Monday, August 25, 2025

 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

  *రైతుకు రిటైర్మెంట్ సన్మానం..!*
             ➖➖➖✍️


*40 ఏళ్లుగా భూమినే నమ్ముకున్న రైతు రిటైర్మెంట్.. వ్యవసాయ విరమణ సన్మానం చేసిన కుమారులు.*

*2018 మే 29న 40 ఏళ్లు భూమినే నమ్ముకొని తమను జీవితంలో స్థిరపడేలా చేసిన ఓ రైతుకు వారి కొడుకులు చేసిన వినూత్న సత్కారం.*

*ఇళ్లంతా సందడిగా ఉంది.. బంధువులు, స్నేహితులతో కళకళలాడుతోంది.. ఇంటి ముందున్న వేదికపై వృద్ధ దంపతులు దండలు మార్చుకుంటున్నారు. అతిథులంతా చప్పట్లు కొడుతున్నారు.*

*అయితే, అదేమీ షష్టిపూర్తి మహోత్సవమో, వివాహ వార్షికోత్సవమో కాదు.. రైతన్న రిటైర్మెంట్.. అవును, వ్యవసాయ విరమణ సన్మాన కార్యక్రమం.*

*40 ఏళ్లు భూమినే నమ్ముకొని తమను జీవితంలో స్థిరపడేలా చేసిన ఓ రైతుకు వారి కొడుకులు చేసిన వినూత్న సత్కారం.*

*తెలంగాణలోని ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం హర్యాతండాకు చెందిన రైతు, బానోత్‌ నాగులు.. ఆయనకు ముగ్గురు కొడుకులు.*

*పెద్ద కొడుకు రాందాస్‌ విజయవాడలో ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌గా, రెండో కుమారుడు రవి హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పని చేస్తున్నారు. మూడో కుమారుడు శ్రీను ఎంఏ బీఈడీ చేసి ఉపాధ్యాయుడుగా చేస్తు అనేక సామాజిక కార్యక్రమాలు చేస్తున్నారు.*

*ఇన్నాళ్లూ తమ కోసం కష్టపడిన తల్లిదండ్రులకు విశ్రాంతినివ్వాలని, వారి శ్రమను తగిన రీతిలో గౌరవించాలని ముగ్గురు కొడుకులు నిర్ణయించుకున్నారు.*

*అందులో భాగంగా, మే 29న బంధువులు, స్నేహితులు, రాజకీయ నాయకులు, వ్యవసాధికారులను తమ ఇంటికి ఆహ్వానించి పెద్ద వేడుక నిర్వహించారు.*

*తల్లిదండ్రులను వేదికపై ఆహ్వానించి వ్యవసాయ విరమణ సన్మాన మహోత్సవం పేరుతో వారిని ఘనంగా సన్మానించారు.*

*నాన్న కష్టానికి గుర్తింపుగా, మరెందరికో స్ఫూర్తిగా'.....*

*40 ఏళ్లుగా వ్యవసాయం చేసి తమను ఉన్నత చదవులు చదివించిన నాన్నకు మేం ఇచ్చే చిన్న గౌరవం ఈ పదవీ విరమణ సన్మానమని నాగులు కుమారుడు రవి  చెప్పారు.*

*”చిన్నప్పుటి నుంచి ఆయన చాలా కష్టపడి మమ్మల్ని పెంచారు. అందుకే ఆయన కోసం ఏదైనా చేయాలనుకున్నాం. ఇంట్లో వాళ్లతో చర్చించి ఇలా పదవీ విరమణ సత్కారం ఏర్పాటు చేశాం’అని ఆయన తెలిపారు.*

*”ఉద్యోగులు 60 ఏళ్లు దాటితే పదవీ విరమణ ఉంటుంది. అదే రైతుకు అలాంటిదేమీ ఉండదు. వ్యవసాయం చాలా కష్టంతో కూడుకున్న పని కాబట్టి ఈ రంగంలో ఉన్నవాళ్లకు కూడా ఒక వయసు రాగానే విశ్రాంతినివ్వాలి!” అనేది తన అభిప్రాయం అని రవి చెప్పారు.*

