Friday, July 25, 2025

 *కాశీని శపించబోయిన వ్యాసుడు, ఆ తర్వాత ఏం జరిగిందంటే...*

*విశాలాక్షీసమేతుడైన విశ్వనాథుడు కొలువుదీరిన కాశీ నగరంలో కొంతకాలం గడుపుదామని భావించి, శిష్యగణాన్ని వెంటబెట్టుకుని అక్కడకు చేరుకున్నాడు...*

*ఆయన వెంట వచ్చిన శిష్యులలో వైశంపాయనుడు, జైమిని, పైలుడు, సుమంతుడు సహా ఎందరెందరో మహామహులు ఉన్నారు...*

*కాశీలో వ్యాసుడు ఆశ్రమం  ఏర్పాటు చేసుకున్నాడు. రోజూ వేకువ జామునే కాలకృత్యాలు తీర్చుకుని, గంగలో స్నానం చేసి, సంధ్యవార్చి, ఆశ్రమం లో అగ్నికార్యం, అనుష్ఠానం పూర్తయ్యాక మధ్యాహ్నం భిక్షాటన కోసం ఊళ్లో తలోదారిన బయలుదేరేవారు...* 

*కాశీలో వారికిభిక్షకు లోటు ఉండేదికాదు. రోజులు ఇలా గడిచిపోతుండగా, విశ్వేశ్వరుడికి వ్యాసుణ్ణి పరీక్షించాలనిపించింది...*

*‘వ్యాసుడి అంతరంగం ఎలాంటిదో తెలుసుకుందాం. అతడికీ, అతడిశిష్యులకూ ఎక్కడా భిక్ష పుట్టకుండా చేయి’ అని విశాలాక్షితో చెప్పాడు...*

*ఆమె సరేనంది. మరునాడు వ్యాసుడు, అతడి శిష్యులు యథాప్రకారం భిక్షాటనకు బయలుదేరారు. విశాలాక్షి ప్రభా వంతో ఏ ఇల్లాలికీ భిక్ష పెట్టే ఇచ్ఛ లేకుండాపోయింది...*

*వ్యాసుడు ఇల్లిల్లూ తిరుగుతూ గుమ్మం ముందు నిలబడి ‘భిక్షాందేహి’ అని గొంతెత్తి పిలిచినా, కొందరు గృహస్థులు కనీసం తలుపులైనా తీశారు కాదు...*

*వ్యాసుడికిఎదురైన అనుభవమే అతడి శిష్యులకూ ఎదురైంది. కాలే కడుపులతో, ఖాళీ భిక్షపాత్రలత్రతో ఒక్కొక్కరే ఆశ్రమా నికిచేరుకున్నారు...*

*నాకు ఎక్కడా ఒక్క మెతుకైనా పుట్టలేదు. మీలో ఎవరికైనా భిక్ష దొరికిందా?’ శిష్యులను అడిగాడు వ్యాసుడు. ‘లేదు గురుదేవా!ఎవరూ మాకు భిక్ష వేయలేదు’ బదులిచ్చారు శిష్యులు...*

*వ్యాసుడు, అతడి శిష్యులు కడుపులో కాళ్లు ముడుచుకుని పస్తు పడుకున్నారు. మర్నాడు వేకువనే నిద్రలేచి స్నాన సంధ్యాది నిత్య నైమిత్తిక అనుష్ఠానాలన్నీ పూర్తిచేసుకుని మళ్లీ భిక్షకు బయలుదేరారు...*

*ఎక్కడా భిక్ష పుట్టలేదు. సాయంత్రం అయ్యే సరికి అందరూ నీరసంగా ఆశ్రమా నికిచేరుకున్నారు. ఒక రోజు రెండు రోజులు కాదు, వరుసగా ఏడు రోజులు వ్యాసుడికి గాని, అతడి శిష్యులకు గాని కాశీ నగరంలో ఎక్కడా భిక్ష పుట్టలేదు...*

*విశాలాక్షీసమేతుడైన విశ్వేశ్వరుడు కొలువైన కాశీ నగరంలో ప్రతి ఇల్లాలూ ఒక అన్నపూర్ణ అని లోకం చెప్పుకుంటుంటే, తనకు తన శిష్యులకు ఇలా ఉపవాసాలు ఎదురవడం ఏమిటని వ్యాసుడు అమితంగా బాధపడ్డాడు...*

