Tuesday, August 12, 2025

 *_🩺"అధిక ర‌క్త‌పోటు"_*

*_Hyper Tension / High Blood Pressure.._*

*_చేయాల్సిన‌వి.. చేయ‌కూడ‌నివి"🩺_*

*_హైపర్ టెన్షన్ లేదా హై బ్లడ్ ప్రెషర్‌ ( Hyper Tension / High Blood Pressure ).. ఎలా పిలిచినా ఒక్క‌టే. ఈ సమస్య వచ్చిందంటే తీవ్రమైన గుండె జబ్బులు, కిడ్నీ సమస్యలు, మెద‌డు సంబంధ ర‌క్త‌నాళాల్లో ఇబ్బందులు వచ్చేందుకు అవకాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. సాధార‌ణంగా ప్ర‌వ‌హించే వేగానికి విరుద్ధంగా ర‌క్తం ప్ర‌వ‌హిస్తుండ‌టం వ‌ల్ల అనేక స‌మ‌స్య‌లు ఎదుర‌వుతాయి. ఇలా అధిక ర‌క్త‌పోటు రాకుండా ఉండేందుకు ఏంచేయాలి? ఏంచేయ‌కూడ‌దు? వ‌రల్డ్ హైప‌ర్‌టెన్ష‌న్ డే సంద‌ర్భంగా కొన్నివిష‌యాలు తెలుసుకుందాం!_*

*_మ‌న శ‌రీర భాగాల‌కు ఆక్సీజ‌న్‌ను స‌ర‌ఫ‌రా చేసే అతిముఖ్య‌మైన ద్రావ‌కం ర‌క్తం. గుండె సంకోచ, వ్యాకోచాలు చేస్తూ రక్తాన్ని శరీర భాగాలకు సరఫరా చేస్తుంటుంది. శ‌రీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోవ‌డం వ‌ల్ల ర‌క్త‌నాళాలు గ‌ట్టిప‌డిపోవ‌డం వ‌ల్ల హైబీపీ సంభ‌విస్తుంది. హైబీపీ అనేది రోగం కాదు.. రోగ ల‌క్ష‌ణం. ఈ సమస్య నిజానికి ఓ సైలెంట్ కిల్లర్ లాంటిది. చాప కింద నీరులా శరీరానికి కొంత హాని క‌లిగించిన తర్వాత మరో సందర్భంలో ఎప్పుడో జరిగిన హాని బ‌య‌ట‌ప‌డుతుంది._*

*_హైబీపీ ( అధిక రక్తపోటు / High BP ) సమస్య ఉన్నప్పుడు రక్త నాళాల గోడలపై ఒత్తిడిని కలగజేస్తూ రక్తం పంప్ అవుతుంది. దీని వల్ల రక్తనాళాల గోడలు కుచించుకుపోయి గుండె జ‌బ్బులు రావ‌డానికి అవ‌కాశాలు ఏర్ప‌డుతాయి. సాధారణంగా ఆరోగ్యవంతుల రక్త పోటు 120/80  ఉండాలి. అయితే హైప‌ర్‌టెన్ష‌న్ స‌మ‌స్య‌తో బాధ‌పడేవారిలో ఈ న‌మోదు 130/90 మి.మీ. అంతకన్నా అధికంగా ఉంటుంది._*

*_🩺"ఏఏ స‌మ‌స్య‌లొస్తాయంటే"..?_*

*_అధిక రక్తపోటు కార‌ణంగా గుండె జబ్బులు, మూత్రపిండాల వ్యాధులు, కంటి జబ్బులు, మెదడు సంబంధ‌ రక్త నాళాల జబ్బులు, పక్షవాతం, గుండె రక్తనాళాల జబ్బులు, విపరీతమైన తలనొప్పులు వంటి అన‌ర్థాలు వ‌స్తాయి. రక్తపు పోటు ఎక్కువగా ఉన్న వారికి బయటకి ఎలాంటి లక్షణాలు కనిపించ‌వు. అయితే కొంద‌రిలో తలనొప్పి, అలసట, కళ్ళు తిరగడం, చూపు మందగించడం, మతిమరుపు, ఊపిరి తీసుకోవడంలో సమస్యలు, ఛాతిలో నొప్పి, జీర్ణ వ్యవస్థలో సమస్యలు వంటివి కనిపిస్తాయి._*