*”నాన్నను, ఆయన వృత్తిని గౌరవించాలనే ఉద్దేశంతోనే మేం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. తల్లిదండ్రులను పట్టించుకోని కుమారులు దీన్ని చూసి కొంతైనా మారితే చాలు. కొందరైనా దీన్ని స్ఫూర్తిగా తీసుకుంటారని భావిస్తున్నాం!” అని రవి పేర్కొన్నారు. నాన్నను, ఆయన వృత్తిని గౌరవించాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని నాగులు కుమారుడు రవి తెలిపారు.*

*వ్యవసాయ మంత్రి నుంచి అభినందనలు.....*

*నాగులుకు నిర్వహించిన వ్యవసాయ విరమణ సన్మాన కార్యక్రమానికి వారి బంధువులు, స్నేహితులతో పాటు వ్యవసాయ అధికారులు కూడా హాజరయ్యారు.*

*'మా నాన్నను సన్మానించిన విషయం తెలిసి వ్యవసాయ శాఖ మంత్రి  స్వయంగా ఫోన్ చేసి అభినందించారు. మా నాన్నతో ఫోన్లో మాట్లాడి అభినందించారు. చాలా మంది రాజకీయనాయకులు, వ్యవసాయ అధికారులు కూడా వచ్చారు!” అని రవి తెలిపారు.*

*భూమితో బంధం పోతుందని బాధపడ్డారు...*

*”తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన ఎకరంన్నర పొలాన్ని మా నాన్న తన కష్టంతో 10 ఎకరాలకు పెంచారు. రైతు విరమణ ప్రతిపాదన తెచ్చిప్పుడు భూమితో బంధం పోతుందని ఆయన బాధపడ్డారు!” అని రవి చెప్పారు.*

*అన్నదాతగా, కన్న తండ్రిగా ఆయన మా కడుపు నింపారు. ఇప్పుడు ఆయనకు విశ్రాంతినిచ్చి జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మాకుంది అని ఆయన పేర్కొన్నారు.*

*వ్యవసాయాన్ని వదిలేసినా ఊరిని మాత్రం వదిలివెళ్లను*
          *- నాగులు, విశ్రాంత రైతు*

*”40 ఏళ్లు వ్యవసాయం చేశాను. ఎన్నో కష్టనష్టాలు అనుభవించాను. పంటలు బాగా పండి లాభాలొచ్చిన రోజులూ ఉన్నాయి.. పెట్టుబడులు కూడా కోల్పోయిన సందర్భాలున్నాయి. వ్యవసాయం అనుకూలించినా, అనుకూలించకపోయినా కూడా దీన్నే నమ్ముకుని జీవితం సాగించాను.*

*సాగు ఆధారంగానే నా పిల్లలను పెంచి వారికి మంచి భవిష్యత్ ఇచ్చాను. ఇప్పుడు వారు నన్ను ఇంతకాలం పడిన కష్టం చాలు విశ్రాంతి తీసుకోమని కోరారు.*

*వ్యవసాయాన్ని వదిలేయాలంటే మొదట బాధగా అనిపించింది. కానీ, నేనూ అలసిపోయాను. అందుకే వారి మాట కాదనలేక అంగీకరించాను.*

*ఇప్పటికీ వ్యవసాయం చేయాలనిపిస్తుంది, అయినా, పిల్లల మాటను గౌరవించి విరమించుకున్నాను. మొత్తం భూమిని కౌలుకిచ్చేశాను.*

*అయితే, వ్యవసాయాన్ని వదిలేసినా మా ఊరిని మాత్రం వదలను. పిల్లలు వారుండే హైదరాబాద్ వచ్చేయమని కోరుతున్నారు. కానీ.. ఇక్కడే ఉంటాను.*

*నా పిల్లల పెళ్లి ఎంతో ఘనంగా చేశాను. వారిప్పుడు అంతకంటే ఘనంగా నా ఈ వ్యవసాయ విరమణ వేడుకను జరిపారు.*✍️

🙏 *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🙏 *లోకా సమస్తా సుఖినోభవన్తు!*

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

No comments:

Post a Comment