*ఎనిమిదో రోజు వ్యాసుడు, అతడిశిష్యులు నిత్య నైమిత్తికాలు పూర్తిచేసుకుని, కాశీలో కొలువుదీరిన దేవతలందరికీ నమస్కారాలు పెట్టుకుని భిక్షకు బయలుదేరారు. వ్యాసుడికి ఒక్క ఇంటా భిక్ష దొరకలేదు...*

*వరుస ఉపవాసాలతో వ్యాసుడు వ్యాకులపడ్డాడు. తన శిష్యుల దురవస్థ తలచుకుని దుఃఖించాడు. అతడికి సహనం నశించింది. ఉక్రోషం ముంచుకొచ్చింది...*

*నడివీథిలో తన భిక్షపాత్రను రాళ్లకేసి కొట్టిపగులగొట్టాడు. కాశీ వాసులకు మూడు తరాల వరకు విద్య, భక్తి, ధనమూ లేకుండా పోవాలని సంకల్పిస్తూ, కమండలం నుంచి శాపజలం అందుకోబోయాడు...* 

*వణుకుతున్న చెయ్యి ముందుకు రాకుండా నిలిచిపోయింది. అప్పుడే ఆ వీథిలోనున్న ఒక ఇంటి తలుపులు తెరుచుకున్నాయి. సర్వాభరణ భూషితురాలైన ఒక నడివయసు స్త్రీ ఆ ఇంటి నుంచి బయటకు వచ్చింది...* 

*'ఓ బ్రాహ్మడా! ఏమిటీ అఘాయిత్యం! కోపం మాని ఇలారా’ అని పిలిచింది. ఆమె పిలుపుతో వ్యాసుడు తెప్పరిల్లాడు. ఆమె ఎవరో కనుక్కోకుండానే అప్రయప్రత్నంగా నమస్కరించాడు...*

*‘భిక్ష దొరకనంత మాత్రాన కాశీ నగరాన్ని శపించేయడానికి సిద్ధపడ్డావే! ఇది నీకు విశ్వేశ్వరుడు పెట్టిన పరీక్ష. ఇదేనా నీ ధీరత్వం?ఏడురోజులు భిక్ష దొరకనంత మాత్రానికే నీ స్థైర్యం సడలిందేం?’ అని మందలిస్తూ, ‘మధ్యాహ్నానికి వస్తే, భిక్ష పెడతాను’ అంది...*

*'తల్లీ! నన్నొక్కణ్ణేనా? నా శిష్యులను కూడానా? నాతో పాటేవాళ్లూ వారం రోజులుగా ఆకలితో అలమటిస్తున్నారు’ అన్నాడు వ్యాసుడు...*

*‘గంగ వద్ద మధ్యాహ్న పూజలు ముగించుకుని అందరూ రండి. కడుపు నిండా భోజనం పెడతాను’ అందామె‌...*

*మధ్యాహ్నం వెళ్లగానే విస్తర్లు వేసి, అందరూ ఆపోశనలు పట్టండని చెప్పింది. విస్తర్లు ఖాళీగా ఉన్నాయి. ఆపోశనలు పట్టగానే విస్తర్లలో ఎవరికి ఇష్టమైన పదార్థాలు వారికి ప్రత్య క్షమయ్యాయి...*

*ఈమెసాక్షాత్తు అన్నపూర్ణాదేవి అయి ఉంటుందనుకుని అందరూ తృప్తిగా భోజనం చేశారు...*

*భోజనాలు పూర్తిచేసి విశ్రమిస్తుండగా, పార్వతీ సమేతంగా శివుడు అక్కడ ప్రత్య క్షమయ్యాడు. పార్వతీదేవి ప్రశాంతంగానే ఉన్నా, శివుడిముఖం కోపంతో చిరచిరలాడుతూ ఉంది...*

*శివుడు వ్యాసుణ్ణి కోపంగా చూస్తూ ‘ఓరీ దుర్మార్గుడా! నా భార్యలాంటి కాశీ నగరానికే శాపం ఇవ్వబోతావా? నువ్వు కాశీలో అడుగు పెట్టడమే ద్రోహం. నువ్వూ నీ శిష్యులూ కాశీ పొలిమేరలు దాటివెళ్లండి’ అన్నాడు...*

*చేసిన తప్పుకు బాధపడుతూ వ్యాసుడు శిష్యులతో సహా కాశీ నగరాన్ని విడిచిపెట్టాడు...*

*┈━❀꧁ఓం నమఃశివాయ꧂❀━┈*
         *SPIRITUAL SEEKERS*
🌊☘️💦 🙏🕉️🙏 💦☘️🌊

No comments:

Post a Comment