Saturday, August 23, 2025

 *ద్వారక అస్తమయం -1*
🪸

రచన : దినకర్ జోషి

అనువాదం : ఏ. విజయలక్ష్మి


*ముందుమాట*

శ్రీకృష్ణుని జీవితం గురించి మహాభారతం లోనూ, శ్రీమద్భాగవతంలోనూ, హరివంశ పురాణంలోనూ, విష్ణుపురాణంలోనూ, మరెన్నో పౌరాణిక గ్రంథాల్లోనూ ఉంటుంది. ఇది కాక వీటి మీద ఆధారపడి వచ్చిన సాహిత్యం మరెంతో ఉంది. తమతమ సిద్ధాంతాలకు, అభిప్రాయాలకు అనుగుణంగా విశ్లేషిస్తూ, వ్యాఖ్యానిస్తూ మరెన్నో రచనలు వచ్చాయి. కొన్ని సందర్భాల్లో కథలో కొత్త సంఘటనలు, సన్నివేశాలు వచ్చి చేరాయి. మరికొన్ని చోట్ల మూలాన్నే అనుసరించినా ఔచిత్యా నుగుణంగా, వివరణాత్మకంగా కవులు తమ రచనలు సాగించారు.

మహాభారత యుద్ధానంతరం 36 సంవత్సరాల తరువాత యదువంశం నశించింది. ఇది అన్ని గ్రంథాల్లోనూ పేర్కొనబడిన వాస్తవం. ఈ కాలమంతా శ్రీకృష్ణుడు ద్వారకలోనే ఉన్నాడు. ఈ వ్యవధిలో ఆయన చేసిన ఏదైనా విశేష కార్యం కానీ, ఘటన కానీ మనకు ఎక్కడా కనిపించదు. అంతేకాదు, ఈ సుదీర్ఘ కాలంలో ఆయన ద్వారకదాటి హస్తినా పురానికిగానీ, మరెక్కడికైనాగానీ వెళ్లినట్లు గానీ, తన ప్రియసఖుడైన అర్జునుణ్ణి కలిసినట్లుగానీ మనకు కనిపించదు. సుదీర్ఘకాలం జీవించాక, ఆఖరి ఘడియలు ఓ కుటుంబ పెద్దలాగా, నిర్వికారభావంతో గడిపినట్లు, శ్రీకృష్ణుడు జీవించి ఉంటాడని అనిపిస్తుంది.

ఈ ముప్పై ఆరు సంవత్సరాల కాలానికి సంబంధించి దొరికిన వివరాల ఆధారంగా వీటికో కథారూపం ఇచ్చే ప్రయత్నం చేశాను. శాస్త్రోక్తమైన కథలు రాస్తున్నప్పుడు అవి కేవలం విశుద్ధమైన సాహిత్య పరంగానే ఉంటాయి. కానీ వాటికి కళను జతపరిచినప్పుడు కొంతైనా కాల్పనికత, తిరిగి వాటిని మూలానికి దగ్గరగా అనుసంధానం చేయడం అనివార్యమౌతుంది. నాయీ భావ స్వాతంత్ర్యాన్ని సహృదయులైన పాఠకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాను.

దినకర్ జోషి
(రచయిత)


*ద్వారక అస్తమయం  -1*
🍁

కృష్ణ పక్షపు అష్టమిచంద్రుడు క్షితిజ నియమాలను ఉల్లంఘించి, వెల్లివిరిసిన ఆకాశాన్నుంచి తొంగిచూస్తుండగా మధ్యా కాశాన స్వాతి నక్షత్రం సాగరుని పైకి వంగి ఉంది - మృగశీర్ష విశాలమైన పాలపుంత లో నుంచి ద్వారక దుర్గపై ప్రతిబింబించే మసక వెలుతురును తిలకిస్తున్నది. పాలపుంతలోని నక్షత్రాలు నైమిశారణ్యం లో ఏదో జ్ఞాన గోష్ఠిలో విరాజితలై వేదా ధ్యయనం గావిస్తున్న మహర్షులవలె దేదీప్యమానంగా ఉన్నాయి. ద్వారక దుర్గాన్ని ఒకవైపు నుంచి చుట్టి ముట్టడించి న సముద్రపు అలలు అలసిపోయి, క్షణకాలం శాంతించినట్లున్నాయి.

