Friday, August 1, 2025

 అయాం ఎ బిగ్ జీరో ( 200) : భండారు శ్రీనివాసరావు

ప్రయాణంలో పదనిసలు 

సుమారు ఏడు వారాల పాటు అమెరికాలో వుండిరావడం బాగానే వుంది కానీ సియాటిల్ నుంచి దోహా వరకు ఏకబిగిన పదిహేను గంటలు,  కాళ్ళూ చేతులు కట్టిపడేసినట్టు కూర్చోవడం ఏదైతే వుందో అదొక్కటే నా బోటి వయసువాళ్ళకు, కొంచెం ఏమిటి బాగానే ఇబ్బంది. వై ఫై ఇవ్వడం వల్ల మొత్తం విమానంలోని వారందరూ గాఢనిద్రలో వున్నా నాకు కాలక్షేపానికి లోటులేకుండా పోయింది. 199 వ ఎపిసోడ్ ఫ్లయిట్ లోనే పూర్తి చేశాను. నిద్ర లేకుండా గడపడం అలవాటే కనుక ఆ ఇబ్బంది లేదు. 

సియాటిల్ లో సెక్యూరిటీ లేడీ ఒకరు నన్ను ఆట పట్టించింది. నేను కూడా ఆమెలోని స్పాంటేనియస్ విట్టీని పూర్తిగా ఆస్వాదించాను.

సెక్యూరిటీ గేటులో పాద ముద్రలు వున్నచోట నిలబడమని చెప్పింది. నిలబడ్డాను. తల పైకి ఎత్తమంది. ఎత్తాను.  మెడ అటూఇటూ వంచమంది. ఫేషియల్ రికగ్నిషన్ కోసం అనుకున్నాను. చేతులు రెండూ పైకి ఎత్తమని ఎలా చేయాలో తాను చేసి చూపించింది. అలాగే చేశాను. ఇక అప్పుడు మొదలైంది. కథాకళి, భరత నాట్యం, కూచిపూడి. తాను నడుం మీద చేతులు పెట్టుకుని ఒక పక్కకు, అలాగే  మరో పక్కకు వంగింది. వెనక్కు, ముందుకు ఇలా ఎన్నో భంగిమలు. నవ్వుతూ  తాను చేసి  చూపించడం, ఏడవలేక నవ్వుతూ నేను చేస్తూ పోవడం ఇలా ఈ తంతు సాగింది. ఈలోగా మరో సెక్యూరిటీ మనిషి పెద్దగా నవ్వుకుంటూ, వచ్చి లోపలకు వచ్చేయమని నాకు  సైగ చేశాడు. డ్యూటీలో స్ట్రెస్ తగ్గించుకోవడం అప్పుడప్పుడూ  ఇలా చేయడం ఆమెకు అలవాటని అన్నాడు. ఆమె కూడా ‘సొ యు ఫినిషుడ్ యువర్ యోగా టుడే’ అంది నవ్వుతూ. 

ఈ హడావిడిలో నా హాండ్ లగేజి వున్న ట్రే వచ్చింది. దాన్ని మరింత క్షుణ్ణంగా శోధించడం కోసం పక్కనబెట్టారు. తీరా చూస్తే అందులో మా కోడలు నాకోసం ప్యాక్ చేసిన పులిహోర, పెరుగు డబ్బాలు  వాళ్ళ కంటపడ్డాయి. అదన్నమాట ఆపడానికి కారణం అని బోధపడింది. దానిమీద మా కోడలు ‘హోం మేడ్ ఫుడ్, ఆన్ డాక్టర్స్ అడ్వైస్’ అని రాసి పెట్టడంతో వాళ్ళు వాటర్ బాటిల్ ఒక్కటి డస్ట్ బిన్ లో పడేసి హ్యాపీ జర్నీ చెప్పి పొమ్మన్నారు. 
అదో స్నానాల రేవులా వుంది.

