Vedantha panchadasi:
దేహవాగ్బుద్ధయస్త్యక్తా జ్ఞానినానృతబుద్ధితః ౹
కర్మీ ప్రవర్తతా మాభిర్జ్ఞానినో హీయతేఽ త్ర కిమ్
౹౹275౹౹
ప్రవృత్తిర్నోపయుక్తా చే న్నివృత్తిః క్వోపయుజ్యతే ౹
బోధహేతు ర్నివృత్తిశ్తేద్ బుభుత్సాయాం తథేతరా
౹౹276౹౹
అసత్యముల యందు కర్మి ప్రవర్తించినచో జ్ఞానికి పోవునదేమి ?
వ్యాఖ్య :- దేహము,వాక్కు,మనస్సు,బుద్ధి
వీటినన్నింటిని అసత్యములు,మిథ్య అనే భావముతో జ్ఞాని వాటిని త్యజించెను.
కర్మిష్ఠియైనవాడు వాటిని
(ఆ దేహవాగ్భుద్ధ్యాదుల్ని))
గ్రహించి కర్మానుష్ఠానంలో ప్రవృత్తుడైతే అందువల్ల జ్ఞానికి కలిగే హాని ఏముంది ? అతనికి అభ్యంతరం ఉండదని భావం.
(సంశయము)"జ్ఞానియైనవానికి ప్రవృత్తివల్ల ఏమీ ఉపయోగం లేనప్పుడు,
(సమాధానము)నివృత్తివల్ల మాత్రం ఏమి ఉపయోగం ఉంటుంది ?".
అని ప్రతిపక్షులు అడగవచ్చు.
(సంశయము)అట్లాగే నివృత్తి అనేది జ్ఞానానికి
కారణము - సహాయకారి.
(సమాధానము)శుభకర్మలందు కలిగే ప్రవృత్తికూడా
చిత్తశుద్ధి,వైరాగ్యాలద్వారా సహాయకారిగా జిజ్ఞాసకు కారణమైనందున - అవి జ్ఞానికి ఉపయోగిస్తాయిగదా ! అనవచ్చు.
జ్ఞానికి ప్రవృత్తి వలనగాని నివృత్తి వలనగాని ప్రయోజనము లేదు.
అవి మిథ్యయగు శరీరత్రయమునకే గాని సత్యమగు సాక్షికి కాకపోవుట చేత.
అజ్ఞానికి ప్రవృత్తి వలన క్రమముగా చిత్తశుద్ధి కలిగి నివృత్తికి అర్హత కలుగును.
నివృత్తి ద్వారా జిజ్ఞాస తీవ్రతరమై జ్ఞానప్రాప్తి కలుగును.
ప్రవృత్తి అనగా సత్కర్మాచరణమని అర్థము,
దుష్కర్మను శాస్త్రము నిషేధించుట చేత తీవ్రమగు జిజ్ఞాస కలుగు వరకు సత్కర్మ చేయవలసినదేనని ఆచార్యులందరూ అంగీకరించిరి.
బుద్ధశ్చేన్న బుభుత్సేత నాప్యసౌ బుధ్యతే పునః ౹
అబాధాదనువర్తేత బోధో న త్వన్యసాధనాత్
౹౹277౹౹
నావాద్యా నాపి తత్కార్యం బోధం బాధితుమర్హతి ౹
పురైవ తత్త్వబోధేన బాధితే తే ఉభే యతః
౹౹278౹౹బాధితం దృశ్యతామక్షెస్తేన బాధో న దృశ్యతే ౹
జీవన్నాఖుర్న మార్జారం హన్తి హన్యాత్కథం మృతః
౹౹279౹౹
అపి పాశుపతాస్త్రేణ విద్ధః చేన్న మమారయః ౹
నిష్ఫలేషు వితున్నాంగో నఙక్ష్యతీత్యత్ర కా ప్రమా
౹౹280౹౹
(సంశయము)బోధ కలిగినచో బోధ కలుగవలెనని కోరడు గదా.(సమాధానము)ఒకసారి బోధ కలిగిన పిమ్మట మరల కలుగు బోధ ఏమీ లేదు.
