*యోగశ్చిత్తవృత్తినిరోధః *
మూలం : ( ఈ యోగ సూత్రం పతంజలి మహర్షి సూత్రీకరించిన "యోగ దర్శనం" లో సమాధి పాదమందలిది )
భావం మరియూ భాష్యం : చిత్త వృత్తుల నిరోధమే యోగమని చెప్పబడినది. ఇక్కడ చిత్తము అంటే ఏమిటి? వృత్తులు అంటే ఏమిటి? అన్న విషయం తెలుసుకోవాలి.
చిత్తము యొక్క సంస్కారాలే చిత్త వృత్తులు. చిత్తము అనే సరస్సు నందు సంస్కారాల రూపమైన మురికి అనే తరంగాలు ఉంటాయి అనుకుంటే, మానసిక సంకల్ప వికల్పాలనే సంస్కారాలు కూడా ఉంటాయి. మరల ఈ తరంగాలకి కారణం అందుగల సంకల్పాలే. ఈ చిత్త వృత్తులను ఆపివేయగలగాలి.
ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, అహంకారములను...అంతఃకరణ చతుష్టయమని అందురు. అయితే ఇవి అన్నియూ చిత్తము నందలి వేరువేరు వ్యాపారములు. ఇవి కూడా సంస్కారాలే కదా, వృత్తులే కదా !
ఈ చిత్త వృత్తుల పరిణామమే మానసిక సంకల్ప వికల్పాలు. ఏవిధంగానైనా ఈ చిత్త వృత్తులను లేదా చిత్త సంస్కారాలనే తరంగములను ఆపివేయగలిగితే...వీటి ఆధారంగా ఏర్పడుచున్న మానసిక సంకల్ప వికల్పాలు ఆగిపోవును. దీనికోసం చిత్తమందున్న సంస్కారాలు, వాసనలు క్షీణింపజేయుట చాలా అవసరం. అందుకే యోగ సూత్ర కారుడైన పతంజలి, శాస్త్ర లక్ష్యాన్ని "చిత్త వృత్తులందు" పెట్టాడు.
ఈ చిత్త వృత్తుల నిరోధము వలనే మనో నిరోధం కలుగుతుంది. అయితే చిత్తము , వృత్తులు పరస్పర ఆశ్రితాలు. చిత్త వృత్తులు నిరోధించబడుతూ, వృత్తుల రూపమైన ముఱికి పోతేనే గాని, చిత్తమనే సరస్సు యొక్క అడుగు భాగం కనబడదు.
...అసలు "యోగము" అంటే ఏమిటి? చిత్త వృత్తుల నిరోధమే యోగము. సూత్ర కారుడైన పతంజలి, యోగ శాస్త్ర లక్ష్యాన్ని "చిత్త వృత్తుల" నిరోధంగా నిర్దేశించాడని చెప్పుకోవచ్చు.
...సమాధిలో చిత్త వృత్తులు నిరోధమౌతాయి కదా! అయితే సమాధి స్థూలంగా సంప్రజ్ఞాత, అసంప్రజ్ఞాతమని రెండు రకములు. సంప్రజ్ఞాత సమాధి అనే పదమునకు సంప్రజ్ఞాత, సబీజ, సవికల్ప సమాధులు అన్నవి పర్యాయ పదాలు. అసంప్రజ్ఞాత సమాధి అనే పదమునకు అసంప్రజ్ఞాత సమాధి, నిర్బీజ సమాధి, నిర్వికల్ప సమాధి అన్నవి పర్యాయ పదములు.
చిత్తం లోని సంకల్పాలే వృత్తులు. సంకల్పం అంటే ఏమిటి? అదొక శక్తి రూపం. ప్రకృతిలో అనంత శక్తి ఉంటుంది కదా! దానిలో నుండి చిత్తం కొంత శక్తిని గ్రహిస్తుంది. సంకల్పం చేసే క్రియను బట్టి, దానికి అలా నామకరణం చేసారు. పురుషుడి చైతన్యమే మనస్సు అనుకుంటే, పురుషుడు మనస్సును త్యాగం చేస్తే...మనస్సు నశిస్తుంది.
చిత్త వృత్తులు నిరోధం కానంత వరకు శుద్ధ చైతన్య రూపమైన "ఆత్మ" అనుభవానికి రాదు. చిత్తానికి, ప్రాణానికి సంబంధం ఉంది. ప్రాణ నిరోధం జరిగితే, చిత్త నిరోధం జరుగుతుంది. చిత్త సంస్కారాలు, వాటంతట అవే అణగుతాయి.
చిత్త వృత్తి నిరోధము జరుగుటతోనే, విచారం - సంకల్ప వికల్పాదులు - అహం కారం - వాసనలు - కోరికలు ...ఫలానాది కావాలనే ఇచ్ఛ జనించదు. అలా చిత్తము క్రియా హీన స్థితిని పొందును. చరమావస్థలో, యోగికి ఆత్మానుభూతి కలుగును.
Compiled : భట్టాచార్య.
No comments:
Post a Comment