ప్రతివాళ్లు తాము సెక్యూరిటీ ట్రేలల్లో వదిలేసిన  లాప్ టాప్ లు, ప్యాంటు బెల్టులు, మొబైల్ ఫోన్లు, చేతి గడియారాలు, పెన్నులు, ఉంగరాలు, పర్సులు, ఓవర్ కోట్లు  వగైరా వగైరా  కలెక్ట్ చేసుకునే హడావిడిలో వున్నారు. ఆడ ప్రయాణీకుల పరిస్థితితో పోలిస్తే కొంచెం నయమే అనిపించింది.  ఈ క్రమంలో మా వాడు కొనిపెట్టిన బ్లాక్ డయల్ రిస్ట్ వాచీని ట్రేలో వదిలేశాను. 

ఈ లోగా వీల్ చైర్ వాడు రావడంతో హ్యాండ్ బ్యాగ్ పట్టుకుని చైర్ లో కూర్చొన్నాను. ఒక మనిషి దర్జాగా కూచుంటే, మరో మనిషి నెట్టుకుంటూ వెళ్ళడం బాధ అనిపించింది. కానీ తప్పదు. వీల్ చైర్ సౌకర్యం వుంటే సెక్యూరిటీలో వెయిటింగ్ వుండదు. వెళ్ళాల్సిన గేటు దగ్గరకు సులభంగా చేరవచ్చు. ఇది కాక ఎయిర్ పోర్ట్ లో  టెర్మినల్స్ నడుమ ప్రయాణీకులను చేర్చే షటిల్ ట్రైన్స్ లో ప్రయాణం, లిఫ్ట్ లు ఎక్కడం, దిగడం సులువు అవుతుంది. అందుకని పిల్లలు చేసిన ఈ ఏర్పాటు వల్ల సమయం బాగా కలిసి వచ్చింది. టైం వుండడం వల్ల భావన నాకోసం పడ్డ శ్రమకు న్యాయం చేస్తూ పులిహార తిని ఆ డబ్బాలు డస్ట్ బిన్ లో పడేసాను. 

దోహాలో ఈ వీల్ చైర్ సౌకర్యం మరింత పకడ్బందీగా వుంది. సూట్లు, బూట్లు, టైలు కట్టుకుని ప్రత్యేక యూనిఫారాల్లో సిబ్బంది చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ప్రయాణీకులను చేరవేశారు. నిరుడు వచ్చినప్పుడు నాకు ఈ సదుపాయం వున్నా కూడా వాడుకోలేదు. నడక అలవాటు లేని బాపతు కనుక అంతంత దూరాలు నడవలేక చాలా ఇబ్బంది పడ్డాను. 

ఈ ప్రయాణాల్లో పైకి కనపడని మరో ఇబ్బంది గడియారంలో సమయాలు ముందుకు వెనక్కీ మారిపోతుంటాయి. నా వాచీ కృష్ణార్పణం కనుక టైము గురించి తెలుసుకోవాలంటే మొబైల్ ఒక్కటే శరణ్యం.  పగలో, రాత్రో ఏమీ అర్ధం కాదు. వాళ్ళు పెట్టేది లంచో డిన్నరో తెలియక భోజనానికి ముందు తర్వాత టాబ్ లెట్స్ వేసుకునేవాళ్ళు అయోమయంలో పడతారు. ఎదురుగా వున్న స్క్రీన్ మీద ఓహో ఇన్ని సముద్రాలు దాటుతున్నాము, ఇన్ని దేశాల మీదుగా ప్రయాణిస్తున్నాము అని సంతోషపడుతూ కాలం దొర్లించడమే.

