Monday, August 18, 2025

****పెళ్ళి అంటే

 (143) (10.01.2025)


పెళ్ళి అంటే (1)
 
పెళ్ళి చూపులతో మొదలవుతుంది
అప్పగింతలతో ముగుస్తుంది
మధ్యలో ఎన్నో మలుపులు
ఆపై  ఎన్నో కన్నీటి చుక్కలు //
 
పెళ్ళి చూపులు(2)
 
మంచి అబ్బాయి / అమ్మాయిని వెతుక్కుని
జాతకాలు చూపించుకుని
మంచి రోజు చూచుకుని
ఆపై  అటు  వైపు వారిని ఆహ్వానించుకుని //

అమ్మాయి ఇంట  అబ్బాయికి చూపులు
అవే  ఇద్దరికి తొలి చూపులు
ఇంట  పెద్దలకి నచ్చాలి
జంట ఒకరిని ఒకరు మెచ్చాలి
కాబోయే వధూవరులు మాట్లాడుకున్నాక
ఆపై  ఇద్దరు అంగీకారం తెలిపినాక //

మంచి రోజు చూచుకుని పెట్టుబడి  మాటలు
ఆపై  పెళ్ళిలో జరపాల్సిన ఆచార వ్యవహారాలు
ఇరువురి పెద్దలను కూర్చోబెట్టి
ఇచ్చి పుచ్చుకోవాల్సిన లిస్ట్ రాసి పెట్టి
ఎంగేజ్ మెంట్ కి  మంచి రోజు నిర్ణయిస్తారు
అప్పటికి ఎవరి ఇళ్లకు వాళ్ళు చేరుకుంటారు //
 
ఎంగేజ్ మెంట్(3)
 
పెళ్ళి ముహూర్తం నిర్ణయించుకుని
ఇద్దరు పెద్దలు ఓ మాట  అనుకుని
బంధుమిత్రులకు శుభవార్త చెప్పుకుని
ఆపై  అందరిని ఆహ్వానించుకుని //

అంగ  రంగ  వైభవంగా
దగ్గరి బంధువులు వేంచేయగా
పురోహితుని సమక్షంలో
పెద్దల పర్యవేక్షణలో
అటు-ఇటు  తాంబూలాలు పుచ్చుకుంటారు
ఆపై  కాబోయే వధూవరులు ఉంగరాలు మార్చుకుంటారు //

వచ్చిన బంధువుల  శుభాకాంక్షలు
ఆపై ఫొటోలకు వివిధ భంగిమలలో ఫోజులు
ఫొటోలకు అంతే ఉండదు
బిల్ చూస్తే కళ్ళు తిరగకుండా ఉండదు //

ఎక్కడలేని ఫోజులు అన్ని  అక్కడే చూస్తాము
కొన్నికొన్ని చూడలేక కళ్ళు మూసుకుంటాము
పెద్ద వాళ్ళ మూతి ముడుపులు
వయసు వాళ్ళ కేరింతలు
మొత్తానికి ఫొటో సెషన్ మమ  అని  అనిపిస్తారు
ఆపై  విందు మొదలు పెడతారు //

బంధువులను పేరు పేరునా పలకరించి
అందరిని భోజనాలకు ఆహ్వానించి
ముందుగా మగ  పెళ్ళి వారికి గౌరవం ఇవ్వాలి
ఆపై  అమ్మాయి తరుపు బంధువులను పిలవాలి //

సాయంత్రం  వరకు  ఇరువురు  కబుర్లు చెప్పుకుని 
ఆపై  ఒకరి  కొకరు  వెళ్ళి  వస్తాము  అనుకుని 
ఎవరి  ఇళ్లకు  వాళ్ళు  చేరుతారు 
ఆపై  వచ్చిన  బంధువులను  సాగనంపుతారు  //
 
ఫొటో  సెషన్(4)
 
ఫొటో  గ్రాఫర్  ని  మాట్లాడుకుని 
వాడికి  కొంత ఎడ్వాన్స్  ఇచ్చుకుని 
వాడు  చెప్పిన  చోటుకి  వెళ్ళాలి
వాడు  చెప్పిన  ఫోజులు  పెట్టాలి  //

