Monday, May 26, 2025

 *మనిషికి శీలమే ప్రధానం.*
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼

*బౌద్ధ ధమ్మంలో కుల బేధాలు లేవు, ధమ్మం మనిషికి శీలమే ప్రధానం అంటుంది.భగవాన్ బుద్ధుడు కులం మానవ సృష్టియని అన్నారు.కులాన్ని నిరసించారు. వేదాల ఉనికిని ప్రామాణికతను త్రోసిపుచ్చారు.యజ్ఞాలను,యాగాలను నిర్వహించి జంతుబలి చేసి మూగజీవుల ప్రాణాలు తీయడాన్ని ఖండించారు.*

*బాబాసాహెబ్ డా.బి.ఆర్. అంబేడ్కర్ ఇలా అన్నారు: "బౌద్ధం అంటే శీలం.ఈ శీలం బౌద్ధంలో అంతర్లీనమై ఉంది. ఈ శీలమన్నది లేనట్లయితే బౌద్ధమనేదే లేదు. బౌద్ధంలో దేవుడు లేడన్నది వాస్తవమే. అయితే దేవుని స్థానంలో శీలం ఉంది. ఇతర మతాలకు దేవుడు ఎటువంటి వాడో బౌద్ధానికి శీలం అటువంటిది."*

*కొందరు పరిచయస్తులు ,కొత్తగా పరిచయం అయ్యేవాళ్ళు నన్ను తరచూ అడిగే ప్రశ్నలు :  'మీరు ఏ కులం వారు (మీరు ఏవుట్లు) మీది బౌద్ధ మతమా?*

*అరియ నాగసేన బోధి:'నేను నన్ను మనిషిగా భావిస్తున్నాను, ఎందుకంటే ఆకాశం కింద మనం ఒకే కుటుంబం మాత్రమే, మనం భిన్నంగా కనిపిస్తాము అంతే,'*

*మనందరిదీ ఒకటే కులం అదే మానవ కులం...ఈ కులాలు మనుషులను ఎక్కువ తక్కువ అంటూ అణచివేతకు గురిచేస్తాయి..మానవత్వం లేకుండా చేస్తాయి.బౌద్ధ ధమ్మం మనుషులను మనుషులుగా చూస్తుంది. కులాలు బట్టి మనుషులను చూడని ధమ్మం ఇది.హెచ్చుతగ్గులు చూడకుండా మనుషులను చూడాలి అయితే కొందరు కులవాదులు ,సంపన్నులు ఇందులో చేరి కులాన్ని బట్టి, సంపద ,అధికారం ,పదవులు బట్టి మనుషులను చూస్తున్నారు.ఇది బౌద్ధ ధమ్మానికి విరుద్ధం..*

*ఒకసారి భగవాన్ బుద్ధునికి-అశ్వలాయనుడు అనే బ్రాహ్మణునికి మధ్య జరిగిన సంభాషణలు గమనిస్తే బుద్ధుడు కులం పట్ల ఏ విధంగా వ్యవహరించినదీ మనకు అర్థం అవుతుంది.అశ్వలాయనుడు అనే బ్రాహ్మణుడు 'మనిషి యొక్క పుట్టుకను బట్టి, అతని వర్ణాన్ని బట్టి మనిషికి గొప్పతనం ఉంటుంది అని బలంగా నమ్మి,అదే చెప్పేవాడు.అశ్వలాయనుడు ప్రకారం 'పుట్టుకను బట్టి బ్రాహ్మణులు మాత్రమే శ్రేష్టులు.' అని అంటాడు.*

*భగవాన్ బుద్ధుడు మాత్రం ఇది పూర్తిగా అసత్యం అంటారు. అశ్వలాయనుడు యొక్క అభిప్రాయంతో ఆయన ఏకీభవించలేదు.మనిషిని పుట్టుకను బట్టి, అతని వర్ణాన్ని బట్టి కాకుండా అతని యొక్క గుణగణాలను బట్టి మాత్రమే చూడాలని అంటారు. గొప్పతనం అనేది పుట్టుకను బట్టి, పుట్టిన వర్ణాన్ని బట్టి రాదు అని అన్నారు.*

