Sunday, August 31, 2025

 నిన్న  ఒకరు ఫోన్ చేసి “హైదరాబాదులో కొత్తగా ఒక రెస్టారెంట్ పెట్టాను. మీరు వచ్చి ఆతిథ్యం స్వీకరించాలి” అన్నారు. 
 
“కొత్త హోటల్ అన్నారు కాబట్టి మా పనివాళ్ళ, స్నేహితుల  పిల్లల్ని కూడా తీసుకొస్తాను. తప్పని సరిగా బిల్లు తీసుకునే పక్షంలో” అని చెప్పాను. వద్దన్నాడు. అలా అయిన పక్షంలో నాకూ రావటం కుదరదన్నాను. 50 శాతం రిబేట్‌కి  అగ్రిమెంట్ కుదిరింది. 

అక్కడికి వెళ్ళాక తన కథ చెప్పాడు. “దాదాపు 30 సంవత్సరాల క్రితం మీరు మా షెడ్డు యజమానికి ఫోన్ చేసి ఒక తారీఖు చెప్పి, ‘...లోయలో తోసేయడానికి ఒక కారు కావాలి’ అన్నారు. నేను అదే మెకానిక్ షాపులో హెల్పర్ కుర్రాడిని. ఆ రోజు ఇంజన్ లేని కారు తోసుకుంటూ మేము నలుగురు కుర్రాళ్ళం సారధి స్టూడియోస్‌కి వచ్చాం. మీరు షూటింగ్లో ఉన్నారు. మీ ఆటోగ్రాఫ్ తీసుకోవాలని, అడగలేక పోయాను. ఆ తర్వాత నేను “విజయానికి ఐదు మెట్లు. ఆరో మెట్టు” చదివి ‘ఇది కాదు జీవితం’ అనుకుని దుబాయ్ వెళ్లిపోయాను. 
అక్కడ చాయ్ దుకాణం పెట్టి, పారిశ్రామికవాడలో కార్మికులకి తెల్లవార్నే రూపాయికి కప్పు ‘టి’ ఇవ్వసాగాను. టీ పొడి, పాలు శ్రద్ధగా చూసుకునేవాడిని. మంచి టీ, చౌకగా ఇవ్వటంతో బాగా క్లిక్ అయింది. ఆ తర్వాత కొంతకాలానికి నా కజిన్‌ని ఇండియా నుంచి పిలిపించి, దుబాయ్‌లోనే “హైదరాబాద్ బిర్యాని రెస్టారెంట్” స్థాపించాను. నా కజిన్ క్యాష్-కౌంటర్లో కూర్చుంటే, నేనూ, మరో కుక్ చాలా రుచిగా వండే వాళ్ళం. ఇంకో వెయిటర్. మొత్తం నలుగురమే. ఇరవై సంవత్సరాలు చాలా బాగా నడిపాము. 
నా తల్లిదండ్రులని చూసుకోవటానికి ఆరు నెలల క్రితం శాశ్వతంగా హైదరాబాదు వచ్చి మొన్నే ఈ రెస్టారెంట్ పెట్టాను. దీనికి కారణమైన మీకు ఈ సందర్భంగా ఆతిథ్యం ఇవ్వాలన్నది నా కోరిక” అన్నాడు. ప్రేరణ కలిగించే కథ.

‘”భీమవరం పక్కన పల్లెటూరు మాది. మా తాతయ్య తాలూకు గేదెలు కాస్తూ విమాన శబ్దం వినబడినప్పుడు ఉద్వేగంగా పైకి చూసేవాడిని.  నాలాగా ఎంతో మంది మధ్యతరగతి వారికి విమానం ఎక్కాలని ఉంటుంది.  కానీ ఆ కోరిక తీరదు. అందుకనే కోటీ ఇరవై లక్షలకి కింగ్ ఫిషర్ విమానం కొని ఈ హోటల్ పెట్టాను. (Kvr flight retaurant. గండి మైసమ్మ). ఆకాశ౦లో జర్నీ అనుభవం ఇవ్వటం కోసం రిమోట్స్ ఏర్పాట్లు చేశాము. కేవలం వెజ్, నాన్-వెజ్ బిర్యాని,  శుద్ధమైన పాలతో చేసిన కోవా,  ఒకటి రెండు కూరలు 600 కు ఇస్తాము.  ఇంట్లో పెద్దవారిని తీసుకొచ్చి ఈ విమానంలో కూర్చునే అనుభవం ఇవ్వాలనుకుంటే వారి పెద్దలకి ‘సగం ధర’ మాత్రమే ఛార్జ్ చేస్తాము. దీనికి కూడా ప్రేరణ మీరే. ‘...ఆటో దిగినప్పుడు 40 రూపాయలు మీటర్ ఛార్జీ అయితే, ఇంకో పది రూపాయలు ఎక్కువ ఇవ్వు. పది రూపాయలు నీకు చిన్న అమౌంట్. కానీ అతనికి పెద్ద ఆనందం’ అని విజయానికి ఆరవ మెట్టు పుస్తకంలోవ్రాసారు. అదే నాకు ప్రేరణ” అన్నారు. 

ఎవరన్నారు పుస్తకాలు మనుషుల్ని మార్చలేవని? పుస్తకాలు విత్తనాలు కాకపోవచ్చు. కానీ పుస్తక పఠనం నిశ్చయంగా మనసులో ‘కోరిక’ అనే విత్తనం. వృక్షమవటానికి కావలసిన నీళ్ళు పోస్తుంది..! ఎరువు అవుతుంది..!


ఇక్కడ వరకు
యండమూరి వీరేంద్రనాథ్

ఇక్కడ నుండి...

 .   సఫ్దర్ హష్మీ
- అనువాదం - ఎన్.వేణుగోపాల్ 

పుస్తకాలు మాట్లాడతాయి 
గడిచిన దినాలను తలపోస్తాయి 
పాత ప్రపంచాన్నీ 
వెళిపోయిన మనుషులనూ 
ఇవాళనూ నిన్ననూ రేపునూ 
ప్రతి ఒక్క క్షణాన్నీ 
ఆనందాలనూ విషాదాలనూ 
వికసిత పుష్పాలనూ 
విస్ఫోటక వస్తువులనూ 
విజయాలనూ అపజయాలనూ 
అనురాగాన్నీ ఆఘాతాన్నీ
అన్నీ తలపోస్తాయి. 
ఏం, నువ్వా పుస్తకాల మాటలు వినవా?
పుస్తకాలు నీతో మాట్లాడదలచుకుంటాయి 
పుస్తకాలు నీదగ్గరే ఉండదలచుకుంటాయి
పుస్తకాల్లో పిట్టలు కిచకిచలాడతాయి 
పుస్తకాల్లో పంటలు కళకళలాడతాయి
పుస్తకాల్లో జలపాతాలు పాటలు పాడతాయి
అద్భుతాశ్చర్య గాథలు వినిపిస్తాయి
పుస్తకాలలో రాకెట్ల రాజ్యం ఉంటుంది
పుస్తకాలలో విజ్ఞాన స్వరం ఉంటుంది 
పుస్తకాలలో విశాల ప్రపంచం ఉంటుంది
పుస్తకాలలో జ్ఞాన సర్వస్వం ఉంటుంది
ఏం, నీకా ప్రపంచంలోకి వెళ్లాలని లేదా?
పుస్తకాలు నీతో మాట్లాడదలచుకుంటాయి 
పుస్తకాలు నీదగ్గరే ఉండదలచుకుంటాయి

- సఫ్దర్ హష్మీ
- అనువాదం - ఎన్.వేణుగోపాల్

No comments:

Post a Comment