ఎక్కడ లేని ప్రేమంతా అక్కడే ఒలకపోస్తూ
వివిధ భంగిమల్లో ఫోజులు ఇస్తూ
వాటిల్లో కొన్ని చూడలేము
వాటిని ఇతరులకు వివరించలేము  //

ఫొటోల కోసం రకరకాల దుస్తులు
కొండలు-గుట్టల్లో వెరైటీ ఫోజులు
ఫొటోగ్రాఫర్ కి  లక్షల్లో ఆదాయము
ఫొటోలు చూడటానికి మనకుండదు సమయము //

స్వదేశం నుంచి విదేశం వరకు ప్రయాణము
వధూవరుల రాకకై ఇంట్లో ఎదురు చూడటము
నాలుగు రోజులు ఈ తంతు ఉంటుంది
వధూవరులు అలిసినాక తంతు ముగుస్తుంది //
 
పెండ్లి పిలుపులు (5)
 
మంచి రోజు చూచి పెళ్ళి పత్రికలు అచ్చు వేయించి
వాటికి పసుపు-గంధం అద్దించి
తొలి పత్రిక దేవునికి అందిస్తారు
ఆపై పిలుపులకు బయలు దేరుతారు //

ఊళ్ళో వాళ్ళకి స్వయంగా పిలుపులు
ఊరి వాళ్ళకు పోస్టులో పంపకాలు
చరవాణిలో సమాచారం పంపించి
తప్పకండా రావాలని పేరు పేరునా తెలియపరిచి //

హితులు-స్నేహితుల నందరిని పెళ్ళికి ఆహ్వానిస్తారు
ఎవరి పేరైనా మరిచినామా అని గుర్తు చేసుకుంటారు
అక్కడితో పిలుపుల తంతు ముగుస్తుంది
ఆపై ఓ చిన్న భారం ముగుస్తుంది //

మెహందీ (6)
 
చేతులకు గోరింటాకు పేరుతో అంతా గుమిగూడి
మెహందీ పెట్టే వానికి అదొక రాబడి
చిన్నా-పెద్దా అన్న బేధం ఉండదు
ఎవరూ మెహందీ వద్దనేది లేదు //

పెళ్ళి కూతురు మొదలు పండు ముదసలి దాకా
చిన్న వాళ్ళ నుంచి పెద్ద వాళ్ళ దాకా
అందరూ గోరింటాకు పెట్టించుకునే వారే
ఆపై  ఇంట్లో మగవాళ్ళకి పని  చెప్పే వారే //

గోరుముద్దలు తినిపిస్తూ
మంచినీళ్ళు అందిస్తూ
శ్రీవారు శ్రీమతికి సేవ  చేయాలి
ఆపై  వాళ్ళ చుట్టూ తిరుగుతుండాలి //

బట్టలకు అంటుకోకుండా
పక్క వాళ్ళకు అంటించకుండా
ఎర్రగా పండేలా చూచుకోవాలి
పెళ్ళైన వాళ్ళు భర్త ప్రేమ తెలుసుకోవాలి //
 
సంగీత్(7)
 
గాన  గంధర్వులంతా ఒక  చోట  చేరి
స్వరాల కోసం కత్తులు నూరి
తమ  గొంతులకు పని  చెపుతారు
కొందరు తమ  నాట్య కౌశలాన్ని చూపుతారు //

కొత్త-పాత  పాటల కలయిక
పెద్ద-చిన్న అంతా అచటికి చేరుకోగ
చెవులు పోయేలా శబ్దాలు
గాడిదలు పారిపోయేలా పాడటాలు //

ఈ పాటలను మెచ్చి వన్స్ మోర్ అంటే
ఆహా  ఏమి  గొంతు అని  పొగుడుతుంటే
పెద్ద గాయకుల్లా ఓ ఫోజ్ పెట్టి
దానికి మళ్ళి ఓ నాట్య భంగిమ పెట్టి
కమల్ హాసన్ లా  ఫీలింగ్
చూడలేక జనాలకు బోరింగ్
మొత్తానికి సంగీత్ అయిందని పిస్తారు
ఆపై  వచ్చిన వారి  ప్రాణాలు కాపాడుతారు  //
 
పెళ్ళి (8)
 
