🌷అభ్యుదయ కవి, సాహితీవేత్త ఇంద్రగంటి శ్రీకాంతశర్మ గారి జయంతి సందర్భంగా..
...🌷
‘#తేనెల తేటల మాటలతో మన #దేశ మాతనే కొలిచెదమా’.. అంటూ #దేశమాతకు లలిత గాన హారతి పట్టిన ప్రముఖ కవి, రచయిత, రేడియో ప్రయోక్త, సీనియర్ పాత్రికేయుడు #ఇంద్రగంటి శ్రీకాంత శర్మ.
రేడియోలో లలిత సంగీతం కార్యక్రమంలోని "తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా" పాట విద్యార్థులకు దాదాపు కంఠస్థంగా ఉండేది.
‘#ఒకానొక సుఖ స్వప్న హేమంతంలోంచి బయటకు వచ్చి నిలబడ్డాను తీర్మాన వాక్యంలాగ’- అని చెప్పుకున్న #అనుభూతివాద కవి, సాహితీవేత్త ఇంద్రగంటి శ్రీకాంత శర్మ దాదాపు అన్ని సాహితీ ప్రక్రియలనూ స్పృశించినట్టే కనపడతారు. అపురూపమైన భావావేశం వీరి సొంతం. ఆవేశాన్నైనా, ఆవేదననైనా అక్షరాల్లో లయబద్దంగా అమర్చగల్గడం, పాఠకుల మనసులతో పాటు, మెదళ్ళనీ రచనల ద్వారా కదిలించగలగడం వీరి ప్రత్యేకతలు. వీరి సతీమణి ఇంద్రగంటి జానకీబాల గారూ రచయితగా సుప్రసిద్ధులే. రేడియో వినే అలవాటు ఉన్న వారందరికీ, “సృష్టిలో తీయనిది స్నేహమేనోయీ..” అంటూ ఆమె గొంతులో ఆహ్లాదంగా సాగిపోయిన గీతం ఈ పాటికే గుర్తొచ్చి ఉంటుంది.
#బాల్యం:
1944 మే 29న జన్మించిన ఇంద్రగంటికి.. తండ్రి హనుమత్ శాస్త్రి సుప్రసిద్ధ కవి కావడంతో సహజంగానే సాహిత్యం ఒంటబట్టింది. విద్యార్థి దశనుంచే ఆయన రచనావ్యాసాంగాన్ని చేపట్టారు.తెలుగులో ఎం. ఏ. పట్టభద్రుడై ఆంధ్రజ్యోతి వారపత్రికలో (విజయవాడ) సబ్-ఎడిటర్ గా 1969-76 మధ్య పనిచేశాడు. అభ్యుదయ కవిగా శర్మ పేరొందాడు.
#అసిస్టెంట్ ఎడిటర్:
1976లో ఆకాశవాణి విజయవాడ కేంద్రంలొ అసిస్టెంట్ ఎడిటర్ (Scripts) గా శర్మ చేరాడు. తెలుగు ప్రసంగాల శాఖకు ఉషశ్రీకి సహాయకునిగా సంస్కృత కార్యక్రమాలు నిర్వహించాడు. శర్మ వివిధ పత్రికలలో గేయాలు, కవితలు, సాహిత్యవ్యాసాలు వ్రాశాడు. అనేక రేడియో నాటికలు, నాటకాలు, డాక్యుమెంటరీలు, సంగీతరూపకాలు రచించాడు. రేడియో ప్రసంగాలు చేశాడు. 1994లో ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ గా నిజామాబాద్ కేంద్రంలో పనిచేశాడు. 1995లో స్వచ్ఛంద పదవీ విరమణ చేసి ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక సంపాదకులుగా చేరాడు.
#సాహిత్యం:
దాదాపు నాలుగున్నర దశబ్దాల సాహితీ ప్రస్థానంలో కవిత్వం, విమర్శలు, నాటకాలు, నవలలు 20కిపైగా పుస్తకాలు రాశారు. రచయితగా, కవిగా, పాత్రికేయుడిగా, సంపాదకులుగా ఆయన సాహిత్యరంగంలో చేసిన సేవలకుగాను పలు జాతీయ స్థాయి పురస్కారాలు, వివిధ సంస్థల నుంచి అవార్డులను అందుకున్నారు.
ఇటీవలే ఆయన ’ఇంటిపేరు ఇంద్రగంటి’పేరుతో తన ఆత్మకథను వెలువరించారు. గత యాభై సంవత్సరాల్లో తానెరిగిన సాహిత్య జీవితాన్ని, అలాగే తన కుటుంబ విశేషాలను, రచయితగా తన అనుభవాలను కలగలిపి ఈ ఆత్మ కథ రాసి 2018 జనవరిలో విడుదల చేశారు.
#ప్రభావం:
తెలుగు సాహిత్యంలో గుడిపాటి వెంకటాచలం, కృష్ణశాస్త్రి, శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి, శ్రీశ్రీ, బుచ్చిబాబు, బాల గంగాధర్ తిలక్, విశ్వనాథశాస్త్రి, అజంతా రచనలతో ఆయన బాగా ప్రభావితమయ్యారు.
