*అవతార్ మెహర్ బాబా - 59*
🪷
రచన: బి. రామకృష్ణయ్య
*ద్వితీయాంధ్ర దేశ పర్యటన*
గుడివాడ పట్టణంలో దాహంగా ఉందని, సోడా కావాలని బాబా అడిగారు. దాని కోసం కారు ఆపారు. సరిగ్గా అదే చోట ఒక వృద్ధుడు ఒక చేతిలో అరటి పళ్ళు, ఒక చేతిలో లాంతరు పట్టుకుని ఉన్నాడు. బాబాను చూడగానే ముందుకు వచ్చి అరటిపళ్ళు బాబా చేతిలో పెట్టాడు. బాబా ఆ కానుకను స్వీకరించి అతనికి దర్శనం ఇచ్చారు. తనకు ప్రియమైన వారి కోర్కెలని ఎలా తీరుస్తారో ఎంత సహజంగా కలుగజేస్తారో మన ఆలోచనలకు కూడా అందని విషయం. ఆ వృద్ధుడు ఎంతసేపటి నుండి నిలబడ్డాడో అతని హృదయంలో ఎంత ప్రేమ ఉందో సర్వజ్ఞుడైన బాబాకు మాత్రమే తెలుసు కదా! కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత దుర్గా కూల్ డ్రింక్స్ షాపు ముందు ఆపి బాబాకు సోడా తెచ్చి ఇచ్చారు. ఆ షాపు యజమాని బాబాకు ప్రణమిల్లి సోడాకు డబ్బు పుచ్చుకోనంటే బాబా తమ ప్రసాదంగా తీసుకొమ్మని ఇచ్చారు. మండలి వారందరు అలా చల్లని పానీయాలు త్రాగారు. బాబా దిగి ఆ షాపు లోకి వెళ్ళి వచ్చారు. బాబా పనికి ఆయన ఎన్నుకున్న మార్గాలు మనకవగతం కావు గదా! ఆ రాత్రి 22.02.54 రోజు రాత్రి 11 గంటల తర్వాత బాబా ఏలూరు చేరుకున్నారు. కట్టా సుబ్బారావు తోటలోనే క్రిందటి మాదిరిగా అన్ని ఏర్పాట్లు చేయబడ్డాయి.
23.02.54 రోజు ఉదయం కట్టా సుబ్బారావు తోటలో అక్కడికి వచ్చిన వారికి దర్శనమిచ్చారు. బాబా సందేశాలు విని భజనలు పాడారు. సాయంత్రం రామకోటి వద్ద అలంకరించిన పెద్ద పందిరిలో బాబా దర్శనమిచ్చారు. రాత్రి 8 గంటలకు కళాశాల విద్యార్థినులు దశావతారాలు మొదలైన నాట్యాలు ప్రదర్శించారు. మండపాక గంగాధరం అను కళాకారుని ఈల పాటలు కూడా విని బాబా ఆనందించారు. ఒక మౌన స్వామి ఏలూరులో బాబా 1953లో వచ్చినప్పుడు బాబా కుటీరము వద్ద సేవ చేస్తూ ఉంటానని చెప్పి అచ్చట తనకు సరియైన సదుపాయాలు కల్పించలేదని ఏలూరు విడిచి వెళ్ళిపోయాడు. తన ఆదేశాలు పాటించనందుకు బాబా అసంతృప్తిని వెలిబుచ్చగా ఆ స్వామి విలపించాడు. బాబా అతని నాలింగనం చేసుకొని మళ్ళీ తన ఆదేశాలనిచ్చారు.