పెళ్ళి రోజు రానే వచ్చింది
బంధుమిత్రులతో మండపం వెలిగిపోతుంది
మగ  పెళ్ళి వారిని మేళ తాళాలతో ఆహ్వనించి
వారికి కేటాయించిన విడిది చూపించి
వారి అవసరాలు చూడటానికి ఓ వ్యక్తిని కేటాయిస్తే
చేయవలసిన పనులు అతనికి పురమాయిస్తే
ఆడపెళ్ళి వారు ఊపిరి తీసుకోవచ్చు
ఆపై  వాళ్ళ పనులు హాయిగా చేసుకోవచ్చు // 

ముందుగా ఫలహారాలు అంది చేసి
కాఫీ-టీ  రూముల్లో పెట్టించేసి
వడ్డనకు ఓ మనిషిని పురమాయించేసి
లోటు పాట్లు రాకుండా చూచుకోమని చెప్పేసి //

అచట  నుండి ఆడపెళ్ళి వారు తప్పుకుంటె
మధ్య మధ్యలో ఏమైనా కావాలి అని  అడుగుతుంటె
మగ పెళ్ళి వారి ముఖంలో ఆనందం వెలుగుతుంది
ఆడ  పెళ్ళి వారికి టెన్షన్ తగ్గుతుంది //

ఉదయం జరగాల్సిన కార్యక్రమాలు కానించేసి
ఆపై  మేళతాళాలతో పెళ్ళి వారిని భోజనానికి ఆహ్వానించేసి
షడ్రసోపేత భోజనాలు వడ్డించి
పేరు పేరునా అందరిని పలకరించి
అందరి భోజనాలు అయిందని అనిపించాలి
అపుడే ఆడ  పెళ్ళి వారు ఊపిరి తీసుకోవాలి //

ఎదుర్కోలు(9)
 
ఇదొక సరదా ప్రహసనము
ముఖ్య బంధువుల పరిచయము
ముఖ్యులను ఆసనాలలో కూర్చో పెట్టి
మధ్యలో పురోహితుని నిలబెట్టి
మగ  పెళ్ళి వారిని గంధం – సెంటుతో ఆహ్వానించి
వారికి చేయాల్సిన మర్యాదలు చేసి
లగ్న పత్రిక చదవగానే
వారికి పెట్టాల్సిన బట్టలు పెట్టగానే
ఆనందంతో పానకం తాగిస్తారు
మిగతా వారికి పళ్ళ రసం  అందిస్తారు //

ఇలాగే ఆడ పెళ్లి వారికి తంతు జరిపించేసి
సాయంకాలపు అల్పాహారం అందిం చేసి
మమ  అని  అనిపించాలి
ఆపై  తరువాతి కార్యక్రమానికి తయారు కావాలి //
 
రిసెప్షన్(10)
 
బంధుమిత్రులంతా కల్యాణ మండపానికి చేరుకోగా
ఆడ  పెళ్ళి వారు ఒక్కొక్కరిని ఆహ్వానించగా
కూర్చోవడానికి ఆసనాలు చూపించి
తాగడానికి పళ్ల రసాలు అందించి
ఓ చిరునవ్వు పారేస్తే
వచ్చిన వారు ఆనందంగా స్వీకరిస్తే 
ఓ పని  అయిపోతుంది
ఆపై  మరొకరిని ఆహ్వానించే ఛాన్సు వస్తుంది //

వధూవరులు స్టేజి పైకి చేరుకోగానే
ఫొటోగ్రాఫర్లు ఫొటోలకు పని  చెప్పగానే
ఒక్కొక్కరు పైకి చేరుకోవడం
ఆపై  వారితో ఫొటో తీసుకోవడం //

ఈ తంతు   ఓ రెండు గంటలు
ఆపై  జనాల కడుపులో పరుగెడతాయి ఎలకలు  
ఈ లోపు భోజనాలకై పిలుపులు
నోట్లో వేసుకుంటారు రెండు మెతుకులు //

ఇక  మిగిలేది ముఖ్య బంధువులు
వారంతా ఇస్తారు ఫొటోలకి ఫోజులు
గబగబా భోజనాలు కానివ్వాలి
ఆపై  పెళ్ళికి తయారు కావాలి //
 