కుశస్థలి, ద్వారామతి లేదా ద్వారకగా ఆర్యావర్తంలో ప్రసిద్ధిచెందిన ఈ నగరికి నాల్గు వైపులా ఏర్పాటు చేసిన కాపలా దార్లు తమ పరస్పర సంకేతాలు పూర్తి చేసుకున్నారు. రాత్రి నాల్గవ ఝాము ఆరంభమవడానికి ఇంకాస్త సమయం మిగిలి ఉన్నది.
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
కృష్ణభవంతిలో, శయనాగారంలో నిద్రిస్తున్న కృష్ణునికి అకస్మాత్తుగా మెలుకువ వచ్చింది. తెరచి ఉన్న గవాక్షం లో నుంచి కృష్ణుడు, ఆకాశాన్ని చూశాడు. అంతులేని ఆకాశంలో ఏదో సరిహద్దు రేఖ గోచరించినట్లు, ఆయన తన దృష్టిని మరల్చుకున్నాడు. చందన తల్పంపై శయనించి కృష్ణుడు మెల్లగా ప్రక్కకు తిరిగాడు. ఎడమవైపు నిద్రిస్తున్న రుక్మిణీ దేవి వైపు చూశాడు. రుక్మిణీదేవి గాఢ నిద్రలో ఉన్నట్లుంది. ఆమె ప్రశాంత నిద్రకు భంగం కలుగకూడదని, కృష్ణుడు అతి మెల్లగా తన కాళ్లు కిందపెట్టాడు. పాదుకల దగ్గర చరణాలు ఆగిపోయాయి. పాదుకల సవ్వడితో రుక్మిణికి మెలుకువ వస్తుందే మోనని పాదుకలు తొడుగుకోలేదు. భుజం పై ఉత్తరీయాన్ని సరిచేసుకొని క్షణకాలం తన కుడిపాదం చూసుకున్నాడు. అరచేత్తో కృష్ణుడు తన అరికాలు తడిమాడు. ఆయన ముఖంలో విషాదంతో కూడిన చిరునవ్వు తొంగిచూసింది. మరోసారి ఆకాశం వైపు చూశాడు. ముఖం ప్రక్కకు తిప్పి రుక్మిణి వైపు చూశాడు. భవంతిలో  సాయంకాలం ఆలస్యంగా వెలిగించిన కాగడాల కాంతి మందగించసాగింది. ఆ కాంతిలో సాగినట్లు కనిపిస్తున్న తన ప్రతి బింబాన్ని చూస్తూ మెల్లగా శయనాగారపు గవాక్షం దగ్గరికి వచ్చాడు కృష్ణుడు, అక్కడ నిల్చుని, నిద్రిస్తున్న ద్వారక తూర్పు దిశను చూశాడు. తూర్పున ఉన్న రైవతక పర్వతపు ఉన్నత శిఖరాలు ద్వారకకు ఆ వైపు నుంచి ఏ మాత్రం ఛేదించడానికి వీలు లేనంత రక్షణనిస్తున్నాయి. రేవత రాజు వారి ఈ పట్టణం ఎంత సురక్షితమైనదో కృష్ణునికి జ్ఞాపకం వచ్చింది. కానీ నేడు ఎందుకింద రక్షణలేని భావం! కృష్ణునికి అర్ధం కాలేదు!