24.02.54 రోజు ఉదయం ఏలూరులో 60 మంది ప్రేమికుల ఇళ్ళకు వెళ్ళారు. కార్యక్రమం ప్రకారం వెళుతూ మధ్యలో బాబా తన కారును దారి మళ్ళించి ఒక స్కూల్లోనికి తీసుకొనివెళ్ళారు. అందరూ బాబా వెనకాలే వెళ్ళారు. బాబా ఎక్కడికి వెళుతున్నారో ఎవరికీ తెలియదు. ఏలూరు పట్టణంలోని దారులు బాబాకి తెలియవని కార్యకర్తలు అనుకున్నారు కాని సర్వజ్ఞుడైన బాబాకు తెలియనిదేది? అన్ని తెలిసి బాబా ఏమీ తెలియనట్లుంటారు. స్కూల్ లోనికి వెళ్ళగానే బాబా కారు దిగి నడిచి వెళ్ళి ఒక తరగతి గది ముందు నిలబడ్డారు. తరగతి గదిలో నుండి దాదాపు 8 సంవత్సరాల వయస్సు గల ఒక కుర్రవాడు పరుగున వచ్చి బాబాపై వాలాడు. బాబా ఆ కుర్రవానిని ఎత్తుకొని ముద్దాడి అక్కున చేర్చుకున్నాడు. ఆ పిల్లవాని ఆనందాని కంతులేదు. ప్రవహించే కన్నీటి ధారతో విలపించాడు. ఆ కుర్రవాడు క్రితం రోజున బాబా కార్యక్రమాల గురించి అచ్చు వేయించి పంచిపెట్టిన కరపత్రాన్ని ఒక దాన్ని చూచి బాబా ముఖంలోని తేజస్సుకు ఆకర్షించబడి తన తండ్రిని బాబా దర్శనానికి తీసుకొని వెళ్ళమని పట్టుబట్టాడు. ఛాందస బ్రాహ్మణుడైన ఆ తండ్రి నేను దేవుడనని చెప్పుకునే ఒక పార్శీ దేవుడి వద్దకు తీసుకొని వెళ్ళడం ఇష్టం లేక ఆ కుర్రవాడిని మందలించాడు. ఆ కుర్రవాడు మాత్రం బాబా దర్శనానికి తీసుకొని వెళ్తేనే గాని భోజనం చేయనని మారాం చేసాడు. అయినా ఆ తండ్రి మనసు కరగలేదు. బాలుడు కూడా తన దర్శనానికై తపన దహించివేసే పట్టు విడువలేదు. రాత్రి భోజనం చేయకుండా పడుకున్నాడు. ఉదయాన్నే బాధతో తన తండ్రి వైఖరి అర్థం గాక హృదయంలో బాబాని తలుచుకుంటూ ఆ పసివాడు విచలిత మనస్కుడై పాఠశాలకు వెళ్ళాడు. వాడి మనస్సంతా బాబా పైనే ఉంది. పాఠశాలలో చెప్పే పాఠాలేవీ వాని మనస్సు లోకి వెళ్ళడం లేదు. సర్వజ్ఞుడు, కరుణామయుడైన బాబా స్వయంగా ఆ పాఠశాలకు వెళ్ళి తన దర్శనానికై తపించే ఆ పసివాడిని తన ఒడిలో చేర్చుకొని తన ప్రేమ సాగరంలో ముంచెత్తాడు. ప్రహ్లాదుని వలె ఆ పరాత్పరుని తన వద్దకే రప్పించు కొన్న ఆ పసివాని ప్రేమ ఎంత మహత్తరమై యుండునో గదా! ఆ పాఠశాలలోని అధ్యాపకులు, విద్యార్థులందరూ ఆ పసివాని కారణాన బాబా దర్శన భాగ్యం పొందారు.
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
బాబా ఏలూరులో ఇంకా ఎంతోమంది ప్రేమికుల ఇళ్ళకు, వారి షాపులకు, కొన్ని పాఠశాలలకు, సాయిబాబా మందిరానికి వెళ్ళారు. వేలాదిమంది బాబా దర్శనం చేసుకున్నారు. తన స్పర్శతో పంచిపెట్టే ప్రసాదం ద్వారా బాబా తన ప్రేమను పంచిపెట్టారు. అర్హతలను బట్టి అందరూ బాబా ప్రేమను స్వీకరించారు. తెలియని ఆనందానుభూతిని పొందారు. బాబా కూడ తన సంతృప్తిని వ్యక్తం చేసారు. ఏలూరులో కట్టా సుబ్బారావు బాబాకు మండలి వారికి ప్రేమతో అన్ని ఏర్పాట్లు చేసి ఆప్యాయతతో మండలి వారికి రక రకాల పదార్థాలని చేయించి తినిపించాడు. నిజంగా కట్టా సుబ్బారావు అవతారుని సేవ నిండు హృదయంతో చేసుకున్న ధన్యజీవి.
ఆ రాత్రి (24.02.54) గం.8.30ని.లకు ఏలూరు నుండి బయలుదేరి భీమడోలు వెళ్ళి అక్కడ ప్రజా దర్శనం ఇచ్చి తాడేపల్లి గూడెం వెళ్ళారు. బాబా ఇచ్చిన మాట ప్రకారం రాత్రి 11.30 గం.లకు బయలుదేరి పెనుగొండకు వెళ్ళి అక్కడ ఇంకా తనకోసం వేచియున్న ప్రజలకు రాత్రి ఒంటి గంటకు దర్శనమిచ్చి ఉదయం గం.3.25 ని.లకు మళ్ళీ తాడేపల్లి గూడెం తిరిగి వచ్చారు.
ఆ రోజు రాత్రి బాబా అందరినీ జాగరణ చేయమన్నారు. పెనుగొండ కార్యక్రమానికి వెళ్ళి రావడంలో అది అప్రయత్నం గానే జరిగిపోయింది. మేలుకొలిపే వానికోసం ఆ రోజు రాత్రి అందరూ మేలుకొని ఆయన సాన్నిధ్యంలో గడిపారు.