వ్యాఖ్య :- తత్త్వజ్ఞానాన్ని పొందిన ప్రబుద్ధునికి ఇక జిజ్ఞాస అనేది ఉండదు. అందుచేత ప్రవృత్తి యందు అతనికి ఆపేక్ష ఉండదు,ప్రవృత్తి అనవసరము.
ఇక పొందాల్సిన జ్ఞానమూ ఉండదు.కాబట్టి అతనికి బోధ స్థిరముగ ఉండుటకు బాధకములు లేకుండవలెను గాని నివృత్తికి అవసరమయ్యే ఇతర సాధనాల అగత్యం ఉండదు.
మహావాక్యజనితమైన జ్ఞానముచే బాధకములు తొలగుట వలన బోధ స్థిరముగా ఉండును.ఇక అతని జ్ఞానానికి కలిగే హాని ఏమీ ఉండదు.కాబట్టి అతని జ్ఞానం స్థిరంగా ఉండటానికై నివృత్తి రూపమైన ఏ ఇతర సాధనమూ అవసరం లేదు అని భావం.
అవిద్యవల్ల కర్తృత్వాది అధ్యాసాలవల్ల జ్ఞానానికి హాని కలగవచ్చుగదా ! అంటే -
అవిద్యవల్లగాని, దాని కార్యరూపమైన ద్వైతజ్ఞానం వల్లగాని అతని తత్త్వజ్ఞానాన్ని బాధింపలేవు.అతని జ్ఞానానికి హాని ఉండదు.
ఎందుచేతనంటే -
తత్త్వజ్ఞానంవల్ల ముందుగానే అవిద్య,ద్వైతజ్ఞానం ఆ రెండూ
నష్టమైపోయినాయం కాబట్టి!
జ్ఞానికి జ్ఞానోదయమైనంతనే అవిద్యా తమస్సు శాశ్వతముగ నిర్మూలింపబడును.
అవిద్య నశించినా,దానికి కార్యరూపాలైన అధ్యాసాదుల ప్రతీతి పోవటం అనేది అసంభవం ! అంటే -
బాధితమైపోయిన(నష్టమైపోయిన)ఇంద్రియాలద్వారా ద్వైతజగత్తును ఎంతగా చూస్తేమాత్రం ఏమినష్టం ?.
జ్ఞానముచే మిథ్య అని తెలియబడిన ద్వైతప్రపంచమును ఇంద్రియములు చూచుగాక,
అనుభవించునుగాక అట్టి దర్శనము - అనుభవము -
తత్త్వజ్ఞానమును స్పర్శింపజాలవు.అందువల్ల జ్ఞానం ఏమాత్రమూ నష్టం కాదు.ఎట్లాగంటే -
ఎలుక బ్రతికి ఉండగాన పిల్లిని చంపలేదుకదా !
ఇక చచ్చిన ఎలుక పిల్లిని ఎట్లా చంపుతుంది ?
బాధితమై పోయిన ఇంద్రియాలు మృతమూషికం లాంటివి.
పాశుపతాస్త్రం ప్రయోగించినను గాయపడని బలిష్టుడు,మలుకులేని బాణముతో మరణించుననే మాట నమ్ముట ఎట్లు? లోహనిర్మితమైన బాణంచేత లేక కేవలం బాణంలేని ధనుష్టంకారం చేత ఎట్లా దెబ్బతగిలి చస్తాడు ?
అట్లా చస్తాడనేందుకు ప్రమాణం ఉందా ?
అవిద్య,అవిద్యాకారమైన ప్రపంచం అమోఘమైన పాశుపతాస్త్రంతో పోల్చబడినది.జ్ఞానిని అంటజాలని ఇంద్రియగోచరములైన సుఖదుఃఖములు,
ములుకు, మొన లేని బాణముతో పోల్చబడినవి.
ఈ దృష్టాంతాన్ని దార్ట్షాంతికంతో అన్వయిస్తున్నారు.
No comments:
Post a Comment