*చెల్లీ నువ్వంటే ప్రాణం* (రాఖీ సందర్భంగా అన్నాచెల్లెళ్ల అనుబంధం తెలిపే అద్భుత జానపద కథ) - డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212
*****************************
ఒక రాజుకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొడుకు పెద్దోడు. కూతురు చిన్నది. అన్నకు చెల్లెలు అంటే చానా ప్రేమ. చెల్లెలు కూడా అన్న చేయి విడిచి ఒక్క క్షణం కూడా అస్సలు ఉండేది కాదు. కలసి నవ్వేవారు, కలసి తిరిగేవారు, కలసి తినేవారు. అందరూ ఆ అన్నాచెల్లెళ్ల ప్రేమను చూసి చానా ముచ్చటపడేవారు. ఈ భూమి ఆకాశం ఉన్నంతకాలం మీ అనుబంధం కూడా పచ్చగా ఉండాలని దీవించేవారు.
కానీ కాలం ఎప్పుడూ ఒకేలా సంతోషంగా ఉండదు కదా... ఒకసారి అనుకోకుండా వాళ్ళమ్మ జబ్బు పడింది. ఎందరెందరో వైద్యులు వచ్చి చూశారు కానీ కొంచెం కూడా తగ్గలేదు. ఒకరోజు తల్లి కొడుకును పిలిచి "ఒరే నాన్నా... చెల్లి చేతిని ఎప్పటికీ విడవకు. అది చానా చిన్నది. లోకం తెలియనిది. అమ్మలోని మొదటి అక్షరం, నాన్నలోని చివరి అక్షరం కలిస్తేనే అన్న అవుతుంది. ఇకపై అమ్మయినా నాన్నయినా అన్నీ నీవే" అంది.
"అమ్మా... నువ్వు భయపడకు. బాధపడకు. చెల్లి చేయి చచ్చినా వదలను. పసిబిడ్డలా చూసుకుంటా. పచ్చని మొక్కలా కాపాడుకుంటా. జన్మజన్మలకు తోడుంటా. నన్ను నమ్ము" అంటూ చేతిలో చేయి వేశాడు.
కొన్ని రోజులకు ఆమె ఆరోగ్యం కుదుటపడక దీపం ఆరిపోయి దేవుని దగ్గరికి చేరుకుంది.
అన్ననే ఆ పిల్లకు అమ్మయ్యాడు. ఏడుస్తే జోలపాట అయ్యాడు. అలిగితే ఆటబొమ్మ అయ్యాడు. నిద్రరాకపోతే కథల చెట్టు అయ్యాడు. ఆపదలో కాపాడే కవచం అయ్యాడు.
కొంతకాలం గడిచిపోయింది.
బంధువులందరూ పదేపదే చెప్పడంతో కాదనలేక రాజు మరలా పెళ్లి చేసుకున్నాడు. సవతితల్లి మొదట్లో పిల్లలను చానా బాగా చూసుకునేది. సొంత బిడ్డల్లాగే దగ్గరికి తీసుకునేది. కానీ నెమ్మదినెమ్మదిగా ఆమె మనసు మారిపోయింది. "రేప్పొద్దున నాకు పిల్లలు పుడితే నా కొడుకు ఎప్పటికీ రాజు కాలేడు కదా" అనుకుంది. ఎలాగైనా వాళ్ళ అడ్డు తొలగించుకోవాలని ఒకరోజు ఎవరికీ తెలియకుండా లడ్డులో విషం పెట్టి ఇద్దరికీ చెరీ ఒకటి ఇచ్చింది. చిన్నపాపకు లడ్డు అంటే అసలు ఇష్టం లేదు. దాంతో తనది కూడా అన్నకే ఇచ్చేసింది. అన్నకు దాంట్లో విషం వున్నది తెలియదు కదా... దాంతో రెండూ తినేశాడు. అంతే కాసేపటికి నోట్లోంచి నురగలు కక్కుకొని గిలగిలా కొట్టుకుంటా కిందపడిపోయాడు.
"అయ్యో పాపం" అంటూ అందరూ వచ్చారు. "ఏదో పాము కరిచినట్టు ఉంది. అందుకే నురగలు కక్కుకొని చచ్చిపోయాడు" అని సవతితల్లి అబద్ధాలు చెప్పింది. అందరూ అదే నిజమనుకున్నారు.