‘ఈ ప్రపంచంలో సర్వవిశ్వాసాలకి, చర్యలకి, వ్యక్తి కేంద్రమని నేను నమ్ముతాను. సెయింట్ కావచ్చు, సిన్నర్ కావచ్చు. వ్యక్తి సమూహాలను శాసిస్తాడని నా విశ్వాసం అయితే ఏ ఒక్క విశ్వాసమూ పరిపూర్ణ సత్యం కాదు. సాపేక్ష సత్యమే. అందుచేత సాహిత్య పఠనం, రచనా వ్యాసంగంలోకి మనసు పెట్టే వాళ్లు, తమ మనసులకుండే కిటికీలు తెరిచిపెట్టడం అవసరం. పాత విశ్వాసాలు కొట్టుకుపోవాల్సి రావచ్చు. కొత్త విశ్వాసాలు దూసుకురావచ్చు. మనసులోకి వెలుతురుతాకే అవకాశం ముఖ్యం. దాన్ని మూసి పెట్టకూడదు’అని ఓ సందర్భంలో ఇంద్రగంటి శ్రీకాంతశర్మ చేసిన ప్రతిపాదన నేటి రచయితలకు ఓ దీపస్తంభం లాంటిది.
#రచనలు:
అనుభూతి గీతాలు (కవితాసంకలనం),
శిలామురళి (వచన కావ్యం),
ఏకాంతకోకిల (ఏకాంత కోకిల),
నిశ్శబ్దగమ్యం (కవితాసంకలనం),
పొగడపూలు (గేయాలు),
తూర్పున వాలిన సూర్యుడు (నవల)
క్షణికం (నవల)
సాహిత్యపరిచయం (సాహిత్యవిమర్శ)
ఆలోచన (సాహిత్యవ్యాసాలు)
శ్రీపద పారిజాతం (యక్షగానం)
కిరాతార్జునీయం (యక్షగానం)
శ్రీ ఆండాల్ కల్యాణం (యక్షగానం)
గంగావతరణం (యక్షగానం)
ఆకుపచ్చని కోరికలు (నాటకం)
అవతార సమాప్తి (నాటిక)
మహర్షి ప్రస్థానం (నాటిక)
గాథావాహిని మొదలైనవి.
#పురస్కారాలు,#సత్కారాలు:
*1977లో అనుభూతిగీతాలు కవితాసంపుటికి ఫ్రీవర్స్ ఫ్రంట్ పురస్కారం.
*1979లో నూతలపాటి సాహితీపురస్కారం.
*1981లో ఆకాశవాణి వార్షిక పోటీలలో అమరామరం డాక్యుమెంటరీకి ప్రథమ బహుమతి.
*1981లో ఆకాశవాణి వార్షిక పోటీలలో వర్షానందిని సంగీత రూపకానికి ప్రథమ బహుమతి.
*1986లో ఆకాశవాణి వార్షిక పోటీలలో నేనుకాని నేను సృజనాత్మక రూపకానికి ప్రథమ బహుమతి.
*1988లో ఆకాశవాణి వార్షిక పోటీలలో మాటా - మౌనం సంగీత రూపకానికి ప్రథమ బహుమతి.
*1988లో ఆకాశవాణి వార్షిక పోటీలలో నిశ్శబ్దగమ్యానికి ద్వితీయబహుమతి.
*1990లో ఆకాశవాణి వార్షిక పోటీలలో మెట్లకు ద్వితీయబహుమతి.
#సీనీరంగం:
కృష్ణావతారం (1982), నెలవంక (1983), రావు - గోపాలరావు (1984) మొదలైన చిత్రాలకు గీతరచన చేశారరు
నెలవంక నుంచి సమ్మోహనం వరకు
శ్రీకాంత శర్మ 20కి పైగా సినిమాలకు పాటలు కూడా రాశారు. జంధ్యాల దర్శకత్వం వహించిన ’నెలవంక’చిత్రంలో 6పాటలు రాశారు. ఇందులో ’ఏది మతం’పాటకు జాతీయ అవార్డు వస్తుందని అనుకున్నారు. ఆ తర్వాత జంధ్యాల దర్శకత్వంలోనే ’పుత్తడిబొమ్మ’సినిమాకు రెండు పాటలు, ’రావు–గోపాల్రావు’చిత్రంలో ఓ పాట రాశారు. ’కృష్ణమూర్తి కుక్కపిల్లలు’అనే టెలీఫిలిం కోసం ఓ పాట రాశారు. తనయుడు మోహనకృష్ణ దర్శకత్వం వహించిన ’గోల్కొండ హైస్కూల్’సినిమాలో ’ఏనాటివో రాగాలు’పాటను, ‘అంతకు ముందు ఆ తర్వాత’చిత్రంలో ’నా అనురాగం’పాటను, ’సమ్మోహనం’లో ’మనసైనదేదో’పాటను రాశారు. 74 సంవత్సరాల వయసులో ఆరోగ్యం సహకరించని పరిస్థితుల్లోనూ ’సమ్మోహనం’కోసం ఆయన రాసిన ఫుల్ రొమాంటిక్ సాంగ్ అందరినీ ఆకట్టుకుంది.
2019 జూలై 25 న
హైదరాబాద్ లో మరణించారు.
#ఇంద్రగంటి శ్రీకాంతశర్మ తనయుడు ఇంద్రగంటి మోహనకృష్ణ సుప్రసిద్ధ సినీ దర్శకుడు. మోహనకృష్ణ దర్శకత్వంలో వచ్చిన 'సమ్మోహనం' సినిమాలో 'మనసైనదేదో' ఆయన చివరగా రాసిన పాట.
🙏🙏🌷🌸🌹🙏🙏

No comments:
Post a Comment