Saturday, June 21, 2025

 *మిస్సమ్మ - 1*
💐

బెంగాలీ మూలం : మన్మొయీ గర్ల్స్ స్కూల్

రచన : రబీంద్రనాథ్ మైత్రా

అనువాదం : చక్రపాణి (విజయాప్రొడక్షన్స్)


మన పాత సినిమాల్లో మిస్సమ్మ ఒక ఆణిముత్యం. ఎన్ టి రామారావు, సావిత్రి, నాగేశ్వరరావు, జమున, ఎస్వీ రంగారావు, రుష్యేంద్రమణి, రేలంగి, రమణారెడ్డి నటించారు. విజయా ప్రొడక్షన్స్ వారి సినిమా ఇది. 1955లో విడుదల అయింది. దర్శకుడు ఎల్.వి. ప్రసాద్. స్క్రీన్ ప్లే రాసింది, చక్రపాణి. నిర్మాతలు నాగిరెడ్డి, చక్రపాణి. రబీంద్రనాథ్ మైత్రా రాసిన మన్మోయీ గర్ల్స్ స్కూలు నీ, శారదీందు బందోపాధ్యాయ్ రాసిన డిటెక్టివ్ నీ కలిపి మిస్సమ్మ సినిమా కథని వండారు. ఆ రెండు బెంగాలీ కథలను తెలుగులోకి అనువాదం చేసింది కూడా చక్రపాణే.

అయితే ఇప్పుడు మీరు చదువుతున్న కథ సినిమా కథ కాదు. ఇది రబీంద్రనాథ్ మైత్రా రాసిన మన్మోయీ గర్ల్స్ స్కూలుకి అనువాదం. కొంచెం నాటకం తరహాలో ఉంటుంది కధ.

అందుకే ఈ కథకీ సినిమాకీ కొద్దిగా తేడా ఉంటుంది.

*కధ ప్రారంభం...*


రోడ్డు పక్క లాంతరు స్తంభం పైన ప్రకటన చూసి ఆగాడు మానస ముఖర్జీ. బి.ఎ. వయస్సు 25 ఏళ్లు. ప్రకటన, చిరునామా నోట్ బుక్ లో రాసుకుంటూ ఉంటాడు. దోవనబోయే బాటసారులు ఒకరిద్దరు ఆ ప్రకటనపై కుతూహలంతో చదివిపోతూ ఉంటారు.

మానస: ఊహూ, నమ్మకంలేదు. అయినా (రాసుకుంటూ) కళ్లు మూసుకుని రాయి
వేద్దాం. తగిలితే తగులుతుంది లేకపోతే అణన్నరేగా దండగ-అసలు స్కూలు ఫైనల్ తోటే చదువుమానేస్తే బాగుండేది. పదిహేనుదో, ఇరవైదో ఏదో ఒక నౌకరీ దొరికేది. బి.ఎ. అని చెప్పగానే అందరికీ హడలాయే. గ్రాడ్యుయేట్ ని మేము మేపలేం బాబూ అంటుండిరి. మరి డబ్బు కూడా ఎక్కడినుంచి వస్తుందిలే. ఉన్న రూపాయలన్నీ కాగితాలైపోయే. ఇంత జీతం ఎక్కడ నుంచి తెచ్చిస్తారు? (కొంచెం ఆగి) ఎక్కడినుంచి ఇస్తే మనకెందుకు? నెలయ్యేసరికి నాలుగురాళ్లు మన జేబులో పడితే చాలు. వాళ్లు దొంగతనం చేసి ఇస్తే యేం. దోపిడీ చేసి ఇస్తే యేం? పిల్లలంతా ఇంగ్లీష్ చదువులతోనాశనమవుతున్నారు. ఈ ఉద్యోగం దొరికిందంటేనా గురుకుల పద్ధతిలో చదువు చెబుతాను.

వైకుంఠ సర్కారు వస్తాడు.

మానస : (నోట్ బుక్ ని ప్రకటనకు అడ్డంపెట్టి) ఏం కావాలి బాబూ?

వైకుంఠం : పుస్తకం తీయాలి.

మానస : ఏం కావాలో చెప్పకూడదూ?

వైకుంఠం : ఆ ప్రకటన కావాలి.

మానస : అది మందుల ప్రకటన అనుకున్నారేమో. తమకెందుకూ ఉపయోగపడదు.

వైకుంఠం : పుస్తకం తీయరా ఏమిటి? నేను తొందరగాపోవాలి. అయ్యగారికి ముసలి తనంలో అజీర్తి రోగం ఉందాయే. అయినా డబ్బులెక్కువైతే ఎందుకురాదులే? ఊ, పుస్తకం తియ్యి.

మానస : ఏం పాసయ్యారు?