*_🩺"ఏమేం తినాలంటే"..?_*

*_హైబీపీ ఉందని చెప్పగానే అంతగా ఆందోళన పడాల్సిన ప‌నిలేదు. ఆహారం ద్వారా శరీరానికి లభించే కెలరీలను తగ్గించుకోవాలి. కెలరీలు, క్రొవ్వులు తక్కువగా, ప్రోటీన్లు సాధారణ మోతాదులో తీసుకోవాలి. ముఖ్య పోషకాలైన కాల్షియం, మెగ్నిషియం, పొటాషియంలు ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. నారింజ పండ్లు, పుట్టగొడుగులు, పాలకూర, కంద గడ్డలు, బ్రొకొలి, అరటి పండ్లు, యాప్రికాట్స్‌, అవకాడొ, బాదం, పిస్తా పప్పు, వాల్‌నట్స్‌, గుమ్మడికాయ, పొద్దు తిరుగుడు విత్తనాలు.. చేపలు, గుడ్లు, పాలు, ఆకుపచ్చని కూరగాయలు తీసుకోవ‌డం ద్వారా హైబీపీని అదుపులో పెట్టుకోవ‌చ్చు._*

*_🩺ఏమేం తిన‌కూడ‌దంటే'..?_*

*_అలవాట్లని మార్చుకోవ‌డం ద్వారా హైప‌ర్‌టెన్ష‌న్‌ను చాల వరకు కంట్రోల్ చేసుకోవ‌చ్చు. ఉప్ప వినియోగం చాలా త‌గ్గించాలి. వంట‌ల త‌యారీలో నూనెలు, కొవ్వు ప‌దార్థాల‌ వాడ‌కం త‌గ్గించాలి. మ‌సాలాలు, కారం వాడ‌కాన్ని అదుపులో పెట్టుకోవాలి. పొగ‌తాగ‌డం, మ‌ద్యం సేవించ‌డం మానుకోవాలి. నిల్వ ప‌చ్చ‌ళ్లు, నిల్వ ఉంచిన ఆహారాలు, బేకరీ ఐటమ్స్, పచ్చళ్లు, అప్పడాలు, క్యాన్డ్‌ ఫుడ్స్‌ పూర్తిగా తగ్గించాలి. వేపుడ్లు, చిప్స్, కేకులు, బిస్కెట్లు, నూడుల్స్, పిజ్జా వంటి ట్రాన్స్ క్రొవ్వు ( Trans Fats )  పదార్థాలను నిషేధించాలి. శ‌రీర బ‌రువును త‌గ్గించుకోవాలి. శ‌రీరానికి ఒత్తిడి, ఉద్విగ్న‌త క‌లుగ‌కుండా చూసుకోవాలి. ప్ర‌తినిత్యం అర్థ‌గంట‌కు త‌క్కువ కాకుండా వ్యాయామం చేయాలి._*

*_🩺"చివ‌ర‌గా".._*

*_40 ఏండ్ల వ‌య‌సు పైబడిన‌ వారు యేటా పూర్తి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవ‌డం.. కుటుంబంలో ఎవరైనా అధిక రక్తపోటుతో బాధ‌ప‌డుతున్నా కనీసం సంవత్సరానికి ఒకసారి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం చాలా మంచిదని గుర్తుంచుకోవాలి. దీని ద్వారా అధిక రక్తపోటు  రాకుండా చూసుకోవ‌చ్చు._*

*_-సదా మీ శ్రేయోభిలాషి.💐_*

 *_-మీ డా. తుకారాం జాదవ్. 🙏_*

No comments:

Post a Comment