365 రోజులు✈️హార్ట్ ఫుల్ నెస్🌍కథతో
♥️ *కథ*-*169* ♥️
మన ఆనందానికి ఆటంకం కలిగించేది ఏమిటి? అనంతమైన , శాశ్వతమైన ఆనందాన్ని అనుభవించడానికి మనం దానిని ఎలా అధిగమించగలం?
*తొంభైతొమ్మిది* *సంఘం*
ఒకానొప్పుడు ఒక రాజు ఉండేవాడు. చాలా విలాసవంతమైన జీవనశైలి గడుపుతున్నప్పటికీ, అతనికి సంతోషం లేదు, సంతృప్తి కూడా లేదు. ఎప్పుడూ అశాంతిగా ఉండేవాడు. ఒకరోజు, రాజు తన కిటికీలో నుండి బయటకు చూస్తుండగా, ఒక సేవకుడు సంతోషంగా పాడుతూ ఉండటం చూశాడు. ఇది రాజును ఎంతగానో ఆకర్షించింది.
ఈ రాజ్యానికి అత్యున్నతమైన పాలకుడైన తాను అసంతృప్తిగా, దిగులుగా ఉన్నాడు, కేవలం ఒక పేద సేవకుడు తనకంటే చాలా ఆనందంగా ఎలా ఉన్నాడా అని ఆశ్చర్యపోయాడు.
రాజు సేవకుడిని, “ఎందుకు నువ్వు సంతోషంగా ఉన్నావు?” అని అడిగాడు.
అతను ఇలా జవాబిచ్చాడు, “మీ దయవల్ల మహారాజా, నేను కేవలం ఒక సేవకుడిని మాత్రమే; మా తల దాచుకోవడానికి ఒక పైకప్పు, మా కడుపులు నింపడానికి ఆహారం, ఇవి తప్ప నా కుటుంబానికి, నాకు, అంతకు మించి ఏమీ అవసరం లేదు ప్రభూ, ఇది నాకు చాలు, నేను సంతృప్తిగా ఉన్నాను.”
ఆ సమాధానంతో రాజు సంతృప్తి చెందలేదు. తరువాత తన అత్యంత విశ్వసనీయ సలహాదారునితో ఈ విషయాన్ని చర్చించాడు. రాజు కష్టాలు, సేవకుడి కథ విన్న తర్వాత, ఆ సలహాదారుడు ఇలా అన్నాడు, "మహాప్రభూ, సేవకుడు ఇంకా 99 ల సంఘంలో భాగం కాలేదని నేను అనుకుంటున్నాను."
“తొంభైతొమ్మిది సంఘమా? అంటే ఏమిటి? ” అని రాజు అడిగాడు.
సలహాదారుడు ఇలా జవాబిచ్చాడు, “మహాప్రభూ, తొంభైతొమ్మిది సంఘం అంటే ఏమిటో తెలుసుకోవాలంటే, ఈ సేవకుడికి మీరు ఇస్తున్నట్లు తెలియకుండా, తొంభైతొమ్మిది బంగారు నాణేలు ఇవ్వాలి”.
రాజు తొంభైతొమ్మిది బంగారు నాణేలను ఒక సంచిలో పెట్టి, ఆ సేవకుని ఇంటి గుమ్మం వద్ద వదిలివేయమని ఆదేశించాడు.
సేవకుడు ఇంటికి తిరిగి వచ్చి సంచిని చూసి, దానిని ఇంట్లోకి తెచ్చాడు. సంచి తెరిచి చూడగానే ఆనందంతో ఎగిరి గంతేసి, ‘‘ఇన్ని బంగారు నాణేలా! అనుకుని తన కళ్లను తానే నమ్మలేకపోయాడు. వాటిని లెక్కించడం ప్రారంభించాడు. చాలా సార్లు లెక్కపెట్టిన తర్వాత, చివరకు అందులో తొంభైతొమ్మిది నాణేలు మాత్రమే ఉన్నాయని నిర్ధారించుకున్నాడు. ఆ చివరి బంగారు నాణెం ఏమైందా అని ఆశ్చర్యపోయాడు.