వైకుంఠ : ఆ, ఆరా నీకెందుకబ్బీ? తీయమని చెబుతుంటే (పుస్తకం తీసేసి) ఇదిగో ఈ కాగితం ముక్క అంటిస్తున్నాను. (కాగితం అంటిస్తూ) ఇక నీ ఇష్టమొచ్చి నట్టు రాసుకో. నిన్న అంటించానో లేదో ప్రకటన తెల్లారేసరికీ మార్పు. మళ్లీ పట్నమంతా అంటించుకుంటూ తిరగాలి. ఇంకా పనేముంది!

మానస : ఏమండోయ్, కాస్త ఆగండి. నమస్కారం, ఈ స్కూలు తమ అయ్యగారిదా?

వైకుంఠం : స్కూలుకాదు, నా పిండాకూడు. పెళ్లయ్యిందా?

మానస : లేదండీ.

వైకుంఠం : అయితే పిండం దొరకదు. నేరుగా ఇంటికి నడువు అని చెప్పి వెళ్లిపోతాడు.

మానస : అందుకే కాబోలు పెళ్లాం అదృష్టమంటారు! నోటి దగ్గరకొచ్చిన ముద్ద జారిపడింది. పెళ్లి చేసుకుంటే ఒక తంటా, చేసుకోకపోతే ఇంకో తంటా- అయినా రాసుకుంటాను అని ఈ కొత్త నౌకరీ వివరాలు రాసుకుంటూ ఉంటాడు.
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
ఇంతలో నీహారికా గంగూలీ. ఈ సంవత్సరమే బి.ఎ. పాసైంది. విచారం సూచిస్తున్న మొహంతో సంచి చేతపట్టుకుని ప్రవేశిస్తుంది.

నీహారిక : పది రూపాయల కోసం రోజూ మూడు కోసులు నడవాలి. ఇక నా వల్ల కాదు బాబూ! అనుకుంటూ మానస వెనక్కి వచ్చి కాస్త తల తియ్యండి! అంది.

మానస : (మొహం తిప్పకుండానే) నా తలిక్కడ పాతేసి లేదు, కాసేపుంటే వెళ్లిపోతాను.

నీహారిక : క్షమించండి. అదేంటి, వాంటెడా?

మానస : (మొహం తిప్పి) ఓ, తమరా, క్షమించండి. నేనింకా ఎవరో అనుకున్నాను.

నీహారిక : అదేమి?

మానస : ప్రకటన వింటారా? Wanted a tutor and a tutoress, both graduates on Rs 100 and 120 respectively for my newly founded girls school.

నీహారిక : అడ్రస్?

మానస : చెబుతాను. పార్డన్. తమ భర్త గారు కూడా గ్రాడ్యుయేటేనా? లేదా నిరుద్యోగేనా?

నీహారిక : ఎందుకో చెప్పండి?

మానస : ఈ కింది వాక్యం విన్నారా? Must be Husband and Wife. తెలుగులో చెప్పమంటారా?

నీహారిక : అక్కర్లేదు, థాంక్స్. అని అక్కడి నుండి పోబోతుంది.

మానస : అడ్రస్ రాసుకుపొండి.

నీహారిక అవసరం లేదు అని వెళ్లిపోతుంది.

మానస : ఈమె కూడా నిరుద్యోగే. ఈమె మొహం వాలకమే చెబుతోంది. పాపం భర్త ఉన్నట్టయితే...

ఇంతలో ఒక ఐడియా వచ్చింది. ఆమెతో చూడండి, ఆగండి, మాట... విన్నారూ...నీహారిక మళ్లీ వస్తుంది.

నీహారిక : ఎందుకు పిలిచారు?

మానస : రెండో మాట అడుగుతాను. మనసులో ఏమీ అనుకోరు కదా!

నీహారిక : నాకిప్పుడు టైములేదు. తొమ్మిది గంటలకు ట్యూషన్ ఉంది.

మానస : ఎక్కువసేపు వద్దు, రెండే మాటలు. తమరు గ్రాడ్యుయేటా?

నీహారిక : మేరీ కాలేజీ నుంచి

మానస : ఎక్కడినుంచైతే ఏమిటి లెండి. మీకు ఒక్కమాట చెప్పదల్చుకున్నాను. ఇందులో నా ఒక్కడి స్వార్థమే ఉన్నదనుకో కండి. చూడండి, నేను కూడా గ్రాడ్యుయేట్ ని, పేదవాణ్ణి. గౌరవ కుటుంబీకుణ్ణి. పదిమందిలో తిరగనేర్చినవాణ్ణి. నాతో పార్టనర్షిప్....

నీహారిక : చేతి గడియారం వైపు చూసి తొమ్మిది కావచ్చింది.
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
మానస : తొమ్మిది కాదు, దాని ఇష్టమొచ్చి నట్టు పది కానివ్వండి. మీరు నా మాట ప్రకారం నడిస్తే ట్యూషన్ చెప్పుకోవాల్సిన బాధ తప్పుతుంది. పైగా ఈ విషయం మీకూ, నాకూ తప్ప బ్రహ్మరుద్రుడికి కూడా తెలియదు. ఇక మీ తల్లిదండ్రులిష్టపడితే-

నీహారిక : నాకెవ్వరూ లేరు.