సవతితల్లి ఇంక ఆ చిన్నపాప జోలికి పోలేదు. పిల్లలు ఇద్దరూ వెంటవెంటనే చచ్చిపోతే అందరూ తన మీదనే అనుమానపడతారని ఆమె భయం. అంతేగాక 'సింహాసనానికి పోటీ మగ పిల్లవానితోనే గానీ ఆడపిల్లతో ఉండదు కదా' అని అనుకుంది.
నెమ్మదిగా కొంతకాలం గడిచిపోయింది. ఆమె చిన్నపిల్లను అస్సలు సరిగా చూసుకునేది కాదు. ఇంటి పనులన్నీ చెప్పేది. చెయ్యకపోతే బాగా కొట్టేది. కడుపునిండా అన్నం కూడా సరిగా పెట్టేది కాదు. దాంతో ఆ పాప చెప్పుకోవడానికి ఎవరూ లేక, రోజూ అన్ననే తలుచుకుంటూ ఏడ్చేది.
ఒకరోజు కళ్లనీళ్లతో పడుకొని అట్లాగే నిద్రపోతా వుంటే అన్న కలలోకి వచ్చాడు. "ఓ చిట్టితల్లీ... బాధపడకు. నేను మన తోటలోని చెరువులో చేపగా పుట్టాను. నువ్వు ఎవరూ లేనప్పుడు రా. కలసి ఆడదాం, కథలు చెప్పుకుందాం, బాధలు పంచుకుందాం, నవ్వులు వెతుక్కుందాం" అన్నాడు.
తరువాతరోజు ఇంటి పనులన్నీ తొందరగా పూర్తిచేసి పరుగు పరుగున చెరువు దగ్గరికి పోయింది. "అన్నా... ఎక్కడున్నావ్. నీ ముద్దుల చెల్లిని వచ్చా" అంటూ సంబరంగా అరిచింది. కాసేపటికి మిలమిలా మెరుస్తా బంగారు రంగులో వున్న ఒక చిన్న చేప అక్కడికి వచ్చింది. చెల్లిని చూసి సంబరంగా నీళ్లలో ఎగిరి గంతులు వేసింది. కడుపునిండా తినడానికి రకరకాల పళ్ళు తెచ్చి పెట్టింది. ఆడుకోవడానికి రంగురంగుల గవ్వలు,
రాళ్లు ఏరుకొచ్చింది. అలా ఆ రోజునుంచీ ఆ పాప తీరిక దొరకడం ఆలస్యం చెరువుగట్టుకు చేరుకునేది.
కడుపునిండా అన్నం పెట్టకపోయినా మొహంలో కళ కొంచెం కూడా తగ్గకపోవడంతో సవతితల్లికి అనుమానం వచ్చింది. ఏం జరుగుతుందో కనుక్కుందామని ఆ పిల్ల రాకపోకల మీద ఒక కన్నేసింది. రోజూ చెరువు దగ్గరికి పోయి చేపతో మాట్లాడటం చూసింది. "ఓహో... ఇదా సంగతి" అనుకొని తర్వాతరోజు జాలర్లను పిలిపించింది. వాళ్లు చెరువులోకి పోయి చేపలన్ని పట్టుకుపోయారు. పాపం ఆ పాప అన్న కూడా వాళ్ల చేతికి చిక్కి చనిపోయాడు.
విషయం తెలిసి ఆ పాప వెక్కివెక్కి ఏడ్చింది. అన్నను తలుచుకుంటూ అన్నం కూడా సరిగా ముట్టుకునేది కాదు. కొంతకాలం గడిచింది. తిండి సరిగా లేక పాపం బాగా చిక్కిపోసాగింది. పలకరించేవాళ్ళు లేక ఒంటరిగా బాధపడసాగింది. కళ్ళు మూసినా తెరిచినా అన్ననే కళ్ళ ముందు కనపడేవాడు. అన్న ప్రేమను తలుచుకొని వెక్కివెక్కి ఏడ్చేది. ఒకరోజు అన్నను తలుచుకుంటూ అట్లాగే నేల మీద పడుకుని నిద్రపోతావుంటే తెల్లవారుజామున అన్న కలలోకి వచ్చాడు.
