Friday, August 1, 2025

 *దేహంలో ఉన్న దేహిని తెలుసుకోవాలి* 

*పొరుగింటిలో పెళ్లయిందని విన్నా, పిల్లలు పుట్టారని విన్నా కలిగే ఆనందం ఆనందమేనా? అలాగే ఎవరో మరణించారని విన్నపుడు కలిగే దుఃఖమూ దుఃఖమేనా? కాదనేదే నిజం. అదొక స్పందన మాత్రమే. తనది అనుకున్నది దూరమైనపుడు మాత్రమే దుఖం, దక్కిందనుకున్నపుడు మాత్రమే ఆనందం కలుగుతున్నాయ్. ఇవి నిజమేనా? తన యింట్లోనే తానొక అతిథిగా ఉండగలిగినపుడు కలిగే భావమే నిజమైన వైరాగ్యం. ఆ స్థితి పొందిన వాడికి, ఆ యింట జరిగే ఏ విషయమూ బాధను కానీ, సుఖాన్ని కానీ కలిగించదు. అదే నిజమైన వైభోగం, నిజానికి వైరాగ్య భూమికలో నిలకడ చెందిన వాడికి, మనసు నిర్మలంగా ఉంచుకోగలిగిన వాడికి, ఆశలు లేని వాడికి, ఎదురుచూడని విజయాలు లభించినవాడికి వైభోగమంతా వైరాగ్యం కదా! జీవన సాఫల్యం సిద్ధించినట్లే కదా! అపజయంలో నుండి ఏర్పడే వైరాగ్యం, తాత్కాలికం. విజయంలో నుండి పుట్టే వైరాగ్యమే శాశ్వతం. అందుకే ఏదైనా* *అర్థమెరిగి చేయాలి. పరిస్థితులు అనుకూలించక, వైఫల్యం వలన కలిగే వైరాగ్యం ఎల్లకాలమూ నిలువదు.*

*స్పృహతో ఇంద్రియ నిగ్రహం సాధించాలి. వృద్ధాప్యంలో యింద్రియాలు తమంత తామే, కార్యకలాపాల నుండి బయటపడతాయ్. తప్పుకొంటాయ్. అన్నీ ఉండగానే, అవేవీ తనవి కావనుకోగలగాలి. స్వచ్ఛందంగా, ఇష్టంగా వదులుకోగలగాలి. తన స్వస్థానమైన హృదయానికి దూరమైన మనసు, నిరంతర సంచారిణి అవుతున్నది. దిక్కు తెలియక, గమ్య మెరుగక, లక్ష్యం లేక పరుగులిడుతున్నది. ఎందుకో తెలియకుండానే, ప్రయాసతో ఆయాసపడుతున్నది. మనసు పరిస్థితి అంతే! అది తన స్వస్థానంలోకి చేరాలి. సహజస్థితిని పొందాలి. ఎట్లా? ముందు స్వస్థానమేమిటో తెలిస్తే, సగం పరిష్కారం లభిస్తుంది. ఆపై చేరే మార్గాలకై అన్వేషణ ఆరంభమౌతుంది. దీనికి మార్గదర్శకుడు కావాలి. దారి ఎరిగిన వాడే దారి చూపించాలి. ఆయనను గురువందామా?* 

*సముద్రం నిండా నీరున్నా, మేఘం కోసం, వాన చినుకు కోసం, చాతక పక్షి ఎదురుచూస్తుంది. ఆ విధంగానే శాస్త్రజ్ఞానం అందుబాటులో ఉన్నా, గురువుకోసం సాధకుడు ఎదురు చూడాలి. గుర్వనుగ్రహం మలయపవనం. స్వాంతన కూర్చే దివ్యానుభవం. శాస్త్రం, గురువు, అనుభవం నిజానికి జ్ఞానానికి మార్గాలు. మనసుకు మూలం హృదయం. ఇంద్రియాల చలనాలకు, స్పందనలకు, కార్యకలాపాలకు మనసు కారణమౌతుంటే, మనోనియంత్రణ మాత్రం హృదయం వద్ద ఉన్నది. అంటే అన్నిటికీ మూలం, అన్నిటిపై అధికారం హృదయానికే వున్నది. ఈ విచారణ నిరంతరం సాగుతూ ఉండాలి. అదే అధ్యాత్మ సాధన. ఇంద్రియాలను, మనసును దాటుకుంటూ, మనసును హృదయస్థానంలో నిలపగలిగితే, అదొక సాధనా సాఫల్యం. దేహంలో ఉన్న దేహిని ఎరగాలి. ఆ ఎరగటమే ఎరుక. అదే ఆత్మానుభవం!*

*┈┉┅━❀꧁శివోహం꧂❀━┅┉┈*
       *ఆధ్యాత్మిక అన్వేషకులు*
☘️📿☘️ 🙏🕉️🙏 ☘️📿☘️

No comments:

Post a Comment