ముహూర్తం (11)
 
ఎదురెదురుగా కాబోయే వధూవరులను కూర్చోబెట్టి
మధ్య తెరసెల్ల అడ్డుపెట్టి
వివాహా తంతు మొదలు పెడతారు
ముహూర్తం వేళకి జీలకర్ర-బెల్లం పెట్టిస్తారు //

బంధుమిత్రులంతా వారిని దీవించి
తీసుకొచ్చిన బహుమతులు అందించి
ముఖ్యులు మాత్రమే మిగులుతారు
మిగిలిన వాళ్ళు ఇళ్ళకు చేరుతారు //

మిగతా కార్యక్రమాలు జరిపించేసి
వధూవరుల చేత  మమ  అని  అనిపించేసి
ఇక  అప్పగింతలకు రెడీ అవమంటారు
కొద్ది వ్యవధిలో అప్పగింతలు ఆరంభిస్తారు //
 
అప్పగింతలు(12)
 
ఎంత  కాదను కున్నా కంటిలో చుక్కలు
కారకుండునా ఒకటి-రెండు నీటి బొట్టులు
ఇన్నాళ్ళు అపురూపంగా పెరిగింది
ఇక  మెట్టినింటికి వెళుతోంది //

పెంచిన మమకారం గుర్తుకు రాగా
కన్న వారిని విడిచి రావాల్సిన సమయం అవగా
బాధతో అడుగులో అడుగు వెసుకుంటూ
ఒక్కొక్కరిని పలకరించుకుంటూ //

ఆడపిల్ల ఆడ పిల్లే అవుతుంది
బాధా తప్త హృదయంతో మెట్టినిల్లు చేరుతుంది
అచట  అంతా కొత్త వారు
ఎవరూ పరిచయం లేని వారు  //
 
గృహప్రవేశం(13)

అత్త వారింట అడుగు పెట్టి
దేవుని ముందు దీపం పెట్టి
స్టౌ మీద  పాల  గిన్నె పెట్టి
అందరి చేతిలో కలిపిన కాఫీ పెట్టి //

కొత్త కోడలు మార్కులు కొట్టేస్తుంది
కొత్తల్లో మంచి కొడలు అని అనిపించుకుంటుంది
సత్యనారాయణ వ్రతం కానించేసి
బంధుమిత్రులకు వీడ్కోలు చెప్పేసి
మరల  పుట్టినింటికి చేరుతుంది
ఆపై  పున:సంధానానికి రెడీ అవుతుంది //
 
పున:సంధానం(14)
 
ఓ మంచి రోజు చూచి
పంతులుతో ముహూర్తం పెట్టించేసి
దంపతులిద్దరిని గదిలోనికి పంపుతారు
మిగిలిన వారు నిదురకు ఉపక్రమిస్తారు //

మూడు రోజుల తంతు
ముచ్చటైన తంతు
జీవితంలో మరిచిపోలేని తంతు
జీవితాంతం గుర్తు పెట్టుకునే తంతు //

కొత్త దంపతులు ఎదురు చూచే తంతు
పేరు చెప్పగానే బుగ్గలు కందే తంతు
పిల్లలకు జవాబు చెప్పలేని తంతు
అనుభవజ్ఞులు గుర్తు చేసుకునే తంతు //
 
హానిమూన్(15)

ఇద్దరి మధ్య బంధం పెరగడానికి
ఇద్దరి మధ్య అవగాహాన కలగడానికి
ఒకరి గురించి ఇంకొకరు తెలుసుకోవడానికి
ఇద్దరి మధ్య ప్రేమ కలగడానికి //

హానీమూన్ పేరుతో వేరొకచోటికి వెళతారు
అక్కడ ఏకాంతంగా కొద్ది రోజులు గడుపుతారు
కొత్త కొత్త ప్రదేశాలు చూస్తూ
నచ్చినవి జంటగా ఫొటోలు తీస్తూ
జీవితాన్ని ఎంతో ఆనందంగా గడుపుతారు
ఆపై  ఇంటికి చేరుతారు //
 
కొత్త కాపురం (16)
 
