Monday, August 25, 2025

 🌺🦚🌺🦚🌺🦚🌺🦚🌺

      🌻 *కృష్ణం వందే* 🌻

🦚🦚🦚🦚🦚🦚🦚🦚

*అఘాసురుడు కొండచిలువగా మారి      కృష్ణుడిని మింగాలని ఎందుకు అనుకున్నాడు?*

*భాగవతంలో బాల కృష్ణుడు ఎంతో మంది రాక్షసులను సంహరిస్తాడు. వారిలో ‘అఘుడు’ ఒకడు.* 

*ఒకసారి బలరామకృష్ణులు స్నేహితులతో కలసి ఒక ఉద్యానవనంలో ఆటలాడుకుంటున్నారు.*

*అలా పిల్లలందరూ ఆటపాటల్లో మునిగివున్నప్పుడు 'అఘుడు' అనే రాక్షసుడొకడు అక్కడికి వచ్చాడు.*

*అతను కంసుని దగ్గర పనిచేస్తాడు. బకుడనే రాక్షసుడికీ, పూతన అనే రాక్షసికీ   తమ్ముడు. తన సోదరులు ఒక గొల్లపిల్లవాని చేతిలో హతులయ్యారని తెలుసుకుని, ఎలాగైనా ఆ పిల్లవాడి అంతు చూడాలనుకుని అక్కడికి వచ్చాడు.*

*బలరామకృష్ణులను చూడగానే 'వీళ్ళే నా అన్నల ప్రాణాలు తీసి వుంటారు' అనే నిర్ణయానికి వచ్చాడు అఘుడు. వెంటనే ఆమడ పొడవూ, కొండంత లావూ ఉన్న కొండచిలువ రూపం ధరించి, పెద్ద గుహ మాదిరిగా నోరు తెరిచి కృష్ణుడిని మింగేసేందుకు ఒకచోట పొంచి వున్నాడు.* 

*ఆ కొండచిలువను చూసి కూడా గోపబాలురు భయపడలేదు. 'మన కృష్ణయ్య వుండగా మనకేం భయం' అనుకుని దాని దగ్గరకు వెళ్ళారు.*

*బిలం మాదిరిగా వున్న దాని నోట్లోకి ఒక్కొక్కరే నడిచివెళ్ళారు. కాని, కొండచిలువ వాళ్ళనేమీ చెయ్యలేదు. కృష్ణయ్య కోసం వేచి ఉంది కాబట్టి కదలకుండా మెదలకుండా అలాగే వుంది. బాలకృష్ణుడు దూరంనుంచి ఇదంతా గమనిస్తూనే వున్నాడు.*

*అది భయంకరమైన కొండచిలువ అని తెలిసి కూడా గొల్లపిల్లలు తనమీద విశ్వాసంతో దాని నోట్లోకి ప్రవేశించారనీ, అది తన కోసమే వేచి వున్నదనీ కృష్ణయ్యకి తెలుసు.*

*తన స్నేహితులకు చేటు కలగకుండానూ, కొండచిలువ కోరిక నెరవేరకుండానూ ఉండే ఉపాయం ఏమిటా అని ఒక్కక్షణం ఆలోచించాడు.*

*చిరునవ్వుతో  ఆలోచించి,   తను కూడా దాని నోట్లోకి వెళ్ళాడు. అలా వెళ్ళిన నల్లనయ్య ఆ కొండచిలువ గొంతులోనే ఆగి తన శరీరాన్ని మహాద్భుతంగా పెంచుకున్నాడు.*

*దాంతో ఆ కొండచిలువ గొంతు పూడిపోయింది. ఊపిరి ఆడే అవకాశం ఏమాత్రం లేకుండా పోయింది. గిలగిల కొట్టుకుంది. తల నేలకేసి బాదుకుంది.*

*కాసేపటికి దాని తల పగిలిపోయింది. పగిలిన శిరస్సులోంచి గోపబాలురతో సహా కృష్ణయ్య బయటకు వచ్చాడు.*

*శ్రీకృష్ణుని  దివ్యశరీర స్పర్శ మూలంగా పాపాలన్నీ హరించుకు పోవడం వల్ల ఆ కొండచిలువలోంచి ఒక మహా తేజస్సు బయటకువచ్చి కృష్ణయ్యలో లీనమైపోయింది.*

*కృష్ణయ్యలో అలా లీనమైన అఘుడు పూర్వం శంఖుడనే రాక్షసుని కుమారుడు.*

*అఘుని బలసంపద అమోఘంగా వుండేది. దానికితోడు అతని రూప లావణ్యాలు, యవ్వనం అతనిని గర్విష్టిగా తయారుచేసాయి.*

*అతనొకసారి మలయాద్రి మీద తపస్సు చేసుకుంటున్న అష్టావక్రుని చూశాడు. వంకర టింకరగా వున్న ఆయనను చూసి అపహాస్యం చేశాడు.*

*అష్టావక్రుడు ఆగ్రహించాడు. 'నువ్వు సర్పరూపం ధరిస్తావు' అని అఘుడిని శపించాడు.*

*అఘుడు తన తప్పు తెలుసుకుని అష్టావక్రుడి పాదాలమీద పడ్డాడు.*

*పశ్చాత్తప్తుడైన అఘుని చూసి జాలిపడి 'శ్రీకృష్ణుడు ఎప్పుడు నీలో ప్రవేశిస్తాడో అప్పుడు నీకు శాపవిముక్తి కలుగుతుంది' అని చెప్పాడు అష్టావక్రుడు.*

*అప్పటి నుంచి శ్రీకృష్ణుడు ఎప్పుడు కనిపిస్తాడా, ఎప్పుడు ఎలా ఆయనను మింగి శాపవిముక్తిని పొందుతానా అని అఘుడు తపించసాగాడు.*

*కాలక్రమేణా అతను బృందావనం చేరుకుని శ్రీకృష్ణుని అనుగ్రహం ద్వారా శాపవిముక్తి పొందాడు.*

🙏 *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
 
🦚🦚🦚🦚🦚🦚🦚🦚

No comments:

Post a Comment