*మనుషులకు శీలమే ప్రధానం.ఒక మనిషిని అంచనా వేయడానికి శీలం ముఖ్యం.శీలం వలనే ఒక వ్యక్తిని శ్రేష్టులుగా చెప్పాలి అని బుద్ధుడు అంటారు.*

*మనిషికి శీలమే ప్రధానం..శీలం గల వారే శ్రేష్టులు అని బుద్ధుడు అన్నారు.*

*అంతట తథాగతుడు ఓ అశ్వలాయనా ! నీ ఉద్ధేశం ప్రకారం కులం గొప్పది.నీ ఉద్ధేశం ప్రకారమే ఇద్దరు బ్రాహ్మణులు ఉన్నారు అనుకుందాం..ఒక బ్రాహ్మణుడు చదువుకున్నాడు.మరొక బ్రాహ్మణుడు చదువుకోలేదు.మరి వీళ్ళద్దరిలో నువ్వు ఎవరికి గౌరవాన్ని ఇస్తావు? అని అశ్వలాయనుణ్ణి ప్రశ్నించారు బుద్ధుడు.*

*అప్పుడు ఆశ్వలాయనుడు చదువుకున్న బ్రాహ్మణుడినే నేను గౌరవిస్తానని సమాధానం ఇచ్చాడు.*

*మంచిది.అంటూ భగవానుడు మళ్ళీ మరొక ఉదాహరణ చెప్పెను.చదువుకున్న ఇద్దరు బ్రాహ్మణులు ఉన్నారు. వారిలో ఒకరికి ఉపనయనం జరిగింది. మరొక బ్రాహ్మణుడికి ఉపనయనం జరుగలేదు. ఇద్దరిలో ఇప్పుడు ఎవరిని నువ్వు గౌరవిస్తావు అని బుద్ధుడు అశ్వలాయనుడిని అడిగారు.*

*అశ్వలాయనుడు నేను ఉపనయనం జరిగిన బ్రాహ్మణుడికే గౌరవాన్ని ఇస్తాను అని అన్నాడు.*

*భగవాన్ బుద్ధుడు సరే, ఇప్పుడు ఇద్దరు ఉపనయనం జరిగిన బ్రాహ్మణులలో ఒకడు మంచి వాడు.మరొకడు వ్యభిచారి,తాగుబోతూ, తిరుగుబోతూ,అబద్ధాలు ఆడేవాడు, దొంగబుద్ధి గలవాడు, దోపిడీదారుడు.ఇప్పుడు వీళ్ళద్దరిలో ఎవరిని గౌరవిస్తావు అని అడిగెను.*

*అప్పుడు అశ్వలాయనుడు నేను ఎలాంటి చెడు అలవాట్లు లేని మంచివాడైన బ్రాహ్మణుడినే గౌరవిస్తాను అని సమాధానం ఇచ్చాడు.*

*అశ్వలాయనా ! చూశావా నీవు ఎలా సమాధానం చెప్పావో...అంటూ భగవాన్ బుద్ధుడు ఈ విధంగా పలికెను 'మొదట నువ్వు పుట్టుకను బట్టి బ్రాహ్మణులను గౌరవించాలని అన్నావు.ఆ తర్వాత చదువుకున్న బ్రాహ్మణుడే గౌరవనీయుడు అని అన్నావు. ఆ తర్వాత ఉపనయనం వంటి సంస్కారాలు పొందిన బ్రాహ్మణుడే గౌరవనీయుడు అని అన్నావు.కట్టకడకు లేదు.. లేదు.. శీలవంతుడైన బ్రాహ్మణుడు గొప్పవాడు అని తేల్చి చెప్పావు. అశ్వలాయనా నీవు కూడా ఒక మనిషి పుట్టుక, చదువు, సంస్కారం,పాండిత్యం... వీటన్నింటికంటే శీలమే ప్రధానం అని ఒప్పుకున్నావు అని అన్నారు.*

*అవును ,భగవాన్ మీరు చెప్పినట్లు ఒక మనిషిని అంచనా వేయడానికి శీలమే ప్రమాణం..అని అశ్వలాయనుడు బుద్ధునికి నమస్సులు తెలియచేసెను.*

