Tuesday, August 26, 2025

  వయసు పెరుగుతున్న కొద్ది,
మా అవసరం ఇక ఎవరికి ఉండదు.
వయసు మీద పడితే ఎక్కడైనా జైలు లాగే ఉంటుంది రఘు. ఎంత పరుగులు పెట్టిన ప్రాకులాడిన ఇంతేనా... ఇక్కడికి చేరుకోడానికేనా అని ఆలోచిస్తుంటే మనసు చివుక్కుమంటోంది రఘు.

మొన్ననే పెద్ద మనవడు మరియు వాడి పిల్లలు వచ్చి చూసి వెళ్లారు. ఆ నాలుగు రోజులు ఎలా గడిచాయో తెలియలేదు. నువ్వు శ్రీంగేరి వెళ్లవు కదా.. అప్పటి నుండి నిన్ను పలకరిద్దమనుకుంటే మనసు రాలేదు. కాసేపు ఈ ఫోన్ చూసి పక్కన పెడుతున్న. పక్కనే ఉన్న హాస్టల్ నుండి ఇద్దరు అమ్మాయిలు అప్పుడప్పుడు వచ్చి పలకరించి పోతుంటారు. వాళ్ళు ఉన్నంత సేపు సందడిగా ఉంటుంది. పాపం వాళ్ళు కూడా ఈ ముసలి దానితో రోజంతా ఉండలేరు కదా...

మొన్న ఒక పోస్ట్ పెట్టావు కదా చిన్నప్పుడు అమ్మమ్మలు నానమ్మలు పసి పిల్లలకు మర్ధన చేసి స్నానం చేపించే విధానం గురించి నాకు బాగా నచ్చింది రఘు. ని రాతలు ఆ రాతల కింద కామెంట్లు చూస్తుంటే... హైదరాబాద్ రోజులు అన్ని గుర్తొస్తున్నాయ్...
హైదరాబాద్ మీద మనసు చావట్లేదు. ఇక్కడ బెంగుళూరు లో ఒంటరిగా మగ్గిపోతున్న రఘు.

హైదరాబాద్ లో అయితే ఒంట్లో ఓపిక లేక పోయిన తెలిసిన ప్లేస్ లకు, ప్రోగ్రాములకు ఆటో కట్టించుకొని వెళ్లి వచ్చేదాన్ని కానీ, ఇప్పుడు ఇంకా నీరసంగా ఉంటున్నాను. నీలాగే రోజు ఏదో ఒకటి రాయాలని, లేదా ఏదైనా వ్యాపకం పెట్టుకోవాలని రెండు రోజులు ప్రయత్నించా కాని మనసు మొద్దుబారింది. రుమటాయిడ్ ఆర్థరైటిస్ వళ్ళ చేతి వెళ్లలో, కండరాల జాయింట్ లలో విపరీతమైన నొప్పి వల్ల కధలలేని పరిస్థితి. ఉదయం లేచినప్పుడు చూడాలి ఒళ్ళంతా కట్టెలా మారి పోతోంది.

ఒంట్లో కాస్త ఓపిక ఉన్నప్పుడు నెలకు ఒకటి రెండు సార్లు రెండో మనవరాలు స్పా కు తీసుకెళ్తే అక్కడ కాట్మండు నుండి వచ్చిన అమ్మాయి చాలా ఓపికగా మసాజ్ చేసేది. నువ్వు రాసిన పోస్ట్ చదువుతుంటే నాకు ఆ పిల్లే గుర్తొచ్చింది. 