నిద్రిస్తున్న ద్వారకను చూశాడు కృష్ణుడు. పన్నెండు యోజనాల విస్తీర్ణం కలిగిన ఈ నగరిలో కృష్ణభవంతికి కుడివైపున ఎర్రని మణులతో అలంకరింపబడిన రుక్మిణీదేవి మహలు ఉంది. ఎడమప్రక్కన ధవళ కాంతితో మెరుస్తున్న రాణీ సత్యభామ పాలరాతి భవంతి ఉంది. పాలతో కడిగి నంత తెల్లగా ఉంది రాణి సత్యభామ భవంతి!, దానికి కాస్తంత దూరంలో తల్లి దేవకి, తండ్రి వసుదేవుల నివాసగృహం "కేతుమాన్" ఉంది. ఎంతో కాలంగా తన తల్లిదండ్రులు అక్కడ తమ చరమ జీవితాన్ని గడుపుతున్నారు. కృష్ణభవంతికి దక్షిణాన 'విరజ' పేరుతో ఒక భవంతి ఉంది. అది కృష్ణుని ఉపస్థానగృహం. విశ్వకర్మ ఈ 'విరజ' మహాలయాన్ని ఏ విధంగా నిర్మింపజేశాడంటే దానిలో రజో, తమో గుణాలు ప్రవేశించలేవు. ఈ భవంతులన్నింటిపై పొదిగిన స్వర్ణ, రత్న కాంతులు చంద్రుని మసక వెన్నెలలో కాంతిని కోల్పోయాయి.
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
కృష్ణుడు ద్వారకపై విహంగ దృష్టిని సారించాడు. దక్షిణాన 'లతావేష్టి' అనే పేరు గల పర్వత సానువులోని పరిపూర్ణంగా నిండిన సరోవరం కృష్ణ భవంతి నుంచి కనిపిస్తున్నది. మానససరోవరం నుంచి నారదుడు స్వయంగా తెచ్చిన బ్రహ్మ కమలాన్ని సత్యభామ ఈ సరోవరంలోనే నాటింది. కాలక్రమంలో ఈ సరోవరం మరెన్నో కమలాలతో నిండిపోయింది. కృష్ణుడు ఉత్తరాన ఉన్న 'వేణుమంత' పర్వతం చుట్టు ప్రక్కల వ్యాపించి వున్న చైత్రకవనాన్ని చూడసాగాడు. కృష్ణుడు స్వయంగా ఇంద్రుని ద్వారా పొందిన పారిజాతాన్ని ఈ వనంలోనే నాటాడు. ఆ ఒక్క మొక్క ఈనాడు ఓ పెద్ద వనంగా రూపుదిద్దుకున్నది. మరెన్నో దిక్కులలో ఉన్న నందనవనం, మిశ్రకవనం, విభ్రాజ వనాలు ఎంతో అందంగా కనిపిస్తున్నాయి. కృష్ణుడు క్షణకాలం కళ్లు మూసుకున్నాడు. మరొక్కసారి తన పాదాల వైపు చూశాడు. మళ్లీ ఆయన ముఖంలో విషాదంతో కూడిన మందహాసం! మరుక్షణంలో ఆ మందహాసం మటుమాయం అయింది. ఆయన ఆకాశం వైపు చూశాడు. రాహు- కేతువులు స్వాతిని దాటి దగ్గరికి
వచ్చేశాయి. కృష్ణుడు కన్నార్పకుండా రాహు-కేతువుల మధ్య దూరాన్ని కొలిచేందుకు ప్రయత్నం చేశాడు.

తన వెనుక ఏదో కదలిక గమనించి, కృష్ణుడు వెనుదిరిగి చూశాడు. రుక్మిణీదేవి తన భర్త వద్దకు వచ్చి నిలబడింది. ఆమె అక్కడికి వచ్చి ఎంతోసేపైనట్లనిపించింది కృష్ణునికి.

“లేచారాదేవీ?" "బ్రహ్మముహూర్తానికి ఇంకా సమయమున్నది కదా!”.

“మీకు తెలిసిన నిజము నాకు తెలియ కున్నది స్వామీ!" రుక్మిణి కృష్ణుని చరణాల వైపుకు కాస్తంత వంగి “మీకు ఇంత త్వరగా ఎలా మెలుకువ వచ్చింది!" అని ప్రశ్నించింది.

కృష్ణుడు చిరునవ్వుతో మెల్లగా “దేవీ! నేను మేలుకున్నాను, సరే, మీకు మెలుకువ రాగూడదనే, అతి మెల్లగా నేను పాన్పు వదిలి ఇక్కడ నిలుచున్నాను. కానీ మీకెలా మెలకువ వచ్చింది?" అన్నాడు.

