బామ్మ కొత్త కథలు
అఖండజ్యోతి (003)
(ప్రభాకర్ పెదపూడి)
బామ్మ ఆరోగ్యం కోసం ఈ మధ్యన నడక మొదలెట్టింది. బాటా బూట్లు కొంది. పక్క వీధిలో చలపతిరావుగారి పెద్దమ్మాయి అఖండజ్యోతి కూడా బామ్మతో కలిసింది. తెలతెలవారుతుండగా ఇద్దరూ కలిసి స్కూలు గ్రౌండులో రెండు చుట్లువేసి ఇంటికొచ్చి పడుతున్నారు. రెండురోజులు బాగానే నడిచారు కానీ మూడోరోజునుంచీ కాళ్ళు తెగ పీకటం మొదలెట్టాయి. మరుసటి రోజు స్కూలు గ్రౌండులో ఎదురైన పంతులుగారి రెండో భార్య సుగుణాల రాశి కనపడి “ఏం! బామ్మగారూ అలా సినిమా హీరొయిన్లా చీమలు చస్తాయేమో అన్నట్లు నడిస్తే వళ్ళు తగ్గదు. నడిస్తే కత్తిలా నడవాలి. అలా కొత్త బూట్లేసుకుని కాళ్ళల్లో పుండ్లు ఉన్నట్లు నడవకూడదు” అని ఎదో సోది చెప్పుతుంటే ఇద్దరూ ఆయాసంతో ఆగారు, ఆవిడ వీళ్ళిద్దరినీ పట్టించుకోకుండా మాట్లాడుకుంటూ వెళ్లిపోయింది. “అమ్మయ్యా బతికాంరా బాబూ” అనుకుంటూ ఇద్దరూ ఇంటిదారి పట్టారు.
“బామ్మగారూ! ఈరోజునుంచీ మనం నడకలో కొద్దిగా వేగం పెంచుదాం. మనం నడవటం మొదలుపెట్టి అప్పుడే వారం దాటింది” అంది అఖండజ్యోతి. “నువ్వయితే ఇంకా కుర్రపిల్లవి, ఇంకా పాతిక నిండలేదు. నాకైతే ఏభై దాటి పదేళ్ళు అయ్యింది. ఎరాయో తగిలి బోర్లా పడ్డానంటే, దిక్కుమొక్కు లేని దాన్నవుతాను” బామ్మ నవ్వుతూ అంది. “అయ్యో అయ్యో అలా అనకండి, మీది పూర్వకాలం వళ్ళు, దుక్కలా దున్నపోతులా ఉన్నారు ” గబుక్కున్ నోరుజారింది అఖండజ్యోతి. “దున్నపోతులా ఉండటమేమిటీ, అసలేం మాట్లాడుతున్నావు, రాత్రి మీఆయన సగం తాగి వదిలేసింది తాగోచ్చావా! మాటలు మీరావంటే బామ్మతో మామూలుగా ఉండదు” అంది బామ్మకోపంగా. ఛీ ఛీ రేపటినుంచీ వాకింగ్ లేదూ డేకింగ్ లేదు, రేపటినుంచీ నాకు కనిపించావంటే కాళ్ళు రెండూ విరక్కోడతాను ఏమనుకుంటున్నావో, రేపు మీ నాన్నని ఒకసారి కనపడమను ” బామ్మ ఇంటిదారి పట్టింది. “ఇంత మాత్రందానికి నాన్న ఎందుకండీ రావడం, నన్ను క్షమించండి. మీ చెప్పుతో నన్ను కొట్టండి” అంది అఖండజ్యోతి ఏడుస్తూ. “ఎందుకూ నా చెప్పు లాక్కుని నన్ను ఎడాపెడా కొట్టడానికా! మొన్నామధ్యన ఎవరోపిల్ల టీచర్ని చచ్చేట్టు చెప్పుతో కొట్టినట్లు నన్ను కొట్టడానికా” అంది బామ్మ గట్టిగా అరుస్తూ. బామ్మ దెబ్బకి నోరుజారిన అఖండజ్యోతి మొహం ఆరిపోయింది. మార్నాటినుంచీ వాకింగ్ ఆగిపాయింది.
No comments:
Post a Comment