Sunday, August 17, 2025

 *🌺🕉️ జై శ్రీమన్నారాయణ  🕉️🌺*
  *ఓం నమో భగవతే వాసుదేవాయ*
🍁🌵🍁 🌵🍁🌵 🍁🌵🍁
                *ఇద్దరూ ఇష్టులే!*

*వెన్నెల వెలుగులో మెరిసిపోతున్న గదిలో అబూ బెన్ ఆథమ్ ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. అతడికో కల వచ్చింది. అందులో ఒక దేవదూత బంగారు పుస్తకంలో ఏదో రాస్తూ ఉంటుంది.*

*'ఏం రాస్తున్నావు?' అడిగాడు అబూ. 'దేవుణ్ని ప్రేమించే వాళ్ల పేర్లను' చెప్పింది. 'నా పేరుందా' ఆత్రంగా అడిగాడు. 'ఊహూ.. లేదు.'*

*'అయితే... తోటి మనుషులను ప్రేమించే వ్యక్తిగా నా పేరు రాయవా' అని వేడుకున్నాడు. ఆ దేవదూత అంతర్థానమైంది.*

*రెండో రోజు మళ్లీ కల. మళ్లీ ఆమె... 'భగవంతుడు ఎవరి ప్రేమను దీవించాడో వారి పేర్లను రాస్తున్నాను' అంటూ ఆ జాబితాను చూపింది.*

*అందులో మొదటి పేరు అతడిదే.*

*'అబూ బెన్ ఆథమ్' అన్న ఈ ఆంగ్ల కవిత రాసింది జేమ్స్ హెన్రీ లీ హంట్. ఆ కవిత ఆయన ఊహించనంత పేరు ప్రఖ్యాతులను తెచ్చింది.*

*కవితలో మానవత్వానికి పెద్దపీట వేయటమేదానికి కారణం. కవితారంభంలో ఉన్న వాక్యం... 'అబూ బెన్ ఆథమ్... అతని వంశం వర్థిల్లుగాక!' అన్నదీ ఒక కారణమే. తోటివారిని ప్రేమించేవారిని దేవుడు దీవిస్తాడని చెప్పడం... ఎంత గొప్ప భావన!*

*మాధవుణ్నే పూజిస్తూ ఆయనను చేరవచ్చు. అలా కాక, తోటి మానవులకు సేవ చేస్తూ కూడా ఆయనను చేరవచ్చు. మార్గమేదైనా దానిలో ప్రేమ ఉండాలి. ఇది అంతస్సూత్రం. ఆయన ప్రేమను, ఆశీస్సులను పొందాలంటే మన ప్రేమను ఇతరులకి పంచాలి. అంతే. అంతకన్నా ప్రత్యామ్నాయం లేదు. భగవంతుణ్ని ఒక నిర్దిష్ట ప్రదేశంలో ఉంచి అక్కడకు వెళ్లి ప్రార్థిస్తుంటారు కొందరు. దైవమంటే వారికి పూర్తి విశ్వాసం. ఏది జరిగినా అంతా మన మంచికే అనుకుంటారు.*

*దైవబలం కారణంగానే ఇంతటితో ప్రమాదం తప్పిందంటారు. చేసే పరోపకారం, దానం, ధర్మం అన్నీ దైవాన్ని తలచుకునే చేస్తారు. విశ్వంలోని అణువణువులో దైవాన్ని దర్శిస్తారు.*

*సర్వాంతర్యామికి ఒక నిర్దేశిత స్థలమా? ఈ సకల చరాచర సృష్టి ఆయనదే అయినప్పుడు ఆయన లేనిదెక్కడ? అని భావిస్తారు మరికొందరు. వీరు తోటివారిని ప్రేమిస్తూ, వారికి కావాల్సిన సేవలు చేస్తూ దేవుణ్నే సేవిస్తున్నట్టు భావిస్తారు. పేదలకు అన్నవస్త్రాలనిచ్చి కాపాడతారు. ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు ముందుంటారు. పరోపకారమే ఊపిరిగా జీవిస్తారు. అందులోనే ఆనందాన్ని పొందుతారు.*

*భగవంతుడికి ఈ రెండూ ప్రియమైనవే. ఇద్దరూ ప్రీతిపాత్రులే. పండితులు, జ్ఞానులు, మతగ్రంథాలు చెప్పే ఈ ఉదాత్త భావననే పై కవిత ఇంకొకసారి చెబుతోంది. తన ఉనికిని ప్రశ్నించే ఇటువంటి వారినీ దైవం మెచ్చుకుంటాడు. ఎందుకంటే వీరు సాటి మనిషికి సాయపడటం కన్నా గొప్ప విషయం ఇంకోటి లేదని భావిస్తారు. మొదటిది భక్తి మార్గం. రెండవది సేవా మార్గం. రెండింటి లక్ష్యం ఒకటే... సమాజంలో మానవతా పరిమళాలను వ్యాపింప జేయటం.*
🍁🌵🍁 🌵🍁🌵 🍁🌵🍁
*🙏సర్వేజనాః సుఖినో భవంతు🙏*
🌴🌳🌴 🌳🌴🌳 🌴🌳🌴

No comments:

Post a Comment