*సమానత్వాన్ని బోధించిన తొలి సంస్కర్త గౌతమ బుద్ధుడు.*

*తథాగత గౌతమ బుద్ధుడు చాతుర్వర్ణ వ్యవస్థను గట్టిగా వ్యతిరేకించారు. బ్రాహ్మణ మతం హైందవ మతం. ఇందులో అసమానతలు అధికారికంగా ఉంటాయి.అందుకే మనుషులలో అహంకారం, ఆధిపత్యం, మోసం, అనైతికత ,అవిద్య, అజ్ఞానం,మూఢత్వం ఎక్కువగా ఉంటుంది.బుద్ధుడు ఈ బ్రాహ్మణ మత సిద్ధాంతాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు.*

*భారతదేశం లో మాత్రమే సవర్ణులు ఏర్పాటు చేసిన వర్ణ ,కుల వ్యవస్థను తీవ్రంగా వ్యతిరేకించడమే కాకుండా దానికి ప్రత్యామ్నాయ సంస్కృతికి పునాదులు వేసిన సర్వోన్నతుడు, పావనచరితుడు, పరిపూర్ణ జ్ఞాని గౌతమ బుద్ధుడు. కులవ్యవస్థకు వ్యతిరేకంగా బుద్ధుడు సమానత్వాన్ని మొట్టమొదటి సారిగా భారతదేశంలో ప్రవేశపెట్టారు. ఈ దుర్మార్గపు, దోపిడీ అసమానతను సమర్థించే కులవ్యవస్థకు వ్యతిరేకంగా బుద్ధుడు చేయని ప్రతివాదన లేదు.*

*ఒకసారి అశ్వలాయన అను బ్రాహ్మణ వేద పండితుని వద్దకు కొందరు బ్రాహ్మణులు వచ్చి, చాతుర్వర్ణ వ్యవస్థను సమర్థిస్తూ గౌతమబుద్ధునితో వాదనకు దిగమని చెబుతారు. అశ్వలాయన కూడా బుద్ధుని వద్దకు వెళ్ళి ఆయనతో వాదన పెట్టుకుంటాడు.*

*బ్రాహ్మణులు పుట్టుకతోనే ఉన్నతమైన వర్ణం వారు ,ఎందుకు అంటే బ్రహ్మ ముఖం నుండి బ్రాహ్మణులు పుట్టారు కాబట్టి బ్రాహ్మణులు పవిత్రులు.మిగతా వర్ణాల వారు హీనులు అని అంటాడు.*

*దానికి సమాధానంగా గౌతమ బుద్ధుడు ఈ విధంగా చెబుతారు "ఓ అశ్వలాయనా! తక్కిన కులాలలోని స్త్రీలు వలెనే బ్రాహ్మణ స్త్రీలు సైతం రజస్వల అనంతరం గర్భం దాల్చి పిల్లల్ని కంటున్నారు గదా!.అలాంటప్పుడు తక్కిన స్త్రీలకు పుట్టినట్లే ఈ బ్రాహ్మణులు పుట్టలేదని నీవెలా చెప్పగలవు ?" ఈ సమాధానానికి అశ్వలాయనుడు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు.*

*బుద్ధుడు ఇంకా ఈ విధంగా తన వాదనను కొనసాగించారు " అశ్వలాయనా! క్షత్రియుడు బ్రాహ్మణ స్త్రీని సంభోగించాడు అనుకుందాం.ఆ బ్రాహ్మణ స్త్రీ మానవుణ్ణి కంటుందా లేక మృగాన్ని కంటుందా ?" అని బుద్ధుడు అశ్వలాయనుణ్ణి ప్రశ్నిస్తాడు.దీనికి కూడా అశ్వలాయనుడి దగ్గర సమాధానం లేదు.*