"ఓ చిన్నారి తల్లీ.... బాధ పడకు. నేను మరలా మన తోటలో నెమలిగా పుట్టాను. నువ్వు ఎవరూ లేనప్పుడు రా. కలసి కమ్మని కబుర్లు చెప్పుకుందాం, అమ్మను తలుచుకుందాం, బాధలు మర్చిపోదాం, ఆనందాల్లో మునిగిపోదాం" అన్నాడు.
తర్వాతరోజు తొందరగా ఇంటి పనులన్నీ పూర్తి చేసి పరుగు పరుగున తోటలోకి చేరుకుంది. "అన్నా... ఎక్కడున్నావు. నీ ముద్దుల చెల్లిని వచ్చా" అని సంబరంగా పిలిచింది. కాసేపటికి ఒక నెమలి చెట్టు కొమ్మమీద నుంచి ఎగురుకుంటా వచ్చి ముందర వాలింది. తన పింఛం విప్పి చెల్లిని దగ్గరికి తీసుకొని గుండెలకు హత్తుకుంది. తోటలోని రకరకాల మాగిన పళ్ళు తీసుకొచ్చి తినమని ముందర పెట్టింది. ఆ రోజునుంచి ఆ పాప ఏమాత్రం తీరిక దొరికినా అన్న దగ్గరికి వచ్చేది. అన్నతో కలసి తిరిగేది, ఎగిరేది, సంబరంగా ఆడేది, పాడేది. దాంతో ఆ పాప మొహం మరలా అప్పుడే విచ్చిన మందారపూవులా కళకళా మెరిసిపోసాగింది.
పీక్కుపోయిన మొహంతో, బక్కచిక్కిన ఒంటితో, చావుకు దగ్గరపడిన దానిలా ఉండాల్సిన ఆ పిల్ల... అలా చిరునవ్వులు నవ్వుతా వుంటే సవతితల్లి చూసి తట్టుకోలేకపోయింది. విషయం ఏంటో తెలుసుకుని రమ్మని ఒక సేవకున్ని రహస్యంగా పంపించింది. వాడు వారంరోజులు చెట్ల చాటున, పుట్టల చాటున దాక్కుంటా జరుగుతున్నదంతా గమనించి ఆమెకు చెప్పాడు. దాంతో ఆమె కొందరు వేటగాళ్ళని పిలిపించి తోటలోని నెమళ్ళను మొత్తం చంపించి వేసింది.
పాపం... విషయం తెలిసి ఆ పాప వెక్కివెక్కి ఏడిచింది. రోజూ అన్ననే తలచుకుంటూ అన్నం నీళ్లు ముట్టకుండా బతికున్న శవంలాగా తయారైంది. కళ్ళు మూసినా తెరిచినా అన్ననే గుర్తుకు రాసాగాడు. కళ్ళలోంచి నీళ్లు ఆగకుండా కారుతూనే ఉన్నాయి. "నా అనేవాళ్ళు ఎవరూ లేక ఇలా ఒంటరిగా ఇలా బతికే బదులు, చచ్చి పైలోకంలో వున్న అన్నను కలుసుకోవడం మేలు" అనుకుంది.
ఆరోజు రాత్రి అన్న మరలా కలలోకి వచ్చాడు. "ఓ చిట్టి తల్లీ.... ఎవరూ లేరని ఏడవకు. నీ బాధలు శాశ్వతంగా తొలగిపోయే చక్కని ఉపాయం ఒకటి తట్టింది. నేను ఈసారి మన సవతితల్లికే కొడుకుగా పుడతాను. నువ్వు వచ్చి ఎత్తుకునేదాకా ఏడుస్తూనే ఉంటాను. అట్లా మనిద్దరం మరలా ఇంతకుముందులాగే హాయిగా కలసిమెలసి కలకాలం ఒకేచోట ఉండవచ్చు. కొన్ని రోజులు ఓపిక పట్టు. తొందరపడకు" అన్నాడు.
