*విశిష్ట చారిత్రక తెలుగు మహిళలు - 65 -1*
*తత్వ వేత్తలు*
*1703 - 1803*
*జ్ఞాన యోగిని కందిమల్లయ్యపల్లె ఈశ్వరమ్మ*
ఆంధ్ర దేశంలో అవతరించిన మహా సిద్ధ పురుషుడు వీర బ్రహ్మ యోగి, పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామిగా విఖ్యాతి గన్న వీరు బోధించిన కాలజ్ఞాన తత్త్వం తాత్విక చింతనలో శిఖరాయమానం.
కడప జిల్లా కంది మల్లయ్య పల్లెలోని బ్రహ్మంగారి మఠం బ్రహ్మ క్షేత్రంగా ప్రసిద్ధికెక్కింది.
వీర బ్రహ్మేంద్ర స్వామి, గోవిందమ్మ లకు(1608-1693) ఐదుగురు కుమారులు సిద్ధ లింగయ్య స్వామి, గోవిందయ్య, శివ రామయ్య, ఓంకారమయ్య, పోతులూరయ్య. ఒక కుమార్తె వీర నారాయణమ్మ.
వీర బ్రహ్మం గారి కుమారులు, వారి సంతానం కొద్ది కాలానికే నిశ్శేషమైపోగా కూతురు వీర నారాయణమ్మ సంతాన పరంపరయే బ్రహ్మం గారి మఠాధిపతు లయ్యారు. ఐతే బ్రహ్మం గారి రెండవ కుమారుడు గోవిందయ్య అతని భార్య గిరెమ్మ. వారి ఐదుగురు సంతానంలో పెద్ద కుమార్తెగా ఈశ్వరమ్మ క్రీ.శ. 1703 లో ప్రభవించింది
ఈశ్వరమ్మ బాల్యం నుంచే తన వయసుకు మించిన ప్రజ్ఞా పాటవాలు ప్రదర్శించింది. వీధి బడి చదువుల్లోనే పురాణేతిహాసాల సారాన్ని పుక్కిట పట్టింది. ఆమె కుశాగ్రబుద్ధి ఉపాధ్యాయులకు, ఊరి ప్రజలకు ఆమె ఆశ్చర్యం గొలిపేది.
కుమార్తెలోని ప్రతిభను గమనించిన తండ్రి గోవిందాచార్య స్వామి ఆమెకు మంత్రోపదేశం చేసాడు. రాజ యోగ రహస్యం బోధించాడు. ఆమెకు వివాహం చేయ సంకల్పించి వరాన్వేషణ సాగించాడు. ఈశ్వరమ్మ తనకు ఐహిక సుఖాల మీద వాంఛ లేదని, తన మనసు తపస్సు మీదే లగ్న మౌతోందని చెప్పినా తల్లి దండ్రులు వినకపోవడంతో ఎవరికీ చెప్పకుండా కంది మల్లయ్య పల్లె సమీపంలోని ఒక కొండ గుహలో ప్రవేశించి ఏకాంతంగా తపస్సుకు ఉపక్రమించింది. ఈ సందర్భంలో ఒక ఉదంతం జన శ్రుతిలో ఉంది.
కడప జిల్లా రాజంపేట తాలూకా నగర పాడు గ్రామానికి చెందిన క్షత్రియ దంపతులు జగ్గమ్మ, జగ్గరాజుల కుమారుడు రంగరాజు. వీర బ్రహ్మేంద్రులు తన తండ్రి కిచ్చిన రాగి శాసనంలోని బీజ సంపుటిని చూచి అక్షర పరతత్త్వాన్ని గ్రహించి వీర బ్రహ్మేంద్రుల వంశంలోని కన్యను వివాహం చేసుకోవాలని నిశ్చయించి తండ్రి అనుమతి పొందాడు. శాసనం తీసుకుని కంది మల్లయ్య పల్లె చేరాడు. గోవిందయ్య కుమార్తె ఈశ్వరమ్మ ఒక్కరే వివాహ వయస్కురాలని తెలిసి కొని ఆమె తండ్రిని వివాహం విషయమై వారిని సంప్రతించాడు. కాని కులాంతర వివాహానికి బ్రహ్మంగారి కుమారులు సమ్మతించ లేదు.
వీర బ్రహ్మేంద్రుల కాల జ్ఞానం గ్రంథాల్లో ఈశ్వరమ్మ, రంగరాజుల వివాహ విషయమై ఏదైనా ఆధారం లభిస్తుందేమోనని రంగరాజు బ్రహ్మం గారి మరో కుమారుడు పోతులూరయ్యతో కలిసి బ్రహ్మంగారి మఠానికి వెళ్లి అక్కడ తాటాకుల గ్రంథాల పాతర నుండి ఒక గ్రంథం మాత్రం తీసుకోగలిగారు. మిగతా గ్రంథాలు పాములై బుస గొట్టాయట. అందులో బ్రహ్మం గారు చెప్పినది ఎవరికి తోచినట్లు వారు అర్ధం చేసుకున్నారు. రంగ రాజు, ఈశ్వరమ్మలు పరస్పరం ప్రేమగా చూసుకున్నారు. రంగరాజు స్వగ్రామానికి వెళ్లి తండ్రి గారి అనుమతితో 21-2-1717 న అగ్నికి ఆహుతి అయ్యాడని ఒక కథనాన్ని వార్తా పత్రిక, కడప ఎడిషన్ 13-12-1999 లో ప్రచురించారు.
ఈశ్వరమ్మ తపస్సులో ఉండగా ఆమెకు బ్రహ్మానంద ప్రాప్తి కలిగిందని ఆమె తాత గారు వీర బ్రహ్మేంద్ర స్వామి ప్రత్యక్షమై "ఈశ్వరీ! నీవు భక్తులను తరింప జేయు కాలమాసన్నమైనది. కార్యోన్ముఖు రాలివి కమ్మని వచించి అంతర్ధాన మయ్యారని చెప్పుకుంటారు.
కొంత కాలం తర్వాత ఆమె తండ్రి కోరిక పై వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి మఠానికి అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించింది. ఆమె శిష్యులకు శరీర తత్త్వాన్ని, యోగ రహస్యాలను, నాడీ కేంద్ర సాధనను బోధించేది. ఆమె దేశ సంచారం చేస్తూ బ్రహ్మం గారి బోధనలు ప్రచారం చేస్తూ ఉండేది. ఈ సందర్భంగా ఆమె ప్రదర్శించిన మహిమలను జనం కథలుగా చెప్పుకునేవారు
*ఓం నమో శ్రీవేంకటేశాయ!!*
(సశేషం)
No comments:
Post a Comment