*బుద్ధుడు ఇంకా ఇలా అంటారు " ఇక నైతిక పరంగా ఆలోచించినట్లైతే ఈ దేశంలో ఒక్క బ్రాహ్మణుడు మాత్రమే ఎలాంటి ద్వేష భావాన్ని, ద్రోహ చింతనను కలిగి ఉండక తన హృదయాన్ని ప్రేమమయంగా ఉంచుకోగలుగుతున్నాడని ,తక్కిన మూడు కులాల వారికి అది సాధ్యం కాదని నీవు చెప్పగలవా ?" అని అశ్వలాయనుణ్ణి బుద్ధుడు ప్రశ్నించగా, దానికి అశ్వలాయన "ఎలా చెప్పగలను ?" అన్ని కులాలు వారు అలా ఉండగలగడం సాధ్యమేనన్నాడు.*
 
*"మీరు ఆచరిస్తున్న చాతుర్వర్ణ వ్యవస్థ ఆదర్శ ప్రాయమైనదైనట్లైతే అది యావత్ ప్రపంచానికి ఎందుకు వర్తింప చేయలేదు ? అని బుద్ధుడు అశ్వలాయనుణ్ణి అడిగారు. అశ్వలాయనుడు బుద్ధుడు అడిగిన ప్రశ్నలన్నింటినీ శ్రద్ధగా విని ఆలోచన చేసి ,అందులో సత్యాన్ని తెలుసుకున్నాడు.అందుకే అశ్వలాయనుడు మౌనంగా ఉండిపోయాడు. ఆ తరువాత తన బ్రాహ్మణ్యాన్ని వదిలిపెట్టి బుద్ధునికి శిష్యునిగా కూడా మారిపోయాడు.*

📕వజ్రశూచి గ్రంథంలో అశ్వఘోషుడు కులాలు గురించి ఈ విధంగా పేర్కొన్నారు : "మనుషుల్లో నాలుగు రకాల కులాలు ఎందుకున్నారు?*

*ఒకే తల్లిదండ్రుల సంతానంలో వుండే చిన్న చిన్న తేడాల వంటివి తప్ప మనుషులంతా సమానంగా లేరా?*

 *పనస చెట్టు కొమ్మలకు, కాండానికి, వేరుకూ కాయలు కాస్తాయి. ఆ కాయలన్నీ ఒకేరకంగా వుంటాయ్.*

 *మరి వేరుకు కాసిని కాయల్ని శూద్రకాయలు అని పిలవాలా? లేదు, కచ్చితంగా అలా పిలవకూడదు.*

 *బ్రహ్మ యొక్క వివిధ శరీర భాగాలు నుండి పుట్టారని చెబుతున్న మానవులు కూడా ఓకే రకంగా వున్నారు.*

*బ్రాహ్మణునికి సంతోషం, బాధ కలిగినట్లే చండాలునికి కూడా కలుగుతాయి. వారి పుట్టుక ఒకేవిధంగా జరుగుతుంది, వారు ఒకేరకంగా ఎదిగి, ఒకేరకమైన కారణాలతో మరణిస్తారు. వారి తెలివితేటలు, చేసే పనులు, కలిగే భావనల్లో ఏ తేడా లేదు. అందుకే చాతుర్వర్ణాలని చెప్పే మాటల్లో ఏ మాత్రం నిజం లేదు.మానవులందరిది ఒకే కులం."*

*డా.బి.ఆర్.అంబేడ్కర్ ఈ విధంగా పేర్కొన్నారు : “ కులం ప్రజా స్పూర్తిని చంపేసింది.కులం ప్రజల యొక్క దాతృత్వ స్వభావాన్ని నాశనం చేసింది. కులం ప్రజాభిప్రాయానికి విలువలేకుండా చేసింది. ధర్మం కూడా కులాధారితంగా తయారైంది, నీతి కూడా కులపరిధిలోనే బంధిపబడింది. కాబట్టి భారతదేశం లోని కులవ్యవస్థను నిర్మూలిద్ధాం ! లేకపోతే అది ప్రపంచాన్నే నాశనం చేస్తుంది. “*
౼౼౼౼౼౼౼మీ మట్టే గురుమూర్తిగారు జై భీమ్ మిత్రులారా బహుజన సామాజిక పరివర్తన ఉద్యమ నాయకుడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఖమ్మం జిల్లా౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
💐💐💐💐💐💐💐💐౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼       
*భవతు సబ్బ మంగలమ్*

*🌼బుద్ధం సరణం గచ్ఛామి☸️*

No comments:

Post a Comment