Saturday, May 24, 2025

 కాఫీ కబుర్లు సంఖ్య 905 (మే 24 - 2025) -- లైఫ్ స్టైల్ (జీవన సరళి) -- గత మూడు నాలుగు దశాబ్దాలలో అందరి లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోయింది.  అలాగే కుటుంబ సంబంధ బాంధవ్యాలు కూడా.  కుటుంబం అంతా ఒకేచోట ఉంటూ కలిసి అన్నీ సమానంగా పంచుకుంటూ ఆప్యాయతలు పెంచుకునే పరిస్థితులు ఇప్పుడు లేవు‌. మన పిల్లలు మనదగ్గర ఇరవై ఏళ్లు పెరిగినా ఉద్యోగాల చదువుల రీత్యా దూరంగా వెళ్ళిపోవడం, వాళ్ళకు నచ్చిన ఇంటర్ కాస్ట్ మేరేజ్ చేసుకుని సెటిల్ ఐపోవడంతో ఒకే కుటుంబం కి అర్ధం పూర్తిగా మారిపోయింది.  ఈ ప్రక్రియలో వాళ్ళ దైనందిక అలవాట్లు ఆలోచనలు, ఆలోచనా విధానాలు, బాంధవ్యాలు, environments,  ఆహార విషయాలు..  ఇలా అన్నింటా మార్పులు సమూలంగా చోటు చేసుకున్నాయి.. అసలు వీళ్ళు మనపిల్లలేనా అనిపించేంతగా.  సమయంతో పాటు మార్పులు తప్పవు.  పిల్లలు మనమాట కాదనరు అనే ఆలోచన ఇంకా మనలో ఉంటే వెంటనే తీసేయాలి.. మనకు నచ్చినట్లు మన పిల్లలు ఉండాలనుకుంటే అది మన మూర్ఖత్వమే అవుతుంది.  యీ అన్ని కారణాల వలన అరవై దాటిన తల్లిదండ్రులు ఈ మార్పులను జీర్ణించుకోలేక అర్ధం చేసుకోలేక సతమతమవుతున్నారు.  ఇంకా చెప్పాలంటే లేని అనారోగ్యాలను  తెచ్చుకుంటున్నారు.  ఒకప్పుడు వాళ్ళకి ఇష్టమని పిల్లలు ఓ నాలుగు రోజుల కోసం మన దగ్గరికి వస్తున్నారని ఒకప్పుడు వాళ్ళకిష్టం అని సున్నుండలు జంతికలు చేస్తే అవి ఇప్పుడు వారికి రుచించవు.  మనవలు ముట్టే ముట్ఝరు.  అయ్యో కష్టపడి చేసేనే అన్న బాధ మాత్రమే మిగులుతుంది.  మనలాంటి పెద్దలలో కూడా అవసరమైన మార్పులు రావాలి అశాంతి అనారోగ్యాలు చాలావరకు రాకుండా ఉండాలంటే.  ఈతరం పిల్లలకు మన పూర్వాపరాలు, సత్సంప్రదాయాలు, కట్టుబాట్లు వంటివేమీ అక్కర్లేదు.. ఎందుకని ప్రశ్నిస్తున్నారు.  మన కన్నబిడ్డల దగ్గరుంటే మన పెద్దలకు స్వాతంత్ర్యం ఉండదు, వారికి నచ్చినట్లు ఉండటానికి మన మనసు ఒప్పుకోదు.  అన్నివిధాలా వారిపైనే ఆధారపడాల్సి వస్తే వాక్ భావ స్వాతంత్ర్యాలు పూర్తిగా పోయినట్లే.  పిల్లలికి వారి పిల్లలకి కాలు చేయి ఆడుతున్నంత వరకూ చాకిరీ చేయాల్సిందే ఓపిక లేకపోయినా తెచ్చుకుని ఈ వృద్ధాప్యంలో.  పరిస్థితి చేయి దాటితే వృద్ధాశ్రమాలు ఉండనే ఉన్నాయి.  పుట్టాక ఇరవై పాతికేళ్ళ వరకే మన పిల్లలు.  తరువాత.. ఆఫీసులకి దాసులు, పెళ్ళాలకి కాంతాదాసులు.  ప్రస్తుతం 80 శాతం ట్రెండ్ ఇలానే ఉంది.  పిల్లల దగ్గరకెళ్ళినా మన ఊరికాని ఊరు కావడం, పై కారణాల వలన ఎక్కువ రోజులు ఉండలేని పరిస్థితి.  మళ్ళీ ఎప్పుడు మనింటికొచ్చి వాలతామా అనే ఆతృత తొందర ఉంటాయి.  ఇందులో ఎవ్వర్నీ తప్పు పట్టడానికి లేదు.  మరి కొన్నాళ్ళే ఉండే పేరెంట్స్ కంటే యాభై ఏళ్లు తమతోనే ఉండే భార్యలకి భర్తలకి ప్రాధాన్యత ఎక్కువ.  కేరీర్ ఉద్యోగం సంపాదన ఆధునిక జీవనశైలి.. ఇవే వారికి ముఖ్యం.  ఈతరం అమ్మాయిలు పిల్లల్ని కనడానికి కూడా శ్రద్ధ చూపడంలేదు.  ఇవన్నీ మనలాంటి పెద్దలకు మింగుడు పడని విషయాలు.  అరవై దాటిన మన పిల్లలు అప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉంటారో అన్న బెంగ చాలామంది పెద్దలకు ఉంటోంది.. చూడ(లే)కపోయినా..  ఎందుకంటే పలకరించే వాళ్ళు ఉంటారో ఉండరో అన్న సందేహంతో.  ఐతే ఇటువంటి సందేహాలు పెట్టుకుంటే పెద్దలకి ఉపయోగం శూన్యం.  ఎవరి లైఫ్ స్టైల్ వారిదే..  ఈ సూత్రాన్ని పెద్దలు బాగా వంటబట్టించు కోవాలి.  ఈరోజు కాఫీ కబుర్లుకి ప్రేరణ.. శ్రీ అవసరాల వేణు, న్యూఢిల్లీ.  వేణు గారికి కృతజ్ఞతలు.  మన కాఫీ కబుర్లుకి రేపటి నుంచి కొంత విరామం ఉంటుంది..  సుమారు జూన్ 10 వరకు.. క్యాంపులు కారణంగా..  ఓకే..  ఆల్వేస్ బి  హ్యాపీ & మేక్ అదర్స్ హ్యాపీ... ------- గాదె లక్ష్మీ నరసింహ స్వామి (నాని) విజయనగరం ఫోన్ 99855 61852....

No comments:

Post a Comment