మానస : అయితే ఇంకా మంచిది. వినండి, చెప్పమంటారా?

నీహారిక : చెప్పండి.

మానస : చూడండి (దగ్గు) చూడండి (దగ్గు) మీకేమీ ఆక్షేపణ లేకపోతే, చూడండి, ఇద్దరం... (కొంచెమాగి) చెప్పనా, ఏమీ అనుకోరు కదా?

నీహారిక : అబ్బ, ఆ చెప్పేదేమిటో త్వరగా చెప్పరాదూ, నలిపి చంపక!

మానస : గుండె చాలడంలేదు. అయినా వినండి, ఒక్కసారి ఐడియా చూడండి, ముందుగానే అడుగుతున్నాను. ఈ ఉద్యోగం దొరికితే మీకు మంచి లాభమేనా?

నీహారిక : తమాషా చేయడానికి పిలిచారా?

మానస : అలాంటి ఉద్దేశం నాకెప్పుడూ లేదు. మీ స్థితంతా గ్రహించాను. ఇక నా అవస్థను కూడా ఊహించుకోండి. మనిద్దరం పార్టనర్షిప్!

నీహారిక : పార్టనర్షిప్!

మానస : అయితే, ఇంకా స్పష్టంగా చెబుతాను. ఇదిగో చూడండి, చెప్పనా?

నీహారిక : చెప్పరాదూ, వేళమిగిలిపోతుంటే...

మానస : అయితే వినండి, ఈ ఉద్యోగం కోసం నేను భర్తగానూ-కోప్పడకండి. పొట్ట కోసం చెబుతున్నాను. మీరు భార్యలా ఒక నాటకమాడకూడదూ? 

అప్పుడు...

నీహారిక : రాస్కెల్!

మానస : రాస్కెల్ అనండి, రాలుగాయనండి మీ ఇష్టం. ఇది రాచమార్గమైపోయింది కానీ లేకపోతే మీ కాళ్లు పట్టుకుని బతిమిలాడేవాణ్ణి 

నీహారిక మాట్లాడకుండా వెళ్లిపోతుంది.

ఏమీ లేకపోయినా చేతికి రిస్ట్ వాచ్ అయినా ఉంది. ఒక వారం గడుస్తుందిలే (వెంటబడి) ఒక్కసారి ఆలోచించి చూడండి. నా ఐడియా ఎలాంటిదో, తోసి వేయాల్సింది కాదు. 

నీహారిక మళ్లీ వెనక్కి వస్తుంది. మీకిప్పటికైనా నచ్చిందా? అని అడిగాడు మానస.

నీహారిక : ఊహూ, నేనందుకోసం రాలేదు. మిమ్మల్ని చాలా అనవసరంగా తిట్టాను.
క్షమించండి. ఇదిగో కాగితం ముక్క అడ్రస్. అవసరమైతే ఇంటికి కబురు చెయ్యండి. ఒకటి రెండు గంటల్లో ఈ దారినే తిరిగి వస్తాను. నమస్కారం.

మానస : ఊహూ, అందుకోసం రాలేదట. షేక్స్ పియర్ చదివి జీర్ణం చేసుకున్న నేను ఈ జిత్తులమారి స్త్రీ జాతిని కనిపెట్టలేనా? కాని నిజంగా నా ఐడియా చాలా అద్భుతమైంది. పారేటట్టుగానే తోస్తోంది. ఎవరి కంటా పడకముందే (ప్రకటన చించివేస్తాడు) ఇక లాంతరు స్తంభాలన్నీ వెతకాలి. పట్టణమంతా కూడా అంటించి ఉండొచ్చు. తర్వాత ఆమె దగ్గరకు వెళ్లాలి. 
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
కాగితంపై అడ్రసు చూస్తాడు. హోలీ బైబిల్, సెయింట్ మేరీస్ హాస్టల్, చర్చి రోడ్ - అయితే మానె, నాకేమీ ఆక్షేపణ లేదు. “నీహారిక' పేరు సరిగ్గానే ఉంది. ఇంకా నయం ఏ మరియమ్మో, దానమ్మో కాలేదు పెద్దల పుణ్యాన. ఈ రెండు గంటలూ చుట్టుపక్కల లాంతరు స్థంభాలన్నీ చూసి ఇక్కడే కలుసుకుంటాను. లేకపోతే మళ్లీ రెండు కోసులు నడిచి చర్చి రోడ్డుకు ఎవరు పోతారు? అంతలోకి దరఖాస్తు కూడా టైప్ చేసి పారేస్తే పని తీరిపోతుంది. అని అక్కడి నుండి బయలుదేరాడు.
💐
*సశేషం*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
*కథల ప్రపంచం* 

https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe

*తెలుగు భాషా రక్షతి రక్షితః* 

*1 YEAR* *SUBSCRIPTION 120/-*
*phone pe & Gpay to 9849656434*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂

No comments:

Post a Comment