విమానం ఎక్కి సీటు బెల్టు పెట్టుకోగానే చేసిన మొదటి పని సెల్ఫీ తీసుకోవడం. ఆ మధ్య ఏదో విమాన ప్రమాదం తర్వాత ఒకాయన, ఫేస్ బుక్ లోనే అనుకుంటా,  ఉచిత సలహా ఇచ్చాడు, విమానం బయలుదేరే ముందే  సెల్ఫీ తీసుకుంటే మీ జీవితంలో ఆఖరి ఫోటో మీ వారసులకు జ్ఞాపకంగా ఇచ్చే ఛాన్స్ ఉంటుందని. పది పన్నెండు తీసిన తర్వాత బోధ పడింది, అవి డి కంపోజుడ్ డెడ్ బాడీ లాగా వచ్చాయని. దాంతో వాటిని పోస్టు చేసే ప్రయత్నం మానుకున్నాను. 

ఖతార్ ఎయిర్ లైన్స్ వాళ్ళు వైఫై ఇవ్వడం వల్ల, మిగతా వాళ్ళు సినిమాలు చూస్తుంటే, నేను రాసుకుంటూ కూర్చున్నాను. ఆరగా ఆరగా అడపాదడపా  ఏదో తాగడానికి, తినడానికి ఇస్తూనే వున్నారు. కాసేపటి తర్వాత దాదాపు ప్రయాణీకులు అందరూ నిద్రలోకి జారుకున్నారు. లంకలో హనుమంతులవారు చూసిన రాక్షస స్త్రీల శయ్యామందిరం మాదిరిగా వుంది విమానం.  

దోహా నుంచి హైదరాబాద్ కు అదే ఎయిర్ లైన్స్ విమానం. కానీ ఈసారి ప్రయాణంలో వైఫై లేదు. కారణం అడిగితే ఒక ఎయిర్ హోస్టెస్ నా సీటు పక్కన మోకాళ్ల మీద వంగి కూర్చుని చంటి పిల్లాడికి చెప్పినట్టు ఏదో చెప్పసాగింది. నాకు చాలా ఇబ్బందిగా అనిపించి ఇట్స్ ఓకే అనేశాను. ఆమె చెప్పేదానికి, నేను అన్నదానికి పొంతన కుదరలేదేమో నావేపు విచిత్రంగా చూసి లేచి వెళ్ళిపోయింది. నేను తప్పనిసరై ఒకటి రెండు మలయాళం సినిమాలు, పేర్లు తెలియకపోయినా పెట్టుకుని చూస్తూ కూర్చున్నాను. 

తెల్లవారుఝాము అనాలో అర్ధరాత్రి అనాలో,   ఉదయం రెండు గంటలకల్లా హైదరాబాదు వచ్చేసింది. విమానం రన్ వే మీద ఉండగానే నా మొబైల్ లో ఎయిర్ టెల్ నెట్ వర్క్ పలకరించింది. అమ్మయ్య అనుకుని, ఫార్మాలిటీస్ ముగించుకుని ఉబెర్ లో మూడు గంటలకల్లా ఎల్లారెడ్డి గూడాలోని మధుబన్ చేరుకున్నాను.   ఎయిర్ పోర్ట్ లో కారు ఎక్కేముందే ఫోన్ చేశాను కనుక మా వాచ్ మన్ సమ్మయ్య గేటు తీశాడు. సామాను భద్రంగా లిఫ్ట్ దగ్గరపెట్టి ఉబెర్ డ్రైవర్  వెళ్ళిపోయాడు. 

శుభం కార్డు పడింది అనుకునే లోగా భశుం అనే బాపుగారి కార్టూన్ కనిపించింది. అదీ ఎక్కడకు వెళ్ళలేని,  తొలిపొద్దు కూడా పొడవని వేళలో. 
ఇంటి తాళాలు సియాటిల్ లో మరచిపోయి ఇండియాకు వచ్చాను. 

కింది ఫోటో: 
బాపు గారి కార్టూన్ . వారికి వేనవేల కృతజ్ఞతలతో 

(ఇంకావుంది)

No comments:

Post a Comment