ఆ పిల్ల చేతుల్లో మృదుత్వం ఉండేది, ఆ మృదుత్వంలో ఓ ఔషధం ఉండేది. నన్ను తాకిన ప్రతిసారి నొప్పులు కరిగిపోయి శరీరం మళ్ళీ పసితనాన్ని ముద్దాడినట్టుగా అనిపించేది. మొదట మెడ దగ్గరనుంచి నెమ్మదిగా ఒత్తుతుండగా, ప్రతి కండరంలో దాచుకున్న అలసట కరుగుతూ వెళ్లేది. వేళ్ళతో మెల్లగా వలిచే ఆ గీతలు శరీరానికి కాకుండా మనసుకే మసాజ్ చేస్తున్నట్టుండేది. జుట్టు దగ్గర తడిమినప్పుడు పూర్వజన్మల ఆత్మీయత గుర్తొచ్చినట్టుండేది. వెన్నుపైన తడుముకుంటే శ్వాసే పచ్చని గాలిలా మారి గదంతా పరచినట్టుండేది. పాదాల దగ్గరకి రాగానే... భూమి తల్లి నన్ను మళ్ళీ ఆలింగనం చేసుకున్నట్టుండేది.

ప్రతి ఇంచు ఇంచు చాలా నిదానంగా మర్దన చేస్తుంటే ఈ క్షణం ఊపిరి గాలిలో కలిసిపోతే బావుండు అని ఎన్ని సార్లు అనుకున్నానో...

మెంబెర్ షిప్ కార్డు ఉండడంతో అప్పుడప్పుడు ఆ అమ్మాయి కాల్ చేసి ఆఫర్ లు చెప్పి రమ్మనేది... నడవలేక పోతున్న అని చెప్తే అమ్మాయికి డ్యూటీ లేని రోజు ఇంటికి వచ్చేది. స్పా లో అయితే అరవై నిముషాలు, తొంబై నిముషాలు అని లెక్కలతో నడిచేది. కానీ ఇంటికి వస్తే అలా లెక్కలతో కాకుండా బాగా కలిసిపోయేది. చాలా అల్లరి పిల్ల. అప్పుడప్పుడు వీడియో కాల్ చేసి వాళ్ల అమ్మతో నాన్నతో వీడియో కాల్ లో చూపించేది...

ఆ పిల్ల ఇంటికి వస్తుంది అంటే చాలు, ఆ పిల్ల వచ్చేంత వరకు ఎక్కడి వరకు వచ్చావు అని రెండు మూడు సార్లు ఆరా తీసేదాన్ని. చూడడానికి మల్లె పువ్వులా ఉంటుంది చిన్న కళ్ళు, సన్నని పెదాలు వచ్చి రాని తెలుగు తో దాదాపు హిందీ లో తెగ మాట్లాడేది. జుట్టు నుండి మొదలు పాదాల వరకు మర్ధన చేస్తూ కొత్త జీవాన్ని తెచ్చేది.

తర్వాత నన్ను పెద్దోడు పిట్సభర్గ్ పట్టుకెళ్ళాడు. అక్కడే ఆరు నెలలు ఉండి వచ్చాను. ఈ ఆరు నెలల్లో రెండు మూడు సార్లు వీడియో కాల్ చేసింది. నన్ను మిస్ అవుతున్నానని కళ్ళ నీళ్లు పెట్టుకుంది. ఒకరోజు కాల్ చేసి నా పెళ్లి అని చెప్పి కాబోయే భర్తను కూడ వీడియో కాల్ లో చూపించింది.

పెళ్ళికి ఎలాగైన రావాలి అని మారం చేస్తే... నేను నా రెండో మనవరాలు ఇద్దరం వెళ్ళాం... పెళ్లి చాలా చూడముచ్చటగా కొండల నడుమ ఆకాశానికి దగ్గర జరిగింది. పెళ్లి చేసుకున్న అబ్బాయి భూటన్ టూరిజం లో చేస్తుండడంతో ఈ పిల్లని కూడ తనతో పట్టుకెళ్ళాడు. ఆ పిల్ల అక్కడికి వెళ్తోంది అని తెలియగానే నా వొంట్లోనుండి జీవాన్ని తీసుకొని వెళ్తున్నాడు అనిపించి రిటర్న్ ఫ్లైట్ లో చాలా సేపు ఏడుస్తూ కూర్చున్న...