📖
*బాబాకు షష్ఠ్యబ్ది పూర్తి*
అరవై సంవత్సరాలు నిండినవారు షష్ఠ్యబ్ది ఉత్సవం చేసుకుంటారు. జనన మరణాల కతీతుడైన అవతారునికి కూడా షష్ఠ్యబ్ది పూర్తి ఉత్సవం చేసే మహదావకాశం ఆంధ్రులకు, తాడేపల్లిగూడెం ప్రేమికులకు ప్రత్యేకంగా డా. ధనపతిరావు దంపతులకు కలుగజేసారు బాబా. 25.02.54 ఉదయం బాబా రాగానే వారు బాబాకు ఎదురేగి పూలదండలు వేసి సాదరంగా లోపలికి ఆహ్వానించారు. ఆ కొద్దిసేపు అక్కడ ఉన్న వారికి బాబా పాదాలకు ప్రణామం చేయడానికి అనుమతించారు. తరువాత ఇంటిలోనికి వెళ్ళి కూర్చున్నారు బాబా. సరిగ్గా 5 గంటలకు ఈరుచ్ ఆంగ్లంలో, రంజూ ఉర్దూలో, ఢాకే మరాఠీలో బాబా ఆజ్ఞ ప్రకారం పశ్చాత్తాపప్రార్థన చదివారు. బాబా తాను స్వయంగా అందరి బలహీనతలను క్షమించమని అడిగానని, అందరు క్షమించబడ్డారని ఆ రోజు నుండి ఎవరి చేతలకు వారే బాధ్యులని చెప్పారు.
డా. ధనపతిరావు దంపతులు బాబా పాదాలను తేనె, పాలు, నెయ్యి మొదలగు పంచామృతాలతో కడిగారు. 'త్వరగా నీళ్ళు పోసి నా కాళ్ళు కడగండి లేకపోతే చీమలు పట్టుకుంటాయి' అని బాబా హాస్యంగా అందరినీ నవ్వించారు. 'కాళ్ళు కడిగిన నీటిని ఎవ్వరూ త్రాగరాదు. తలపై పోసుకోరాదు. బయట పోయించండి' అని చెప్పారు. పిళ్ళై అనే రిటైర్డ్ ఇంజనీర్ గారి అమ్మాయిలు మీరా, వీణా ఇద్దరూ బాబా ప్రక్కన నిలబడ్డారు. వారిని బాబా ఆశీర్వదించారు.
ఉదయం గం. 5.30 ని.లకు బాబా బయట ఏర్పాటు చేసిన పందిట్లో కూర్చున్నారు. అంత ఉదయాన్నే బాబా దర్శనం కోసం దాదాపు 500 మంది వచ్చి కూర్చున్నారు. ఎవరూ తన పాదాలు తాకకూడదని ఆజ్ఞాపించారు. చింతాక్రాంతులై యున్న కోడూరు కృష్ణారావు దంపతులకు గోదావరి జలాలతో తన కాలి వ్రేళ్ళను కడగటానికి మాత్రం బాబా అనుమతించారు. వారు సంతోషించారు. సావనీర్ నుండి వచ్చిన అబ్దుల్ మజీద్ ఖాన్ ప్రార్ధన చేసాడు. బాబా అనుమతితో ఆయన మెడలో పూలదండ వేసాడు. బాలగోపాల భాస్కర రాజు మొదలగు వారు పలు భాషలలో బాబా హారతి గానం చేసారు. ఉదయం గం.7.30లకు రహదారి బంగళాలో ప్రారంభించి మేళతాళాలతో, నృత్యాలతో బాబాను ఊరేగింపుతో పుర వీధులగుండా ధనపతిరావు ఇంటి వరకు తీసుకొని వెళ్ళారు. అక్కడ ప్రత్యేకంగా అలంకరింప బడిన పందిట్లో బహిరంగ సభ, సమావేశం జరిగింది. వివిధ భాషలలో ప్రార్థనలు చదివారు. రంజూ, అబ్దుల్లా 'అల్లా హో ! అక్బర్' అని ఇస్లాం సాంప్రదాయానుసారం గా ప్రార్థన చేసాడు. షష్ట్యబ్ది పూర్తి మహోత్సవానికి బాబా ఇచ్చిన ప్రత్యేక సందేశాన్ని రంజూ చదివి వినిపించాడు. దాని తెలుగు అనువాదాన్ని ఈ క్రింది విధంగా జగన్నాధంగారు చదివి వినిపించారు.
🪷
*సశేషం*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
*కథల ప్రపంచం*
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
*తెలుగు భాషా రక్షతి రక్షితః*
*ఏడాది చందా 120/-, ఫోన్ పే & గూగుల్ పే నెంబర్ 9849656434*
*1 YEAR* *SUBSCRIPTION 120/-*
*phone pe & Gpay to 9849656434*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
No comments:
Post a Comment