వాక్చాతుర్యం ....!!
సాహితీ సంగీతప్రియుడైన భోజరాజ చక్రవర్తిని దర్శించడానికి ఒక పేద పండితుడు చాలా రోజులుగా ప్రయత్నిస్తూ వచ్చాడు. కానీ కోట కావలి భటులు యేవో కారణాలు చెప్తూ అడ్డుకుంటూ వచ్చారు.
ఒకనాడు భోజరాజు ఊరిలోని
దేవాలయం దర్శించడానికి వెళ్ళిన సమయంలో ఆ పండితుడు కూడా ఆలయానికి వెళ్ళాడు.
అక్కడి ఆలయంలోని వారందరికీ
ఆ పండితుడన్నా , ఆయన పాండిత్యం అన్నా అపారమైన గౌరవాభిమానాలు వున్నాయి.
మహారాజు పరమేశ్వరుని స్తుతిస్తుండగా, ఈ పేద పండితుడు మహారాజు వెనుకగా నిలబడ్డాడు.
అర్చకుడు దేవుడికి ఆరతి ఇస్తున్న సమయంలో ఆ పండితుడు గట్టిగా…
"గర్భగుడిలో పరమశివుడు లేడు"
అని అరిచాడు.
వెనక నుండి వచ్చిన అరుపు విని మహారాజు ఉలిక్కిపడ్డాడు.
పండితుని వేపు వెనక్కి తిరిగి చూసి
"ఎందుకు అలా చెప్తున్నారు? దేవుడిని దూషించడం తప్పు అన్నట్టు ఖండిస్తూ అడిగాడు.
అందుకు ఆ పండితుడు "చాలా కాలం క్రితమే శంకరుడు తన దేహంలో సగం నారాయణునికి యిచ్చి శంకరనారాయణుడైనాడు.
మరియొక సగాన్ని ధర్మపత్నికి యిచ్చి అర్ధనారీశ్వరుడైనాడు. అందుకే ఆయన చిహ్నంగా ఏదీ లేదని అంటున్నానన్నాడు.
ఆయన శిరసున గంగ వున్నది కదా.." అని భోజరాజు అడిగాడు.
గంగ సముద్రంలో కలిసి పోయింది.”
అన్నాడు పండితుడు.
వెంటనే మహారాజు ఝటాఝూట అలంకారమైన చంద్రుడు ఏమయ్యాడు? అని అడిగాడు. "చంద్రుడు ఆకాశంలోకి వెళ్ళి ఇప్పుడు అక్కడే వున్నాడు." అని అన్నాడు పండితుడు.
అప్పుడు భోజరాజు "అవేవీ లేకపోయినా ఆయన శక్తి మాత్రం తప్పకుండా వుంటుంది.” అన్నాడు.
అది కూడా లేదు. తన శక్తినంతా మీకు
యిచ్చివేశాడు .." అని అన్నాడు పండితుడు.
పండితుని నిందాచమత్కార సంభాషణ విని భోజమహారాజు , చిరునవ్వుతో "అన్నీ పోయినా కూడా ఆయన భిక్షాపాత్ర మాత్రం తప్పక ఆయన వద్దనే వుంటుంది" అన్నాడు.
పండితుడు అప్పుడు "ప్రభూ .. అది కూడా యిప్పుడు ఆయన వద్ద లేదు. దానిని పరమేశ్వరుడు నాకు యిచ్చివేశాడు."
ఈ సంభాషణ విన్న భోజరాజుకు పండితుని పేదతనం అర్ధం అయింది. ఆ పండితునికి ధనధాన్యాలు, అగ్రహారాలు దానం చేశాడు.
ఆ పండితుని కావ్యాలకు తగిన ప్రచారం చేయించాడు.
ఒక వ్యక్తి ఎంత గొప్పవాడైనా తనలోని ప్రతిభను ఇతరులకు తెలియజెప్పడానికి తగిన లౌక్యం, వాక్చాతుర్యం కావాలి.
తన వ్యక్తిత్వానికి భంగకరం కాకుండా తన గురించి తానే పొగుడుకోకుండా
తన గురించి చెప్పకనే అవతలివారు తెలుసుకోగల బుధ్ధి సూక్ష్మత కావాలి.
అలాటివారు ఏ మూలనున్నా రాణిస్తారు...స్వస్తీ
No comments:
Post a Comment