ఆ పిల్ల మసాజ్ చేసిన క్షణాలను గుర్తుచేసుకుంటూ,
ఒక మాయల ఒక మర్ధన... ఒక శరీర పండుగ అనిపిస్తోంది.
నొప్పిని మర్చిపోయిన శరీరానికి మాత్రమే కాదు,
ఆసరా కోసం విలవిలలాడే మనసుకి కూడ ఆ స్పర్శ
ఒక పండుగలా, ఒక కొత్త జీవితంలా నిలిచిపోయింది రఘు.

ఇప్పుడెలాగూ ఆ పండుగ మరోసారి జరగదు అనిపిస్తోంది.
కానీ ఆ జ్ఞాపకం మాత్రం గుండెల్లో ఒక దీపంలా వెలుగుతూ ఉంది.
బెంగుళూరులోని ఈ ఒంటరితనం మధ్య,
ఆ మర్దన చేసిన చేతుల స్మృతులు నన్ను మళ్లీ పసిదాన్ని చేస్తాయి రఘు...

కానీ ఈ గుండె మాత్రం ఆగడం లేదు.
హైదరాబాద్ రావాలని ఉంది, అందరినీ కలవాలని ఉంది.
మరింత ఓపిక తెచ్చుకొని...
ఒకరోజు భూటాన్ దాకా వెళ్ళి ఆ పిల్లని చూసి
గట్టిగా కౌగిలించుకోవాలని ఉంది రఘు.
నా చిన్న తనంలో నా అమ్మమ్మ నాయనమ్మ నన్ను ఎలా చూసుకున్నారో నాకు గుర్తు లేదు రఘు కానీ..
ఆ పిల్ల కౌగిలిలో నేనొక పసిపిల్లలా 
జీవితాంతం నిలిచిపోవాలని ఉంది రఘు...

**

మీ మాటలు చదివుతుంటే నా కళ్లూ చెమ్మగిల్లాయి మా..
వయసు అనే మాట మన శరీరానికి మాత్రమే పరిమితం... మనసుకి కాదు.
మీ ఆలోచనల్లో, మీ జ్ఞాపకాలలో, మీ గుండెల్లో ఉన్న ఆ ప్రేమలో మీరు ఎప్పటికీ పసిపిల్లగానే ఉంటారు.

మీరు చెప్పిన ఆ పిల్ల మసాజ్ చేసిన క్షణాలు విన్నపుడు...
నిజంగానే అది కేవలం ఒక మర్ధన కాదు,
ఒక పూజ, ఒక స్నేహం, ఒక తల్లిదనపు ఆప్యాయత అని నాకు అనిపించింది.
ఆ స్పర్శలో మీరు అమ్మమ్మ నాయనమ్మ చేతిని తిరిగి మళ్లీ పొందారు,
అందుకే మీ హృదయం ఇప్పటికీ దానిని పండుగలా గుర్తుంచుకుంది.

మీ మాటల్లో ఉన్న ఆరాటం నాకు ఎంతో హత్తుకుంది.
ఒక రోజు భూటాన్ వెళ్లి ఆ పిల్లని కౌగిలించుకోవాలని మీరు చెప్పిన ఆ కోరికలో,
నాకు తల్లిదనపు ఆత్మ, జీవితం కోసం తపించే హృదయరాగం వినిపిస్తోంది.

మీరు ఎప్పటికీ ఒంటరిగా లేరు మా...
మీ జ్ఞాపకాలలో ఆ అమ్మాయి ఉంది, మీ మనసులో మేమున్నాం.
హైదరాబాద్ మీకోసం ఎదురుచూస్తోంది.
ఆ కౌగిలి కోసం మీరు కలలు కనడం ఆపకండి...
ఎందుకంటే ఆ కలలోనే మీ శరీరానికీ, మనసుకీ మళ్ళీ కొత్త జీవం వస్తుంది.
.
.
.
.
.
రఘు మందాటి
Season 2, Episode : 13
(213)

No comments:

Post a Comment