తొలగి పోతాయి అని పరమశివుడు వరమిచ్చాడు.
శివరాత్రి నాడు ఉపవాసం ఉండి, శివలింగాన్ని పూజించాలి.
జాగరణ చేసి, లింగాన్ని అభిషేకించండి అన్నాడు శివుడు.
శివరాత్రి నాడు లింగం రోజంతా పూజించవచ్చు, సూర్యోదయము నుంచి మళ్లీ సూర్యోదయము వరకు ఎప్పుడైనా పూజించవచ్చు.
కాని అర్ధరాత్రి 12 గంటలకు లింగోద్భవ కాలములో ఈశ్వరుడిని పంచామృతాలతో, జలధారలతో అభిషేకించండి. సర్వశుభాలు కలుగుతాయి.
శివరాత్రి నాడు బ్రాహ్మీ ముహూర్తంలో నదిలో కానీ, సముద్రంలో కానీ, నూతి దగ్గర కానీ సంకల్ప పూర్వకంగా స్నానం చేయాలి.
ఆచమనము చేసి, విభూతి తప్పక పూసుకోవాలి, రుద్రాక్షలు ధరిస్తే మంచిది.
ఆ తరువాత గణపతిని పూజించాలి, పగలు, రాత్రి కూడా షోడషోపచారాలతో పూజించాలి.
నమకచమకాలతో లేదా మహన్న్యాసం పెట్టుకుని, రుద్రాధ్యాయము వింటూ అభిషేకించండి.
జలంతోపాటు, పంచామృతాలతో, పాలతో, నెయ్యి, పంచదార, తేనె, ఆవు పెరుగుతో అభిషేకించి కొంచెం తీర్థముగా తీసుకుంటే ఆయువు పెరుగుతుంది.
దారిద్ర్యము తొలగిపోతుంది, అకాలమరణం ఉండదు, మనశ్శాంతి లభిస్తుంది,
ఫలరసాలతో అభిషేకించిన తరువాత జలధారలతో అభిషేకించాలి.
పసుపుకుంకుమలజలంతో అభిషేకిస్తే సౌభాగ్యం లభిస్తుంది, గంగాజలం మరీ మంచిది.
అభిషేకం అయ్యాక తుడిచి పువ్వులతో పూజించడం మంచిది, శివుడిని పసుపు పచ్చని పూలతో, తెల్లని పూలతో పూజించడం మంచిది,
శివ మానస స్తోత్రం చేయాలి, *ఓం నమఃశివాయ* అనే పంచాక్షరీ మంత్రంతో అర్చన చేయడం మంచిది...
ధూపము, దీప, నైవేద్యం ఉండి తీరాలి.
పంచ ఉపచారములు చేయాలి, లింగోద్భవ కథను చెప్పుకోవాలి.
అర్థరాత్రి 12 గంటలకు అభిషేకం చేసిన తరువాత హారతి ఇచ్చి, 12గంటల నుంచి 3 గంటల వరకు శివపురాణ గాథలు వింటూ జాగరణ చేయాలి.
ఈ రోజు ఉపవాసం ఉండి పళ్ళు, పాలు తీసుకోవచ్చును, మరునాడు స్నానం చేసి దానము చేయాలి.
వ్రతము చేసిన వాళ్ళు పేదలకు స్వయంపాకం, ఆన్నదానం చేస్తే, చేస్తే సంపూర్ణ ఫలితం పొందుతారు.
శివాలయానికి వెళ్ళి ప్రదక్షిణము చేస్తే మంచిది.
*_🌿శుభమస్తు🌿_*
No comments:
Post a Comment