ఖచ్చితంగా, ఎవరూ తొంభైతొమ్మిది నాణేలను మాత్రమే వదిలిపెట్టరు కదా! అనుకుని, వీలైన ప్రతిచోటా వెతికాడు, కాని ఆ చివరి నాణెం మాత్రం దొరకలేదు. వెతికి వెతికి అలసిపోయి, అతను ఆ చివరి బంగారు నాణెం సంపాదించి, తన వంద నాణాల సేకరణను పూర్తి చేయడానికి గతంలో కంటే ఎక్కువ కష్టపడాలని నిర్ణయించుకున్నాడు.
ఆ రోజు నుండి, ఆ సేవకుడి జీవితం మారిపోయింది!
అతను ఎక్కువ పని చేయడం మొదలుపెట్టాడు, కోపం పెరిగిపోయింది, ఆ వంద వ బంగారు నాణెం సంపాదించడంలో తనకు సహాయపడట్లేదని తన కుటుంబాన్ని దూషించాడు. ఇప్పుడు పని చేస్తున్నప్పుడు పాడటం మానేశాడు. ఈ విపరీతమైన పరివర్తనను చూసి రాజు అయోమయంలో పడ్డాడు. మళ్ళీ తన సలహాదారుని సహాయం కోరినప్పుడు, అతను ఇలా అన్నాడు, "మహారాజా, ఈ సేవకుడు ఇప్పుడు అధికారికంగా తొంభైతొమ్మిది సంఘంలో చేరినట్లు."
ఇలా కొనసాగించాడు, " తొంభైతొమ్మిది సంఘం అనేది సంతోషంగా ఉండటానికి తగినంతగా ఉన్నా కూడా ఎప్పుడూ సంతృప్తి చెందని వారికి ఇవ్వబడిన పేరు. ఎందుకంటే వారు ఎల్లప్పుడూ అదనంగా ఉన్న 'ఆ ఒక్క' దానికోసం తహతహలాడుతూ ఉంటారు. వారు తమకు తాము ఇలా సమాధానపర్చుకుంటూ ఉంటారు,
"నాకు ఈ చివరిది ఒక్కటీ దొరికితే, అప్పుడు నేను జీవితాంతం సంతోషంగా ఉంటాను."
ఆనందం అనేది కోరికల సంఖ్యకు సంబంధించి ఉంటుంది. కోరికల సంఖ్య ఎంత ఎక్కువగా ఉంటే, వాటిని నెరవేర్చుకోవడం అంత కష్టం అవుతుంది, అందుచేత, మన సంతోషం కూడా అల్పంగా ఉంటుంది.
ఆనందం = నెరవేరే కోరికలు / మొత్తం కోరికల సంఖ్య
మనకు అసలు కోరికలే లేనప్పుడు ఏమి జరుగుతుందో ఒకసారి ఆలోచించండి?
ఈ సమీకరణంలో, హారసంఖ్య (డినోమినేటర్) సున్నా అవుతుంది. మనం దేనిని సున్నాతో భాగించినా అది అనంతానికి దారి తీస్తుంది. మన కోరికలు సున్నా అయితే, మన ఆనందానికి అవధులుండవు.
ఈ స్థితిలో మనం ఏమీ ఆశించం. బదులుగా, మనకు ఇప్పటికే ఉన్నదానితో సంతోషకరమైన జీవితాన్ని అనుభవిస్తాం.
♾️
అనంతమైన సంతోషం, అనంతమైన ఆనందం కావాలంటే, మన కోరికలను కనిష్టంగా, తక్కువగా, చివరకు శూన్యమయ్యేదాకా తగ్గించుకోవాలి! సంతృప్తే అసలైన పరిష్కారం! 🌼
*దాజి*
హార్ట్ ఫుల్ నెస్ ధ్యానం 💌
HFN Story team
No comments:
Post a Comment