“మీరు త్యజించిన శయ్య నుంచి వెలువడిన నిట్టూర్పు గాలితో కలిసి నా హృదయాన్ని బరువెక్కించగా నా నిద్ర భంగమయ్యింది. శయ్యపై స్వామియే లేకుంటే దాన్ని తాకే గాలి కూడా భారంగా ఉంటుంది. ఇక మరి నాకు నిద్ర ఎలా పడుతుంది స్వామీ!"

కృష్ణుడు బదులివ్వలేకపోయాడు.

“ఇదేమి వాసుదేవా! పడక వదిలారు, కానీ పాదుకలు?" రుక్మిణీదేవి దృష్టి కృష్ణుని పాదాలపై బడింది.

కృష్ణుడు పాదుకలు లేని తన పాదాల వైపు మరోసారి చూసుకున్నాడు. ఈసారి ఆయన ముఖం పైన చిరునవ్వు కాంతి మెరిసింది.

"ఆఁ అర్థమైంది, రుక్మిణికి ఏదో రహస్యం తెలిసినట్లు - మీ పాదుకల సవ్వడి నా నిద్రకు భంగం కలిగిస్తుందనేగా, కానీ స్వామీ మీరు ప్రక్కన లేని లోటు తెలియదా నాకు!" అంది.
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
“మీకు నా అంతఃకరణ తెలుసు దేవీ!"

“మరెందుకో, మీ అంతఃకరణకు నేను చాలా దూరంలో ఉన్న భావన నిరంతరం నన్ను వెంటాడుతూనే ఉంటుంది."

"ఇదే మనిషి జీవితంలోని వైషమ్యం! ఎక్కడో ఎవ్వరో దగ్గరున్నట్లు అనిపిస్తుంది. మరికొన్నిసార్లు వాళ్లు మనకు బహు దూరంలో ఉన్నట్లు అనిపిస్తారు."

"దేవా, బ్రహ్మ ముహూర్త సమయంలో మీతో వివాదమా”, అంటూ రుక్మిణి తన విశాల నేత్రాలు కృష్ణుని ముఖంపై కేంద్రీకృతం చేసింది.

బ్రహ్మముహూర్తం వేళలో వీస్తున్న శీతల పవనాలు కృష్ణుని ఉత్తరీయాన్ని కదిలిస్తున్నాయి.

"కానీ స్వామీ, ఇంతకు మీరు ఈ అర్ధరాత్రి సమయాన ఎందుకు మేలుకున్నారో చెప్పనేలేదు!"

క్షణకాలం ఆమె వంక చూస్తూ ఆ తరువాత అన్నాడు కృష్ణుడు. "నాకో దుఃస్వప్నం వచ్చింది దేవీ! అది నా నిద్రను భంగం చేసింది”

"దుఃస్వప్నమా!" రుక్మిణి ఆశ్చర్యపోయింది. 

“దుఃస్వప్నాలు మిమ్ములను బాధించగల వా ప్రభూ! తమరు స్వప్న - సృష్టికే అతీతులు. అస్సలీ దుఃస్వప్నం, మీ నిద్రా కక్షలోనికి ఎలా ప్రవేశించగలిగింది?"

"ఏమో, అది దుఃస్వప్నం కూడా కాదేమో" అంటూ కృష్ణుడు "అది స్వప్నం కాని ఎడల, దాన్ని సత్యంగా స్వీకరించినట్లైతే దాని వల్ల మరో కఠిన సమస్య ఏర్పడే అవకాశం ఉంది" అన్నాడు.

"అసలేమి జరిగింది దేవా?" ఈసారి రుక్మిణి కంఠంలో ఆవేదన ధ్వనించింది.
🪾
*సశేషం*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
*కథల ప్రపంచం* 

https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe

*తెలుగు భాషా రక్షతి రక్షితః* 

*ఏడాది చందా 120/-, ఫోన్ పే & గూగుల్ పే నెంబర్ 9849656434*

*1 YEAR* *SUBSCRIPTION 120/-*
*phone pe & Gpay to 9849656434*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂

No comments:

Post a Comment