అట్లా నెమ్మదిగా తొమ్మిది నెలలు గడిచాయి. ఒక మంచిరోజున సవతి తల్లికి ముద్దులు మూటగట్టే ఒక చక్కని కొడుకు పుట్టాడు. అందరూ వెన్నముద్దలా వున్న ఆ పిల్లోన్ని చూసి మురిసిపోయారు. కానీ పిల్లోడు పుట్టిన కాసేపటికి ఏడవడం మొదలుపెట్టాడు. అందరూ ఎత్తుకొని ఆడించారు. జోల పాటలు పాడారు. చందమామను చూపించారు. ఆట బొమ్మలు తెచ్చారు. పాలు పట్టించారు. వైద్యులకు చూపించారు. దేవుళ్ళకు మొక్కుకున్నారు. జాతరలు చేయించారు. చెట్లు నాటించారు. బావులు తవ్వించారు. గుడులు కట్టించారు. అన్నదానాలు చేశారు... కానీ ఏమి చేసినా ఆ ఏడుపు కొంచెం కూడా తగ్గలేదు. రాజుకి ఏం చేయాలో అర్థం కాలేదు. సవతితల్లి లేక లేక పుట్టిన కొడుకుని చూస్తూ "పెద్దరాణి కొడుకును చంపిన పాపం... ఇలా తనకు తగిలినట్లుంది" అని బాధపడసాగింది.
పండితులు బాగా ఆలోచించి "ఇంతవరకు ఇలాంటి ఏడుపును ఎప్పుడూ ఎక్కడా చూడలేదు. బహుశా ఏ పూర్వజన్మ బంధమో ఇంకా ఈ పిల్లవాడిని విడిచినట్టు లేదు. ఎవరికోసమో తల్లడిల్లిపోతున్నాడు. రాజు బంధువులందరూ ఒక్కొక్కరుగా వచ్చి ఆ పిల్లవాడిని ఒకసారి ఎత్తుకొని చూడండి. ఎవరి చేతుల్లోనన్నా ఏడుపు ఆగిపోతుందేమో" అన్నారు.
ఎక్కడెక్కడి బంధువులూ వచ్చారు. తమ చేతుల్లోకి తీసుకున్నారు. కానీ కంటనీరు కొంచెం కూడా తగ్గలేదు. ఇక ఒక్క పెద్దరాణి కూతురు మాత్రమే మిగిలింది. భయం భయంగా దూరంగా నిలబడి ఉయ్యాల వంకే చూస్తూ ఉంది. సవతితల్లి ఆ పాపను చూసి "రా నువ్వు కూడా ఎత్తుకొని చూడు" అంది. ఆ పాప సంబరంగా పరుగెత్తుకుని వచ్చింది. ఉయ్యాలలో ఉన్న అన్నను చిరునవ్వుతో ఎత్తుకుంది. తన హృదయానికి ప్రేమగా హత్తుకుంది. నుదుటిపై చిన్న ముద్దు పెట్టింది. చెల్లి స్పర్శ అన్నలోకి సరసరా ప్రవహించింది. నెలల తరబడి ఏడుస్తున్న గొంతు ఒక్కసారిగా ఆగిపోయింది. మొహం చందమామలా వెలిగిపోయింది. పెదవులు ఆనందంతో విచ్చుకున్నాయి. సంబరంగా చెల్లిని చూస్తూ కేరింతలు కొట్టాడు.
విషయం రాజుకు చేరింది. పరుగు పరుగున వచ్చాడు. ఆనందంతో ఎగిరి గంతులు వేశాడు. ఊరంతా పండుగ చేసుకుంది.
చెల్లి చేతుల్లో నుంచి పక్కకు తీస్తే చాలు అన్న మరలా ఏడుపు అందుకునేవాడు. "ఏ జన్మ బంధమో ఇద్దరిదీ" అన్నారు చూసినవాళ్ళు.
సవతితల్లికి అంతా అర్థమయింది. ఈ బంధాన్ని విడదీయడం అసాధ్యం అనుకుంది.
దాంతో ఆమె చిన్నపాపను దగ్గరికి తీసుకొని "చూడు తల్లీ నన్ను మన్నించు... ఇకపై బాబుకు అక్కయినా, చెల్లయినా, అమ్మయినా అన్నీ నువ్వే. జరిగిందంతా మర్చిపో. ఈరోజు నుంచీ నాకు ఇద్దరూ సొంతపిల్లలే" అంది. అన్నచెల్లెళ్ళు ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు. సంతోషంగా నవ్వుకున్నారు.
**********************
డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212
**********************
కథ నచ్చితే *SHARE* చేయండి. రచయిత పేరు మార్చకండి. తీసేయకండి.
No comments:
Post a Comment