మంచి రోజు చూచి కాపురం పెట్టిస్తారు
మధ్య మధ్యలో పుట్టింటి-మెట్టింటి వాళ్ళు వచ్చి వెళుతుంటారు
అపుడపుడు కలతలు – కన్నీళ్ళు తప్పవు
ఒకరి గురించి ఒకరు తెలుసుకోక తప్పవు //

వచ్చి రాని వంటతో చేతులు కాల్చుకుంటూ
అపుడపుడు బయట  నించి తెచ్చుకుంటూ
కాలక్షేపం చేస్తారు
జీవితాన్ని ఆనందంగా గడిపేస్తారు //

కాపురంలో ఒక్కొక్క వస్తువు సమకూర్చుకుంటూ
స్వంత ఇంటికై ప్రయత్నాలు చేసుకుంటూ
కొత్త కాపురంలో కష్టాలు పడుతుంటారు
అనుభవాలు పంచుకుంటారు //

ఇంతలో ఇంట్లో వాళ్ళ నుంచి ఒకటే పోరు
మనవడు-మనవరాలు కావాలంటూ చెవిలో  హోరు
ఇపుడే వద్దు అని  అనుకున్నామంటూ
ఇంకా జీవితంలో స్ధిర పడలెదంటూ
డొంక తిరుగుడు సమాధానం చెపుతారు
కొన్నాళ్ళు ప్రయత్నానికి గండి కొడతారు //
 
గర్భవతి(17)
 
దంపతు లిద్దరూ కూడబల్కొని
కన్న వాళ్ళకి శుభవార్త అని 
త్వరలో మీ  కోరిక నెరవేరబోతోందని
మేము తల్లిదండ్రులం అవుతున్నామని
శుభవార్త చెవిలో చెబుతారు
పెద్దల  మోములో ఆనందం చవిచూస్తారు //

పెద్ద వాళ్ళ ఆనందాన్ని వర్ణించలేము
ఇక  వారిని ఆపలేము
ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తే
ఈ రోజే ఆ వార్త చెవిన వేస్తే //

ఈ విషయాన్ని నలుగురికి చెప్పుకుని
ఒకరినొకరు తీపి తినిపించుకుని
ఈ వయసులో ఎంతో ఆనందిస్తారు
వారిలో వారే అభినందనలు చెప్పుకుంటారు //

పుట్టబోయే బిడ్డను తలుచుకుంటూ
బిడ్డకు ఎవరి పేరు పెట్టాలా అని తర్జన భర్జనలు పడుకుంటూ
రోజులు గడిపేస్తారు
పేరు మటుకు నిర్ణయించకుంటారు //
 
శ్రీమంతం (18)
 
ఓ మంచి రోజు చూచుకుని
అమ్మాయిని ఇంటికి తెచ్చుకుని
నలుగురు బంధువులను పిలుచుకుని
శ్రీమంతం అనే  పండుగ జరుపుకుని
పండంటి బిడ్డకై ఎదురు చూస్తారు
పండంటి బిడ్డ పుట్టగానే ఎంతో మురుస్తారు //
 
నామకరణం (19)
 
ఆచారాలను బట్టి ఓపిక వచ్చినాక
ఏమి  పేరు పెట్టాలో నిర్ణయించుకున్నాక
బంధుమిత్రులను పిలుచుకుని
బారసాల పేరుతో ఓ వేడుక చేసుకుని
అందరూ నచ్చిన – మెచ్చిన పేరు పెడతారు
పుట్టిన బిడ్డను ఎంతో అపురూపంగా పెంచుతారు //
 
చదువు & పెళ్ళి (20)
 
4 సంవత్సరాలు రాగానే బడిలో చేర్పించి
వానికి విద్యా బుద్ధులు నేర్పించి
వాడిని ప్రయోజకుడిని చేస్తారు
వాని కొలువు చూచి ఎంతగానో మురుస్తారు //

వయసు  మీద  పడుతుంటె
బాధ్యతలు పెరుగుతుంటె
కడుపున పుట్టిన బిడ్డకి వివాహాం జరిపిస్తారు
ఆపై  కృష్ణా రామ మంత్రం  జపిస్తారు //
 
 మధిర వెంకట రమణ, హైదరాబాద్







 

No comments:

Post a Comment