ఆమె గుండె వేగంగా కొట్టుకుంటుంది. తన గుండె కొట్టుకునే శబ్దం తనకు వినిపిస్తుంది. శ్వాస తీసుకునే రేటు పెరిగింది. రక్తం బలంగా నరనరాలలో ప్రవహిస్తుంది. దానితో పాటుగా ఏదో పాజిటివ్ హార్మోన్ శరీరం మొత్తం ప్రవహిస్తుంది. కాలి వెళ్లనున్న గోరు చివరి దాకా రక్తం చేరుకుంటుంది. తల వెంట్రుకల వరకు రక్తం ప్రవహిస్తుంది. శ్వాసద్వారా తీసుకున్న ఆక్సిజెన్ శరీరంలోని అణువణువుకూ చేరుతుంది. శరీరం మొత్తం ఒక పాజిటివ్ ఎనర్జీతో ఉత్తేజితం అవుతుంది.
ఇదంతా అతను తన వద్దకు వచ్చేటపుడు ఆమెలో వచ్చే మార్పు. అతని కోసం ఎదురు చూస్తుంది. అతను వచ్చే సమయం దగ్గరపడే కొద్దీ తన గుండె వేగం పెరుగుతుంది. అతని చిరునవ్వు, అతని హ్యూమర్ అంటే ఆమెకు చాలా ఇష్టం. అతని నుదురు మీద పడే జుట్టు, ఆ జుట్టు నుండి వచ్చే షాంపూ సువాసన ఆమెను మైమరపిస్తుంది. అతని నూనోగు మీసాలు, వాటి క్రిందున్న పెదవి వంపు, ఆ పెదవుల మధ్య నుండి అతను తిన్న చాకొలేట్ వాసన ఆమెకు ఒక విధమైన మత్తునిస్తుంది. ఆమె కంటిలో పడిన నలుసును అతను ఎంతో సున్నితంగా ప్రేమగా తొలగిస్తాడు. అతడెప్పుడు తనను ఆక్రమిస్తాడా అని ఆమె మనస్సు ఎదురుచూస్తుంది.
అతను రావడంతోనే 'అబ్బా!! నీ మొహం ఎంత అందంగా, ఎంత కాంతి వంతంగా ఉంటుంది? నీ చర్మంలో ఆ వెలుగు ఎలా వస్తుంది అని అడుగుతాడు.' ఇతంతా నీవల్లే వచ్చింది అని ఆమె చెబితే అతనికి అతిశయోక్తిగా ఉంటుంది.
#20_సంవత్సరాల_తరువాత....
ఆమె తల్లిదండ్రులతో, సమాజంతో పోరాడి మరీ అతనిని తన భర్తగా పొందింది. ఇప్పుడు అతను ఆమె భర్త. తన ఇద్దరు పిల్లలకు తండ్రి. అప్పటిలో ఎంతో కాంతివంతంగా ఉందని అతడు పొగిడిన ఆ శరీరమే చిక్కి శల్యమైనది. చర్మము తడారిపోయింది. కాలు చెయ్యి కదపలేనంత నిస్సత్తువతో ఉంటుంది. అయినా శక్తిని కూడగట్టుకుని అతనికి, అతని వల్ల పుట్టిన బిడ్డలకు వండిపెడుతుంది.
ఇప్పడు కూడా అతనొస్తున్నాడు అంటే గుండెల్లో దఢ మొదలవుతుంది. శ్వాస తీసుకునే రేట్ పెరుగుతుంది. ఉన్న కొద్దిగా రక్తం బలంగా శరీరంలో ప్రవహిస్తుంది. దానితో పాటుగా భయం వల్ల శరీరంలో విడుదలయిన హార్మోన్ శరీరమంతా వ్యాపిస్తుంది. వీలయినంత శక్తి జరగబోయే హింసను ఎదుర్కోడానికి తన శరీరంలో విడుదల అయ్యింది. చర్మం, గోర్లు, వెంట్రుకలకు ఆక్సిజెన్ తగ్గిపోయింది. చర్మం తడారిపోయి డెడ్ స్కిన్ కనిపిస్తుంది. బలం లేక వెంట్రుకలు ఊడిపోతున్నాయి.
ఇప్పుడు కూడా అదే వ్యక్తి వస్తున్నాడు. కానీ ఎప్పటిలాగా మనస్సు స్పందించడం లేదు. అందుకు విరుద్ధంగా మనస్సు భయపడుతుంది. అతను వస్తున్న కాళ్ళ శబ్దం వినగానే ఆమె గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభమవుతుంది. వస్తూనే చిరాకుగా అరుస్తాడు. డైనింగ్ టేబుల్ మీద ఉన్న వస్తువులను కోపంగా విసిరికొడతాడు. భయం భయంగా ఆమె వడ్డిస్తే తినేస్తాడు. బెడ్ మీదకు చేరగానే ఆమెను పిలుస్తాడు. అతడు ఆమెను ఆక్రమిస్తాడు.
విపరీతమైన అతని శరీరపు బరువు మొత్తం ఆమె మీద పడేస్తాడు. అడ్డమైన తిండి తిని తిని అతని శరీరం నుండి వెలువడే చెమట దుర్గంధం వస్తూ ఉంటుంది. అతని నోటి నుండి ఆల్కహాల్ వాసన ఆమె కడుపులో త్రిప్పుతుంది. ఆ సమయంలో అతను వాడే బూతులు ఆమె మనస్సును కత్తితో కోసినట్లుగా బాధిస్తుంది. ఆమె శరీరం ముడుచుకు పోతుంది. అయినా అతను చేసిన బలవంతపు శృంగారం ఆమె శరీరాన్ని బాధిస్తుంది. పంటి బిగువున బాధను అణిచి పెట్టుకుంటుంది. కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. కానీ అతను ఆమె మొహం చూస్తే కదా ఆ నీళ్లను గమనించేది. అతని పనంతా శరీరంతోనే. మనస్సుతో పనిలేదు.
'ఎందుకు రోజు రోజుకూ అలా శవం లాగా తయారవుతావు? బాగా తిని ఎక్సరసైజ్ చేయొచ్చుగా..' అంటాడు. కానీ 'నీ వల్లే నా చర్మం ఎండి పోతుంది. నా జుట్టు రాలిపోతుంది' అని చెబితే అతనికి ఎప్పటికి అర్థం అవుతుంది?
చాలా మంది మహిళలు 40 ఏండ్లకు కూడా సన్నగా నాజూకుగా ఉండడం గమనిస్తాము. ఎక్కడా వయస్సు తెలియదు. కానీ పలచబడిని జుట్టు, ఎండిపోయిన చర్మం ఆమెకున్న వయస్సుకన్నా ఎక్కువ చూపిస్తుంది. అందుకు కారణం వారు నిరంతరం జీవితంలో పడే భయం మరియూ బాధ. నెగటివ్ ఎమోషన్స్ కి లోనయిన వ్యక్తి శరీరంలో విడుదలయ్యే హార్మోనులు చాలా ప్రమాదకరమైనవి. అవి మెదడునే కాకుండా శరీరాన్ని కూడా రోజు రోజుకూ క్రుంగదీస్తాయి.
Captured from link -
No comments:
Post a Comment